Sakshi education logo
Sakshi education logo

‘గోలకొండ పట్టణము’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
1. ఆజంఖాను:-
గోలకొండ పట్టణ నిర్మాణ పథకం రూపకర్త అజంఖాను. ఇతడే గోలకొండ పట్టణం రూపురేఖలు దిద్దాడు. పట్టణాన్ని అనేక విభాగాలు చేసి, ఆ విభాగాలకు మొహల్లాలని పేరు పెట్టాడు. పట్టణంలోని ఒక్కొక్క మొహల్లాలో ఒక ప్రముఖుడు నివసించడమో లేక ఒక్కొక్క మొహల్లా గురించి శ్రద్ధవహించడమో జరిగేది. అందుకే మొహల్లాలకు ప్రముఖుల పేర్లు నిర్ణయించారు. ఉదా:-మాదన్న మొహల్లా.

2. గోలకొండ పట్టణం ప్రత్యేకతలు:-
భారతదేశంలోని దక్షిణాపథంలో పూర్వం ఏకైక పట్టణంగా ప్రసిద్ధి గాంచినది గోలకొండ పట్టణం. గోలకొండ మూడుకోటలుగా ఉంది. మొదటి కోట, రెండో కోటల మధ్య భాగంలో గోలకొండ పట్టణం విస్తరించి ఉంది. దుర్గానికి సుమారు ఏడుమైళ్ల పరిధిలో ఎనభై బురుజులు, ఎనిమిది ద్వారాలు ఉండేవి. సుమారు నాలుగుమైళ్ల విస్తీర్ణంలో గోలకొండ పట్టణం వెలిసింది. ఇందులో అనేక మొహల్లాలుండేవి. విశాలమైన వీధులుండేవి. పడమటిదిశలో రాజ భవనాలు ఉండేవి. ధనవంతుల గృహాలతోపాటు ఉద్యోగస్తులకు భవనాలుండేవి. ఆలయాలు, మసీదులతోపాటు భిక్షగాళ్లకు (ఫకీర్లకు) గృహాలుండేవి. ఉద్యానవనాలు, స్నానమందిరాలుండేవి. పాఠశాలభవనాలూ ఉండేవి. మిద్దెల మీది తోటలు (Roof Gardens), జలాశయాలు, నీటికాల్వలు, అంతరాళనందనం ఉండేవి. ఈ అంతరాళనందనం బాబిలోనియాలోని నందనాన్ని పోలి ఉండేది. వాయవ్యదిశలో దొడ్డ బాల్బోవా వృక్షం ఒకటి ఉండేది. దాని పాదంలోని తొర్రలో ఒక టేబుల్, నాలుగు కుర్చీలు వేసుకొని కూర్చునేవాళ్లు.

3. పట్టణం అలంకార భూయిష్టం:-
అలంకార భూయిష్టం అంటే నిండి ఉందని అర్థం. అలంకార భూయిష్టం అంటే అలంకారంతో నిండి ఉంది అని. గోలకొండ పట్టణం ఎప్పుడూ అలంకరించే ఉండేది. అందులోని నిర్మాణాలు, ఏర్పాట్లు ఈ పట్టణాన్ని నిత్యాలంకార శోభాయమానంగా మార్చేశాయి.

4. గోలకొండ కోట-అచ్చెరువు గొలిపే అంశాలు...
 • గోలకొండ కోటలో అశ్చర్యచకితులను చేసే అంశాలెన్నో ఉండేవి. పట్టణంలో పన్నెండు భిక్షాగృహాలు (ఫకీర్ల నివాసాలు) ఉండేవి.
 • నగీబాగ్ అనే అందాలరాశి వంటి ఉద్యానవనం ఉండేది.
 • ‘దిల్‌కుషా’ అనే మనోహర రాజభవనం పారశీకదేశ రాయబారికి ప్రత్యేకం.
 • మిద్దెల తోటలు అనగా రూఫ్ గార్డెన్స్ ఉండేవి.
 • నీటి పారుదల వ్యవస్థ అత్యంతాశ్చర్యకరంగా ఉండేది.
 • బాబిలోనియాలోని అత్యంత ప్రాచీన శైలిని పోలిన అంతరాళ భవనం ఉండేది.
 • దొడ్డ బాల్బోవా వృక్షం ఉండేది. దాని కాండం పరిధి 80 అడుగులు. ఆ చెట్టు పాదంలో పెద్దతొర్ర ఉండేది. అందులో టేబుల్, నాలుగు కుర్చీలు వేసుకొని సౌకర్యంగా కూర్చునేవారు. ఈ చెట్టు ఆఫ్రికా నుంచి తెప్పించింది.
 • ‘కటోరాహౌజ్’ అనే సంపన్నుల వేసవి విహారస్థలం ఉండేది.
5. గోలకొండ నుంచి హైదరాబాద్‌కు..
కమంగా గోలకొండ పట్టణం నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి నివసించడం ప్రారంభించారు. ఎందుకంటే.
 • గోలకొండలో జనసమ్మర్థం ఎక్కువ. 40వేల ఇళ్లు, 2లక్షల జనం.
 • హైదరాబాద్ కొత్తగా ఏర్పడుతున్న నగరం. అక్కడ నిర్మాణాలు, స్థలం చవక.
 • విశాలమైన స్థలంలో, స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక.
 • గోలకొండ ఎప్పుడూ రద్దీగా ఉండేది. అడుగడుగున తనిఖీలుండేవి. ఈ ఇబ్బంది లేని ప్రశాంత జీవనంపై మొగ్గు చూపడం.
 • హైదరాబాద్‌లోని ఆధునిక వసతులు, ఏర్పాట్లపై ఆసక్తి
6. గోలకొండ పట్టణం-వర్తక వాణిజ్యాలు
గోలకొండ పట్టణం గొప్ప వర్తక వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.
 • బజార్లలో తినుబండారాలు, చిల్లరవస్తువులు, నగలు, నాణేలు, విలాసవస్తువులు దొరికేవి.
 • కుబేర సములైన (చాలాధనవంతులైన) వర్తకులు నివసిస్తుండేవారు.
 • వజ్రాల వ్యాపారం విరివిగా సాగేది.
 • విదేశాల నుంచి సరుకులు సముద్ర మార్గం ద్వారా మచిలీపట్నం (బందరు) నుంచి నేరుగా గోలకొండకు చేరేవి.
 • తెలంగాణ ఈజిప్టు అంగడిగా గోలకొండ పేరు గాంచింది.
 • మీర్‌జుమ్లా అనే మంత్రి వజ్రపు గనుల సొంతదారు. అక్కన్న ఓడల వ్యాపారం చేసేవాడు.
 • డచ్చి, తుర్కిస్తాన్, అరేబియా, పర్షియా దేశాలతో వ్యాపారం జరిగేది.
 • బియ్యం, జొన్నలు, గోధుమలు, చందనం, సీసం, తగరం, కస్తూరి, చైనాపట్టు, కర్పూరం, గాజు సామాను, సుగంధ ద్రవ్యాలు దిగుమతి అయ్యేవి.
 • పుట్టి, మణుము (మణుగు), శేరు మొదలైన కొలమానాలు; హోను, పణం, పెగోడాలు ద్రవ్యమానంగా చలామణి అయ్యేవి (పైసలు, గవ్వలు కూడా).
 • పైఠన్ వస్త్రాలు, కలంకారీ చీరల అమ్మకం ఎక్కువ.
7. గోలకొండ పట్టణం-రాకపోకల జాగ్రత్తలు....
 • గోలకొండ పట్టణంలోకి రాకపోకలు చాలా కట్టుదిట్టంగా జరిగేవి. ఎందుకంటే అది రాజధాని. రాజనివాసం ఉండేది. ఎంతో ఖరీదైన వర్తక వ్యాపారాలు జరిగేవి. ముఖ్యమైన రాజపరివారం అంతా అక్కడే నివాసముండేది. విదేశీ ప్రముఖులు చాలా మంది వస్తూ పోతూ ఉండేవారు. అందుకే..
 • రాజు, రాజకుటుంబం, రాజపరివారాన్ని కంటికి రెప్పలా కాపాడటం సైనిక వ్యవస్థ ప్రధాన బాధ్యత.
 • విదేశీయులు, గూఢచారులు, దొంగలు, మోసగాళ్లు చొరబడే అవకాశం ఎక్కువగా ఉండేది. వాళ్లను అరికట్టడం, దొరికితే పనిబట్టడం రక్షణ విభాగం కర్తవ్యం.
 • అక్రమ వ్యాపారం, అనైతిక వ్యవహారాలను అడ్డుకోవలసిన అవసరం ఉంది.
 • ఇతరుల ప్రవేశం ఇక్కడి ప్రజా జీవితంలో ఇబ్బందులు కలిగించడం, వాటిని అరికట్టడం కోసం సైనికులు, భటులు అప్రమత్తంగా ఉండటం వంటివి పకడ్బందీగా జరిగేవి.
8. నాటిధరలు-నేటి ధరలు
కాలానికి అనుగుణంగా మనిషి జీవన భారం పెరగడం, ధరలు పెరగడం సహజం. సుమారు మూడు వందల సంవత్సరాల పూర్వం డబ్బు మొహం చూడని వాళ్లు ఎంతోమంది ఉండేవాళ్లు. అప్పుడు గవ్వలకు, చిల్లిగవ్వలకూ విలువ ఉండేది. ఇప్పుడు వందనోట్ల కాగితాలు కూడా సాధారణమైపోయాయి. ఆనాటి ధరలకు నేటి ధరలకు నాకలోకానికి-నక్కకు ఉన్నంత తేడా ఉంది - (నాకలోకం అంటే స్వర్గం). అసలు పోల్చడమే సాధ్యం కాదు. పుట్టిబియ్యం ఒకటిన్నర హోనులు. అంటే సుమారు టన్ను బియ్యం ఆరు రూపాయలకు దొరికేవి. ఆరు రూపాయలకు ఇప్పుడు కిలోలో నాలుగోవంతు కూడా రావు. నాలుగురూపాయలకు అరవై కోళ్లు కొనుక్కోగలిగేవాళ్లు. ఇప్పుడు ఒక్క కోడికాలు కూడా రాదు. సుమారు 25 పైసలకు 80 గుడ్లు దొరికేవి. ఇప్పుడు 25పైసలు చలామణీలోనే లేవు.

9. గోల్కొండ పాదుషాల సాహితీ ప్రియత్వం
గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలుగు భాష మీద ప్రేమ ఎక్కువ. ఆయన కవి పండితులను ఎంతగానో ఆదరించి పోషిస్తూ ఉండేవాడు. అద్దంకి గంగాధరకవి ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని రచించి కులీకుతుబ్‌షాకు అంకితం గావించాడు. మహబూబ్‌నగర్ జిల్లా నివాసి ఆసూరి మరింగంటి సింగరాచార్యులకు ‘మత్తగంధేభ సిత ఛత్రముత్తమాశ్వహాటకాంబర చతురంత యాన యగ్రహారం’ లను ఇచ్చి, కులీ కుతుబ్‌షా సత్కరించాడు (అంటే మదగజంమీద అంబారి-తెల్లని గొడుగు సత్కారం, బంగారం, వస్త్రాలు, పల్లకీ సేవలతో అగ్రహారాలను కానుకగా ఇవ్వడం). కులీ కుతుబ్‌షా కాలంలోనే పొన్నికంటి తెలగన కవి అచ్చతెనుగులో యయాతి చరిత్రమనే కావ్యం రాసి, అమీర్‌ఖాన్ అనే సేనానికి అంకితం ఇచ్చాడు.

10. గోలకొండ పాదుషాల జీవకారుణ్యం, ప్రకృతియత్వం
గోలకొండ పాదుషాల కోటలో ఒక వనం పెంపొందించారు. అది జింకలవనం. అవి అక్కడ స్వేచ్ఛగా విహరించేవి. వాటిని కొట్టకూడదని ఆంక్షపెట్టారు. ఇప్పటికీ గోలకొండ సమీపంలో జింకల పార్కు ఉంది. కోటలో ఉద్యానవనాలను విరివిగా పెంచారు. ద్రాక్షతోటలు పెంచారు. ఆ కాలంలోనే మిద్దె మీది తోటలు (రూఫ్ గార్డెన్స్) పెంచడం పాదుషాల ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం.

11. పట్టణాల్లో జనాభా పెరుగుదలకు కారణాలు
పట్టణాల్లో జనాభా పెరగడానికి చాలా కారణాలున్నాయి.
1) ఏదో ఒక పని చేసుకొని పొట్టపోసుకునేందుకు వచ్చేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూంటుంది.
2) గ్రామాల్లో కంటె పట్టణాల్లో సౌకర్యాలు అధికంగా ఉంటాయి.
3) విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.
4) ధనార్జన కోసం వివిధ వృత్తులు, వ్యాపారం చేసుకునే వాళ్లు పెరుగుతుంటారు.
5) ఉద్యోగులు-వాళ్ల బంధువుల నివాసాలు పెరుగుతుంటాయి.
6) సందర్శకులు కొందరు ఇక్కడే స్థిరపడుతుంటారు.

‘ఇవి చేయండి’ అభ్యాసాల ఆధారంగా - ముఖ్యాంశాలు

1. పాఠం ఆధారంగా ఆనాటి చారిత్రక, సాంస్కృతిక అంశాలు.....
‘గోలకొండ పట్టణం’ పాఠం మూడువందల ఏళ్లనాటి చరిత్రక, సాంస్కృతిక విశేషాలకు అద్దం పడుతుంది.
 • ఆనాటి రాచరిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేది.
 • కోటల నిర్మాణానికి రాజులు విశేష ప్రాధాన్యతని ఇచ్చేవాళ్లు.
 • విలాసవంతమైన జీవితం, విశాల ఉద్యానవనాలు, ప్రత్యేకంగా నిర్మించిన మేడలు, వాడలు ఉండేవి.
 • రాజులు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేవాళ్లు. తాగు-సాగునీటికి ప్రత్యేక వ్యవస్థ ఉండేది.
 • భిక్షగాళ్లకు (ఫకీర్లకు) కూడా ప్రత్యేక గృహాలు నిర్మించి ఇచ్చేవాళ్లు.
 • వర్తక వ్యాపారాలు విరివిగా సాగేవి.
 • వాస్తు, శిల్ప నిర్మాణ కళాకారులకు ఎంతో గౌరవం ఉండేది.
 • పాదుషాలు సంగీత సాహిత్య కళాప్రియులు. ప్రకృతి ప్రేమికులు, జీవ కారుణ్యం గలవారు, సాహితీ పోషకులు.
 • వివిధ వస్తువులు, సరుకుల ధరలు చాలా చవకగా ఉండేవి.
 • ప్రజలు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేవాళ్లు.
2. నాటి తెలంగాణలో కూడా తెలుగు భాషా ఉచ్చస్థితిలో ఉండేది..
నాటి తెలంగాణాపాలకులు ఉర్దూ మాతృభాషగా కలిగినవారు. ఉర్దూ, ఫార్సీ భాషలను ప్రేమించేవాళ్లు. అయినప్పటికీ తెలుగును ఉపేక్షించలేదు. ఆనాటికాలంలో కూడా కవులు విరివిగా కావ్యాలు రచించారు. పాదుషాలకు, ప్రముఖులకు అంకితమిచ్చారు. సన్మాన సత్కారాలను పొందారు. ఆసూరి మరింగంటి సింగరాచార్యులు, అద్దంకి గంగాధరులు, పొన్నికంటి తెలగన ఆకాలంవారే.

3. తెలంగాణం ఈజిప్టువలె ప్రపంచపు అంగడి
తెలంగాణ రాజధాని గోలకొండ పట్టణం గొప్ప వర్తక వాణిజ్య కేంద్రం. గోలకొండ రాజ్యమంతటా ఈ వ్యాపారం ఇక్కడి నుంచి విస్తరించేది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో వర్తక వాణిజ్యాలు సాగేవి. డచ్చి, పర్షియా, తుర్కిస్తాన్, అరేబియా దేశాలకు సంబంధించిన వర్తకులు ఇక్కడ వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, ధాన్యాలు తదితర వ్యాపారం విరివిగా సాగేది. సముద్రతీరం మచిలీపట్నం (బందరు) ఓడరేవు నుంచి నేరుగా విదేశీ వ్యాపారం జరిగేది. అందుకే ఆకాలం వాళ్లు తెలంగాణను ‘ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి’ అని ప్రశంసించారు.

4. పట్టణాల్లో జనాభా పెరుగుదల అధికం కావడం వల్ల కలిగే ఇబ్బందులు
పట్టణ జనాభా నానాటికి పెరుగుతోంది. ఇలా శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 1. వసతులు చాలకపోవడం వల్ల ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి సామాన్యులకు జీవనభారం పెరుగుతుంది.
 2. రవాణా సౌకర్యాలు తగినంత లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాల్లో ప్రయాణ ఖర్చు తడిసి మోపెడవుతుంది.
 3. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతూండటం వల్ల మధ్య తరగతి జీవనం కష్టంగా మారుతుంది.
 4. వాహనదారులు పెరగడం వల్ల ప్రయాణానికి ఎక్కువ సమయం అవసరం కావడంతో ఎవరూ సకాలంలో గమ్యం చేరలేకపోతున్నారు.
 5. తగినంత నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటికోసం జనం క టకట లాడుతున్నారు. - ఈ విధంగా జనాభా పెరుగుదల, అందుకు సరిపడే నిష్పత్తిలో వసతులు, వ్యవస్థలు లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత...(పాఠంలోని 2, 3, 4 చర్చనీయ అంశాలను క్రోడీకరించాలి.)

5. పట్టణం/గ్రామం/చారిత్రక, సాంస్కృతిక అంశాలతో వ్యాసం
వ్యాసం అంటే ఏ అంశాన్నైనా సమగ్రంగా వివరించేది. ఏదైనా పట్టణం/గ్రామం, చారిత్రక/ సాంస్కృతిక అంశాలను వివరించడానికి ఆధారాలు.
1. గ్రామ/పట్టణ చరిత్ర-ఎప్పుడు ఏవిధంగా ఏర్పడింది.
2. కట్టడాలు-కోటలు, దేవాలయాలు, శిల్పసంపద..
3. ఉత్సవాలు, జాతరలు ప్రత్యేకతలు
4. సాహిత్యం, కళలు-కళాకారులు
5. ఉత్పత్తులు, వాణిజ్య వ్యాపారాలు
6. ప్రజాజీవనంలోని ప్రత్యేకతలు
7. గుర్తింపు
8. అభిప్రాయం
* అన్ని గ్రామాల్లో అన్ని విశేషాలు ఉండవు. ఉన్న వాటితోనే వ్యాసం ఆకర్షణీయంగా మలచాలి.

ఉదా:-పాలంపేట
వరంగల్ జిల్లాలో, జిల్లాకేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. చుట్టూ కొండలతో నయనానందకారమైన దృశ్యాల నడుమ కొలువై ఉంది ఈ ఊరు. ఊరి పక్కనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం ఉంది. దీన్ని 31 మార్చి 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.
 • రామప్ప అనేది ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పిపేరని కొందరు; ఆలయంలో కొలువైన దైవం రామలింగేశ్వర స్వామి ముద్దుపేరే రామప్ప అని మరికొందరూ వాదిస్తారు. ఏది ఏమైనా రామప్ప అంటే అద్భుతమైన శిల్ప సంపదకు చిరునామా.
 • దేవాలయం ద్వారం బయట కొలువైన నాగిని ప్రతిమలు నల్లరాతిలో నిగనిగలాడే అందాలు సందర్శకులను చూపు మరల్చుకోనీయవు. సప్తస్వరాల స్తంభం, సజీవంగా సాక్షాత్కరించే నంది, మండపంపైన కళ్యాణ ఘట్ట శిల్పాలు, గోడల నిండ అనేక కథలు చెప్పే బొమ్మలు గంటల తరబడి చూస్తూ గడపవచ్చు.
 • ఇక్కడి గోడల మీది పేరిణి శివతాండవం బొమ్మలు చూసి, ఆ కళను పునరుద్ధరించిన డాక్టర్ నటరాజ రామకృష్ణ 1985 ఫిబ్రవరి 17నాడు శివరాత్రి పర్వదినాన వేలమంది సమక్షంలో ప్రదర్శిపజేశాడు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారు ఆంగ్లంలో ప్రచురించిన రామప్ప వ్యాసం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నా.రె. కు పాటలు రాయడానికి ఈ శిల్పాలు ప్రేరణ ఇచ్చాయి.
 • దేవాలయం సమీపంలోని రామప్ప చెరువు తాగునీటి, సాగునీటి అవసరాలను తీరుస్తూ ఊరి పరిసరాలను సస్యశ్యామలం చేస్తుంది.
 • శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ పునరుద్ధరణ 1914 నుంచి ప్రారంభమై, అంచెలంచెలుగా పూర్తవుతున్నది. ఇంకా చేయవలసిందెంతో ఉంది. ఈ విషయంలో అందరూ సహకరిస్తే ఊరూ, దేవాలయం పూర్వవైభవం సాధించగలదనడంలో అనుమానం లేదు.
Published on 1/4/2016 2:44:00 PM