Sakshi education logo
Sakshi education logo

‘లక్ష్యసిద్ధి’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
పాఠంలోని చర్చనీయ అంశాలు

1. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో స్పందన...
‘తెలంగాణ రాష్ట్ర సిద్ధి’ కల సాకారమవుతుందన్న ఆశ ఇక్కడి వాళ్లందరి మనసుల్లో బలంగా వెలుగుతున్నా, సుడిగాలి లాంటి ఆంధ్రనాయకుల విజృంభణ ఏ క్షణాన ఎలాంటి పరిణామాలు కొని తెస్తుందోనన్న అనుమానం కుదిపేస్తుంది. గతంలో చాలాసార్లు నోటి దాకా వచ్చిన ముద్ద జారిపడ్డ గత అనుభవాలే ఈ అనుమానానికి కారణం. కాని, అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించింది. బీజేపీ కూడా తన మాటను నిలబెట్టుకుంది. రెండు నాల్కల ధోరణి అనుసరించిన వాళ్లు కుదేలైపోయారు. మసిపూసి మారేడుకాయ చేసి మంచిపేరు తెచ్చుకోవాలని ఆరాటపడ్డవాళ్లఆటలు సాగలేదు. ఆంధ్రనాయకుల నిరసనలు తెలంగాణ ప్రాంతానికి చెందిన తీపికబురును అడ్డుకోలేక పోయాయి. తెలంగాణ ప్రకటన విషయాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. ఎట్టకే లకు షాక్ నుంచి తేరుకొని అర్ధరాత్రి వేళ ఆకాశాన్నంటే సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు. ఎక్కడి వాళ్లక్కడ తీన్‌మార్ దరువులతో, డాన్సులతో, బతుకమ్మా ఆటలతో, ఉద్యమం పాటలతో ఆకాశమే హద్దుగా ఆనంద నృత్యాలు చేశారు. ఉద్యమ స్మృతులను నెమరువేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మాటిమాటికీ అమరవీరులకు జోహార్లు అర్పించారు. బాణాసాంచా వెలుగులతో అర్ధరాత్రిని పట్టపగలుగా మార్చారు. ఒక కొత్తశకం ప్రారంభమైన వైనాన్ని పత్రికలన్నీ ముక్తకంఠంతో అభినందించాయి. మేమంతా వీధుల్లోకి వెళ్లి ఒకరికొకరం మిఠాయిలు తినిపించుకున్నాం, డాన్సులు చేశాం, అభినందించుకున్నాం.

2. తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చిన పోరాట ఘట్టాలు....
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రెండు దశల ఉద్యమంలో తొలిదశ ఉద్యమానికి సంబంధించి ఈ తరం వారికి ప్రత్యక్ష నిదర్శనాలు అంతగా అందుబాటులో లేవుకానీ మలిదశ ఉద్యమంలో మాత్రం ఎన్నో సంఘటనలు ప్రజలను కలచివేశాయి. కన్నీరు వరదలై పారిన సంఘటనలు, హృదయం చెమ్మగిల్లేలా చేశాయి. 2001లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా సాగింది. 2010-11లో కొంచెం నెమ్మదించినట్టు ఉన్నా, 2012లో పడిలేచిన కెరటమై విజృంభించింది. స్త్రీలు, బాలురు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోజుకూలీలు, ఆటోకార్మికులు, పారిశుధ్యకార్మికులు, కుల సంఘాలు...పల్లెలు, పట్నాలు, నగరాలు, వీధులు, వాడలు-అన్నీ కలిసి ఉప్పెనై సీమాంధ్ర నాయకులను ముంచెత్తాయి. ఆ సందర్భంగా మనసులను చెమ్మగిల్లేలా చేసిన వాటిలో కొన్ని.....
 1. శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకోవడం.
 2. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం.
 3. పార్లమెంట్ భవన్ సమీపంలో యాదిరెడ్డి ఆత్మార్పణ గావించడం.
 4. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై విచక్షణా రహితంగా బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీలతో విపరీతంగా కొట్టడం.
 5. సీమాంధ్రుల సమైక్యవాదసభ ఎల్.బి.స్టేడియంలో జరుగుతున్నప్పుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పోలీస్ ‘జై తెలంగాణ’ నినాదం చేసి అధికారులచే శిక్ష ఎదుర్కొవడం.. ఇలా ఎన్నెన్నో ఆర్ద్రమైన జ్ఞాపకాలు ఇప్పటికీ, ఇంకా పచ్చిగానే ఉన్నాయి.
3. ‘జై తెలంగాణ’ నినాదం బలపడటానికి దారితీసిన పరిస్థితులు, పర్యవసానాలు...
నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటాన్ని మొదటి నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘ఇది తాత్కాలిక బంధమే. ఎప్పుడైనా విడిపోవచ్చు’. అన్న ఆపద్ధర్మ సూత్రంతో రెండు ప్రాంతాలను ముడివేశాడు. ఆనాటి నుంచి 2014 జూన్ రెండు వరకు ఆ బలహీనమైన బంధం తుమ్మితే ఊడి పడే ముక్కులాగానే సాగింది. అయితే ముల్కీ నిబంధనల ప్రకారం ఇక్కడి స్థానిక ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, పరిస్థితులు ఇంత దారుణంగా మారేవికాదు. క్రమక్రమంగా తెలంగాణేతర ప్రాంతీయుల ఆధిపత్యం బలపడటం, పాలకవర్గంలో వాళ్లబలం అధికం కావడంతో తమకు అన్యాయం జరుగుతుందన్న సృ్పహకలిగింది తెలంగాణ ప్రజల్లో. అది అంతకంతకూ తీవ్రమై 1969లో ఉధృతరూపం దాల్చింది. ‘జై తెలంగాణ’ నినాదం ఊపిరి పోసుకుంది. ఒక్కసారి ప్రజల నాలుక మీదికి వచ్చిన ఈ నినాదం ఇప్పటికీ అలసట లేకుండా నర్తిస్తోంది. ఒకప్పుడు ఆర్తితో, ఇప్పుడు ఆనందంతో.
వలస పాలకుల వివక్షపూరిత నిర్ణయాలు, పెత్తనాలు, అవమానాలు, అమర్యాదలు, పక్షపాత ధోరణులు, ఒంటెద్దు పోకడలు, అణచివేత విధానాలు జై తెలంగాణ నినాదం మరింతగా బలపడేటట్లు చేశాయి.

4. ఉద్యమకాలంలో హైదరాబాద్ వీధులు, మైదానాలు....
తెలంగాణ సాధన ఉద్యమ కాలం-మరో నిజాం వ్యతిరేక పోరాటాన్ని ఆవిష్కరించింది. పల్లెటూళ్లలో చినుకుల్లా మొదలైన ఉద్యమం, వాగులై, వరదలై, హైదరాబాద్‌ను ముంచెత్తినట్లు పార్టీలకు, వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతమై తెలంగాణ ఉద్యమం నగరంలోని వీధులన్నింటిలో ఎర్రగులాబీలను పూయించింది. కార్యాలయాల్లో, కుల సంఘాల్లో, కాలనీవాసుల్లో, కార్ఖానాల్లో, ఉత్సవాల్లో, పండుగల్లో, సమావేశాల్లో, చర్చల్లో... స్థలమేదైనా, సందర్భమేదైనా తెలంగాణ స్వేచ్ఛకోసం గళాలన్నీ నిప్పుకణాలు విరజిమ్మాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మోగిన తెలంగాణ నినాదం ఊరూ-వాడ, పల్లెపట్నం, నగరం రాజధాని దాటి అంతర్జాతీయ వేదికల్లో మార్మోగింది. పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగులు, వ్యాపారులు, కవులు, కళాకారులు సమరాగ్నిని చల్లారకుండా దశదశలుగా ఉద్యమించి, దిశలన్నీ ఉద్యమకాంతితో నిండిపోయేటట్లు చేశారు. మైదానాలన్నీ జన సముద్రాలయ్యాయి. ఆటపాటలతో, నినాదాలతో, వక్తల ప్రసంగాలతో యువత ఉద్రేకంతో ఉర్రూతలూగాయి.

5. గన్‌పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటనలు...
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీర పోరాటయోధుల స్మృతి చిహ్నంగా 1969లో గన్‌పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్తూపమే అమరవీరుల స్తూపం. దీని రూపశిల్పి ఎక్కా యాదగిరి. గత అర్థశతాబ్దంగా ఈ స్తూపం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని రగుల్కొల్పుతూనే ఉంది. తెలంగాణలోని చాలా ఉద్యమాలు ఇక్కడే ప్రారంభం కావడం ఆనవాయితీగా మారింది.
తొలిదశ ఉద్యమంలో 258 మంది బలిదానానికి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల రాళ్లను స్తూప నిర్మాణానికి ఉపయోగించడం భిన్నమైన విషాదాలకు సంకేతం. అశోక చక్రం గుర్తు రాజ్యాంగ హక్కులకు ప్రతీక. మెడలాంటి నిలువు చారలు తుపాకీ తూటాలను గుర్తు చేస్తాయి. శిఖర భాగంలోని తెల్లని పువ్వు స్వేచ్ఛకు సంకేతం.
తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు అనేక కార్యక్రమాలకు ఈ స్తూపం వేదికగా నిలిచింది. నిరాహార దీక్షలు, ప్రతిజ్ఞలు, మానవహారాలు, తీర్మానాలు, సభలు-ర్యాలీల ఆరంభాలకు ఇదే వేదిక. లాఠీలకు తూటాలకు కూడా ఇదే మౌన సాక్షి.

పత్రికా సంపాదకుడు ఆశిస్తున్న.........
6. తెలంగాణ పునర్నిర్మాణంలో చేపట్టవలసిన తక్షణ చర్యలేవి? మీరు సమర్థిస్తారా?

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో చేపట్టవలసిన అంశాలను గురించి నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు ఆశించినవి.
1) తెలంగాణ భాష, సంస్కృతులకు ప్రాణం పోయాలె.
2) తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలె.
3) ప్రజలకు కడుపు నిండాతిండి, కలతలేని నిద్రా, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలె.
4) సంక్షేమ పథకాలు చేపట్టాలె.
- రుణమాఫీ, పక్కా ఇళ్ల నిర్మాణం.
5) నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాలు చక్కదిద్దాలె.
6) పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టాలె.
ఇవన్నీ చారిత్రక సత్యాలు. తప్పనిసరి అవసరాలు. వీటిని కొత్తప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాం అందరమూ.

7. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు..
1) పాలనను పటిష్టం చేయడం-సంస్కరణలు చేపట్టడం.
2) ప్రజల కనీస అవసరాలకు లోటు రాకుండా చూడటం.
3) ఇక్కడి భాషను, సంస్కృతిని కాపాడటం.
4) సంక్షేమ పథకాలు చేపట్టడం.
5) నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం.

8. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నిర్వహించవలసిన పాత్ర (విద్యార్థిగా)
 • ఇక్కడి భాషను, యాసను గౌరవించి అనుసరిస్తాను.
 • సంస్కృతీ సంప్రదాయాల మూలాలను తెలుసుకొని గర్విస్తాను. వాటిని కొనసాగిస్తాను.
 • కష్టపడి చదివి, నా బాధ్యతలను ఇష్టపూర్వకంగా, సంతోషంగా నిర్వహిస్తాను.
 • రాష్ట్రాన్ని, రాష్ట్రచిహ్నాలను, రాష్ట్రగీతాన్ని గౌరవిస్తాను.
 • వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తాను.

పాఠాలు-ముఖ్యాంశాల అవగాహన

లక్ష్యసిద్ధి పాఠం
‘ఇవి చేయండి’ అభ్యాసాలు ఆధారంగా....

1. రాష్ట్రావిర్భావానికి కృషి చేసిన వారి అభినందన సభలో ప్రసంగాంశాలు.
అ) రాష్ట్రసాధనలో కవులు, కళాకారులు
 • రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమంలో సాహసవంతులైన నాయకులు ముందునడవగా ఎందరో వీరులు ప్రాణాలకు తెగించి పోరాడారు. అయితే వీళ్లకు అడుగడునా అదృశ్య శక్తినందించిన వాళ్లు మాత్రం కవులు, కళాకారులు.
 • కవులు తమ కలాల్లో నిప్పుల గరగరలు రాలిస్తే-కళాకారులు ఉరుములై గర్జించి ప్రజా హృదయాన్ని ఉర్రూత లూగించారు.
 • కవులు కన్నీటి చుక్కలను రాలిస్తే, కళాకారులు ఉప్పెనలై ఎగిసి, బడబానలాన్ని రగిలించారు.
 • కవులు ఆలోచనకు అక్షర రూపమిస్తే కళాకారులు ఆ అక్షరాలను ఆయుధాలుగా సంధించారు.
 • కవులు తమ కవితా కన్యకలకు కత్తులిచ్చి యుద్ధరంగంలో నిలబెడితే, కళాకారులు పేరిణి శివతాండవం వంటి ఆవేశపూరితమైన ఆటపాలతో జనాన్ని శివమెత్తించినారు.
 • ఊరూ-వాడ, పల్లె-పట్నం అంతటా పౌరుష రుషల్ రగిలించిన కవులు-కళాకారులు తెలంగాణ సాధనలో కీలకభూమిక నిర్వహించారు.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర.
 • అసమానత, వివక్ష, అన్యాయాన్ని సహించలేని ఉద్యోగులు, ఉద్యోగుల్లో భాగంగా మారిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యార్థులు...అందరూ ఉద్యమంలో గణనీయమైన పాత్ర పొషించారు.
 • ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా పెన్‌డౌన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, విధుల బహిష్కరణలు, నిరాహారదీక్షలు...ఈ విధంగా అన్ని రకాలుగా ఆనాటి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను, తెలంగాణ సాధనపై తమకుగల అకుంఠిత దీక్షను చాటుకున్నారు.
 • ఉపాధ్యాయులు సహజంగానే చరిత్ర నిర్మాతలు. వాళ్లు పాఠశాలల్లో ఉద్యమ నిర్మాతలయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాంల మార్గదర్శనంలో ఒక్కొక్కరు ఒక జయశంకర్, కోదండరాంలా మారి గర్జనలు చేశారు. భావిభారత పౌరులైన విద్యార్థుల్లోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆట పాటలతో సహ నిరసనలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసంగాల ద్వారా తెలంగాణ సాధనోద్యమంలో కీలకపాత్ర నిర్వహించారు.
 • ఉద్యమంలో అందరికంటె చురుగ్గా పాల్గొన్నవాళ్లు, ఎక్కువ కష్టనష్టాలు భరించిన వాళ్లు ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ముమ్మాటికీ విద్యార్థులే. ఉరకలెత్తుతున్న కవోష్ణరుధిరం వాళ ్లలోని ఉద్వేగానికి ఉత్ప్రేరకమై, భూనభోంతరాళను ఏకం చేసే ప్రచండ శక్తిగా మారింది. లాఠీ దెబ్బలను పూల చెండ్లుగా, తుపాకి గుండ్లను ఆటగోళీలుగా భావించి, అన్నిటికీ ఎదురొడ్డి వెన్నుచూపకుండా ముందుకురికారు. కళాశాలలు, మైదానాలూ ఉద్యమ వేదికలుగా చేసుకొని, ఆవేదనకు ఆవేశాన్ని జోడించి, వివక్షపాలకులపై నిప్పుల ప్రసంగాలను వెళ్లగక్కినారు. పాటలతో, ఆటలతో సంఘటిత శక్తిని చాటారు. యువశక్తి పవర్ ఆనాటి ప్రభుత్వాలు చవిచూసేటట్లు చేశారు. స్వరాష్ట్రం కోసం అమరులైన వాళ్లలో అత్యధికులు విద్యార్థులే.
ఇ) ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు
 • గల్లీ నుంచి ఢిల్లీదాక ఉద్యమం సెగ చ ల్లారకుండా నడిపించినవాళ్లు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు. వీళ్లంతా వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రసాధననే ఆయుధంగా చేసుకొని ఎన్నికైన ప్రతినిధులు. ఎన్నిక కాని నాయకులు కూడా సత్యాన్ని గ్రహించి, సెంటిమెంట్‌కు తలవంచి ‘ఉద్యమమే శరణ్యం, అదిలేకుంటే బతుకు అరణ్యం’ అని బతుకుపోరాటం బరిలోకి దిగారు.
 • పార్టీలకు అతీతంగా ప్రాతినిధ్యం వహించడం; జెండాలకు, ఎజెండాలకు అతీతంగా ప్రజాభిప్రాయానికి అండగా నిలువడం అనివార్యమైంది.
 • తమ అధికారంతో, పలుకుబడితో ప్రజలను కాపాడుకుంటూనే గల్లీ నుంచి ఢిల్లీదాక ఉన్న అన్ని వేదికలనూ రాష్ట్రస్థాయిలో సాధకాలుగా మలచుకున్నారు.
 • ఉద్యమంలో ఇబ్బందులెదురైన ప్రతిసారి మేమున్నామన్న భరోసా కల్పిస్తూ ప్రత్యక్షమై, సమస్యలను నిర్మూలిస్తూ, ఉద్యమాన్ని ఉత్తేజ పరుస్తూ ప్రస్థానాన్ని కొనసాగించారు.
 • రాష్ట్ర సాధనలో తిరుగులేని నాయకత్వాన్ని నెర్పారు.
ఈ) సకల జనులపాత్ర
తెలంగాణ సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైన చారిత్రక ఘటం సకలజనుల సమ్మె. కులం, మతం, వంశం, వర్గం, వయస్సు, వృత్తి, పార్టీ, పర్సనాలిటీ అన్న వైషమ్యాలన్నీటినీ పక్కన పెట్టి సకల జనులు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రప్రజల బాగుకోసం ఉద్యోగులు తమ జీతాలు వ దులు కోవడానికి సిద్ధపడ్డారు. వ్యాపారులు తమ లావాదేవీలకు కళ్లెం వేశారు. కులవృత్తుల వాళ్లు ఆత్మగౌరవం ముందు వృత్తిపనులను మోకరిల్లజేశారు. కూలీలు, పనివాళ్లు కడుపులు మాడినా సరే కాలు కదపమని భీష్మించారు. అర్చకస్వాములు, ఆలయ నిర్వాహకులు స్వరాష్ట్రానికి సహకరించకుంటే నిత్య నైవేద్యాలు సైతం కరువవుతాయని దేవతలను హెచ్చరించారు. అన్ని విభాగాల ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ వ్యక్తులు మూకుమ్మడిగా నిరసన గళమెత్తారు. రోడ్డురవాణా సంస్థవాళ్లు కూడా ప్రగతి రథ చక్రాల నుంచి గాలి తీసి, అందరితో గళం కలిపారు. ఈ విధంగా రాష్ట్ర సాధనలో అందరూ పాలు పంచుకున్నారు.

2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతి చరిత్రలో అద్భుత ఘట్టం
నిజమే! భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అనేది ఒక అద్భుత ఘట్టం. తెలంగాణ చరిత్రనే ఒక అద్భుతం. 1947లో దేశమంతా స్వాతంత్య్రం లభించినా, పదమూడు నెలల రెండు రోజులు ఆలస్యంగా స్వేచ్ఛా వాయువులు పీల్చింది. అప్పుడు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
 • ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రమేర్పడినప్పుడు ఎంతో సంఘర్షణనను అనుభవించారు.
 • సుమారు అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వేయి మందికి పైగా వీరులు బలిదానమయ్యారు.
 • ఢిల్లీ పెద్దలను ఒప్పించి, అన్ని పార్టీలను ఒక్క తాటిమీదికి రప్పించి, అనేక ప్రతికూలతల మధ్య స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
 • ఇన్ని ప్రత్యేకతలున్న రాష్ట్ర ఆవిర్భావం జాతి చరిత్రలో అద్భుత ఘట్టం.
3. సంపాదకీయల్లోని భాష, శైలి
పత్రికల్లో సంపాదకీయాలు రాసే వాళ్లు ప్రజలందరికి (పాఠకులకు) బాగా అలవాటైన అర్థమైన భాషనుపయోగిస్తారు.
 • మంచి పట్టుగలిగిన శైలితో, సమయోచిత ఉదాహరణలతో, సందర్భోచిత జాతీయాలతో పఠనీయగుణాన్ని నింపుతారు.
 • సంపాదకీయ నేపథ్యాన్ని చక్కగా ఆవిష్కరించి, పఠితల హృదయాల్లో చెరగనిముద్ర వేస్తారు.
 • మంచి ముగింపునిచ్చి పాఠకులను ఆలోచింపజేస్తారు.
 • పత్రికకు గుండెకాయవంటి సంపాదకీయాన్ని ప్రతినిత్యం తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
4. పత్రికల్లో సంపాదకీయాల అవసరం
పత్రికలు ప్రత్యేక సిద్దాంతాలు, లక్షాల ఆధారంగా నడుస్తాయి.
 • సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ వంటి వి. మిగతావార్తలకు విశ్లేషణలకు భిన్నంగా వాస్తవాల అవసరాలకు ప్రజలకు ప్రభావవంతంగా అందజేస్తాయి.
 • అనివార్యమైన అంశాలు, చక్కనీ భాషా శైలితో పాఠకులకు అందించి ఆలోచింపజేస్తాయి.
 • మేథావులలో చలనం తీసుకొచ్చి, స్పందించేటట్లు చేస్తాయి.
 • సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి.
 • సమకాలీన సామాజికాంశాలు; రాజకీయ, ఆర్థిక విషయాలు; చారిత్ర పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రజలను మేల్కొలుపుతాయి.
ఈ లక్ష్యాల సాధనకోసం పత్రికల్లో సంపాదకీయాలు రాస్తారు.

5. సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు భేదాలు
 • సంపాదకీయాలు ప్రత్యేకంగా రూపొందిస్తారు (రచిస్తారు), వార్తలు సేకరించి ముద్రిస్తారు.
 • సంపాదకులు (ఎడిటర్స్) స్వయంగా సంపాదకీయం రాస్తారు. విలేకరులు వార్తా సమాచారం సేకరిస్తారు.
 • సంపాదకీయాల్లో విమర్శనాత్మక, విశ్లేషణాత్మక అంశాలుంటాయి. వార్తలను కొన్నింటిని, కొన్ని సందర్భాల్లోనే విశ్లేషిస్తారు.
 • సంపాదకీయాల్లో భావంతోపాటు భాష, శైలి ప్రత్యేకంగా ఉంటుంది. వార్తాంశాల్లో విషయం ప్రధానం.
 • సంపాదకీయాల్లో పత్రిక సిద్ధాంతాలు ప్రతిఫలిస్తాయి. వార్తలు ఆపని చేయలేకపోవచ్చు.
 • సంపాదకీయాలు పాఠకుల్లో ఆలోచనాశక్తిని పెంపొందించి, స్ఫూర్తిని రగిలిస్తాయి. వార్తల ప్రభావం పరిమితం.
6. పత్రికల ఆలోచనాధోరణికి, దృక్పథానికి సంపాదకాయాలు ప్రతీకలు
 • ప్రతి పత్రికకూ తనదైన ఆలోచనా ధోరణి, దృక్పథం ఉంటాయి. సంపాదకీయాలు వాటిని ప్రతిఫలింపజేస్తూంటాయి. ఉదా:- తెలంగాణ రాష్ట్రావిర్భావం సందర్భంగా నమస్తేతెలంగాణ పత్రిక తన సంపాదకీయ శీర్షికను ‘లక్ష్యసిద్ధి’ అని పేర్కొంది. మిగతా పత్రికలు ‘ఎన్నేళ్లో వేచిన ఉదయం (ఈనాడు)’, ‘పొద్దుపొడుపు (ఆంధ్రజ్యోతి)’, ‘స్వాగతాంజలి (ప్రజాశక్తి)’, ‘నవతెలంగాణ (సాక్షి)’ అనే శీర్షికల కింద సంపాదకీయ వ్యాసాలు ప్రచురించాయి.
 • ఈనాడు ఒక సినిమాపాట ప్రారంభాన్ని సూచించింది. ఇది ఉత్కంఠకు తెరదించే సమయమని తెలుపుతుంది. ఆంధ్రజ్యోతి దాశరథీ తెలంగాణ పద్యంలోని మాటను శీర్షికగా నిర్ణయించింది, సాక్షి తెలంగాణకు కొత్తజీవనం ప్రారంభమవుతుందని ప్రకటించింది.
 • నమస్తే తెలంగాణ సంపాదకీయ శీర్షిక పోరాట చరిత్రనంతా ప్రతిఫలింపజేస్తుంది. ఏ లక్ష్యంకోసం అర్థశతాబ్దంగా పోరాటం సాగిందో, ఏలక్ష్యం కోసం వేయికిపైగా పిల్లలు బలిదానమయ్యారో అది సిద్ధించింది అన్న చారిత్రక సత్యాన్ని ఆమాట తెల్పుతుంది.
 • దీన్నిబట్టి పత్రిక ఆలోచనా ధోరణి స్పష్టమవుతుంది. తెలంగాణ ప్రజల లక్ష్యం సిద్ధించిందని తెలియజేస్తూనే, ఇంకా సిద్ధింపజేసుకోవలసిన లక్ష్యాన్ని అన్యాపదేశంగా ఈ శీర్షిక హెచ్చరిస్తుంది.
 • తెలంగాణ మట్టిలో పుట్టి, కేవలం తెలంగాణకోసం పని చేస్తున్న అంకిత భావం ఈ పత్రిక నేపథ్యంగా మనకు స్పష్టమవుతున్నది.
 • ఈవిధంగా కొంచెం లోతుగా ఆలోచించి చూసినప్పుడు ఆయా పత్రికల అంతరంగాలు అర్థమవుతాయి.
 • సంపాదకీయాలు చాలావరకు నిష్పాక్షికంగా ఉంటాయి కాని, ఈ మధ్యకాలంలో వార్తలు-విశ్లేషణల్లో, ప్రచురణ ప్రాధాన్యతలోనే పత్రికలు తమ స్వరూప స్వభావాలను బయటపెడుతున్నాయి.
7. సంపాదకీయవ్యాసం
సమకాలీన సామాజికాంశాన్ని పత్రికలు తమ ఆలోచనాధోరణి ప్రతిఫలించేటట్లు విశ్లేషిస్తాయి సంపాదకీయాలు. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని అందంగా, స్పష్టంగా, ఆలంకారికంగా చెబుతాయి.
ఉదా:-‘తెలంగాణ భాషాదినోత్సవం’
ఈ మట్టిలో పుట్టి, ఇక్కడి భాషను యాసను సొంతం చేసుకొని, స్వరాష్ట్రం కోసం మూడు తరాల వాళ్ల ఉద్యమంలో ముందు భాగంలో నడిచి, ఈ జాతికి పథనిర్దేశకుడుగా పేరుగాంచిన ‘కాళోజీ’ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం ముదావహమైన విషయం.
 • ఒక ప్రాంతంలో జీవించడమంటే అక్కడి ప్రజల కష్టసుఖాల్లో, కన్నీళ్లలో ఆనందబాష్పాల్లో, వేదనల్లో, ఆనందాల్లో తానూ ఒక భాగంగా మారిపోవడం. కాళోజీ అచ్చంగా అలాగే గడిపాడు. రాష్ట్రపతి పక్కన నిలబడ్డా, రాళ్లు గొట్టేటోని పక్కన కూచున్నా ఒకే రకంగా భావించిన స్థిత ప్రజ్ఞుడాయన. పద్మ భూషణం కంటే పదిమందితో భాషించడంలోనే నిజమైన ఆనందాన్ని అనుభవించిన వాడు కాళోజీ. ఎవ్వనికీ భయపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం చిత్తశుద్ధితో పని చేయగలిగే మొనగాడు ఒక్కడే ఉంటడు. ఆ ఒక్కడే కాళోజీ అలాంటి కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. మాతృభాషలో మాట్లాడలేక పోవడం కంటె చావడం నయమని కఠినంగా పలికిన కాళోజీ జీవితకాలం అంతా ఇక్కడి యాసలోనే మాట్లాడిండు. ఇంతకు మించిన ప్రాంతీయ భాషాభిమానం ఉండదు.
 • దశాబ్దాల తరబడి వెక్కిరింపులకు, అవమానాలకు, అపహాస్యాలకు కేంద్రబిందువుగా చేసిన వలసపాలకుల ప్రాంతం వాళ్ల జన్మదినాన్ని మన మాతృభాషాదినోత్సవంగా జరుపుకోవడం సమంజసమో, ఈ భాషాను జీవభాషగా జీవిత కాలమంతా తలెత్తుకొని తిరిగిన కాళన్న జయంతిని భాషాదినోత్సవంగా సంబురంగా జరుపడం ముఖ్యమో నిర్ణయించుకోవాల్సిన తరుణమిది.
Published on 1/4/2016 2:28:00 PM