Sakshi education logo
Sakshi education logo

‘భూమిక’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
1. కథకు, కవిత్వానికి గల భేదం....ఇష్టమైన ప్రక్రియ?
కథ వచన రచన. కవిత్వం పద్యరచన. కథలో కథనం ఉంటుంది. కవిత్వంలో గూడార్థం ఉంటుంది. కథలో మనోరంజకత్వం ప్రధానం. కవిత్వంలో శబ్దప్రయోగం అందం. కథ సంఘటనల మధ్య సంబంధాన్ని చిత్రిస్తుంది. కవిత్వం ఆలోచనకు ఆశ్రయం ఇస్తుంది. దేనికది గొప్పదే . దేని ప్రత్యేకత దానిదే.
- కథను ఇష్టపడితే...
కథలో వేగం నచ్చుతుంది. సహజమైన పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. సంభాషణలు ఉత్సాహాన్ని నింపుతాయి. కథనం ముగింపుపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముగింపు హృదయాన్ని కదిలిస్తుంది. సందేశం మార్గనిర్దేశనం చేస్తుంది.
- కవిత ఇష్టమైతే...
పద ప్రయోగం ఆకట్టుకుంటుంది. క్లుప్తత నచ్చుతుంది. కవితలోని లయ ముగ్ధులను చేస్తుంది. అంశ విశ్లేషణ ఆలోచింపజేస్తుంది. వ్యంగం/ధ్వని/శ్లేష/ చమత్కారం పదేపదే చదివిస్తుంది. సొంతంగా రాయాలన్న ప్రేరణనిస్తుంది.

2. నాటి హైదరాబాద్‌రాజ్యంలో ప్రజల ఉద్యమం ఎందుకుసాగి ఉండవచ్చు?
20వ శతాబ్దం ప్రారంభం హైదరాబాద్ రాష్ట్రానికి చేదు అనుభవాలను మిగిల్చింది. మతం ప్రాతిపదికగా హిందువులను నీచంగా చూడటమే కాక రజాకార్ల పేరుతో చెప్పుకోలేనన్ని దౌర్జన్యాలు సాగించారు. అవి సహించలేక తిరగబడ్డ ఈ రాష్ర్ట ప్రజలు హక్కులకోసం, స్వాతంత్య్రంకోసం ఉద్యమించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 13 నెలల దాకా ఇక్కడి ప్రజలు నిరంకుశ పాలనలోనే నలిగిపోయారంటే, పరిస్థితులెంత దయనీయంగా ఉండేవో ఊహించుకోవచ్చు.

3. హైదరాబాద్ నగర జీవితాన్ని తెలుగులో చిత్రించడం...
హైదరాబాద్ ప్రాచీన నగర జీవితమంతా ఉర్దూతో ముడిపడి ఉంది. అక్కడి చదువు, వ్యవహారం, నిత్యవ్యవహారం అంతా ఉర్దూలోనే సాగేవి. నెల్లూరి కేశవస్వామి హైదరాబాద్‌లో పుట్టాడు. నిజాం కాలేజీలో ప్రి డిగ్రీ చదివి, ఉస్మానియాలో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యాడు. నీటి పారుదల శాఖలో పనిచేశాడు. అంటే కేశవస్వామి జీవితం, చదువు, ఉద్యోగం, వ్యవహారం అంతా ఉర్దూతో ముడిపడి ఉంది. తెలుగుకు దూరంగా ఉంది. అలాంటి నేపథ్యం కలిగిన కేశవస్వామి ఉర్దూ భాషతో మమేకమైన హైదరాబాద్ నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం ఎంతో ప్రత్యేకమైంది అని అర్థం.

4. జీవభాష-కథల్లో చిత్రించడం
జీవభాష అంటే బతికున్న భాష. భాష బతికి ఉండటం అంటే వ్యవహారంలో ఉండటం. అంటే మాట్లాడుతున్న భాష జీవ భాష. కథ అంటే దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్న అనుభూతి. ఆ అనుభూతికి సహజత్వాన్నిచ్చేది భాష. ఆ భాష వ్యవహారంలో ఉండే పాత్రోచితమైందిగా ఉండాలి. సన్నివేశాలను, నేపథ్యాలను సహజంగా ఆవిష్కరించాలి. జీవ భాషను కథల్లో చిత్రించడమంటే ఇదే.

5. చార్‌మినార్ కథలను ఎందుకు చదవాలి?
చార్‌మినార్ కథలు నెల్లూరి కేశవస్వామి అనుభవాల్లో నుంచి జీవం పోసుకున్న కథలు. 11వ శతాబ్దం నుంచి వేయి సంవత్సరాల్లో హైదరాబాద్‌లో ఊపిరిపోసుకున్న సంస్కృతి, చరిత్ర కేశవస్వామి కథల్లో సాక్షాత్కరిస్తుంది. నవాబులు, దేవిడీలు, మహబూబ్‌కి మెహందీలు, కోఠీలు, దివాన్‌ఖానాలు, జనానాఖానాలు, బేగంసాహెబులు, దుల్హన్‌పాషాలు, పాన్‌దాన్‌లు, పరాటాకీమాలు, దాల్చాలు, నమాజులు, పరదాల వెనుక సంఘటనలు...ఈ విధంగా హైదరాబాద్ నగర జీవితాన్ని, చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకునేందుకు, హైదరాబాదీ జీవితాన్ని అధ్యయనం చేసేందుకు చార్‌మినార్ కథలు చదవాలి.

6. ‘రెండు మతాల మధ్య-ఆలోచనలు, సంస్కృతిలో ఆదానప్రదానాలు
ఆదానప్రదానాలు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి. ప్రతి మతానికి ప్రత్యేక సిద్ధాంతాలు, నమ్మకాలు ఉంటాయి. ఆలోచనా విధానంలో తేడాలుంటాయి. సంస్కృతిలో వైవిధ్యం ఉంటుంది. కాని మతమేదైనా మానవత్వాన్ని విస్మరించి చరించుమని బోధించదు. పరోపకారాన్ని వ్యతిరేకించదు. పరమత ద్వేషాన్ని ప్రోత్సహించదు. ఈ మూల సూత్రాలను ఆధారంగా చేసుకొని మతాల మధ్య పరస్పరం మంచి ఆలోచనలు పంచుకోవాలి. సంస్కృతిలోని గొప్పతనాన్ని ఆహ్వానించాలి.

7. నెల్లూరికేశస్వామి హృదయం చార్మినార్ కథల్లో ప్రతిబింబిస్తుంది
హైదరాబాద్‌లో పుట్టి, పెరిగి, ఈ వాతావరణాన్ని, సంస్కృతిని గుండెలనిండా నింపుకున్న కేశవస్వామికి ఈ మట్టిలోని ప్రతిరేణువుతో సంబంధముంది. ఆ బంధం మతాలకు అతీతమైన మైత్రీ బంధం. అందుకే తాను జీవించిన, అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కూలాతీత - మతాతీత మమతలు, ఓల్డ్‌సిటీ జీవితం చార్మినార్ కథల్లో ఆవిష్కరించాడు. అందుకే చార్మినార్ కథల్లో నెల్లూరికేశవస్వామి హృదయం ప్రతిబింబిస్తుంది. ఇవి కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల సామాజిక పరిణామాల చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకున్న చారిత్రక కథలు. నిజాం యుగాంత పరిణామాలను ఇవి కళ్లకు కడతాయి.

8. హృదయ సంస్కారం అంటే...
సంస్కారవంతమైన హృదయం. అంటే హృదయ పూర్వకంగా సంస్కారవంతంగా ప్రవర్తించడం. మనుషులు అవకాశాన్నిబట్టి మంచి వాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారిపోతుంటారు. హృదయంలో సంస్కారమున్న వాళ్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ మంచితనాన్ని విడనాడరు. మంచితనాన్ని అవకాశవాదానికి బలిచేయరు. నెల్లూరి కేశవస్వామి ‘రూహిఆపా’ కథలోని ‘నవాబు’ పాత్రలో అతని కుమారుడు సలీం పాత్రలోనూ ఈ హృదయ సంస్కారం కనిపిస్తుంది. ఆవు-పులి కథలో పులిహృదయ సంస్కారం అలాంటిదే. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు లేని పాండవులు చిక్కినా అపకారం తలపెట్టని కర్ణుని ఔదార్యం కూడా హృదయ సంస్కారానికి ప్రతీక.

9. స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది
నిజమే. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకంటె భిన్నమైంది, అపురూపమైంది, ఉపమింపలేని ఆత్మీయతను కలిగిందీ స్నేహం ఒక్కటే. స్నేహితుల మధ్య ఉండే అనేక అంతరాలను అది అంతం చేస్తుంది. స్నేహం మధ్య కులం తలదూర్చడానికి భయపడుతుంది. మతం రంగుచల్లడానికి జంకుతుంది. స్నేహితులు ఒకరికోసం మరొకరు జీవిస్తారు. ఒకరికోసం మరొకరు ఏ త్యాగం చేయడానికైనా తపిస్తారు. మతం ఆధిపత్యాన్ని మాత్రం సహిస్తారా? సహించరు. అందుకే స్నేహం మతాల సరిహద్దులను కచ్చితంగా చెరిపేస్తుంది.

10. పేదల కష్టాలు-వాళ్ల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నాలు
పేదల జీవితాలు కష్టాలకు నిలయాలు. దరిద్రం అన్ని కష్టాలకు మూలం. ఆ రక్కసి కోరల నుంచి బయటపడటానికి ఒక్కొక్కసారి సరిపడని పనులు చేస్తారు. త్యాగాలకు సిద్ధపడతారు. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి మరిన్ని కష్టాల పాలవుతారు.
కష్టాలకు కారణమైన దారిద్య్రాన్ని దూరం చేసేందుకు సహృదయులైన వదాన్యులు, సామాజిక కార్యకర్తలు ముందుకురావాలి. ఆర్థిక సహాయంతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపించే ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాల ప్రయోజనం వాళ్లకు చేరేటట్లు చేయాలి. బ్యాంకుల చేయూత, స్వచ్ఛంద సంస్థల సహకారం యోగ్యతననుసరించి వాళ్లకు లభించేటట్లు చేయడం వల్ల పేదల జీవితాలు బాగుపడతాయి.

11. కేశవస్వామి కథల ఆధారంగా కథల స్వరూప స్వభావాలు...
నెల్లూరి కేశవస్వామి కథలు అసాధారణమైనవి. మున్షీప్రేమ్‌చంద్, కిషన్‌చంద్‌ల వంటి జాతీయస్థాయి రచయితలతో సమానమైన ప్రతిభతో చార్మినార్‌కథలు రచించాడు కేశవస్వామి. ఈ కథలను పరిశీలించినప్పుడు కథలంటే ఎలా ఉండాలో ఒక అభిప్రాయం కలుగుతుంది...
 • వాస్తవ సంఘటనల ఆధారంగా కథలుండాలి.
 • పాత్ర చిత్రణ, సంభాషణలు సహజంగా ఉండాలి.
 • సంఘటనల మధ్య సంబంధాలను కళాత్మకంగా చిత్రించాలి.
 • కథలు పాఠకుల్ని కదిలించాలి, ఆలోచింపజేయాలి
 • చక్కని సందేశాన్నివ్వాలి.

ఇవి చేయండి అభ్యాసాల ఆధారంగా-ముఖ్యాంశాలు

1. పుస్తకావిష్కరణ కార్యక్రమం...
కవులు/రచయితలు రచించిన కొత్తపుస్తకాలను విడుదల చేసే కార్యక్రమమే పుస్తకావిష్కరణ.
 • ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అతిథులందరినీ పిలిచి, పుస్తకప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువుల సమక్షంలో ఒక సమావేశమందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.
 • జ్యోతిప్రజ్వలన, ప్రార్థన, అతిథుల పరిచయం చేస్తారు. అధ్యక్షులు తొలిపలుకులలో కార్యక్రమం పూర్వాపరాల గురించి తెలియజేస్తారు. ముఖ్యఅతిథి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ గావిస్తారు. అంకితం చేస్తారు.
 • వేదిక మీదున్న అతిథుల్లో ఒకరు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. అతిథులంతా తమ అభిప్రాయాలు చెబుతారు. అభినందనలు తెల్పుతారు.
 • పుస్తక రచయితకు సన్మానం చేస్తారు. రచయిత(త్రి) తన ప్రతిస్పందనను తెలియజేస్తారు. వేదిక మీదున్న పెద్దలకు సన్మానాలు చేస్తారు. చివరగా వందన సమర్పణతో కార్యక్రమం ముగిస్తారు.
నేటి సమాజానికి అవసరమైన రచయితలు:
రచయితలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటారు. ఫక్తు కాలక్షేపం కోసం రకరకాల మసాలాలను దట్టించి పాఠకులను ఉద్రేకపడేటట్లు చేసే రచనలు అందించేవాళ్లు ఒకరకం. రచనను సామాజిక బాధ్యతగా భావించి ఒక సిద్ధాంతం కోసం, లక్ష్యసాధన కోసం రచనలు చేసేవాళ్లు రెండోరకం. రెండోరకానికి చెందిన రచయితలే సమాజానికి అవసరం. ఎందుకంటే.
 • ఇలాంటి రచనల వల్ల చారిత్రక, సామాజిక అంశాలు ప్రజలకు (పాఠకులకు) తెలుస్తాయి.
 • సమాజంలోని మంచి-చెడులు, కష్టసుఖాలు, జరుగుతున్న పరిణామాలు అవగతమవుతాయి.
 • పాఠకుల్లో ఆలోచన జాగృతమై, సమాజాన్ని మెరుగైన స్థితిలో నిలబె ట్టగలిగేందుకు తాము నిర్వహించవలసిన బాధ్యతను తెలుసుకుంటారు.
 • అలాంటి రచనలనందించే రచయితలు కలకాలం పాఠకుల హృదయాల్లో నిలిచిపోయి, తరతరాలకు స్ఫూర్తినిస్తారు.
3. ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు
సాహిత్యం అంటే హితం గూర్చేది అని అర్థం. కవులు, రచయితలు ఏ రచనలు చేసినా అది తమ సమకాలీన సమాజానికి మేలు కలిగించాలనే ఉద్దేశంతో చేస్తారు. పద్ధతి ఏదైనా, పంథా ఏదైనా, సిద్ధాంతం ఏదైనా ర చయితలు/కవుల అంతిమ లక్ష్యం మానవ కళ్యాణమే. కాబట్టి రచయితలు తమ కాలంనాటి పరిస్థితులను, వాటిని బాగుచేయవలసిన బాధ్యతను సూటిగా కాని, అన్యాపదేశంగా కాని తమ రచనల్లో చొప్పిస్తూ ఉంటారు. ఆ కారణం చేత రచయితల రచనల్లో వాళ్ల కాలంనాటి పరిస్థితులు వర్ణిస్తుంటారు. పూర్వకాలంలో కంటె ఆధునిక యుగంలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది.
ఉదా:- నెల్లూరి కేశవస్వామి కథలు 1950 నాటి హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చెబుతాయి; దాశరథి రంగాచార్యగారి ‘చిల్లరదేవూళ్లు’ నవల భూస్వామ్యవ్యవస్థలోని దుర్మార్గాలను బట్టబయలు చేస్తుంది; యాదగిరిగారి ‘బండెనక బండి గట్టి...’ పాట నిజాం వ్యతిరేకోద్యమ తీవ్రతను ఆవిష్కరిస్తుంది; శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యం కార్మిక కర్షక జీవితాలను కళ్లముందుంచుతుంది.

4. తెలంగాణ పలుకుబడులు:
‘పలుకుబడి’ అంటే ఉచ్చారణలో ఉండే విలక్షణత. దీన్నేయాస అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉచ్చరించే మాటలు తెలంగాణ పలుకుబడులు. తెలంగాణకే ప్రత్యేకమైన పలుకుబడులు ఎన్నో ఉన్నాయి.
ఉదా:-
 1. అంగడి-అంగడి అనే పదం ఇప్పుడు దుకాణం లేదా కొట్టు అనే అర్థంలో చలామణిలో ఉంది. నిజానికి అంగడి అనే మాటను తెలంగాణలో ‘సంత’ అనే అర్థంలో ఉపయోగిస్తారు. దుకాణం కూడా తెలంగాణ పలుకుబడే. ఇది ఉర్దూ భాషా ప్రభావంతో ఈ భాషలోకి వలస వచ్చింది.
 2. అరిగోస-గోస అంటే కష్టం. అరిగోస అంటే శత్రువుల కష్టం. అప్పుడప్పుడు శత్రువులకు కూడా ఈ కష్టం రాకూడదని అంటుంటాం. అరిగోస అంటే పగవాడు కూడా భరించలేని కష్టం. తీరని కష్టం అన్నమాట.
 3. రంది అంటే విచారం:-ఫికరు, చింత (ఫికరు కూడా ఉర్దూలో నుంచి దిగుబడి అయిన పదమే). దీన్నే ‘రంది’ అనీ అంటారు.
 4. పెయ్యి-శరీరం. మనిషి దేహంలో రెండు భాగాలు ఒకటి బయటికి కనిపించే స్థూల శరీరం. రెండోది లోపల ఉండే హృదయం-ఆత్మ. పైకి కనిపించేది కాబట్టి పై-పయ్యిగా మారి పెయ్యిగా స్థిరపడి ఉంటుంది.
 5. సోయి-స్పృహ. ఇది తెలంగాణలో బాగా వాడుకలోఉన్న పదం.
5) తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది...
నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్’ కథలను పరిచయం చేస్తూ, గూడూరి సితారాం రాసిన మాటలు అక్షరాలా నిజం. 1910లో ఆంధ్ర ప్రాంతంలో దిద్దుబాటు కథ (గురజాడ) మొదటిదైనట్లే 1912 సంవత్సరం మాడపాటి హనుమంతరావు రచించిన ‘హృదయశల్యం’ కథ విశేష పాఠకాదరణ పొందింది. నిజానికి 1910లోనే ఇక్కడ కూడా కథా రచన ప్రారంభమైంది. (కొమర్రాజు లక్ష్మణరావు రచించిన ‘ఏబదివేల బేరం’-ఆంధ్రపత్రిక-మార్చి 2010). 1914లో తెలంగాణ తెలుగు కథ హితబోధిని పత్రికలో ‘రాజయ్య సోమయాజులు’ అనే కథ బండారు శ్రీనివాసరావు రచన అచ్చయింది.
 • నాటి నుంచి నేటివరకు తెలంగాణలో వచ్చిన కథలన్నీ సామాజీక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చాయి. తొలితరం కథారచయితల్లో సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి వాళ్లు కథారచయితలుగానే కాక సంకలనాలు, పత్రికలు ప్రచురించి తెలంగాణ కథ సామాజిక బాధ్యతను నిర్వహించారు. తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా గత అర్థశతాబ్దకాలంగా ఎన్నో కథలు వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ, కాళోజి, కాంచనపల్లి, ఆవుల పిచ్చయ్య, బోయ జంగయ్య, మందరామారెడ్డి తదితర అనేక రచయితలు సామాజిక చైతన్యంతోనే కథలు రాశారు. తర్వాత కథారచయితలు హోరు, బద్‌లా, తెలంగాణకథ లాంటి కథాసంకలనాలతో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. నాటి ఉషస్సు నుంచి నేటి రంది దాకా ఇక్కడి కథలన్నీ సామాజిక చైతన్యం కలిగించే బాధ్యతను నెరవేరుస్తూనే ఉన్నాయి.
6. నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది. చైతన్యశీలి.
పజాస్వామ్యం అంటే కులమతవర్గలింగ భేదాలు లేని సమసమాజం. ఈ భావనను సమర్థించడమే ప్రజాస్వామికవాదం. చైతన్యమంటే ప్రగతి శీలమైన కదలిక. ఈ రెండు బాధ్యతలనూ నెల్లూరి కేశవస్వామి తన కథల ద్వారా నెరవేర్చాడు.
 • హైదరాబాద్ నగరంలో కొన్ని అసాంఘిక శక్తులు చెలరేగి హిందూ ముస్లింల సఖ్యతకు విఘాతం కలిగిస్తున్నప్పుడు కేశవస్వామి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు. సమాజం, ప్రజాస్వామ్యంపై ఆయనకు గల బాధ్యతకు ఇది సంకేతం.
 • ‘రుహి ఆపా’ కథ స్త్రీ స్వేచ్ఛను, వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను ఆర్ద్రంగా ఆవిష్కరించాడు.
 • ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్లి సంబంధాల లోగుట్టును రట్టుచేశాడు.
 • ‘భరోసా’ కథ పేదరికం పెనుశాపంగా మారడాన్ని చిత్రీకరించాడు.
 • కేవలం మనుషులలో మతాల మధ్య మైత్రిని కథనం చేశాడు.
7. పుస్తక పరిచయ వ్యాసం / పుస్తక సమీక్ష....
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకును చూసి గ్రహించినట్లు. ఒక్క పుస్తకం మొత్తం చదవనవసరం లేకుండా దానికి సంబంధించిన సమీక్షనో, పరిచయ వాక్యాలనో చదివితే ఆ పుస్తకంపై ఒక సమగ్ర అవగాహన కలుగుతుంది. ఎందుకంటే.
 • నెల్లూరి కేశవస్వామి కథలు (చార్మినార్) పరిచయం చేస్తూ గూడూరి సీతారాం ఆనాటి సామాజిక, చారిత్రక పరిస్థితులు, హైదరాబాద్ జీవనం ‘నేపథ్యం’గా ఉన్నాయన్న విషయం విశదీకరించాడు.
 • ‘రచయిత హృదయం, ఆలోచనా ధోరణి’ గురించి వివరించాడు. ‘కథలకు రచయిత ఎంపిక చేసుకున్న వస్తువు’ను విశ్లేషించాడు. ముఖ్యమైన కథలను (విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, భరోసా..) పేర్కొన్నాడు. ‘రచయిత శైలి, శిల్పం, భాష, చిత్రణ’ మొదలైన విషయాల గురించి తెలియజేశాడు.
 • ఈ అంశాలన్నీ నెల్లూరి కేవస్వామి గొప్ప హృదయమున్న రచయిత అని, సామాజిక బాధ్యత కలవాడని, చైతన్యశీలి అని, చేయితిరిగిన కథా రచయిత అని, ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ స్థాయిలో పేరు వహించిన ప్రేమ్‌చంద్, కిషన్ చంద్‌ల సరసన నిలువగలిగే రచయిత అనీ తెలియజేస్తున్నాయి.
 • కథల్లో హైదరాబాద్ నగర జీవితం, ఆనాటి చరిత్ర, సంస్కృతి, ముస్లిం సంప్రదాయాలు, కష్టాలు, కన్నీళ్లు, మానవ సంబంధాలు, మతసామరస్యత, స్నేహ బంధం, మానవతాపరిమళం తదితరాంశాలు అద్భుతంగా చిత్రించారని తెలుస్తుంది.
8. కథల పుస్తకానికి పరిచయం/పీఠిక
 • పుస్తక పరిచయం/పీఠిక రచయిత గురించి, పుస్తకాన్ని గురించి, పుస్తకం నేపథ్యాన్ని గురించి, అందులోని విషయాన్ని గురించి స్థూలంగా తెలియజేస్తుంది.
 • ఇందులోని భాగాలు: 1. రచయిత పరిచయం (స్థూలంగా), 2. కథలలోని ముఖ్యమైన వాటి పేర్లు, 3. వస్తువు, 4. కథన విధానం, 5. కథలిచ్చే సందేశం, 6. సమీక్షకుని అభిప్రాయం. ఉదా:-‘ఆచార్యదేవోభవ’ కథల పుస్తకం.
  • 2012లో ఉపాధ్యాయుల జీవితాలు నేపథ్యంగా రచించిన ఈ పుస్తకరచయిత దోరవేటి.
  • దోరవేటి అసలు పేరు వి.చెన్నయ్య. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన దోరవేటి ఉపాధ్యాయ జీవితంలోని అనేక కోణాలను ఈ కథల్లో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. సుమారు 200లపై చిలుకు కథలు రాసిన దోరవేటి చేయితిరిగిన కథారచయిత.
  • ఈ కథల సంపుటిలో విన్నపం మొదలుకొని చివరకు మిగిలేది వరకు మొత్తం 16 కథలున్నాయి. వీటిలో ఉత్తమోపాధ్యాయ, లచ్చిదొంగ-లక్ష్మణరావు, జెరజూస్కో, చదువు, పశ్చాత్తాపం, సన్మానం దేనికదే ప్రత్యేకం. ఉపాధ్యాయ వృత్తిలోని అనేక కోణాలను సున్నితంగా ఆవిష్కరించడం, సుతిమెత్తని హెచ్చరికలు చేయడం, సామాజిక బాధ్యతను గుర్తుచేయడం స్పష్టంగా కనిపిస్తుంది.
  • 2000 పరిసరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయిన కథల్ని సంపుటీకరించుకున్న ఈ పుస్తకం ఉపాధ్యాయ జీవితాలను మరింత చైతన్య పరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Published on 1/4/2016 2:53:00 PM