Sakshi education logo
Sakshi education logo

‘కొత్త బాట’

Join our Community

whatsup Telegram Playstore
పాఠాలు - ముఖ్యాంశాలు అవగాహన
4. ‘కొత్త బాట’ పాఠం

పాఠంలోని చర్చనీయ (కీలక) అంశాలు.....


1. ‘సెవ్వు మీద పేనువారుడు’
అంటే చెవి మీద పేను పారడం. దీని అర్థం పట్టించుకోవడం. స్పర్శ జ్ఞానం బాగా కలిగిన శరీర భాగాల్లో చెవి ఒకటి. తలలో ఉండే పేలు ఒక్కొక్క సారి దారి తప్పి చెవి మీదికి వస్తాయి. అది వెంటనే తెలిసిపోతుంది. ఆ విధంగా ‘చెవి మీద పేను పారడం’ అంటే గ్రహింపు కలగడం అని అర్థం. ‘సెవ్వుమీద పేనువార్తెనా?’ అని రచయిత్రి ప్రయోగించడంలో అర్థం ‘అసలు పట్టించుకోవడం లేదు’, ‘గ్రహించడం లేదు’ అని.

2. నడుచుకుంటూ పోయేటప్పుడు గమనించేవి:-
మామూలుగా నడుచుకుంటూ పోయేటప్పుడు చాలా మంది ఈనాడు చుట్టూ గమనించే స్థితిలో ఉండరు. కారణం ఇప్పుడు నడక చాలా తగ్గింది. ఎప్పటిలాగా (రొటీన్‌గా) నడిచే నడక అలవాటైపోయి పరిసరాల మీద దృష్టి అంతగా ఉండదు. కొత్త ప్రదేశంలో ఆయా ప్రాంతాలను చూడటానికి వెళ్లినపుడు ప్రత్యేకంగా అన్నీ గమనిస్తాం. హృదయానికి కళ్లుంటే, కళ్లు హృదయపూర్వకంగా చూస్తూంటే ఎన్ని అంశాలైనా గమనించవచ్చు.
 1. గాలి వీచడంలోని ప్రత్యేకత
 2. చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రత్యేకతలు
 3. నేల, నేలమీద పరచుకున్న ప్రకృతి
 4. ప్రకృతిలోని అందాలు-చెట్లు, మొక్కలు, పొదలు, గడ్డి, పూలు, ఆకులు, కాయలు, కొమ్మలు ఊగడం, కొండలు, లోయలు, సెలయేళ్లు, వాగులు, వంకలు, ఆ వాగుల్లోని ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయి.
 5. నగరాల్లో అయితే ఎత్తై మేడలు-వాటి అందచందాలు; రోడ్డు-రోడ్డు ఇరుపక్కల నిర్మాణాలు, చెట్లు-మొక్కలు; రోడ్డు మీద తిరిగే వాహనాలు-పాదచారులు.
 6. రకరకాల మనుషులు-ప్రవర్తనలు.
 7. చుట్టూ పేరుకుపోయిన మాలిన్యం, మనుషుల మనసుల్లోని కాఠిన్యం..
పై అంశాలను ఆధారంగా చేసుకొని విద్యార్థులు తమ అనుభవాలను అక్షరరూపంలోకి మలచాలి.
3. ఊరి పొలిమేరల్లో ప్రకృతి:-
 • ఊళ్లు ప్రస్తూతానికి పట్టణీకరిస్తున్న ఇంకా ప్రకృతి సోయగానికి దూరం కాలేదు.
 • ఊళ్లోకి చేరుకునేందుకు చుట్టూ రకరకాల దారులు వాహనాలు వెళ్లడానికి, ఎడ్లబండ్లు పోవడానికి, కాలినడకన వెళ్లడానికి బాటలు చిత్రంగా ఉంటాయి.
 • ఊరి చుట్టూ పచ్చని ప్రకృతి, చెట్లు, పంటపొలాలు-ఆ పొలాలపై నుంచి వీచే గాలి హాయి గొలుపుతూంటుంది.
 • (ఏదో ఒకపక్క ఏరు/వాగు, చెరువు/కుంట కానీ ఉంటుంది.) గలగలపారే యేటి ధ్వనులు చెవులకు ఇంపుగా ఉంటాయి. ఆ నీటి పరిసరాల్లో తిరిగే చిన్న చిన్న జంతువులు ముచ్చట గొలుపుతుంటాయి.
 • చెరువు నిండి పారే మత్తడి (అలుగు)-అలుగు నీటిలో ఎగిరే చేపలు, పిల్లల ఆటలు గిలిగింతలు పెడుతుంటాయి.
 • ఆవులు, మేకలు గుంపులు గుంపులుగా వెళ్తూండటం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది.
 • పొలాల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించే పల్లె వాసుల సహజ సౌందర్యం మనసుకు హత్తుకుంటుంది.
4. తన కాళ్ల మీద తాను నిలబడటం:-

అంటే స్వతంత్రంగా. ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. సాధారణంగా ఎదిగిన పిల్లలు ఏదో ఒక వృత్తిలోనో, ఉద్యోగంలో స్థిరపడి, తలిదండ్రుల మీద ఆధారపడకుండా బతికే సందర్భంలో ఈ మాటను ప్రయోగిస్తారు. ఈ మాట ఎవరైనా ఇతరుల మీద ఆధారపడకుండా జీవించాలనే సందేశాన్నిస్తుంది. 5 నాటి-నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు:-
 • మానవ జీవనం ఆనందంగా, ఆదర్శంగా ఉండటం కోసం ఏర్పరచుకున్న విధానాలే ఆచార వ్యవహారాలు. మనిషి ఆలోచనల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, సాంకేతిక విజ్ఞానం శరవేగంతో ముందుకు దూసుకునిపోవడం, సమసమాజ చింతన, అభ్యుదయవాదం ఆచార వ్యవహారాల్లో పరిణామాలకు కారణమవుతున్నాయి. అందుకే ఒకప్పటికి-ఇప్పటికి ఆ తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
  1. ఒకప్పుడు వర్గభేదాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు ఉన్నత వర్గాలు - నిమ్న వర్గాల మధ్య గల అంతరం తగ్గిపోతోంది.
  2. కులతత్వం వేళ్లూ కొని ఉండేది. ఇప్పుడు కుల సంఘాలున్నా వాటి పరిధి, పనితీరు మారింది.
  3. అంటరానితనం పాటించేవారు - ఇప్పుడది తీవ్రనేరం.
  4. ఆహారపు అలవాట్లు పరిమితం - ఇప్పుడు రకరకాల రుచులు మరిగినారు.
  5. వస్త్రధారణ సంప్రదాయబద్ధం - ఇప్పుడు ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు.
  6. వినోద కార్యక్రమాలు-భజనలు, భాగోతాలు, చిరుతల రామాయాణం, కోలాటం, దొమ్మరాటలు, బహిరూపులు మొదలైనవి ఉండేవి. ఇప్పుడు టివిలు, వాటిలో సినిమాలు, రియాలిటీ షోలు ప్రధాన వినోదాలు.
6. రచ్చబండ/గ్రామ సచివాలయంలో చర్చలు:-
ఊరున్నచోట బొడ్రాయి, ఆంజనేయస్వామి గుడి సాధారణంగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయితీలు, అక్కడక్కడ రచ్చబండలు కనిపిస్తాయి. కానీ చాలా ఊళ్లల్లో ‘రచ్చబండ’లు ఉండవు చాలా మట్టుకు ఊరిపెద్దలంతా హనుమంతుడి (ఆంజనేయ స్వామి) గుడి వద్ద గుమ్మిగూడి మంచీ-చెడ్డా మాట్లాడుకోవడం, ఏవైనా సమస్యలుంటే తమలోతామే (ఊరి పరిధిలోనే) పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గ్రామపంచాయితీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన సభ్యులు, సర్పంచ్ ఉంటారు. వీళ్లు తరచూ కలుసుకుంటూ, గ్రామ అభివృద్ధి కోసం చేపట్టవలసిన కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఏవైనా పంచాయితీ (కొట్లాట)లుంటే సామరస్యంగా పరష్కరించడానికి ప్రయత్నిస్తారు.

7. కడ్పుల ఇసం-నాల్కెన తీపి:-
‘కడుపులో విషం-నాలుక మీద తీయదనం’ అంటే మనసులో అసూయ, కుట్ర ఉన్నప్పటికీ పైకి మాత్రం ప్రేమతో మాట్లాడుతూ ఉండటమని అర్థం. ఆధునిక సమాజంలో ఈ లక్షణం సర్వసాధారణమై పోయింది.

8. పంచాయితీలు చెప్పడం:-
ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్యగాని, రెండువర్గాల మధ్యగానీ ఏర్పడే తగాదాను తీర్చడమే పంచాయితీలు చెప్పడం. అసలు ‘పంచాయితీ’ అంటే తగాదా అనే రూఢార్థం ఏర్పడింది. అందుకే పంచాయితీ చెప్పడమంటే తగాదాలు తీర్చడం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.

9. కళదప్పిన ఇల్లు:-
‘ఇల్లు కళ దప్పడం’ అంటే అందాన్ని కోల్పోవడం. ఇది భౌతికమైంది కాదు. కొత్తగా రంగులు వేసి అలంకరించిన ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ఆ ఇల్లు కళదప్పుతుంది (కదా!). ఇంటి నిండా మనుషులుండి ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ తిరిగే ఇల్లు ‘కళ’కళలాడుతుంది. పెద్ద ఇంట్లో మనుషులెవ్వరూ లేకపోయినా, ఒకరిద్దరే ఉంటున్నా, దీపం వెలిగించే దిక్కులేకపోయినా ఇల్లు కళతప్పుతుంది.

10. రాత్రిబడి:-
పగటిపూటబడిలో పిల్లలు చదువుకునేది నియత విద్య. పగటిపూట బడికి వెళ్లలేని పిల్లలు, వయోజనుల సౌకర్యం కోసం రాత్రిపూట బడి నడిపించే వాళ్లు. ఇది అనియత విద్య. జాతీయ స్థాయిలో సాక్షరతామిషన్ గతశతాబ్ది చివర్లో అక్షరాస్యతా ఉద్యమం నడిపించి, వయోజనులకోసం ప్రతి ఊరిలో రాత్రి బడి నడిపించింది. రాత్రిబడిలో పాఠాలు చెప్పడానికి పుస్తకాలు కూడా అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేశాయి.

11. నలుగురు నడిసిందె బాట:-
నలుగురూ నడిచిందేబాట. అంటే పది మంది పాటించింది పద్ధతిగా మారుతుంది. ఈ విషయాన్నే వేమన ‘పదుగురాడుమాట పాడియె ధరజెల్లు; ఒక్కడాడు మాట ఎక్కదెందు’ అని వక్కాణించాడు. నలుగురూ దేన్ని సమర్థిస్తారో అదే అనుసరణీయమవుతుంది. నలుగురు ఏది అనుసరిస్తారో అదే పద్ధతిగా, సంప్రదాయంగా మారుతుంది. నలుగురూ నడిచినప్పుడే అది బాటగామారుతుంది. దాన్నే తక్కినవాళ్లు కూడా అనుసరిస్తారు.

12. పరిసర ప్రాంతపు పిల్లల రూపు రేఖలు:-
పల్లెటూళ్లలో, బస్తీల్లో దరిద్రం అధికంగా ఉన్నపుడు, ఆరోగ్యసూత్రాలు అంతగా పాటించనప్పుడు, పిల్లలు ఉపేక్షకు గురైనప్పుడు ఒకప్పుడు పిల్లలు ‘ఈసురో’ మని కనిపించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల విషయంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. మారిన ఈ పరిస్థితుల్లో మనచుట్టూ ఉన్న పిల్లల రూపు రేఖలను గమనిస్తే.
 • అందంగా ఉన్నారు.
 • ముక్కు, మొఖం చూడ చక్కగా ఉన్నాయి.
 • జుట్టుకు నూనెలేక కొంత సంస్కార హీనత కనిపిస్తుంది.
 • దుస్తులు మామూలుగా ఉన్నాయి. ఆడపిల్లలు గౌన్లు, లంగా జాకెట్లు వేసుకున్నారు. మగపిల్లలు నిక్కర్లు, అంగీలు తొడుక్కున్నారు.
 • కొందరికి కళ్లద్దాలున్నాయి.
 • భాష సంస్కారవంతంగా ఉంది.
పాఠాలు-ముఖ్యాంశాల అవగాహన
4. ‘కొత్త బాట’ పాఠం

‘ఇవి చేయండి’ అభ్యాసాల నుంచి గ్రహించవలసిన అంశాలు.

1. ‘కొత్తబాట’ పేరు కథకు తగిన విధంగా ఉందా?
పి.యశోదారెడ్డి రచించిన మాండలిక భాషా కథ ‘కొత్తబాట’కు ఆపేరు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే....
 1. అది ఒకప్పటి బాటే అయినప్పటికీ బురద, మట్టిలేని చక్కని దారిగా మార్చి కొత్తదనం తె చ్చారు గ్రామస్తులు.
 2. పేదలను పట్టిపీడించే భూస్వామ్యవ్యవస్థ అడుగంటింది.
 3. అప్పులిచ్చి, వడ్డీల కింద పేదవాళ్ల శ్రమను దోచుకునే పద్ధతి మారింది.
 4. మనుషులే మనుషులను మోసే మేనా పద్ధతి పోయింది.
 5. కులాంతరాలు, వర్గాంతరాలు సమసిపోయి, నిమ్నవర్గాల పిల్లలు ఉన్నత కుటుంబాలతో కలిసిపోయి తిరుగుతున్నారు.
 6. రాత్రిబడి లాంటి అభ్యుదయ కార్యక్రమాలకు ఊరు శ్రీకారం చుట్టింది. అందుకే ‘కొత్తబాట’ పేరు ఈ కథకు బాగా సరిపోయింది.
2. ‘.......ఇంకోణి ఆసరాతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగుడు.....’:-
- ఇతరుల సహకారంతో పరాయివాళ్ల భుజాల మీదికెక్కి ప్రయాణించడం ‘అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా (తన పనితాను చేసుకుంటూ) జీవించగలగడం’ అని అర్థం.
ప్రయాణ సౌకర్యాలు సరిగ్గాలేక పోవడం వల్ల గతంలో మనుషులను మనుషులే మూటలు మోసినట్లు మోసుకొని పోయేవాళ్లు. ఇది చాలా ఇబ్బందికరమే కాక, అవమానకరంగానూ ఉండేది. ఒక్కొక్కసారి ఆడవాళ్లను మగవాళ్లు, మగవాళ్లను ఆడవాళ్లు మోసే దుస్థితి కూడా ఎదురయ్యేది. అలాంటి పరిస్థితి లేకుండటం అనేది ఒక అర్థం. రెండో అర్థం-ఒంట్లో శక్తి లేక, ధనం లేక ఎదుటివాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకడం ఆత్మన్యూనతను కలిగిస్తుంది. ఆ పరిస్థితి రాకూడదని కోరుకోవడం.

3. ‘అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు..’:-
‘అదును గాయడం’ అంటే అవకాశం కోసం కాచుకొని కూచోవడం. నక్కలు స్వయంగా వేటాడలేవు. ఏ జంతువైనా వేటాడితే ఆ ఆహారం తాము కాజేయవచ్చుననే అదనుకోసం ఎదురు చూడటం నక్క లక్షణం. కథలో ఈ విషయం వర్ణించడంలో నక్కల లక్షణంతోపాటు, నక్క లక్షణాలున్న మనుషులు కూడా మనచుట్టూ పొంచి ఉన్నారని చెప్పడం రచయిత్రి ఉద్దేశం.

4. గ్రామంలోని ప్రకృతి/ఊరి ప్రత్యేకతలు:-
ఆధునికీకరణ కారణంగా గ్రామాల్లో ప్రకృతిలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పడు పెంకుటిళ్లు; ప్రతి ఇంటికీ పెరడు; ఇంటికి ముందూ వెనకా చెట్లు; ఎడ్లబండ్లు; నాగళ్లు; కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆల మందలు చాలా ఉండేవి. ఇప్పుడివన్నీ ఎక్కువగా లేకున్నా గ్రామాలు వాటి ఉనికినింకా పూర్తిగా కోల్పోలేదు. గ్రామంలోని ప్రకృతి గురించి చెప్పేటప్పుడు దృష్టిలో ఉంచుకోదగిన అంశాలు...
 1. ఇళ్లు, వసారాలు, ఇంటిచుట్టూ ఉండే ఖాళీ ప్రదేశం, అందులోని మొక్కలు..
 2. అక్కడక్కడా చెట్లు, వాటి అందం (వేప, చింత, బొప్పాయి..)
 3. వీధుల్లో కుక్కలు, మేకలు, ఇతర పశుసంపద..
 4. ఊరి చివర అంజనేయస్వామి గుడి, బొడ్రాయి, రావి చెట్టు..
 5. ఊళ్లోని బడి, బడిపరిసరాలు..
 6. వాహనాలు (ఆటోలు, మోటారు సైకిళ్లు, వాటిమీద తిరిగే వాళ్ల తీరూ తెన్నూ..)
 7. ఊరి చుట్టూ వాతావరణం, పారిశుధ్య సమస్య, కాలువలు...
 8. ఊరి పక్కన వాగు/ఏరు/నది/చెరువు, దాని సొగసు..
 9. ఊళ్లోని మనుషుల స్థితిగతులు
 10. ఊళ్లో మీ ఇల్లు, వీధి, వాటి ప్రత్యేకతలు.
ఊరి ప్రత్యేకత గురించి చెప్పేటప్పడు దృష్టిలో ఉంచుకోదగిన అంశాలు.
 1. ఊరు ఉన్న స్థితి-సమతలం/కొండమీద/పల్లంలో..
 2. ఊళ్లోని ఇళ్ల సంఖ్య. అందులో ఏఏ రకాల ఇళ్లున్నాయి? (డాబాలు/పెంకుటిళ్లు/గుడిసెలు మొద లైనవి)
 3. ఊరి పక్కన ఉన్న ఏరు/చెరువు/వాగు-దాని పేరు, దాని స్థితి (అన్ని కాలాలూ పారుతుందా/నీళ్లుంటాయా/ ఉండవా మొదలైనవి)
 4. ఊళ్లోని యువత ఉపాధి అవకాశాలు, ఆసక్తులు.
 5. ఊళ్లో నిర్వహించుకునే ఉత్సవాలు, పండుగలు-ప్రత్యేకతలు.
5. చెరువుల ప్రాముఖ్యత:-
సాధారణంగా నీటి వసతి ఉన్న చోటే గ్రామాలు ఏర్పడతాయి. గ్రామాలు ఏర్పాటైన కొత్తలో గాని, కొంత కాలానికి గాని చెరువులు, కుంటలు ఏర్పాటు చేసుకోవడం తెలంగాణలోని ప్రత్యేకత. అందుకే ఈ విషయంపై అందరికీ అవగాహన ఉంటుంది. చెరువుల ప్రాముఖ్యతలోని ముఖ్యాంశాలు...
 1. చెరువు-గ్రామం సుఖ సమృద్ధికి ఆదెరువు.
 2. చెరువుల నిండా నీళ్లుండటం వల్ల వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బంది ఉండదు.
 3. భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. బోర్లు, బావులు ఎండిపోకుండా ఉండడం వల్ల అందరికీ నీటి వసతికి లోటుండదు.
 4. చేపల పెంపకం ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది.
 5. వర్షాకాలంలో మత్తడి (అలుగు) దూకే నీళ్లు కన్నుల పండుగ చేస్తాయి. ఆ నీటిలో చేపలు పట్టడం, పిల్లలాడుకోవడం ఒక మంచి అనుభూతి.
 6. పశువులకు, ఇతర జంతు జాలానికి తాగడానికి నీరు లభిస్తుంది.
 7. పశువుల మేతకు లోటుండదు.
6. పల్లెల్లో వచ్చిన మార్పుల విశ్లేషణ:-
 • పల్లెలు ఒకప్పుడు పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన వాతావరణంలో ఉండేవి. రవాణా సౌకర్యాలుండేవి కాదు. కులవృత్తులు తప్పనిసరిగా అందరూ పాటించేవాళ్లు. విద్యాగంధం (చదువు) అంతంత మాత్రంగా ఉండేది. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్లు. వస్త్రధారణ, భాష నగరాలకు భిన్నంగా ఉండేది. మనుషులంతా ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉన్నా కులమతాల పట్టింపులు తీవ్రంగా ఉండేవి. పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉండేది...... అటువంటి గ్రామాల్లో ఇప్పుడు చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి.
 • పల్లెల్లో జనసాంద్రత పెరిగి, సాగుబడిలో లేని నేల కూడా వ్యవసాయానికి వినియోగించడం వల్ల అడవులు, చెట్లు తగ్గిపోయాయి.
 • ప్రభుత్వ పథకాలు, ప్రణాళికల కారణంగా రవాణా సౌకర్యాలు పెరిగాయి. ప్రజలు కాలినడకపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. పొలాలకి కూడా కొందరు ద్విచక్రవాహనాలపై వె ళ్తున్నారు.
 • కుల వృత్తులు అడుగంటాయి. ఒకప్పుడు జీవనాధారమైన కులవృత్తిని ఇప్పటి యువత అనుసరించడం లేదు. బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు, పదవులు నిర్వహించాలని ఆరాటపడుతున్నారు. ఇది మంచి పరిణామమే.
 • చదువుకున్న వాళ్ల సంఖ్య పెరిగింది. సామాజిక అసమానతలు తగ్గిపోతున్నాయి. వర్గభేదాలు, కులభేదాలు, మతవైషమ్యాలు తగ్గుతున్నాయి.
 • వ్యవసాయ పద్ధతుల్లో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు వర్షాధార పంటలు, వరి, పప్పుదినుసులు, ఆహారధాన్యాలు ఎక్కువగా పండించేవాళ్లు. ఇప్పుడు పత్తి, పసుపు, మొక్కజొన్న, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు పండించడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు బదులుగా యంత్రాలు ఉపయోగిస్తున్నారు. పల్లెల్లో ఎడ్లు, బండ్లు తగ్గాయి.
 • వస్త్రధారణలోనూ చెప్పుకోదగిన మార్పులు చోటుచేసుకున్నాయి. పంచెకట్టు, చీరకట్టుకు చిరునామాలుగా ఉన్న పల్లెటూళ్లలో ఇప్పుడు పంచెలు బాగా తగ్గిపోయాయి. చీరలు ధరించే వారితో పాటు పంజాబీ డ్రెస్సులు ధరించే వారు ఎక్కువయ్యారు. కొన్ని ఇళ్లలో రాత్రి గౌనులు వేసుకునే వాళ్లూ కనిపిస్తున్నారు.
 • భాషలో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్థానిక మాండలిక యాస తగ్గిపోయి, పత్రికల భాష, ఇంగ్లీషు మాటలతో కూడిన భాష, టీవిల భాష ఇప్పుడు పల్లెల్లో ప్రవహిస్తోంది.
 • మనుషుల మధ్య మునుపటి ఆత్మీయతలు కొంత సన్నగిల్లుతున్నాయి. గతంలో ఒకరి మీద మరొకరు ఆధారపడి జీవించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. దాంతో పరస్పరం లెక్క చేసుకోవడం తగ్గిపోతోంది.
 • కులమతాల పట్టింపులు కూడా మునుపున్నంత తీవ్రంగా లేవు. నిమ్న కులాలవాళ్లను నీచంగా చూడటం లేదు. కులాలకు అతీతంగా మనుషులు పరస్పరం గౌరవాదరాలు పొందడం పల్లెల్లో ఇప్పుడు చూడగలుగుతున్నాం.
 • పారిశుధ్య సమస్య ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది. ఊరిచుట్టూ బాటలన్నీ నిప్పులకొలిమిలా, మలవిసర్జక కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు చాలామంది మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. మురికి కాల్వల వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తం మీద పల్లెల్లో మునుపు కంటె మెరుగైన జీవితం ఇప్పుడు కనిపిస్తోంది. ఊళ్లకు విద్యుత్ సరఫరా కూడా పెరిగి టీవీలు ప్రధాన వినోద కేంద్రాలయ్యాయి. ఇవన్నీ ఆహ్వనించదగిన పరిణామాలే. కాని ఈ పరిస్థితులు మనుషుల మధ్య ఆత్మీయతను తగ్గిస్తున్నాయి. శారీరక దృఢత్వాన్ని తగ్గిస్తున్నాయి. పల్లె అందాలను మసకబారుస్తున్నాయి. ఈ చారిత్రక పరిణామాన్ని జీర్ణం చేసుకొకతప్పదు.
7. పల్లె సౌందర్య వర్ణన:-
 • పల్లెలు సౌందర్యానికి నిలయాలు. పల్లె గురించి వర్ణిస్తూ వ్యాసం, లేఖ, కవిత రాసినప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు..
  1. చుట్టూ ఉండే ప్రకృతి
  2. పచ్చని పొలాలు
  3. స్వచ్ఛమైన గాలి, నీరు
  4. అరమరికల్లేని మానవ సంబంధాలు
  5. అందమైన వస్త్రధారణ
  6. కొండలు, అడవులు, వాగులు- వంకలు, చెరువులు-కుంటలు.
  7. భాషయాస, భావనల్లో అమాయకత్వం, ఆహారపు అలవాట్లు...
   • ఉదా:- పచ్చని ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నట్లు కనిపించే పల్లెతల్లి..
   • అల్లంత దూరంలో నేను కనిపించగానే
   • రారమ్మని చేతులు చాచుతున్నట్లు పిలుస్తుంది.
   • రోడ్డు మలుపు తిరగగానే
   • కొండ చాటున దాకున్న పల్లె
   • చిలిపిగా నన్ను పలకరిస్తుంది.
   • వరిచేలపై నుంచి వీచే చల్లని గాలి నా
   • అణువణువునూ తడిమినప్పుడు
   • తన్మయాత్వంతో శరీరం పులకరిస్తుంది
   • భూజాన కట్టె, ఒక చేతిలో చుట్టతో
   • తెల్లని పంచెకట్టు, తెల్లని తలపాగాతో
   • పోటీ పడుతున్న మెరిసే తెల్లగడ్డంతో
   • భళ్ళున నవ్వే మా తాత
   • తరతరాల సంపదా నాకిస్తున్నట్లనిపిస్తుంది
   • రాములుగాని కుక్క పిల్ల ‘ఇంత ఆలస్యంగా వచ్చిన వేం?’ అన్నట్లు నామీద అరుస్తుంది.
   • అమ్మను చూడగానే ఎంత అపుదామనుకున్నా కన్నీరు తన్నుకొస్తుంది....
Published on 12/28/2015 4:01:00 PM
టాగ్లు:
‘కొత్త బాట’