Sakshi education logo
Sakshi education logo

‘ఎవరిభాష వాళ్లకు వినసోంపు’ పాఠం

Join our Community

whatsup Telegram Playstore
చర్చనీయ (కీలక) అంశాలు.....
1. ఏ ప్రాంతం వాళ్ల తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.
పాతనీరుపోయి, కొత్తనీరు వస్తున్నట్లుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజలక్షణం. అదే సజీవ లక్షణం. అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియారూపాల్లోనే కాక నామవాచకాల్లో, సంబోధనల్లో, మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల విధానం, పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితరాంశాలు భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి. (ఉదా॥సముద్రతీర ప్రాంతవాసులకు అక్కడ లభించే చేపలు, చేపలుపట్టే సాధనాలు, చేపలు వండటంలోని విధానాలు, సముద్రపు ఆటుపోటులు మొదలైన అనేక అంశాలు భాషలో భాగమైపోతాయి. అవి మిగతా వ్యవ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. సముద్రాలకు దూరంగా కొండల్లో నివాసముండే వాళ్లకు అక్కడ దొరికే కాయలు, పండ్లు, నీటి ఎద్దడితో ఎదుర్కునే ఇబ్బందులు, వస్త్రధారణ, ఆహార వ్యవహారాలు వాళ్ల భాషలో అంతర్లీనమై నిత్యవ్యవహారంలోనూ భిన్నత్వాన్ని చూపిస్తాయి కదా!) అదే విధంగా ప్రతి పదిమైళ్లకు భాషలో భేదం ఉంటుంది. భాష పరమార్థం భావవినిమయమే కాబట్టి ఎక్కడి ప్రాంతం వాళ్లు అక్కడ మాట్లాడే భాషకు బాగా అలవాటు పడతారు. చెవులకింపుగా, హృదయాన్ని తాకేటట్లుగా ఉండే ఆ భాష వాళ్ల రక్తంలో రక్తమై విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే భాష తల్లివంటిదని ‘మాతృభాష’ అని గౌరవిస్తూ ఆత్మీయానందాన్ని అనుభవిస్తుంటాం. ‘ఎవని కంపు వానికింపు’అన్నట్లు మనదైన భాష మనకు ఇంపూ, సొంపు. తద్భిన్నమైన అలవాటులో లేని భాష విన్నప్పుడు అసౌకర్యంగానే కాక విచిత్రంగా అనిపిస్తుంది. అది రుచించదు. (అలవాటైతే అది కూడా బాగుంటుంది) అందుకే ఎవరి భాష వాళ్లకు చాలా బాగ అనిపిస్తుంది.

2. ‘గురుస్థానీయులు’
అంటే ‘గురువు’ స్థానానికి తగినవారు. భారతీయ సంస్కృతిలో గురవుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. దేవుని కంటె గురువే గొప్పవాడంటాడు కబీరుదాసు. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్పినవాడు గురువే. మనలోని సృజనకు బీజాలు వేసి(బహ్మ), ఉత్తమ గుణాలను పోషించి (విష్ణువు), చెడును జయింపజేసి (శివుడు) జీవితాన్ని జ్ఞానభరితం చేయగల (పరబ్రహ్మ) స్వరూపం గురువు. అలాంటి జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శనం ఇచ్చే ప్రతి ఒక్కరినీ గురువుతో సమానంగా భావించడం ఉత్తమ సంస్కారం. అలాంటి వాళ్లందరూ గురుస్థానీయులే.

3. గురువులలో ఆశించదగిన ప్రత్యేకతలు:-
గురువంటే సర్వశ్రేష్ఠుడు. శుచి-వర్ఛస్సు, వక్తృత్వం-ధృతి, స్మృతి, కృతి, నమ్రత, ఉత్సాహం, జిజ్ఞాస కలిగిన వాళ్లు ఉత్తమ గురువులుగా భాసించగలరంటారు పెద్దలు. అంటే బయట, మనస్సులో స్వచ్ఛంగా ఉండే వాళ్లు, మంచి జ్ఞానవంతులు, చక్కగా మాట్లాడంతో పాటు పట్టుదల, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, వినయం, ఉత్సాహం, కొత్తవిషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిరంతరం కృషి చేసేవాళ్లు, వాళ్ల విధులను ఏలోపం లేకుండా నిర్వహిస్తేచాలు; పిల్లలంతా ప్రభావితులవుతారు. అంటే
 1. ఎప్పుడూ స్వచ్ఛంగా కన్పిస్తుండాలి
 2. ఏది అడిగినా చక్కగా అర్థమయ్యేటట్లు వివరించాలి.
 3. ప్రేమతో, మంచిమాటలు మాట్లాడాలి.
 4. పట్టుదలతో పని చేస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపాలి.
 5. మంచి జ్ఞాపకశక్తి కలిగి విషయాన్ని బోధించాలి, చర్చించాలి.
 6. ఎప్పటికప్పుడు కొత్తదనం ఉట్టిపడే టట్టుగా బోధన చర్య నిర్వహించాలి.
 7. ఎంత గొప్పస్థానంలో ఉన్నా అహంకారాన్ని ప్రదర్శించకుండా విద్యార్థులతో స్నేహంగా, పెద్దవాళ్లతో వినయంగా ఉండాలి.
 8. ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.
 9. కొత్త విషయాలను నేర్చుకునేందుకు తపించాలి. ఆ అలవాటు విద్యార్థుల్లో నిర్మాణం చేయాలి.
 10. పాత విధానాన్ని సంస్కరించుకుంటూ నిత్యనూతనంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ, విద్యార్థుల్లో మంచి గుణాలు పెంపొందించేందుకు ప్రయత్నించాలి.---ఇలాంటి గుణాలుండే ఉపాధ్యాయులంటే మాకైతే ఎంతో ఇష్టం. అసలు అలాంటి వాళ్లను ఇష్టపడని వాళ్లుంటారా?!
4. పసందైన ప్రాంతీయ భాష:-
‘పసందు’అంటే బాగా ఇష్టం అని అర్థం. ఏప్రాంతం వాళ్లకు ఆప్రాంతంలో మాట్లాడే భాషబాగా నచ్చుతుంది. అలా నచ్చడంలో భాషకు మూలాలైన స్థానిక పదాలు, అన్యభాషా ప్రయోగాలు, పలుకుబడులు, నుడులు, సామెతలు, జాతీయాలు... ఇవన్నీ ఎక్కడి వాళ్లకక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడేటప్పుడు భాషలో ప్రయోగించడం వల్ల అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తాయి. అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి పసందుగా ఉంటుంది.

5. మాటలో, రాతలో ప్రాంతీయత కనిపించడం:-
ఒకప్పుడు మాట్లాడే భాష-రాసే భాష వేర్వేరుగా ఉండేవి. చదవడం నేర్చిన వాళ్లందరికీ ఒకే భాష ఉండేది. మాట్లాడటంలో మాత్రం అనేక కారణాల చేత భిన్నమైన శైలులు ఉండేవి. ఒకే ప్రాంతంలో నివసించే వాళ్లైనా వంశం (కుటుంబం), వృత్తి, ఉద్యోగం, నివసించే పరిసరాలను బట్టి మాట్లాడే తీరు వేరుగా ఉండేది. ఇంటి భాష, బడి భాష వేర్వేరుగాఉండేవి. కాల క్రమంలో ఈ భేదాలు అంతరించి మాట్లాడే భాషనే రాయడంలోనూ వినియోగించడం పరిపాటిగా మారింది. దాంతో రచయితలు తమ రాతలో కూడా ప్రాంతీయ భాషను విరివిగా ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. మరికొంతమంది పట్టుబట్టి తమ ప్రాంతపు యాసలోనే మాట్లాడటం, రాయడం అలవాటు చేసుకున్నారు. ఆవిధంగా రాతలోను, మాటల్లోనూ కొందరి భాషలో ప్రాంతీయత స్పష్టంగా కనిపించేది. ఈ మాటలు సామలసదాశివ తన ‘యాది’ పుస్తకంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన సురవరం ప్రతాపరెడ్డి అనే సుప్రసిద్ధ సాహితీవేత్త గురించి చెప్పేటప్పుడు పేర్కొన్నారు.

6. ఏకలవ్య శిష్యుడు:-
అంటే ఏకలవ్యుని వంటి శిష్యుడు. ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్యనేర్పించకున్నా, అతనినే గురువుగా భావించి, ధనుర్విద్యలోని మెళకువలన్నీ నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అదే విధంగా తమకు అందుబాట్లో లేకున్నా కొందరి గొప్పలక్షణాల నుంచి ప్రేరణపొంది, ఆయారంగాల్లో కృషి చేసి పేరు సంపాదించుకునే వారు ఏకలవ్య శిష్యులు. సామల సదాశివ వేలూరి వారికి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకున్నారు. (దోరవేటి దాశరథి ఏకలవ్య శిష్యుడినని అని చెప్పుకుంటాడు)

7. ‘పలుకుబడి, నుడికారం, జాతీయాలు భాషకు అలంకారం వంటివి’:-
పలుకుబడి అంటే ఒక ప్రాంతంలోని యాసలో ఉపయోగించే పదం; నుడికారం అంటే ఒకప్రాంత ప్రజల అనుభవం నుంచి పుట్టిన మాటచమత్కారం/విశేషపదం; జాతీయం అంటే ఒక మాట ప్రత్యేకమైన అర్థంలో ఉపయోగించడం అన్నమాట.
భాష కేవలం భావ వినిమయం చేస్తే, అది నిత్యవ్యవహారానికి ఉపయోగపడుతుంది. అదే భాషను మనోరంజక సాధనంగా మలచినప్పుడు అది కళగా భాసిస్తుంది. కళాత్మకంగా మాట్లాడటం, రచనలు చేయడం భాషను కళగా నిలబెడుతున్న అంశాలు. ఆ విధంగా భాష కళాత్మకంగా మారాలంటే అది సాధారణార్థంలో కాకుండా చమత్కారంగా, విశేషార్థం వచ్చేటట్లు, నిగూడార్థం స్ఫురించేటట్లు రచించడం, మాట్లాడటం జరగాలి. అలా జరగడానికి దోహదం చేసే అంశాలే పలుకుబళ్లు, నుడికారాలు, జాతీయాలు. అందుకే అవి భాషకు అలంకారాలాంటివి.

8. ‘కళ్లకు నీళ్లు పెట్టుకోవడం’ లాంటి సంఘటనలు:-
కళ్లనీళ్లు పెట్టుకోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం’ అనే మాటలు తెలుగు భాషావ్యవహారంలో ‘ఏడవడం’ అనే అర్థంలో వాడతారు. మరాఠా ప్రాంతం వాడైన పూజారికి ఈ విషయం తెలియక వచ్చీరాని తెలుగులో కళ్లకు నీళ్లు అద్దుకోండి అనడానికి బదులు ‘కళ్లకు నీళ్లు పెట్టుకోండి’ అని ప్రయోగించి అపార్థానికి బీజాలు నాటాడు. ఇలాంటి సంఘటనలు నిత్యజీవితంలో అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.
 1. మనభాషపై స్పష్టమైన అవగాహలేని ఇతర భాషస్థులు మాట్లాడేటప్పుడు.
 2. మనం ఇతర భాషల్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు.
 3. కంప్యూటర్, ఆటలు, వ్యవసాయం, సాహిత్యం మొదలైన అనుభవం లేని రంగానికి సంబంధించిన విషయాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నప్పుడు.
 4. భాష మీద పట్టులేకున్నా ఆడంబరమైన పదజాలం ఉపయోగించాలనుకున్నప్పుడు.
 5. మిడిమిడి జ్ఞానంతో తెలిసీ తెలియక మాట్లాడుతున్నప్పుడు-ఇలాంటిపొర పాట్లు చోటు చేసుకుంటాయి.
9. ‘ఏప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోట వినగలం’:-
ఈ మాట సామల సదాశివ గారు రాసిన కాలానికి చాలా వరకు వర్తించేదే కాని, ఈ కాలానికి సరిపడే సిద్ధాంతం కాదు.
ఆయన ఉద్దేశ్యాన్ని అనుసరించి, ఆడవాళ్లు అంటే గృహిణులు అంటే ఇల్లువదలి వెళ్లని స్త్రీలు. విద్యారంగం, బయటి వ్యవహారం అంతగా తెలియని వాళ్లు. ఒకప్పుడు ఇంటిభాషనే అత్యధికులు మాట్లాడే వాళ్లు. వాళ్లకు ఆధునిక సమాచార మాధ్యమాలు (టివి లాంటివి) అందుబాట్లో ఉండేవి కాదు. వాళ్లభాష ఇతరభాషల ప్రభావానికి లోనయ్యేదికాదు. అచ్చమైన పల్లెసీమలా స్వచ్ఛంగా ఉండేది. అందుకే అది వినసోంపుగా, మూలాలు వదలకుండా ఉండేది కాబట్టి రచయిత, అసలైన భాష ఆడవాళ్లనోట వినగలం’ అన్నారు. నిజానికి ఇప్పుడు మగవాళ్ల కంటె ఎక్కువగా ఆడవాళ్లే బయటి వ్యవహారాలు చ క్క బెడుతున్నారు కదా!

10. ‘కవిసమ్మేళనం’ అనుభవాలు:-
కవులందరూ ఒక్కచోట చేరి తమ కవితలను ఇతర కవులకు, శ్రోతలకు, ప్రేక్షకులకు వినిపించే కార్యక్రమమే ‘కవి సమ్మేళనం’. కవిసమ్మేళనంలో రకరకాల కవులు పాల్గొంటారు. నిర్వాహకులు వేదిక మీద ఒక అధ్యక్షున్ని, ప్రత్యేక అతిథలు/కవులను ఆసీనులను చేస్తారు. కవులు తమ కవితలను వినిపిస్తుంటారు. అలా వినిపించే కవుల కవితలు బాగా లేకపోయినా, కవితలు వినిపించే తీరు బాగాలేకపోయినా శ్రోతలు విసుగు చెందుతారు. అది మోతాదు మించితే శ్రోతలు మంచి కవితలను కూడా వినే అదృష్టాన్ని కోల్పోతారు. కవులు తమ కవితలను ఇతరులు వినాలని కోరుకుంటారు కానీ ఇతరుల కవితలను ఆదరించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. దాంతో కవితలు చదివిన కవులంతా వెళ్లిపోతే చివరన చదివే కవుల కవితలు వినేవారుండరు. నిరుత్సాహంతో పాటు అపహాస్యం కూడా చోటు చేసుకుంటుంది. (ఇవి నివారిస్తూ చక్కని యోజనతో కవి సమ్యేళనాలు నిర్వహించాలి.)

11. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. నేను మాట్లాడేది మాత్రం సామాన్య ప్రజలతోనే :-
కవులు అనేక అంశాలను గురించి కవితలు రాస్తుంటారు. చదివేవాళ్లు, వినేవాళ్లు అందులోని సార స్యాన్ని గ్రహించి వాటిని ఇష్టపడుతుంటారు/ పసందు చేస్తుంటారు. అయితే కొంతమంది కవులు సామాన్య ప్రజల బాధలు, కష్టసుఖాలు, సాధక బాధకాలా ఆధారంగా చేసుకొని, వాళ్ల భాషలోనే భావాలు కవిత్వీకరిస్తుంటారు. అవి వాళ్లు చదవకపోవచ్చు, వినక పోవచ్చు. విన్నా కవిత్వంలోని చమత్కారాలను గ్రహించలేక పోవచ్చు. గ్రహించే వాళ్లు కవిపండితులు, వాటిని పసందు చేసేదీ కవి పండితులే. కాని, మీర్ తఖీమీర్ తను ప్రజల కోసమే ప్రజల భాషలోనే కవిత్వం రాస్తున్నానని వినయంగా ప్రకటించుకున్నాడు.

12. పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు-బడిలో చదివే భాషవేరు:-
ఈ మాటనిజమే. ఇంట్లో మాట్లాడేభాష, బడిలో చదువుకునే భాష ఒకేలా ఉండవు. పిల్లలు నివసించే పరిసరాలు, ఇంట్లో అందరూ మాట్లాడుకునే భాష-పుస్తకాల్లో చదువుకునే భాషకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ భేదం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పడు వ్యవహార భాష అందరూ మాట్లాడే భాష ఆధారంగానే పుస్తకాల్లో రాస్తున్నారు. పిల్లలు తమ ఇంటి భాషలో జవాబులు రాసినా అంగీకరిస్తున్నారు.

13. ప్రాంతీయభాషా భేదాలను ఎలా సరిచేసుకోవాలి:-
‘ప్రాంతీయ భాషా భేదాలను సరిచేసుకోవడం’ అనేది శాస్త్రీయమైన ఆలోచనకాదు. ఏప్రాంతం వాళ్ల భాష ఆ ప్రాంతం వాళ్లకు వినసొంపుగా, ఆకర్షణీయంగా, ఆస్వాదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇష్టమైన శైలిలో వాళ్లను మాట్లాడనీయడమే ఆయాభాషల ఉనికిని కాపాడుతుంది. అలా కాకుండా భాషాభేదాలను సరిచేసుకుంటూ పోతే మాండలికభాషలు మాయమైపోతాయి. భాషా భేదాలను సరిచేసుకోవడం కంటె, అన్ని భేదాలను అవగాహన చేసుకునే స్థాయిని పెంచుకోవాలి. భిన్నమైన పదాలను ఏ అర్థంలో వాడుతున్నారో గ్రహించి, అర్థం చేసుకొని, ఆయా భాషారీతులు సహజంగా అభివృద్ధి చెందేటట్లు ప్రోత్సహించాలి. ‘ఎవరిభాష వాళ్లకు మరింత ప్రియం’గా గుర్తించకుంటే ఈ పాఠానికి అర్థమేలేదు.


పాఠలు-ముఖ్యాంశాల అవగాహన

2. ‘ఎవరిభాష వాళ్లకు వినసొంపు’ పాఠం
ఇవి చేయండి అభ్యాసాల నుంచి గ్రహించవలసిన అంశాలు:-

1. మనుమరాలి మాటలు రచయితను ఎందుకు అబ్బురపరచినాయి?
 1. మనుమరాలి మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో మాట్లాడటం.
 2. ఆ అమ్మాయి ఆ ప్రాంతపు తెలుగు అచ్చంగా మాట్లాడటం.
 3. నాలుగేళ్లు పూర్తిగా నిండని ఆపాప స్థానిక భాష చక్కగా పలకడం.
 4. రచయిత ఎంతగానో ప్రేమించే స్థానిక యాస ఉన్న తెలుగు భాష ఆ పాప పలకడం.
 5. ఎవరిభాష వాళ్లకు ఇష్టం కాబట్టి, ఇతర భాషల వాళ్లు మన భాషను స్పష్టంగా ఉచ్చరించినప్పుడు ఆశ్చర్యం కలగడం సహజం.
2. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిని రచయిత గురుస్థానీయులుగా భావించడం...
 • లక్ష్మణశాస్త్రి గారు సుప్రసిద్ధ సాహితీవేత్త. ‘ఆంధ్రబిల్వణ’ బిరుదాంచితులు.
 • ఆయనపై సామల సదాశివగారికి చాలా అభిమానం.
 • ఆయన సాహిత్యం, వ్యక్తిత్వంపై ఎంతో ఆరాధన.
 • సదాశివగారు శాస్త్రిగారి శిష్యరికం చేయకున్నా, వారి సన్నిధిలో కూర్చొని ఉత్తరాలు రాస్తూ అనేక విషయాలను గ్రహించారు.
 • అందుకే లక్ష్మణ శాస్త్రిగారిని గురుస్థానీయులుగా భావించారు.
3. సాహిత్య సభకు రిటైర్‌‌డ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం..
 • సాధారణంగా సాహిత్యసభలకు అధ్యక్షత వహించేవాళ్లు ఆ సంస్థల ప్రతినిధులై ఉంటారు.
 • లేదా సుప్రసిద్ధ సాహితీవేత్తలను ఎంపిక చేయడం ఆనవాయితీ.
 • ఇతర రంగాల్లో పనిచేస్తూన్న వాళ్లల్లో కూడా సాహితీ సేవ చేస్తున్న వాళ్లూ అధ్యక్ష స్థానం అలంకరించడం పరిపాటి.
 • సదరు రెవెన్యూ అధికారిపై రచయితకు అవగాహన లేకపోవడంతో కొంత ఆశ్చర్యానికి గురియ్యాడు.
 • కాని, అతని ప్రసంగం విన్న తర్వాత ఇతర భాషా పదాలు వాడకుండా తెలుగులో అతను మాట్లాడిన తీరుచూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ అధికారిపై అభిమానం ఏర్పరచుకున్నాడు.
4. సామల సదాశివ రచనా శైలి:-
 • సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మారాఠీ భాషల్లో పండితులు.
 • అనువాదాలు, సంగీతాభినివేశం, విమర్శనా పటిమగల సదాశివగారి రచన సహజ సుందరంగా ఉంటుంది.
 • వీరి రచన చదువుతూంటే ఒక పుస్తకం చదువుతున్నట్టు కాక, ఆత్మీయుడైన మిత్రునితో మాట్లాడుతున్నంత హాయిగా ఉంటుంది.
 • సుదీర్ఘసమాసాలు, పదాడంబరాలు లేకుండా సరళమైన మాటలతో సహజమైన శైలి సదాశివ గారిది.
 • ఆధునిక వ్యవహార శైలిని పుణికిపుచ్చుకున్న సదాశివగారు మాండలిక పదాల జోలికి పోకుండా అందరికీ అర్థమయ్యే భాషలో రాయడం వల్ల తెలుగు మాట్లాడే వాళ్లందరూ వీరి రచనలను ఇష్టపడతారు.
5. సామల సదాశివ గురించి....
 • సామల సదాశివ తెలంగాణ రాష్ర్టం గర్వించదగ్గ సాహితీవేత్త.
 • తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో పండితులు.
 • ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయమారుతాలు, సంగీత శిఖరాలు, స్వరలయాలు మొదలైన రచనలు వీరికి సంగీత సాహిత్యాలలో గల పట్టును తెలియజేస్తున్నాయి. వీరి ‘యాది’ గ్రంథం ఎంతో జనాదరణ పొందింది.
 • ‘యాది’ గ్రంథం నుంచి తీసుకున్న పాఠమే ‘ఎవరి భాష వాళ్లకు వినసొంపు’. ఇదొక వ్యాసం. ఇలాంటి వ్యాసాల సమాహారమే యాది. ‘యాది’ అంటే జ్ఞాపకం. అంటే ఈ వ్యాస పరంపరలో రచయిత అనుభవాలు. జ్ఞాపకాలూ ఉన్నాయనేది స్పష్టం. ఈ పాఠం ద్వారా రచయితకు సంబంధించిన అనేక విశేషగుణాలు తెలుస్తున్నాయి.
  1. సాహితీవేత్తలపై ఈయన అభిమానం వెలకట్టలేనిది. లక్ష్మణ శాస్త్రిగారిని గురుస్థానీయులుగా భావించడం, వారి కూతురు కమలగారిని ఆదరించడం. రెవెన్యూ అధికారిని అభిమానించడం ఇందుకు తార్కాణం.
  2. స్వభాష అంటే ఈయన కెంతో ఇష్టం. మరాఠా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల తన మనుమరాలి భాషకు ముగ్ధులుకావడం, లక్ష్మణశాస్త్రిగారి ‘వారీ రామచంద్రా....’ అనే మాటలను యాది చేసుకోవడం, మహబూబ్‌నగర్కి చెందిన ప్రతాపరెడ్డి భాషపై అభిమానం ప్రదర్శించడం తదితరాంశాలు ఈ విషయాన్ని తెల్పుతున్నాయి.
  3. తన కాలం నాటి కవులు, రచయితలపై ఎంతో అవగాహన కలిగినవారు. అంబటిపూడి వేంకటరత్నం, గడియారం రామకృష్ణ శర్మ గారు. లక్ష్మణ శాస్త్రిగారు తదితర ప్రముఖుల గురించి పేర్కొనడం అందుకు నిదర్శనం.
  4. స్థానిక భాషలన్నిటినీ ప్రేమించడం సదాశివ గారి ప్రత్యేకత. మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ తదితర ప్రాంతాల భాషలు ఎంతో సొంపయినవని, దేనికది ప్రత్యేకమైందని సంతోషాన్ని ప్రకటించారు.
  5. స్త్రీలు ఇళ్లలో మాట్లాడుకునే భాష అసలైన భాష అనేది వీరి అభిప్రాయం. ఒకప్పుడు ఇది నిజమే. వాళ్లకు ఇతర భాషల గురించిన అవగాహన అంతగా లేకపోవడం వలన అచ్చమైన మాతృభాషకు వాళ్లు ప్రతినిధులుగా ఉండేవాళ్లు.
  6. సామల సదాశివ గారు సాహిత్య కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే వారు. ఆయా కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కలిగినవారు.
  7. భాషలోని విభిన్న శైలులను తెలిసినవారు.
  8. ఉర్దూభాషపై అధికారం గలవారు.
  9. ఇంట్లో మాట్లాడే భాష-బడిలో బోధించే భాష వేరువేరుగా ఉండటాన్ని ఏమాత్రం ఇష్టపడకపోయేవారు. అయినా అప్పనిసరి ఆనాటి బోధనా విధానాన్ని అనుసరించేవారు.
  10. ఉర్దూ, ఫారసీ భాషల్లో ప్రముఖ కవులు, సాహితివేత్తలు, వాళ్ల రచనల గురించిన లోతులు తెలిసినవారు. అందుకే మీర్‌తఖీమీర్ గురించి వివరించారు.
 • ఈ పాఠం ఆధారంగా విద్యార్థులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను చక్కగా వివరించడం (రాయడం) అలవరచుకోవాలి.
 • ఏదైనా ఒక సంఘటన ను సంభాషణగా రాయడం సాధన చేయాలి.
 • సంభాషణలో రెండు మూడు పాత్రలకు మించకుండా చూడండి.
 • పాత్ర పేరు మార్జిన్‌లో రాసి, ఆ పాత్ర మాటలను యాథాతథంగా రాయాలి.
 • మధ్యలో సన్నివేశాన్ని, స్పందనను, స్వగతాన్ని చెప్పే సందర్భంలో బ్రాకెట్లను ఉపయోగించాలి.
Published on 12/28/2015 3:38:00 PM