Sakshi education logo
Sakshi education logo

దానశీలం

Join our Community

whatsup Telegram Playstore
ఈ పాఠం ద్వారా విద్యార్థులు గ్రహించాల్సిన ముఖ్యాంశాలు:-
1) పాఠం ఉద్దేశం
2) కథ (విషయం)
3) పద్యాల కంఠస్థం-ప్రతిపదార్థ తాత్పర్యాలు గ్రహించడం.
4) ముఖ్యాంశాల గురించి భిన్నకోణాలో అవగాహన
5) కవి, కవిశైలి గురించి వివరాలు
6) భాషాంశాలు

1) పాఠం ఉద్దేశం:- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఆడిన మాట తప్పకుండా ఉండడం; దానం గొప్పతనాన్ని గ్రహించడం, విద్యార్థుల్లో పెంపొందింపజేయడం లక్ష్యంగా ఈ పాఠం నిర్దేశించారు. ఈ ఉద్దేశం నెరవేర డానికి విద్యార్థులకు అవగాహన ఉండవలసిన అంశాలు.
 • ఆడిన మాట తప్పకుండా ఉండడం వల్ల సమాజంలో మనిషికి ఉండే గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, వ్యక్తీకరించాలి.
 • ఆడినమాట తప్పని చారిత్రక, ఇతిహాసిక, పౌరాణిక పురుషుల/వ్యక్తులకు సంబంధించిన కొన్ని అంశాలు దృష్టిలో ఉండాలి. ఉదా:- సత్యహరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, గోవు(పులిబారిన పడినప్పుడు), భీష్ముడు, కర్ణుడు, మహాత్మాగాంధీ మొదలైనవారు.
 • దాన గుణంలో ప్రసిద్ధులైనవారి గురించి తెలుసుకుని ఉండాలి. శిబిచక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, వివేకానందుడు (బాల్యంలో), ప్రకాశం పంతులు, సంగం లక్ష్మీబాయి, ఆధునిక సమాజంలో మీకు తెలిసిన ఒకరిద్దరు వ్యక్తులు-వాళ్లు చేసిన దానాలు.
 • దాన గుణం ప్రత్యేకత-ఆధునిక కాలంలో దానాలు-రక్తదానం, అవయవదానం మొదలైన అంశాలపై అవగాహన.
2) కథ:-
 • పాఠ్యాంశానికి సంబంధించిన కథ-కీలకాంశాలు.
 • రాక్షసరాజైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు, ఉత్తమ గుణ సంపన్నుడు. అతని కుమారుడు విరోచనుడు. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి.
 • బలిచక్రవర్తి మహావీరుడు. ఉత్తమ గుణాలు కలిగినవాడు. ఆడిన మాట తప్పని సత్యసంధుడు. దానం చేయడమనే వ్రతానికి కట్టుబడిన వాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయని వాడు.
 • బలి చక్రవర్తి ఉత్తముడైనప్పటికీ రాక్షసజాతికి నాయకుడు. అతని అండచూసుకుని రాక్షసులు దేవతలను, సాధుసత్పురుషులను హింసించే తమ సహజ గుణాన్ని మరింత వికృతంగా ప్రదర్శించేవారు. రాక్షసులకు దేవతలతో ఉన్న జాతివైరం వల్ల బలిచక్రవర్తి కూడా ఇంద్రున్ని స్వర్గం నుంచి తరిమేసి, ఇంద్రపదవిని అలంకరించాడు.
 • బలిచక్రవర్తిని ఓడించలేని దేవతలు రాక్షసుల వల్ల తాము అనుభవిస్తున్న బాధలను విష్ణుమూర్తికి తెలియజేస్తారు. విష్ణువు తాను వామనుడుగా అవతరించి, బలి చక్రవర్తిని స్వర్గం నుంచి తొలగించి, మేలు చేస్తానని వాగ్దానం చేస్తాడు.
 • అన్నమాట ప్రకారం వామనుడుగా మారి, నర్మదానదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి, తనకు మూడడుగుల నేల కావాలని యాచిస్తాడు విష్ణువు.
 • అతడు విష్ణువని, అడిగిన దానంలో మోసం ఉందని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి దానం ఇవ్వకూడదని, ఇస్తే బలిచక్రవర్తితో పాటు రాక్షసకుల వినాశనం, రాజ్యనాశనం సంభవిస్తుందని హెచ్చరిస్తాడు.
 • తాను గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నానని, ఎవరేది అడిగినా (ధనం, కోరిక, కీర్తి, పదవి) కాదనకుండా ఇస్తానని మాట ఇచ్చి, ఇప్పుడా వాగ్దానభంగం చేయలేనని అంటాడు బలిచక్రవర్తి.
 • అంతేకాదు, ఆడినమాట తప్పేవాళ్లు దుర్మార్గులకన్నా నీచులని, వాళ్లను భూదేవి భరించలేదని చెబుతాడు. పూర్వపు రాజులు ఎంత సంపాదించినా, అహంకారంతో విర్రవీగి, నామరూపాలు లేకుండా అంతమైపోయారని, శిబిచక్రవర్తి లాంటి సత్యసంధులు, దాన గుణ సంపన్నులూ ఇప్పటికీ కీర్తి పొందుతున్నారని అంటాడు.
 • ఇంకా, ప్రాణం పోయినా, నరకం ప్రాప్తించినా, సమస్త సంపదలూ, రాజ్యం నశించినా, వచ్చినవాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్లో ఎవ్వరైనా, తెలిసిన వాడైనా తాను మాట తప్పననీ ప్రకటిస్తాడు బలిచక్రవర్తి.
 • ఆ విధంగా ప్రకటించి, భార్య అయిన వింధ్యావళితో కూడి, ఆ వామనుని కాళ్లు కడిగి, ఆ నీళ్లు నె త్తిన చల్లుకుని ‘విష్ణుస్వరూపుడవైన బ్రాహ్మణోత్తమా! వేద ప్రామాణికంగా మూడడుగలనేలను నీకు దానం చేస్తున్నాను’ అంటూ వామనుడు కోరిన మూడడుగుల నేలను దానమిస్తాడు.
 • సర్వప్రాణులకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువుకు బలిచక్రవర్తి దానమీయగానే దిక్కులన్నీ బలిచక్రవర్తిని ప్రశంసించాయి.
4. ముఖ్యాంశాల గురించి భిన్నకోణాల అవగాహన:-
 • నూతన విద్యావిధానంలో అత్యంత కీలకమైన అంశమిది. నిర్దేశిత పాఠం ఏ ఉద్దేశం ఆధారంగా రూపొందించారు; విద్యార్థి జీవితానికి, భాషాసాహిత్యాల అభిరుచికి, వ్యక్తిత్వవికాసానికి, ఆలోచనా విధానానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న అంశాలను ఆధారంగా చేసుకొనే పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి, పాఠంలోని కీలక విషయాల గురించి అవగాహన, విశ్లేషణ అవసరం.
 • ఆధారాలు:- పై అంశాల అవగాహనకు పాఠం మధ్యలో గళ్లలో చర్చకోసం ఇచ్చిన ప్రశ్నలు, పాఠం చివర అభ్యాసాల్లో ఇచ్చిన ప్రశ్నలు ఆధారంగా చేసుకొని విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ధోరణిలో ఆలోచించాలి.
 • గళ్లలోని ప్రశ్నలు-ఆశించే కీలకాంశాలు:-
  1) శుక్రుడు బలిచక్రవర్తి దానాన్ని అడ్డుకోవడం.
  2) మానధనుల లక్షణాలు
  3) కీర్తి సంపాదించడం గొప్పవిషయమా?
  4) ‘తిరుగన్ నేరదు నాదుజిహ్వ’ అంటే
  5) శిబి గొప్పదాత-ఎందుకు?
  6) అడిగింది ఇవ్వడంలోని తృప్తి-అనుభవాలు
  7) పొడవు-కురుచ పదాల వెనుకున్న అర్థం
  8) మానధనులు మాట తిరుగకుండడం
  9) దిక్కులు పొగడడం అంటే
 • పై ప్రశ్నలు-అంశాలను గమనించినప్పుడు.. విద్యార్థులు ఈ పాఠం ద్వారా ఏఏ అంశాలను అవగాహన చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? అనుభవాలు ఎలా జోడించాలి అనే విషయాలు స్పష్టమవుతాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకొని, తమ భావనలు (స్పందనలు) అక్షర రూపంలో స్పష్టంగా వ్యక్తీకరిస్తే ప్రశ్నలన్నిటికీ/ ఏ ప్రశ్నకైనా జవాబు రాయగలిగే సామర్థ్యం కలుగుతుంది.
ఆ ప్రశ్నల విశ్లేషణలో ఏర్పడే భావనలు....
 1. రాక్షసకుల గురువుగా తన జాతిని, ఆజాతికి నాయకుడైన బలిచక్రవర్తిని కాపాడుకోవడం శుక్రాచార్యుని బాధ్యత. వంచనతో విష్ణువు బలిచక్రవర్తిని, రాక్షసజాతిని నాశనం చేయడానికి వచ్చిన విషయం గ్రహించిన శుక్రుడు ఆ నిజం తెలిపి తన వాళ్లను కాపాడుకునే కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది సమర్థనీయం.
 2. మానధనులంటే గౌరవమే సంపదగా కలిగిన వారు. అంటే పరువు మర్యాదల కోసం జీవించే వాళ్లు. వీళ్లు గౌరవానికి హాని కలిగించే ఏ పనినీ సమర్థించరు. తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడితే ప్రాణాలైనా వదులుకుంటారు. నీతి, నిజాయితీగా జీవించడం, మాటకు కట్టుబడి ఉండడం, ఎవరినీ యాచించకుండా ఉండటం, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలనుకోవడం, తగని పనులు చేయకుండా ఉండడం వంటి లక్షణాలు వీళ్ల సహజసిద్ధమైన గుణాలు.
 3. కీర్తి సంపాదించడం నిజంగా గొప్ప విషయమే. ఈ లోకంలో ధనం చాలామంది సంపాదిస్తారు. నాయకత్వాన్ని కొందరు సంపాదిస్తారు. కాని కీర్తిని సంపాదించే వాళ్లు కొందరే ఉంటారు. అది తేలికగా లభించేదికాదు. ఎంతో అంకితభావం, నియమబద్ధమైన జీవితం, నిరంతర కృషి, నీతి-నిజాయితీ, సహనం, ఔదార్యం వంటి ఉత్తమ గుణాలతో ప్రవర్తించే వాళ్లే కీర్తి సంపాదించగల్గుతారు.
 4. ‘జిహ్వ తిరుగనేరదు’ అంటే ‘ఆడినమాట తప్పను’ అని అర్థం.
 5. ఒక పావురాన్ని కాపాడడం కోసం ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడ్డ శిబిచక్రవర్తి నిజంగా గొప్పదాత.
 6. ఎవరైనా ఏదైనా అడిగితే-దాన్ని ఇవ్వడంలో ఎంతో తృప్తి ఉంటుంది (విద్యార్థుల వ్యక్తిగతానుభవాలు జోడించాలి)
 7. పొడవు-అంటే గొప్ప, శ్రేష్ఠత్వం అని అర్థం. దానికి వ్యతిరేక పదం కురుచ-ఈ పదానికి అల్పం, తక్కువ అనే అర్థాలున్నాయి. శ్రేష్ఠుడైన విష్ణువు తనను తాను అల్పునిగా చేసుకొని బలిచక్రవర్తిని దానం అడగడం అల్పత్వానికి ప్రతీక కదా!
 8. మానధనులైన వాళ్లు మాటతిరుగరు-అంటే ప్రాణం పోయినా ఆడినమాట తప్పరు అని భావం.
 9. ‘దిక్కులు’ అనేవి అమూర్త పదార్థాలు. అంటే కనిపించనివి. కనిపించని దిక్కులు బలి చక్రవర్తిని ఎలా పొగుడుతాయి? దీని అర్థం దిక్కులలోని సమస్త ప్రాణులూ ఆ మహనీయుడిని పొగిడాయని.
పాఠం ద్వారా విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాలు:-

‘దానశీలము’ పాఠం:-
- కవి, రచనాశైలి గురించి....
 • ప్రతి పాఠానికి సంబంధించిన కవి/ రచయిత గురించిన విశేషాలపై అవగాహన కలిగి ఉండడం అవసరం. కవి గురించి తెలుసుకునేటప్పుడు రెండు విభాగాలు ముఖ్యమైనవే. 1) జీవిత విశేషాలు 2) సాహితీవిశేషాలు.
 • జీవిత విశేషాల్లో జననం, తల్లిదండ్రులు, రచనలు, పురస్కారాలు తదితరాంశాలుంటాయి.
 • సాహితీ విశేషాల్లో రచనలు, రచనాశైలి, భాష, అలంకారాలు, ప్రత్యేకతలు ఉంటాయి.
పోతన గురించి-జీవిత విశేషాలు:-
 • పోతన 15వ శతాబ్దానికి (1420 ప్రాంతానికి) చెందిన కవి. వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసనలకు జన్మించాడు. ఎవరి దగ్గర విద్యనేర్చుకోలేదు. సహజ పండితుడు. సంస్కృతంలోని భాగవతపురాణాన్ని తెలుగులోకి భావానువాదం చేశాడు. ఇది పన్నెండు స్కంధాల బృహద్రచన. (ఇందులో కొంతభాగం సింగన, గంగన, నారయలు పూరించారు). వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం పోతన ఇతర రచనలు.
 • పోతన రచనల్లో సుప్రసిద్ధమైనది భాగవతం. ఇది పండిత పామరజన రంజకం కావడానికి పోతన రచనాశైలి ప్రధాన కారణం. శబ్దాలంకారాల సొగసు పోతన పద్యాలకు ఎంతో సొగసు చేకూర్చింది. పోతన భాగవతంలో చిత్రించిన మధుర భక్తి తర్వాత తరాల వాళ్లకు ఆదర్శంగా మారింది. ఆయన పద్యాల్లోని ధారాశుద్ధి, భావస్పష్టత తెలుగువాళ్లకు పద్యాలపై మక్కువ పెంచింది. అందుకే గజేంద్రమోక్షం, శ్రీకృష్ణ లీలలు, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీ కళ్యాణం తదితర భాగాల్లోని పద్యాలెన్నో తెలుగువాళ్లకు కంఠస్థమైయాయి. భాగవతంలోని అవతారిక పద్యాల్లో నుంచి కూడా ఒకటి రెండు పద్యాలైనా తెలియని తెలుగువారు ఉండరు.
పాఠం-అదనపు అంశాలు:-
ఒక పాఠం అధ్యయనం చేసిన తర్వాత ఆ పాఠాన్ని పిల్లలు ఎంతమేర అర్థం చేసుకున్నారో, ఆ పాఠం ద్వారా భాషా సాహిత్యాంశాలపై వాళ్ల అవగాహన ఏ మాత్రం పెంపొందిందో, నిజజీవితానికి ఆయా అంశాలను ఎంత సమర్థంగా వినియోగించుకోగలరో తెలుసుకోవడానికి (అంచనా వేయడానికి) పాఠం చివర ‘ఇవిచేయండి’ అనే పేరుతో అభ్యాసాలు కల్పించారు. వాటన్నిటినీ పిల్లలు వ్యక్తిగత సామర్థ్యంతో పూర్తిచేయాలి. అవి సక్రమంగా సాధించగలిగితే, పరీక్షలో ఎటువంటి ప్రశ్నలకైనా అవలీలగా జవాబులు రాయగలరు.

ఈ పాఠంలో పాఠ్యాంశానికి అదనంగా చేర్చిన అంశాలు....
 1. రక్తదానం, అవయవదానం వంటి వివిధ దానాల గురించి పిల్లలకు ఏం తెలుసో - గ్రహించడం.
 2. రైతుకు తృప్తినిచ్చే వసతి సౌకర్యాలు
 3. సిరిమూటగట్టుకొని పోవడం అంటే
 4. ఆడినమాట తప్పకుండా ఉండటం-ప్రాధాన్యత
 5. దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం
 6. సత్యవాక్కు, దానగుణం లక్షణాల ఆవశ్యకతపై నినాదాలు, సూక్తులు.....
1) రక్తదానం-అవయవదానం-ప్రాధాన్యత:-
 • దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు మన దగ్గరున్నా ఏ సంపదనైనా, వస్తువునైనా ఇవ్వడం.
 • అనాదిగా అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం, ద్రవ్యదానం మొదలైన దానాలను చేస్తున్నారు మనపూర్వులు. ఆ సంప్రదాయం ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం.
 • ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం అభివృద్ధి చెందిన నేపథ్యంలో మానవుడు సృష్టికి ప్రతిసృష్టి చేసే స్థాయికి చేరుకుంటున్నాడు. ప్రాణ ప్రతిష్ట చేయడం మినహా, ప్రాణమున్న మానవున్ని మామూలు వ్యక్తిగా మనగలిగేటట్లు చేయడంలో మనిషి విజ్ఞానం చాలా వరకు సఫలమమైంది. ఈ ప్రయత్నంలో భాగంగానే మానవుల రక్తాన్ని, అవయవాలను కూడా ఒకరి నుంచి మరొకరికి వినియోగించే శాస్త్రపరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. పర్యవసానంగా రక్తదానం, అవయవదానం ప్రాముఖ్యత, గుర్తింపూ పెరిగాయి.
రక్తదానం:-
 • రక్తం-మనిషిని సజీవంగా ఉంచి జీవనక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పతుంది. సగటున ప్రతి మనిషి శరీరంలోనూ 200 ఔన్సుల రక్తం ఉంటుంది. రక్తం ఆక్సీజన్(ప్రాణవాయువు)ను శరీర భాగాలన్నిటికీ అందజేస్తుంది. జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరమంతటా వ్యాపింపజేస్తుంది. రక్తం తనంతటతాను గడ్డ కట్టుకునే శక్తిని కూడా కలిగి ఉండి కొంతమేర రక్త స్రావాన్ని అడ్డుకుంటుంది. అందుకే రక్తం మనిషి శరీరంలో అత్యంత కీలకమైంది.
 • ప్రమాదాలు జరిగినప్పుడు; శస్త్రచికిత్సలు చేసిన ప్పుడు; రక్తం పూర్తిగా పాడైపోయినప్పుడు; కిడ్నీలు, కాలేయం వంటివి పని చేయడం మానేసినప్పుడు రక్తమార్పిడి అవసరమవుతుంది.
 • ఒక మనిషి ఒకసారి 8ఔన్సుల రక్తాన్ని ఇవ్వవచ్చు. ఈ 8 ఔన్సుల రక్తం రెండురోజుల్లో మళ్లీ సమకూరుతుంది. అందుకే ఆరోగ్యవంతులైనవారు వీలైనన్ని సార్లు రక్తదానం చేయవచ్చు.
 • మనిషి ప్రాణాన్ని కాపాడే రక్తం దానం చేయడమంటే ప్రాణదానం చేసినట్లే. ఈ విలువ గ్రహించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్త నిధులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి.
 • అందుకే ఆధునిక కాలంలో రక్తదానం ఎంతో విలువైంది. పుణ్య ప్రదమైంది. మానవతా సదృశమైందని అందరూ గ్రహించాలి.
అవయవదానం:-
 • మనిషి శరీరంలోని అంతరావయవాల్లో గుండె, మూత్రపిండాలు (కిడ్నీలు), కళ్లు, కాలేయం వంటివి ఇటీవలి కాలంలో మార్పిడి చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడడం, చూపు నివ్వడం, దీర్ఘ రోగాల బారి నుంచి కాపాడటం వంటి పుణ్యప్రదమైన కార్యక్రమాలు అందరి మన్ననలనందుకుంటున్నాయి.
 • మనిషి చనిపోయిన తర్వాత ఉపయోగపడని ముఖ్యమైన అవయవాలను శరీరం స్పందించడం మానిన సమయంలో, మెదడు నియంత్రణ పూర్తిగా కోల్పోయిన (బ్రెయిన్ డెడ్) సందర్భంలో గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయం వంటివి తీసి, నిర్ణీతకాలంలో ఇతరులకు అమర్చే వ్యవస్థ ఉంటుంది. ‘కిడ్నీ’ బతికున్నప్పుడు కూడా ఒకరి నుంచి మరొకరికి మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పిడి కార్యక్రమం అవయవదానం చేసే వ్యక్తుల లేదా వాళ్లబంధువుల పూర్తి అంగీకారం, సహకారంతోనే జరుగుతుంది.
 • దానాలన్నింటి ద్వారా మేలు జరుగుతుంది కాని, రక్తదానం, అవయవదానం వల్ల పరోక్షంగా ప్రాణదానం జరుగుతుంది. అందుకే ఇవి అన్ని దానాల్లోనూ విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి.
 • ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచి, మానవ శ్రేయస్సుకు, సంక్షేమానికి తోడ్పడే రక్తదానం, అవయవదానం కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వం, ప్రచారసాధనాలు ముందుకు రావాలి.
2) రైతుకు తృప్తినీయగల వసతి సౌకర్యాలు:-
 • అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా పేరుగాంచిన రైతు తృప్తిగా ఉంటేనే అందరికీ ఆరోగ్యం, ఆనందం. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మేధావులు, వ్యాపారులు, దళారీలు సహానుభూతితో వ్యవహరించి, వాళ్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి.
 • సకాలంలో సాగునీరు, తాగునీటి వ్యవస్థను కల్పించడం; అంతరాయం లేని విద్యుత్ సరఫరా; మేలిరకం విత్తనాలు; ఆధునిక వ్యవసాయ పరికరాలు; సబ్సిడీమీద ఎరువులు, విత్తనాలు; అధికోత్పత్తికి అవసరమైన విజ్ఞానం, అవగాహన; ఉత్పత్తి చేసిన సరుకును తరలించే రవాణా వ్యవస్థ; ఉత్పత్తులకు తగిన ధర; ధర పలుకు సమయంలో మద్దతు ధర; ప్రకృతి బీభత్సం నుంచి ధాన్యాన్ని కాపాడుకునే గిడ్డంగులు తదితర వసతి సౌకర్యాలుంటే రైతులు తృప్తిగా జీవించగలుగుతారు.
3) సిరిమూట గట్టుకొని పోవడం:-
 • అంటే సంపాదించిన ధనాన్ని మరణానంతరం వెంటతీసుకొని పోవడం. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు. భౌతికమైన ఏ సంపదనూ తన వెంట తీసుకుని పోలేరు. అందుకే సంపాదించిన ధనాన్ని ప్రజలకు మేలు చేయడానికి వినియోగించాలి. అప్పుడు ధనం స్థానంలో పుణ్యం అంటే ‘చేసిన మేలు’ మిగులుతుంది. తన గురించి తాను ఆలోచించకుండా, తనదనుకున్నదంతా పరులకోసం నిస్సంకోచంగా ఇచ్చిన త్యాగధనులు చరితార్థులై చరిత్రలో నిలిచిపోతారు. అందుకే పోయేటప్పుడు ఎవరూ సిరిమూట గట్టుకొని పోలేరన్న వాస్తవం వ్యాప్తిలోకి వచ్చింది.
4) ఆడినమాట తప్పకుండా ఉండడం:-
 • అంటే మాటంటే దాన్ని తు.చ తప్పకుండా నెరవేర్చడం. వాగ్దానం తప్పకూడదన్నమాట. దీన్నే మాటమీద నిలబడడం అంటారు. అలా మాటమీద నిలబడే వాళ్లకు ఇంట బయటా గౌరవమర్యాదలుంటాయి. కాని, ఆడినమాట తప్పినవాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లనెవ్వరూ నమ్మరు. ఎంతటి గొప్పస్థానంలో ఉన్నా చులకనైపోతారు. సొంతమనుషులు కూడా వాళ్లను తేలికగా తీసుకుంటారు. సమాజం నుంచి, బంధువుల నుంచి సరైన సహకారం లభించదు. అవకాశం వస్తే అల్పులు కూడా అవమానించడానికి సాహసిస్తారు. అనుకున్న పనులు నేరవేరవు.
దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం
 • సమాజంలో ఏకాలంలోనైనా పేదలు, ఉపేక్షితులు, బాధితులు ఉంటారు. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అయితే ఆదుకోవడానికి ప్రధానంగా కావలసింది మంచి మనస్సు, ధనం. ఈ రెండు కలిగిన వాళ్లు మాత్రమే దాతలుగా పేరు పొందగలరు.
 • సమాజంలోని అసమానతల కారణంగా పేదరికం పూర్తిగా అంతరించడం లేదు. నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి, ఛాందసభావాలు పేదలను ఎదగనీయకుండా అడ్డుపడుతున్నాయి. వాటిని అధిగమించడానికి పేదలను ఆదుకోవడానికి మనసున్న ధనవంతులు ముందుకు రావాలి.
 • కులం, వర్గం, జాతి కారణంగా నీచంగా చూస్తున్న వాళ్లను సాటిమానవులుగా భావించాలి. సమాజాన్ని మేల్కొల్పాలి.
 • ముసలీతనం, రోగాల బారిన పడడం, అనాథలుగా మారడం వల్ల దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. వాళ్లను ఆదుకొని, అండగా నిలబడేందుకు వదాన్యులు ముందుకు రావాలి.
సత్యవాక్కు, దానగుణం ఆవశ్యకత ఆధారంగా సూక్తులు-నినాదాలు:-
సూక్తి-అంటే మంచిమాట: నినాదం అంటే నినాదించేది అని అర్థం. నినాదాలు ఉద్యమాల్లో, ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో ఉపయోగిస్తుంటారు.
 ఉదా:- సూక్తులు:-
1. మనిషిని మాధవుడుగా నిలబెట్టేశక్తి ‘సత్యం’.
2. దయగల హృదయమే దేవాలయం.
నినాదాలు:- 1. సత్యమే జీవనం! అసత్యమే మరణం!
                    2. దాతృత్వాన్నే పాటించు!
                                పదికాలాలూ జీవించు!!
Published on 12/28/2015 2:58:00 PM
టాగ్లు:
దానశీలం