Sakshi education logo
Sakshi education logo

‘జీవనభాష్యం’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
1. మనసుకు మబ్బు ముసరడం:-
‘మబ్బు ముసరడం’ అంటే మబ్బులు కమ్ముకోవడం అని అర్థం. మనసుకు మబ్బు ముసరడం అంటే మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం అని అర్థం. సమస్యలతో సతమతమయ్యే మనసు స్వచ్ఛంగా, స్పష్టంగా కనిపించదు, వ్యవహరించదు. చింతలు, వెతలు, అస్పష్టభావాలతో నిండి ఉన్న మనసు దుఃఖానికి కేంద్రంగా మారుతుంది. మబ్బు చినుకుల్ని కురిపించినట్లే మనసు దుఃఖాన్ని వర్షింపజేస్తుంది.

2. జంకని అడుగులుకదిలితే అది దారి అవుతుంది.
కొత్తదారిలో వెళ్లాలంటే, కొత్త మార్గం కనుక్కొవాలంటే, కొత్తగా బాటను వేయాలంటే ఏ అనుమానం, అధైర్యం లేక అడుగు ముందుకు వేయాలి. అలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఒక కొత్తమార్గంలో నడిచి విజయం సాధించినవారే పదిమందికి ఆదర్శం అవుతారు. వాళ్లు నడిచిన మార్గంలో మరికొంత మందినడిస్తేనే అది దారిగా మారుతుంది. జీవితంలోనూ ఒక ప్రయోజనాన్ని ఆశించి, కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు భయపడకుండా ముందడుగువేసి, ఆదర్శంగా నిలవాలని కవిభావం.

3. మనిషి-మృగం:-
మనిషి-మృగం ఎన్నటికీ ఒకటి కాదు. మనిషి మనిషే, మృగం మృగమే. ఆకారంలో, స్వరూపంలో, స్వభావంలో స్పష్టమైన తేడాలున్నాయి. మృగానికి వావివరుసలు, తన పర భేదాలుండవు. దాని కడుపునిండటం సుఖంగా ఉండటమే పరమార్థంగా బతుకుతుంది. తనకు అడ్డంకిగా ఉన్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా, పశుబలంతో పక్కకుతోస్తుంది. ఈ లక్షణాలేవీ మనిషిలో ఉండవు. అన్నిటికీమించి మనిషి మేథో సంపన్నుడు. ఆలోచించి ఏది మంచో, ఏది చెడో ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసి, తెలివిగా జీవిస్తాడు. తెలివి అంటే విచక్షణ (మోసం కాదు).

4. హిమగిరిశిరసుమాడటం:-
హిమగిరి అంటే హిమాలయపర్వతం. హిమాలయం ఎంతో ఎతైంది, గొప్పతనానికి, గాంభీర్యానికి ప్రతీక. ఎంతటి ఉన్నతమైన వ్యక్తులకైనా వేదనలు ఉంటాయి. గాంభీర్యం కరిగిపోయి అసలు స్వరూపం తప్పకుండా ఆవిష్కారమవుతుంది.

5. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది:-
మనిషి పేరు సంపాదించడం అంటే గొప్పపేరు పొందడం అని అర్థం. గొప్పపేరు మామూలు ప్రయత్నం వల్ల లభించదు. అందుకు ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగం ఎంతో విలువైంది కావాలి. అప్పుడే పేరు చిరుస్థాయిగా మిగిలిపోతుంది.


‘ఇవి చేయండి’ అభ్యాసాల ఆధారంగా-ముఖ్యాంశాలు
1. ‘జీవనభాష్యం’ శీర్షిక ఔచిత్యం
జీవనం అంటే బతుకు. భాష్యం అంటే నిర్వచనం. జీవన భాష్యం అంటే జీవితాన్ని నిర్వహించడం అని అర్థం. డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు రచించిన ఈ గజల్‌కు పేరు చక్కగా సరిపోయింది.
 • ఈ గజల్‌లో జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అనుసరించాల్సిన మార్గాలు అంతరార్థంగా విశ్లేషించారు.
 • మనిషి మనసు ఎంత కఠినమో అంత సున్నితం. బ్రతుకు ప్రయాణమెంత కఠినంగా ఉన్నా ప్రయాణం మానుకోవద్దు. ప్రయత్నిస్తే ఎడారుల్లో కూడా మొక్కలు మొలిపించిన ట్టు నిరాశానిస్పృహల్లో కొట్టుకొని పోయేవారిలోనూ ఆశలు చిగురింపజేయవచ్చు. మనుషుల్లో మానవత్వం ఎంతలోపించినా అతడు మృగం కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, గర్వించినా అది తొలగిపోయి, మాములు స్థితికి చేరుకోక తప్పదు. ఇలాంటి జీవిత సత్యాలను చెబుతూ మానవ జీవితాన్ని వ్యాఖ్యానించడం ఈ గజల్‌లో కనిపిస్తుంది. అందుకే ఈ గజల్‌కు ‘జీవన భాష్యం’ అనే పేరు సరిగ్గా సరిపోతుంది.
2. ఆధునిక పద్యసాహిత్య ప్రక్రియలు:-
 1. వచనకవిత:- ఎలాంటి ఛందస్సుగానీ, క్రమబద్ధత గానీ లేకుండా భావమే ప్రధానంగా ఉండే కవిత్వం. ఉదా:-శ్రీశ్రీ-మహాప్రస్థానం.
 2. మినీకవిత:-నాలుగైదు పాదాలకు మించని చిన్న కవితను మినీకవిత అంటారు. ఇందులో వ్యంగ్యం, చమత్కారం, మెరుపు కనిపిస్తాయి. ఉదా:-ఆలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్.
 3. గేయం:-మాత్రాఛందస్సులో ఉండి, పాడుకోవడానికి అనువుగా ఉండే కవిత్వం. ఉదా:-సుద్దాల హనుమంతు- ‘పల్లెటూరి పిల్లగాడా...’
 4. నానీ:-నాలుగుపాదాల చిన్న కవిత. ఇరవై అక్షరాలుంటాయి. వ్యంగ్యం. చమత్కారం, సందేశం, తాత్వికమైన అంశాలను కలిగి ఉండే ఈ నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్. గోపి. ఉదా:-గోపీనానీలు.
 5. రుబాయి:-ఉర్దూ సాహిత్య ప్రక్రియ నుంచి తెలుగులోకి అనువదించారు. నాలుగు పాదాలు ఉండి, 1, 2, 4 పాదాల చివర అంత్యాను ప్రాసతో పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఉదా:-సామల సదాశివ రుబాయిలు.
 6. హైకూ:-జపనీస్ కవిత్వం నుంచి అనువదించారు. మూడు పాదాలుంటాయి. 1, 3 పాదాల్లో ఐదేసి అక్షరాలు, రెండోపాదంలో ఏడక్షరాలుంటాయి. అసాధారణ పోలికలతో ఆలోచనలు రేకెత్తిస్తాయి.
3. ఎడారిదిబ్బలు దున్నితే ఫలమేముందనకు..ఇచ్చే కవి సందేశం:-
ఎడారిలో ఏ పంటలూ పండవు. అలాగని నిరాశపడకుండా అక్కడ కూడా మేలైన ప్రదేశాన్ని వెతికి మొక్కలను అంకురింపజేయొచ్చు. ‘నిరాశా నిస్పృహలతో కొట్టుకు పోవడం కంటె, ఏదో ఒక ఆధారంతో ప్రయత్నిస్తే శూన్యంలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు’ అనేది కవి సి.నా.రె. సందేశం. అంటే ప్రయత్నలోపం ఉండరాదని హెచ్చరిక.

4. మంచిపంటలు పండటానికి రైతు చేసే శ్రమ.....
భూమినే దైవంగా భావించి నిరంతరం కష్టపడే శ్రామికుడు రైతు. అందుకే రైతును భూమిపుత్రుడన్నారు. మంచి పంటలు పండటానికి రైతు ఎంతగానో శ్రమిస్తాడు.
 • నేలను బాగాదున్ని చదును చేస్తాడు.
 • నీరుకట్టి, అరకతో మడులు చేస్తాడు.
 • నారుపోసి, నాట్లేస్తాడు.
 • కలుపుతీస్తాడు.
 • ఎరువులేస్తాడు.
 • సకాలంలో పంటకోసి, నూర్పిడి/కళ్లం చేస్తాడు.
5. చరిత్రలో శాశ్వతంగా నిలవాలంటే చేయవలసిన పనులు.....
అందరిలో ఒకరుగా కాక అందరికోసం ఒకడుగా జీవించేవారు; ఏదైనా ఒక రంగానికి జీవితాన్ని అంకితం చేసి ముందుకు నడిచేవారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ స్థాయిని అందుకోవాలంటే...
 • స్వార్థం విడిచిపెట్టి, ఇతరుల మేలుకోసం ఆలోచించాలి.
 • అలసత్వం, సోమరితనం విడిచి, నిరంతరం శ్రమించాలి.
 • లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకోసం ప్రయత్నించాలి.
 • యాంత్రికంగా కాకుండా చిత్తశుద్ధితో పని చేయాలి.
 • అంకితభావంతో అంటే పనిసాధించడానికి దేన్నైనా సమర్పించగలం అన్న స్థితిలో పూర్తిగా మనసుపెట్టి పనిచేయాలి.
 • పట్టుదల, దృఢదీక్షలను ఆధారం చేసుకొని ముందుకు సాగాలి.
6. మనుషులు పదుగురుకూడితే ఊరవుతుంది అంటే.......
 కవి ఆచార్య సి.నా.రె. ఈ మాట అనడం వెనుక ఉద్దేశం-మనుషులంతా కలిసి ఉన్నప్పుడే ‘ఊరు’ అనే మాటకు అర్థం. ఊరంటే పది ఇళ్లు కాదు, ఇళ్లలోని మనుషులు కలిసిమెలిసి జీవిస్తూ ఒకరి బాధలు ఇంకొకరు అర్థం చేసుకోవడం. పరస్పర సహకారంతో ఊరిని అభివృద్ధి చేసుకోవడం. అందరూ కలిసి ఆనందాలను పెంచుకోవడం, సామూహిక కార్యక్రమాలూ, ఉత్సవాలూ నిర్వహించుకోవడం.
 
7. వచనకవిత (అంత్యాను ప్రాసలతో):-
వచన కవితలో అంత్యానుప్రాస ఒక పద్ధతి. ఇది తప్పకుండా పాటించాలనే నియమం లేదు. ‘జీవన భాష్యం’ గజల్ కాబట్టి దానికి అంత్యానుప్రాస ఒక నియమం.
    మంచుకరిగితే నీరవుతుంది
    నలుగురునడిస్తేనే దారవుతుంది
    రైతు కృషి చేస్తే పైరవుతుంది
    పదిమంది కలిసి జీవిస్తే ఊరవుతుంది
    చినుకూ చినుకూ కలిస్తే ఏరవుతుంది
    అందరూ పిలిచినప్పుడే అది పేరవుతుంది.
 
8. ఇంటర్వ్యూ ప్రశ్నలు:-
ఏదైనా ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వాళ్ల గురించి తెలుసుకోవడానికి వాళ్లను ఇంటర్యూ చేస్తుంటారు. దీన్నే తెలుగులో ముఖాముఖి అంటారు (ఏదైనా ఉద్యోగానికిగాని, పదవికిగాని ఎంపిక చేసే పరీక్షగా కూడా ముఖాముఖి నిర్వహిస్తుంటారు.)
ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు 1. వాళ్ల వ్యక్తి గత సమాచారం. 2. పనిచేస్తున్న రంగానికి సంబంధించిన వివరాలు. 3. సాధించిన విజయాలు, గుర్తింపు గురించిన అంశాలు 4. సందేశం-అనే అంశాల పై ప్రశ్నలు అడగాలి.
 ఉదా:-(సి.నా.రె. గారిని అడిగితే...)
 1) మీ పూర్తిపేరు?
 2) కుటుంబ వివరాలు తెలుసుకోవాలని ఉంది...
 3) కవితా రచన ఎప్పుడు ప్రారంభించారు?
 4) ఎవరు మీకు ప్రేరణ?
 5) ఎన్ని పుస్తకాలు రాశారు? ముఖ్యమైన పుస్తకాలు...
 6) జ్ఞానపీఠ పురస్కారం లభించిన ‘విశ్వంభర’ గురించి చెప్పండి?
 7) పురస్కారం ఎలా లభించిందో కొంచెం వివరించండి?
 8) మీకు బాగా ఇష్టమైన పుస్తకం...?
 9) మీకు ఇంకా ఏఏ పురస్కారాలు, బిరుదులు లభించాయి?
 10) సినిమా పాటలు ఎంతకాలం రాశారు? బాగా నచ్చిన పాట ఏది?
 11) ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న వైనం గురించి చెప్పండి?
 12) పద్యరచన మాని, వచన కవితలు రాయడం ఎప్పుడు మొదలైంది? ఎందుకు?
 13) అంతర్జాతీయ పర్యటనలకు సంబంధించి ఏదైనా ఒక అనుభవం చెప్పండి?
 14) మీ జీవితలక్ష్యం ఏంటి? నెరవేరిందా?
 15) ప్రస్తుత కవులకు మీరిచ్చే సందేశం?
Published on 1/4/2016 2:35:00 PM