Sakshi education logo
Sakshi education logo

‘భాగ్యోదయం’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
పాఠంలోని చర్చనీయ అంశాలు:-
1. కులవ్యవస్థ-సమాజంపై ప్రభావం
‘కులవ్యవస్థ’ అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్లనంతా ఒకేవర్గంగా భావించి, ఆ వర్గం వ్యక్తుల్లోనే సంబంధ బాంధవ్యాలను విస్తరింపజేసుకోవడం. ఈ వ్యవస్థ మానవ సమాజాన్ని విభజిస్తుంది కానీ ఆధునిక యుగంలో విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇది మరింత పటిష్టం కావడం ఆశ్చర్యకరమైన పరిణామం. కుల సంఘాలు స్థాపించుకోవడం, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం, ఇతర కులాలతో పిల్లలు సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని వ్యతిరేకించడం ఆరోగ్యకరమైన అంశాలు కావు. ఇది పరిహరించి మనుషులంతా ఒక్కటే అన్న భావన పెంపొందించాలి.

2. చిత్తశుద్ధి:-అంటే మనసులో ఏ ఇతర (మలినమైన) ఆలోచనలు లేకుండా వ్యవహరించడం. అంటే స్వచ్ఛమైన మనసుతో ప్రవర్తించాలి. మనఃపూర్వకంగా పనిచేయాలి.

3. నిజాయితీ:-న్యాయబద్ధంగా నడుచుకోవడమే నిజాయితీ. మనం చేసేపని ధర్మబద్ధంగా, సత్యాన్ని అతిక్రమించకుండా, ఎవరికీ అన్యాయం కలగకుండా ఉండే టట్లు చూసుకోవడం నిజాయితీ.

4. అజ్ఞానం, ఉదాసీనత వల్ల నష్ణాలు:-
అజ్ఞానం అంటే తెలియనితనం. ఉదాసీనత అంటే పట్టనట్లుండటం. ఈ రెండూ అనేక కష్టాలకు, నష్టాలకూ కారణమవుతాయి. మానవజాతి వినాశనానికి సగం కారణం అజ్ఞానం అయితే మరో సగం అమాయక త్వం అన్నారో మహానుభావులు.
ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా ఆ విషయంలో ప్రయోజనాన్ని పొందలేం. ఉదాహరణకు మహిళలకు గృహహింస చట్టం గురించి తెలియదనుకోండి. అప్పుడు ఇంట్లో ఎంత వేదన అనుభవిస్తున్నా, కష్టాలు పడుతున్నా ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఫలితం ఉండదని తమలోతాము బాధపడుతూ చివరికి ప్రాణాంతక పరిస్థితుల్లోకి తమనుతాము నెట్టుకుంటారు. ఇక రెండోది ఉదాసీనత. ఇది అజ్ఞానం కంటె భయంకరమైంది. చట్టాల గురించి తెలిసినా సరే! ‘ఎవరొచ్చి ఉద్ధరిస్తారు?’ అని అనుకోవడం. ‘నా కర్మ ఇలా కాలింది’ అని సరిపెట్టుకోవడం. ఏమాత్రం లక్ష్యపెట్టకపోవడం...ఇవన్నీ న ష్టాన్ని కలిగించేవే కదా! ఇదే విధంగా...
 • ప్రభుత్వ పథకాలు; హక్కులు; ఉమ్మడి ఆస్తుల రక్షణ, వినియోగం; సామాజిక సౌకర్యాలు; ఓటు హక్కు; సమాచార హక్కు వంటి వాటి గురించి తెలుసుకోకపోవడం...
 • మనకేం జరిగినా; పక్కవాళ్లకి నష్టం జరిగినా; పర్యావరణం పాడైపోతున్నా; వీధి వాడా మురికి కూపంగా మారినా; ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా; అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం అన్ని రకాల కష్టనష్టాలు కలిగిస్తాయి.
5. మూఢనమ్మకాలు అంటే...
 • మూఢం అంటే అజ్ఞానం (తెలివిలేనితనం). ఏ విషయాన్నైనా గుడ్డిగా (అజ్ఞానంగా) నమ్మడాన్నే మూఢనమ్మకం అంటారు. ఎదుటివాళ్లు ఏది చెప్పినా నిజమేనన్న అమాయకత్వంతో, ఎదురు ప్రశ్నించకుండా, కనీసం ఆలోచించకుండా నమ్మి అనుసరించడమే మూఢనమ్మకం. తరతరాలుగా ఇలాంటి నిజాలని అనుసరిస్తూ, వాటిని సంప్రదాయంగా మలచి, కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మూఢనమ్మకాలను ఈ సమాజంలో స్థిరపడేటట్లు చేసుకున్నాం.
 • దయ్యాలు; చేతబడులు; బాణామతులు; తుమ్మితే, పిల్లి ఎదురైతే, విధవల మొఖం చూస్తే అశుభం కలుగుతుందనుకోవడం; కుడికాలు - ఎడమకాలుకు తేడా; పుట్టుమచ్చలు; బల్లిపడటం; కలలుకనడం....ఇలా ఎన్నో.....
6. వర్మ తన జాతి జనుల్లో తెచ్చిన మార్పు......
భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ రాష్ట్రంలో 20వ శతాబ్దపు ప్రారంభంలో నిమ్న జాతుల అభ్యున్నతికి, సమాజశ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన సంస్కర్త.
 • మనుషులంతా సమానమని, ఎవరూ ఎక్కువ తక్కవ కాదన్న నిజాన్ని గ్రహించే లా చేశాడు.
 • నిమ్న జాతులపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ, వాళ్లు చదువుకునేలా చేశాడు.
 • బహిరంగ సభలు నిర్వహించి, హిందువులందరినీ ఒక్క తాటిమీదికి తెచ్చే ప్రయత్నం చేశాడు.
 • దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలకు అడ్డుకట్ట వేశాడు.
 • తాగుడు మాన్పించగలిగాడు.
 • అనేక దురాచారాల నుంచి కొన్ని కుటుంబాలను కాపాడగలిగాడు.
7. మంచి వక్త:-
మంచి వక్త అంటే బాగా మాట్లాడగలిగేవాడు. బాగా మాట్లాడడం అంటే 1) సందర్భానికి తగ్గట్లు మాట్లాడటం. 2) తగినంత మాట్లాడటం 3) మంచి భాష ఉపయోగించి, స్పష్టంగా మాట్లాడటం 4) ఎంత కఠినమైన విషయాన్నైనా సున్నితంగా చెప్పగలగడం. 5) చక్కని ఉదాహరణలు, జాతీయాలు, సామెతలు సమయోచితంగా ఉపయోగించడం 6) ధారాళంగా మాట్లాడటం. 7) ప్రేక్షకులకు /శ్రోతలకు అర్థమయ్యేట్టుగా మాట్లాడటం. 8) అలంకారికంగా మాట్లాడటం 9) హేతుబద్ధతతో మాట్లాడటం 10) ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా మాట్లాడటం.

8. అండగా ఉండటం:-
‘అండ’ అంటే తోడు, ఆశ్రయం, ప్రాపు, సమీపం అనే అర్థాలున్నాయి. అండగా ఉండటం అంటే ‘నీకుతోడు నేనున్నా’నని భరోసా కల్పించడం. ఎవరైనా చేసే పనులను సమర్థిస్తూ సమస్యలను ఎదుర్కునేందుకు తగిన సహకారాన్ని అందించడం.

9. చదువుకోవడం వల్ల సమాజం చైతన్యవంతం కావడం:-
చదువు అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం. తెలివి తెచ్చుకోవడం. తెలివి కలిగి ప్రవర్తించినప్పుడు విచక్షణ కలుగుతుంది. విచక్షణ అంటేనే ఏది మంచి, ఏది చెడు అనే విజ్ఞత కలిగి ప్రవర్తించడం. ఈ తెలివి ఉన్నవాళ్లు తప్పకుండా మంచిపనులు చేస్తారు. అందరికీ మేలు కలిగేటట్లు ప్రవర్తిస్తారు. కీడు కలిగించే పనులు చేయరు. ముఖ్యంగా సోమరులుగా ఉండరు. ఉదాసీనంగా ప్రవర్తించరు. ఏపని లేకుండా గడపరు. ఇదే చైతన్యం. సమాజంలోని వ్యక్తులందరూ చదువుకుంటే, ఆ చదువు అందించిన తెలివిని కలిగి ప్రవర్తిస్తే సమాజమంతా చైతన్యవంత మైనట్లే.

10. నాయకత్వ పటిమను అంచనా వేయడం:-
‘నాయకత్వం’ అంటే పదిమంది మేలుకోరుతూ ముందుండి పనిచేయడం. ‘శతేషు జాయతే శూరః’అన్నారు పెద్దలు. అంటే-వందమందిలో ఒక శూరుడుంటాడట. అంటే అందరూ నాయకులు కాలేరు. నూటికొక్కడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఒక నాయకుని నాయకత్వ పటిమను అంచనా వేయాలంటే.
 • ధైర్యంగా ఎంతటివారితోనైనా మాట్లాడటం.
 • ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం అందించడం.
 • తనకు నష్టమైనా, కష్టమైనా భరిస్తూ, సమాజం మేలు కోసం పని చేయడం.
 • సమాజ చైతన్యం కోసం కృషి చేయడం.
 • స్వార్థాన్ని వదిలి, అందరి బాగు కోసం పని చేయడం.
 • అందరినీ తన మాటలతో ఒప్పించడం, చేతలతో అభిమానాన్ని చూరగొనడం.
 • సమాజాన్ని ఒక్క తాటి మీద నడిపించడం.
 • పోరాట పటిమను రగిలించడం.
 • అనుకున్నది సాధించడానికి ప్రాణాలైనా త్యజించడానికి సిద్ధపడటం.
పాఠాలు-ముఖ్యాంశాల అవగాహన
6. ‘భాగ్యోదయం’ పాఠం
‘ఇవి చేయండి’ అభ్యాసాల ద్వారా గ్రహించవలసిన ముఖ్యాంశాలు.

1. భాగ్యరెడ్డి వర్మ-అంబేద్కర్‌ల మధ్య పోలికలు:-
భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ రాష్ట్రంలో జన్మించి ఇక్కడి హిందువులందరూ సమానమేనని, నిమ్నజాతుల వాళ్లే హిందూజాతికి మూల పురుషులని, వాళ్లను ‘ఆది హిందువులు’ అనాలని వాదించి, అంటరాని వాళ్లుగా ముద్రించిన వాళ్ల అభ్యున్నతి కోసం ఉద్యమాలు నడిపి, ఎంతో చైతన్యాన్ని రగిలించాడు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నిమ్నకులంలోనే జన్మించి, ఎన్నో అవమానాలను, అన్యాయాలనూ ఎదుర్కొని, తన జాతివాళ్లలో చైతన్యం నింపి, చివరకు రాజ్యాంగం ద్వారా ఉపేక్షితులందరికీ మేలు సాధించిన మహనీయుడు. వీళ్లిద్దరి మధ్య చాలా పోలికలున్నాయి.
 • ఇద్దరూ ఉన్నత విద్యావంతలు.
 • నీతి, ధర్మశాస్త్రాలను, చరిత్రనూ అధ్యయనం చేశారు.
 • నిమ్నజాతుల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం ఉద్యమించారు.
 • తక్కువజాతిగా పిలుస్తున్న వాళ్లను చైతన్యపరచారు.
 • నిమ్నజాతులను విద్యావంతులు చేశారు.
 • మిగతా వర్గాలతో సమానంగా దళితులను చూడాలని, వాళ్లు మిగతా వాళ్లకు ఏరకంగానూ తీసిపోరని నిరూపించారు.
 • తమ జీవితాలను వెనుకబడిన జాతులకోసం అంకితం చేశారు.
 • మంచి వక్తలు, కార్యదక్షులు.
 • విశాల భావనలు కలిగిన మహనీయులు ఇద్దరూ.
2. చదువుకుంటే కలిగే లాభాలు:-
 • చదువుకుంటే కలిగే లాభాలు అనంతం.
 • చదువుకోవడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది.
 • అక్షరజ్ఞానం కలుగుతుంది. ఇది జ్ఞానార్జనను సులభం చేస్తుంది.
 • లోక వ్యవహారం నడిపించే నైపుణ్యం పెరుగుతుంది.
 • మంచి-చెడు విచక్షణ కలుగుతుంది.
 • మనం చదివే చదువుకు ఏఏ ఉపాధి అవకాశాలున్నాయో తెలుస్తుంది.
 • క్రమశిక్షణ అలవడుతుంది.
 • వినయం, విధేయత, యోగ్యతలు కలుగుతాయి.
 • ప్రపంచ జ్ఞానం కలుగుతుంది.
 • మానవత్వంతో జీవించగలుగుతాం.
 • నలుగురికి సహాయపడగలుగుతాం
 • జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోగలుగుతాం.
3. అసమానతలు తొలగి, సమానత్వం రావాలంటే:-
సమాజంలో కులం, మతం, వర్గం అనే తేడాలు సమసిపోయి అందరం సమానమనే భావన అంతటా వ్యాపించాలంటే.
 1. మన ఇతిహాసాలు, పురాణాలు వాస్తవంగా ఏం చెబుతున్నాయో, ధర్మశాస్త్రంలోని అంశాలు ఏవిధంగా మానవులంతా సమానమని చాటి చెప్పాయో అందరికీ తెలియ పరచాలి.
 2. దేవాలయాలు, పవిత్రస్థలాలు అందరికీ సమానమేనని చాటి చెబుతూ అందరికీ దర్శన, ప్రవేశ అవకాశాలను సమానంగా కల్పించాలి.
 3. సామూహిక సహపంక్తి భోజనాలు చేయాలి. ఇందులో అన్ని కులాల, మతాల వాళ్లు పాలు పంచుకోవాలి.
 4. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
 5. పండుగలు, ఉత్సవాల వంటి కార్యక్రమాల్లో అన్ని కుల, మతాల వాళ్లను పాల్గొనేటట్లు చేయాలి.
 6. బాలబాలికల్లో మనమంతా ఒక్కటేనన్న భావాలను పెంచే పాఠాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.
 7. సమసమాజం కోసం కృషి చేసిన మహనీయుల జయంతి ఉత్సవాలను అంతటా జరపాలి.
 8. స్వచ్ఛంద సంస్థలు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించాలి.
 9. మత పెద్దలు, సంస్థలు పరమత సహనాన్ని, ఆదరాన్ని పెంచాలి.
 10. కులాన్ని, మతాన్ని కించపరచడాన్ని వ్యతిరేకించే చట్టాల గురించి ప్రజల్లో సదవగాహన కల్పించాలి.
4. అంకిత భావంతో పనిచేయడం:-
అంకితభావం అంటే సమర్పణ భావం. తాను నెరవేర్చే కార్యం విజయవంతం కావడానికి, మెరుగైన ఫలితాన్ని సాధించడానికి తన శక్తియుక్తులన్నీటినీ సమర్పించి పనిచేయడం అంకిత భావంతో పనిచేయడం. స్వార్థం గురించి ఆలోచించకుండా, సోమరితనం, ఉపేక్షాభావం విడనాడి, కేవలం తాను చేసేపని మీదనే మనసు కేంద్రీకరించి పనిచేయడం అంకిత భావానికి నిదర్శనం. ఏదైనా ఒకరంగంలో ప్రసిద్ధిగాంచిన వాళ్లు, మహనీయులుగా గుర్తింపు పొందుతున్న వాళ్లందరూ అంకితభావంతో పనిచే సిన వాళ్లే. వీళ్లు గుర్తింపు, ప్రశంసలు, బహుమతుల కోసం ప్రాకులాడరు. వీళ్ల దృష్టి అంతా తాము చేపట్టిన కార్యం నూటికి నూరుశాతం సత్ఫలితాలను సాధించడం మీదనే ఉంటుంది.

5. వ్యసనాల వలన కలిగే నష్టాలు:-
మానుకోజాలని అలవాట్లను వ్యసనాలు అంటారు. కాలక్రమంలో చెడ్డ అలవాట్లనే వ్యసనాలుగా పరిగణించడం పరిపాటి అయ్యింది. సాధారణంగా 7 వ్యసనాల గురించి చెబుతారు. జూదమాడటం, స్త్రీలపై వ్యామోహాన్ని కలిగి ఉండటం, మద్యంతాగడం, వేటాడటం, కఠినంగా మాట్లాడటం, దొంగతనం చేయడం, ఇతరులను నిందించడం సప్తవ్యసనాలు. వీటిలో ఏ వ్యసనానికిలోనైనా...
 • వ్యక్తి గతమైన శ్రద్ధతగ్గి అనారోగ్యం పాలవుతారు.
 • సమాజంలో గౌరవం తగ్గిపోతుంది, పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయి.
 • ఆర్థికంగా నష్టం కలుగుతుంది.
 • అప్పులపాలవుతారు.
 • దుఃఖం, కోపం, మనస్తాపం, ఆవేదన కలుగుతాయి.
 • కుటుంబాల్లో కలత లేర్పడతాయి.
 • ప్రాణాంతక పరిస్థితులు దాపురిస్తాయి.
6. సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలడానికి ఏం చేయవచ్చు:-
సమాజ అభివృద్ధికి ఆటంకాలుగా మారి, మానవజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న సమస్యలు మూఢనమ్మకాలు. ఎవరో చెప్పిందాన్ని గుడ్డిగా నమ్మి, ఆ నమ్మకాన్ని వెర్రిగా అనుసరించడమే మూఢనమ్మకం. దయ్యాలున్నాయని విశ్వసించడం. చేతబడులు, బాణామతులు ఉన్నాయనుకోవడం, అపశకునాలపై భయభ్రాంతులు కావడం, సంఖ్యాశాస్త్రాన్ని నమ్మడం, శరీరధర్మానికి వక్రభాష్యాలు కల్పించుకోవడం, మనుషుల ముఖాలు చూడటంలో మంచీ చెడులు జోడించడం మొదలైనవెన్నో మూఢనమ్మకాలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇవి సమాజంలో లేకుండా చేయాలంటే..
 • విద్యావంతులైన వాళ్లు ముందుగా వివేకాన్ని కలిగి ప్రవర్తించేటట్లు కరపత్రాల ద్వారా మేల్కొలుపడం.
 • మూఢనమ్మకాలు నిరాధారమైనవని వివిధ ప్రక్రియల ద్వారా తెలియజేయాలని పత్రికలకు విజ్ఞప్తులు పంపడం.
 • హేతువాదులను కలిసి, మూఢనమ్మకాల ద్వారా నష్టపోతున్న ప్రజల్లో చైతన్యం కల్గించడానికి చక్కని ప్రసంగాలు ఏర్పాటు చేయడం.
 • మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేస్తున్న సంస్థల సహకారంతో గ్రామాల్లో, విద్యాలయాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం.
 • ప్రత్యేక ఉత్సవాలు, పండుగల సందర్భంగా ఇంద్రజాలం వంటి వినోదప్రదర్శనలు ఏర్పాటు చేయించి, అన్యాపదేశంగా మూఢనమ్మకాల గుట్టురట్టు చేయడం.
 • మూఢనమ్మకాల వల్ల గతంలో ప్రజలు ఎన్ని కష్టనష్టాల పాలైయారో తెలిపే సంఘటనలు పుస్తకాలుగా ప్రచురించి, అందరికీ అందుబాటులో ఉంచడం.
 • మూఢనమ్మకాల గురించిన నాటకాలు, బుర్రకథలు, హాస్య కార్యక్రమాలు నిర్వహించడం.
 • మూఢనమ్మకాలు పారద్రోలడానికి కృషిచేసే వ్యక్తులతో సంఘాలు ఏర్పరచి, తరచూ సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించడం.
 • మనం మూఢనమ్మకాలను అనుసరించకుండా ఉండటం. మన కుటుంబంలోని వాళ్లు అలాంటి ప్రయత్నం చేయడాన్ని తగిన కారణాలతో ఖండించడం.
 • మూఢనమ్మకాలు అనుసరిస్తున్న వాళ్లను, దాని హేతుబద్ధత గురించి ప్రశ్నించి, ఆ కోణంలో ఆలోచించేలా చేయడం.
7. అభినందన వ్యాసం:-
ఏదైనా ఒక రంగంలో విజయం సాధించిన వాళ్లను అభినందించడం పరిపాటి. సమాజంకోసం అంకితభావంతో పనిచేసి, అభివృద్ధిని సాధించిన మహనీయులు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ల కృషి, పట్టుదల, అంకితభావం, సేవానిరతి ముందుతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. వాళ్ల గురించి అభినందిస్తూ రాసే వ్యాసం అభినందన వ్యాసం. ఈ వ్యాసంలో వారి జీవిత నేపథ్యం, సేవాకార్యక్రమాల వివరాలు, సాధించిన విజయాలు, సమాజం మీద ప్రభావం, ప్రేరణ/స్ఫూర్తి అనే అంశాలు ప్రధానంగా ఉంటాయి.
ఉదా:- మురళీ కృష్ణ అనే వ్యక్తి గ్రామ పరిశుభ్రత కోసం కృషి చేసి, గుర్తింపు పొందాడు. ఆయన గురించి అభినందన వ్యాసం.....
 • పేద కుటుంబం, మురికవాడలో కమలంలా జన్మించిన మురళీకృష్ణ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్ణపడి చదువుకున్నాడు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం.
 • తాను ఎంత ఎదిగినా తమగ్రామం అనుకున్న స్థాయిలో అభివృద్ధి పథంలో పయనించకపోవడం గురించి బాధపడే మురళి, ఈ పరిస్థితికి గ్రామ పారిశుధ్యం కూడా ఒక ప్రధాన సమస్య అని గుర్తించాడు. ఆ ఆలోచన రావడమే తడవు ఊళ్లోని విద్యావంతులు, యువకులనూ కలిసి చర్చించాడు. ‘గాంధీ యువసేన’ అనే పేరుతో ఒక సంఘం స్థాపించాడు.
 • సంఘ సభ్యుల ఇంటింటికి తిరిగి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వెయ్యకూడదని, నిర్దేశిత స్థలంలోనే వేయాలని అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారని అందరినీ చైతన్యపరచారు.
 • గ్రామ పంచాయతీవాళ్లతో మాట్లాడి, చెత్తకుండీలను ఏర్పాటు చేయించాడు. పాఠశాలలను సందర్శించి, విద్యార్థులలో పారిశుధ్య సమస్యలపై అవగాహన కల్పించి, బడిని గుడిలాగా పవిత్రంగా ఉంచుకోవాలని ఉద్భోధించి, బడి, బడి పరిసరాలు రోజూ కళకళలాడేటట్లు చేశాడు.
 • బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనం రోగకారకం అవుతుందని తెలియజేసి, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవడాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వ సహకారంతో ఆ విషయంలో విజయం సాధించాడు. నిప్పుల కొలిమిలాంటి ఊరి చుట్టు పక్కల దారి మరుగు దొడ్లను నిర్మూలించి, అద్దంలాంటి పరిసరాలను అనుభవంలోకి తె చ్చాడు.
 • మొక్కల అవసరం, వినియోగం గురించి చెప్పి ఇళ్లలో, బాట పక్కలలో, పొలాలగట్లలో విరివిగా మొక్కలను పెంచుకునే ఏర్పాటు చేశాడు.
 • మురళీకృష్ణ కృషివల్ల అచిరకాలంలోనే మా ఊరికి ‘అందమైన గ్రామం’ అనే పేరొచ్చింది. మా ఊరిని చూడడానికి ముఖ్యమంత్రితో సహా ఎందరో పెద్దలు వచ్చివెళ్తున్నారు. త్వరలో ప్రధానమంత్రి కూడా రానున్నారు.
 • ఒకవ్యక్తి వల్ల ఇంత గొప్ప విజయం సాధ్యం కావడం నమ్మలేని నిజం. ఇంతటి మహత్తర కార్యం సాధించిన మురళీ కృష్ణ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో యువకులు వివిధ రంగాల్లో కృషి చేస్తున్నారు.
 • ఇలాంటి వాళ్లు ఊరికొక్కరున్నా ఈ దేశం శరవేగంతో అభివృద్ధి పథంలో దూసుకొని పోతుంది.
Published on 1/4/2016 2:16:00 PM