Sakshi education logo
Sakshi education logo

‘వీర తెలంగాణ’

Join our Community

whatsup Telegram Playstore
పాఠాలు - ముఖ్యాంశాల అవగాహన
3. ‘వీర తెలంగాణ’ పాఠం

పాఠంలోని చర్చనీయ (కీలక) అంశాలు.....

1. ‘భూమండలమంతా ధ్వనించడం’:-
దాశరథీ వీరతెలంగాణ పాఠంలో-నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ర్టం (తెలంగాణ) విముక్తమైన సందర్భంలో యావత్తు తెలంగాణ రాష్ర్టం సాగించిన స్వేచ్ఛా పోరాటపు శంఖధ్వని ఈ భూతలమంతా బొబ్బలు పెట్టినట్లు ఊహించి (ఉత్ప్రేక్ష ద్వారా) ప్రకటించాడు. భూమండలమంతా ప్రతిధ్వనించడమంటే-ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఆ నినాదం తాకిందని చెప్పడం. ఇది పోరాట తీవ్రతను ప్రతిబింబిస్తుంది.

2. బతుకు తోవ చూపే కాలం రావడం:-
బతకడానికి ఆధారాన్ని, బతుకుకు ఆధారమైన మార్గాన్ని ‘బతుకుబాట’ లేదా ‘బతుకు తోవ’ అంటారు. తెలంగాణలో సామాన్యులు తమ దారిలో తాము సంపాదించుకునే అవకాశాల్లేవు. అలాంటి పరిస్థితుల్లో నిజాం రాష్ర్ట (తెలంగాణ) విముక్తి పోరాటం సాగింది. రాష్ర్టం స్వతంత్రమై ప్రజలు ఎవరి బతుకు వాళ్లు బతకగలిగే పరిస్థితులేర్పడ్డాయి. ఈ కాలం/పరిస్థితుల గురించి చెబుతూ ‘బతుకు తోవ చూపేకాలం వచ్చింది’ అని అన్నారు కవి. మరొక అర్థంలో చచ్చేకాలం పోయి బతికే కాలం వచ్చిందని భావం.

3. తెలంగాణ నేలలో కాంతి:-
‘తెలుగు రేగడిలో జిగిమెండు’ అన్నది దాశరథీ ప్రయోగం. అంటే తెలంగాణ నేలలో కాంతి అధికం. అంటే ఇక్కడ నివసించే వాళ్లలో తేజస్సు, ఉత్సాహం, బుద్ధి మొదలైనవి ఎక్కువ అని అర్థం. అయితే ‘రేగడిలో జిగి’ అనే ప్రయోగం చేయడం వల్ల ఈ ‘జిగి’ కాంతికి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి ఉంటుంది. రేగడినేల సహజంగా ‘జిగి’ అంటే పట్టుగలిగి ఉంటుంది. అంటే ఇక్కడి వాళ్లలో పట్టుదల ఎక్కువ అని చెప్పడం కవి ఉద్దేశం.

4. గడ్డిపోచ కత్తిగా మారడం:-
సాధారణంగా ‘గడ్డిపోచ’ అనే మాటను తేలికైంది, పనికిరానిది, అల్పమైంది అనే అర్థంలో వాడతారు. తెలంగాణలోని గడ్డిపోచలు కూడా ఖడ్గాలు ధరించి యుద్ధరంగంలోకి దిగాయని దాశరథి పేర్కొనడంలో ఉద్దేశం-ఇక్కడ నివసించే అల్పులు అంటే స్త్రీలు, బాలురు, వృద్ధులు, బలహీనులు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్లు కత్తులుగా మారి యుద్ధంలోకి దూకారని చెప్పడమే.

5. నవోదయం రావడమంటే:-
కొత్త ఉదయం’ అనేది ప్రతినిత్యం ఉండే దే. అయితే ప్రతిరోజూ చీకటి వస్తుంది. ఆ చీకటిని చీలుస్తూ కొత్త వెలుగు ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చీకటి ఒక్క నాటిది కాదు. తరతరాలుగా పట్టిపీడించిన దుష్పరిపాలన అనే చీకటి తొలగిపోయి కొత్త ఉదయం వచ్చిందని చెప్పడమే కవిభావం.

6. తెలంగాణ వీరుల ప్రత్యేకత:-
తెలంగాణ వీరులు ఆగని తమ పోరాట పటిమతో స్వాతంత్య్రమనే సూర్యుడిని పిలిచి, ఈ నేల అంతటా కాంతి సముద్రాలు ఉప్పొంగేటట్లు చేశారు. కాంతి సర్వత్రానిండేది. అది సముద్రమైనప్పుడు అణువణువునూ తడుపుతుంది. ఈ ప్రయోగం చేయడం వల్ల దాశరథి స్వాతంత్య్రం గొప్పతనాన్ని, తెలంగాణ దాన్ని అనుభవించిన విధానాన్ని చాలా నిండుగా వర్ణించాడు. ఇది సాధించిన వీరుల గొప్పతనం చెప్పకనే చెప్పాడు. అంతేకాదు. ఇక్కడి వీరులు సామాన్యులుకారు. మతపిశాచం కోరలు సాచి భయంకరంగా విజృంభిస్తున్న సమయంలో, అది భయంకరంగా గొంతులు కోస్తున్నా, దిక్కుతోచని పరిస్థితులు దాపురించినా, బతకడమే కష్టమైనా తమ తెలుగుదనాన్ని కాపాడుకుంటూ విజయం సాధించిన వీరపుత్రులు వీళ్లు.

7. బతుకు దుర్భరం కావడం:-
దుర్భరం (దుస్+భరం) కావడం అంటే భరించడం చాలా కష్టం కావడం లేదా భరించలేకపోవడం. తిండి సరిగ్గా దొరకకపోయినా, మనసుకు తీవ్రవిఘాతం కలిగినా, కష్టాలు చుట్టుముట్టినా, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసినా బతుకు దుర్భరమవుతుంది. నిజాం పాలనా కాలంలో పై సమస్యలన్నీ ఇక్కడి ప్రజలను చట్టుముట్టి ఊపిరి సలపనీయకుండా చేశాయ్. అప్పుడు తెలంగాణ లోని సామాన్యులందరి బతుకు దుర్భరంగా మారింది.

8. ఆకాశాన జెండాలు రెపరెపలాడటం:-
జెండాలు రెపరెపలాడటం అంటే గర్వంగా అందరి ముందూ తలెత్తుకొని నిలబడటం అని అర్థం. సాధారణంగా జెండాలను యుద్ధంలో రథాలమీద, అంబారీల మీద ధరిస్తారు. విజయం సాధించిన ప్పుడు ఆ జెండాలు రెపరెపలాడటం సైనికుల్లో, నాయకుల్లో ఆనందోత్సాహాలను నింపుతాయి. ఆకాశాన ‘జెండాలు రెపరెపలాడటం’ అంటే-ఎంతో ఎత్తున, అందరికీ కనబడేటట్లు/తెలిసేటట్లు విజయ గర్వాన్ని ప్రదర్శించడం అని అర్థం. ‘రుద్రమదేవి యుద్ధంలో తన ప్రతాపాన్ని చూపించిన రోజు తెలుగు జెండాలు ఆకాశంలో నర్తించాయని దాశరథీ వర్ణించడంలో ఉద్దేశం కూడా అదే. తెలుగు రాణి రుద్రమదేవి విజయం లోకమంతటికీ తెలిసిందని చాటి చెప్పడం.

పాఠాలు - ముఖ్యాంశాల అవగాహన
3. ‘వీర తెలంగాణ’ పాఠం

‘ఇవి చేయండి’ అభ్యాసాల నుంచి గ్రహించవలసిన అంశాలు:

1. ‘వీర తెలంగాణ’ పాఠం పేరుపై స్పందన:-
 • వీర రసం ఉత్సాహాన్ని నింపుతుంది. ఆమాట వినడంతోనే ఎవరికైనా ఉత్సాహోద్రేకాలతో మనసుపులకరిస్తుంది. శరీరం రోమాంచితం అవుతుంది.
 • వీరమాత, వీరపత్ని, వీరనారి, వీరపుత్రుడు, వీరపుత్రిక, వీరుడు అనే పదాల్లోనే ఎంతో ప్రేరణనిండి ఉంది.
 • అదేమాట ఒకదేశానికి, రాజ్యానికి, ప్రాంతానికి అన్వయించినప్పుడు అక్కడి ప్రజలందరిలోనూ అది నూతనోత్తేజాన్ని నింపుతుంది.
 • నిజాం పాలనకు చరమగీతం పాడటంలో తెలంగాణ ప్రజలు చూపిన ధైర్యసాహసాలు, పట్టుదల, త్యాగం సామాన్యమైనవి కావు. వీటన్నిటినీ ‘వీర తెలంగాణ’అనే ఒక్కమాట ఆవిష్కరిస్తుంది.
 • దాశరథి ఈ పేరు నిర్ణయించడంలో ఎంతో ఔచిత్యముంది. ఈ పాఠంలో తెలంగాణ విముక్త పోరాటంలో ఇక్కడి ప్రజలు ఎంత తెగింపు చూపించారో, ఎంత ధైర్యాన్ని ప్రదర్శించారో, ఎన్ని కష్ట నష్టాలను సహించారో కళ్లకు కట్టినట్లు వర్ణించారు దాశరథి.
  1. తెలంగాణలో గడ్డిపోచకూడా కృపాణం ధరించింది.
  2. తెలంగాణ తల్లి స్వయంగా ఈడొచ్చిన తన పిల్లలకు కత్తులిచ్చి యుద్ధ రంగానికి పంపింది.
  3. వీరులు స్వాతంత్య్రకాంతిని సముద్రంగా మార్చి నేల అంతటా పారించారు.
  4. చుట్టూ ఉన్న స్వాతంత్య్ర సాగరాలను ఇక్కడికి రప్పించేందుకు అడ్డుగా ఉన్న కట్టలకు గండి కొట్టారు.
  5. మతపిశాచం ఎంతటి భయంకర పరిస్థితులు కల్పించినా చలించకుండా నిలిచి స్వాతంత్య్రం సాధించారు.
  6. ఈ నేలను కాకతీయులు శత్రువులు కలవరపడేటట్లు పాలించారు.
  7. రుద్రమదేవి యుద్ధ విజయాల జెండాలు ఆకాశంలో రెపరెపలాడించింది.
  8. కాపయనాయకుని విజృంభణతో శత్రువుల గుండెలు అగిపోయాయి.
  9. చాళుక్యుల పాలనలో విజయ వాద్యాలు నిరంతరం మోగేవి
  10. శ్రావణమేఘ గంభీరంలా ఈ తెలంగాణ నిరంతరం గర్జిస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది.
  11. పాఠం అంతా ఇలాంటి వీరరస వర్ణనతో నిండిపోయినప్పుడు ‘వీరతెలంగాణ’కు ఈ పేరును నూటికి నూరు శాతం సరిపోతుంది.
2. తెలంగాణ గొప్పతనం విశేషాలు కొన్ని తరాలదాకా శత్రువుల చేతిలో చిక్కుకున్నాయి:-
నిజమే. ఎంతో గొప్పతనం, సమృద్ధి, ప్రతిభ, పౌరుషం కలిగి ఉన్న తెలంగాణ విశేషాలన్నీ కొన్ని తరాలదాకా శత్రువుల చేతిలో చిక్కుకున్నాయి.
 • ఇక్కడ శత్రువులంటే బయటివాళ్లు కాదు. పాలకులు.
 • బయటి వారు అయితే దేశమంతా ఒక్కటై తరిమేయవచ్చు కాని కంచె చేనుమేసిన విధంగా పాలకులే పీడకులుగా మారినవేళ ప్రజాస్వామ్యవాదులంతా తిరగబడి స్వాతంత్య్రం సంపాదించక తప్పదు.
 • ఆ ప్రయత్నం వల్ల దేశమంతా స్వాతంత్య్రం సంపాదించుకున్నా తెలంగాణ నిజాం ఏలుబడిలో నలిగిపోవడం పీడన తత్వానికి పరాకాష్ట.
 • ‘రజాకార్ల’ పేరుతో మతానికి ప్రతీకగా సైన్యవిభాగం తయారు కావడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు.
 • స్వసుఖం, ఒక మతం, కేవలం అధికారం కోసం రాచరికం నెరిపేవాడు ప్రజాసంక్షేమ బాధ్యతను ఎంతమాత్రం నెరవేర్చలేదు.
 • తెలంగాణ విషయంలో అదే జరిగింది. తత్ఫలితంగా ఇక్కడి ప్రతిభ, సామర్థ్యం, గొప్పతనం అంతా మరుగున పడిపోయింది. కొన్ని తరాలదాకా ఈ పరిస్థితి కొనసాగింది.
3. ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’:-
 • కవి దాశరథీ స్వయంగా నిజాంపాలనకు వ్యతిరేకంగా ‘కదం’ కదిపినవాడు. ఆ అనుభవాలతో ‘కలం’ కదిలించినవాడు. జైలు గోడలమీద బొగ్గుతో నిజాంపాలనకు చ రమగీతం రాసినవాడు.
 • తెలంగాణ పోరాటపు అనుభవాలన్నీ గుండెల నిండుగా నింపుకున్న కవి దాశరథి.
 • పాలకుల హింస ఎంత భయంకరంగా ఉండేదో ప్రజల ప్రతిచర్య కూడా అంత ఉధృతంగా ఉండేది.
 • ఆ ఉద్యమంలో ప్రజలంతా స్త్రీ, బాలలు, వృద్ధులనే భేదం లేకుండా బలహీనులైన వాళ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో దొరికిన ఆయుధాన్ని అందుకొని పాలకుల మీద తిరగబడ్డారు.
 • ‘గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథీ పేర్కొనడంలో అర్థం అదే.
4. తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించడం:-
 • ‘సంధ్యాభానువు’ అంటే తొలిసంధ్య వేళ ఉదయించే సూర్యుడు.
 • చీకటి భయాన్ని తొలగించి ‘భరోసా’ నిస్తూ సూర్యుడు ఉదయిస్తాడు.
 • ఈ దేశంలో పరాయిపాలన అనే చీకటిని తొలగిస్తూ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సూర్యోదయం అయ్యింది.
 • కాని తెలంగాణను పట్టిపీడిస్తున్న నిజాం పాలకుడు మాత్రం ఈ రాష్ట్రాన్ని స్వతంత్ర భారతంలో భాగం కావడానికి అంగీకరించలేదు.
 • ఇక్కడి ప్రజల ఆకాంక్ష, సర్దార్‌పటేల్ చేపట్టిన సైనిక చర్య ఒక్కటై ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 17న ఇది విముక్తి పొందింది. ఆ రకంగా ఇక్కడ మొదటిసారిగా సూర్యోదయమైంది. అది స్వాతంత్య్ర సూర్యోదయం.
5. దాశరథి రచనా శైలి:-
 • ‘నాగీతావళి ఎంతదూరం ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద’ అన్నది దాశరథి ప్రతిజ్ఞ. అంటే ప్రపంచాన్నంతా నా కవిత్వంలో ప్రజ్వలింపజేస్తానన్నాడాయన.
 • పోరాట జీవనంలో ఎదుర్కున్న ఆటుపోట్లతో కలాన్ని కత్తిగా మలచి వేలాది మందిలో ప్రేరణనింపిన మహాకవి దాశరథి.
 • అనవద్య పద్యధార, అద్భుత పదప్రయోగం, ఆవేశపూరితమైన భావనా బలం ఆయన కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. అభ్యుదయ భావాలు ఆయన కవిత్వంలో రుద్రవీణ మోగిస్తాయి. అగ్నిధార నొలికిస్తాయి.
 • పద్యంతో పాటు గేయం, వచన కవిత్వం కూడా ఎంతో సమర్థంగా నడిపించిన కవి దాశరథి.
 • సున్నితమైన భావుకతతో ప్రజల హృదయాలను ఆకట్టుకోగల ప్రతిభాసమన్వయ శీలి ఆయన.
 • కవిత్వంతో పాటు వచన రచన, నాటికలు, సినిమాపాటలు కూడా రాసి అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయుడైన అజరామరమూర్తి దాశరథీ కృష్ణమాచార్యులు.
6. ‘తెలంగాణతల్లి’గొప్పతనం (ఏకపాత్ర/ఆత్మకథ):-
 • నేను...మీ అమ్మను! నాలుగు కోట్ల తెలుగు బిడ్డలు ఈనాడు నవ్వుతూ బతకగలుగుతున్నా ఎన్నో వెతలను, వేదనలనూ చవి చూసిన మీ తెలంగాణ తల్లిని.
 • హాల చక్రవర్తి నా హృదయపీఠంమీద అధివసించే ప్రాకృత భాషలోని ఏడువందల కథా పద్యాలను సేకరించి గాథాసప్తశతిని అందించాడు. చోళులు, చాళుక్యులు నా ఒడిలో నుంచే ప్రపంచానికి తమ పౌరుషాన్ని రుచి చూపించారు. కాకతీయుల ఖడ్గ ప్రహారాలు నాగుండెల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. పాలంపేటలోని రామప్పశిల్ప సౌందర్యం ప్రపంచంలోనే ఎంతో కీర్తినార్జించింది. ఇక్కడే జాయప సేనాని నృత్తరత్నావళిని లోకోత్తరంగా రచించి జాతికి అందించాడు. తదనంతర కాలంలో నాముద్దుల కొడుకు నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవంగా ఆవిష్కరించి, శిల్ప సంగీత నృత్యాలకు నేను పెట్టింది పేరని చాటి చెప్పాడు.
 • తొలి తెలుగురాణి రుద్రమ్మ వీరత్వానికి పట్టుగొమ్మ. ఆ అమ్మ కత్తిపట్టిందంటే ఎంతటి వాడైనా పాదాక్రాంతుడు కావలసిందే. దేవగిరి యాదవరాజు సంగతి మీకంతా తెలిసిందే కదా! ఆ కొడుకు ‘ఆడది’ అని రుద్రమ్మను చులకన చేసి కత్తిదూసినందుకు నిప్పులుచిమ్మిస్తూ గర్జించే పర్జన్యమై వాడిని రాజ్యం పొలిమేరలు దాటించి, స్త్రీ చిహ్నాలు ధరింపజేసి తెలంగాణ ఆడబిడ్డ ఎంతటి మొనగత్తెనో రుచి చూపించింది. అలాంటి వీరుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తర్వాత తరం బిడ్డలు కూడా ఎప్పటికీ పోరాడుతునే ఉన్నారు. నాకు ‘పోరాటాల గడ్డ’ అనే పేరు దెచ్చిన్రు.
 • ఒగడువోతె మరొగడన్నట్లు రావణాసురుని తలకాయల్లాగ పాలకులే పీడకులై ఇక్కడి ప్రజలను పీడిస్తుంటే ఎంతకాలమని ఓపికతో నుంటరు. అందుకే నైజాం సర్కారోనికి గోరి గట్టిన్రు. సీమ సర్కారోడ్ని చిదిమేసిన్రు. స్వతంత్ర తెలంగాణాను 2014 జూన్ 2న తెచ్చుకున్నరు.
 • తెచ్చుకున్నమని సంబురంతోని సంకలు గుద్దుకోకున్రి. ఇంకా చెయ్యవలసింది చానా ఉన్నది. మనం సమృద్ధం కావాలె. మన రైతుల ఆత్మహత్యలు ఆగాలె. పంటలు, ఉత్పత్తులు పెరగాలె. మన పిల్లలు అన్ని రంగాల్లో ప్రపంచస్థాయిలో వెలుగాలె. మన రాష్ర్టం దేశానికే ఆదర్శం గావాలె. అట్లగానీకె అందరూ కష్టపడి పనిజెయ్యాలె గప్పుడే నాకు నిజంగా సంతోషం గలుగుతది. ఇగనన్నా అందరూ ఆప్రయత్నం మొదలు పెట్టి ఆనందాలను పంచుకోండి. సుఖ సంతోషాలను పెంచుకోండి.
Published on 12/28/2015 3:45:00 PM