Sakshi education logo
Sakshi education logo

ఏపీపీఎస్సీ మెయిన్స్..ప్రజాసేవలో నైతికత

Join our Community

facebook Twitter Youtube
Virtue is Knowledge (సుగుణమే విజ్ఞానం)ఈ వ్యాఖ్య ద్వారా మనిషి జీవితానికి నైతిక విలువలు ఎంత అవసరమో ప్లేటో తెలియజేశారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పాటించినప్పుడు ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుతాడు. వ్యక్తి తన వృత్తి జీవితంలో నైతికతను కలిగి ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థలో మార్పునకు కారణమవుతాడు. వ్యవస్థలోని మిగతా వారందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. వ్యవస్థను మంచి మార్గంలో నడిపించి.. మొత్తం సమాజ శ్రేయస్సుకు దోహదపడతాడు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వృత్తి జీవితంలో వ్యక్తుల నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూడో పేపర్‌లో ‘‘ప్రజాసేవలో నైతికత ’’ అనే అంశాన్ని ప్రవేశ పెట్టింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ సిలబస్‌లోనూ ‘పాలనలో నైతికత’ అంశం భాగమైంది.
Career Guidance భారతదేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగస్వామ్య వ్యవస్థలో.. ఉన్నత స్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్‌లలో అభ్యర్థుల నైతిక సామర్థ్యాలను గుర్తించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2013లో సిలబస్‌లో మార్పులు చేసి.. మెయిన్స్ జీఎస్-పేపర్4లో ‘‘నైతికత, సమగ్రత, సహజ సామర్థ్యం’’ అంశాలను పొందుపరించింది. ఇటీవల జరిగిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల సమావేశంలో.. రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్‌ల సిలబస్‌ను యూపీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 సిలబస్‌లో మార్పులు చేసి.. మెయిన్స్ పేపర్-3, పార్ట్ సీలో... ప్రజాసేవలో నైతికత (ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్) అనే అంశాన్ని సిలబస్‌లో చేర్చింది.

ప్రజాసేవలో నైతిక విలువలు
గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3, పార్ట్-సీలో పేర్కొన్న.. ‘‘ప్రజాసేవలో నైతిక విలువలు’’లో నైతిక విలువలు, మానవ సమన్వయం; మానవ విలువలు; దృక్పథం; ప్రజాసేవ భావన ఉన్నాయి.

నైతిక విలువలు, మానవ సమన్వయం
  • ఇందులో సారాంశం; మానవ చర్యలలో నైతికత నిర్ధారకాలు-పరిణామాలు; నైతికత కోణాలు; వ్యక్తిగత, ప్రజా సంబంధాలలో నైతిక విలువలు; ప్రజాసేవలో జవాబుదారీతనం; నైతికత-సమగ్రత; వంటి అంశాలున్నాయి.
  • మానవ చర్యలలో నైతిక నిర్ధారకాలు అంశాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ కొంత పదజాలం, కొన్ని నిజ జీవిత సంఘటనలు అవసరమవుతాయి. ముఖ్యంగా నైతికత అంటే ఏమిటి; నిజాయితీ, సానుభూతి, సహానుభూతి, నిస్వార్థం, హెడోనిజం, రుజువర్తనాన్ని కలిగి ఉండటం వంటి కొన్ని అంశాలకు సంబంధించిన పదాల వివరణలు అవసరం. ముఖ్యంగా నైతికత పరిణామాలు వంటి అంశాలను చర్చించేటప్పుడు భారతీయ పురాతన గ్రంథాలలోని; రామాయణ, మహాభారత, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాల సారాంశం; భారతీయ, పాశ్చాత్య తత్వవేత్తల సూక్తులను రాయడం మంచిది. ఉదాహరణకు ధర్మోరక్షతి రక్షిత:, ఆత్మదీపోభవ, కర్మఫల సిద్ధాంతం వంటి వాటి గురించి రాయడం అవసరం. ఈ సందర్భాలలో పురాతన గ్రంథాలలో నైతికతను కోల్పోయిన వ్యక్తులు ఏ విధంగా పతనమయ్యారు, వ్యక్తిగతంగా మంచివాడైనా చెడ్డవారితో సహవాసం వల్ల ప్రాణాలు కోల్పోయిన కర్ణుడి గాథ వంటి వివరణలు ఇవ్వడం మంచిదే!

మానవ విలువలు
  • ఇందులో ప్రకృతి, సమాజంలో అంత ర్లీనంగా ఉనికిలో ఉన్న సామరస్యాన్ని అర్థం చేసుకోవడం; మానవ సంబంధాలలో లింగ సమానత్వం; పౌరుల్లో విలువలు ఏర్పడటంలో కుటుంబం, సమాజం, విద్యాసంస్థల పాత్ర; గొప్పనాయకులు, సంస్కర్తలు, పాలకుల జీవితాలు, సందేశాల నుంచి స్ఫూర్తి పాఠాలు తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. సిలబస్‌లో ఈ అంశం చాలా విస్తృతమైనదనే చెప్పాలి. ఎందుకంటే... భారతీయ సమాజంలో కుటుంబ పాత్ర, విద్యాసంస్థల పాత్ర వ్యక్తి ప్రవర్తనపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ అంశాలను వివరించేటప్పుడు గాంధీజీ వంటి వారి జీవిత చరిత్రలు ముఖ్యంగా ఆయన తల్లికి ఇచ్చిన ‘‘మూడు వాగ్దానాలు’’వంటి అంశాల ద్వారా కుటుంబ ప్రాధాన్యత వివరించవచ్చు. విద్య, విద్యాసంస్థలు వ్యక్తిలో విలువలు పెంపొందించే క్రమంలో.. వాటి పాత్రను వివరించేటప్పుడు నెల్సన్ మండేలా చెప్పిన సూక్తులు రాయాలి. ఉదాహరణకు ‘‘ఈ ప్రపంచంలో విద్యకు మించిన ఆయుధం లేదు’’ వంటివి.
  • పాలకుల జీవితాల విషయానికి వస్తే... గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్, కలాంలతోపాటు శంకరన్ వంటి అధికారుల జీవిత అంశాల ద్వారా వివరణ ఇవ్వాలి. ఉదాహరణకు: కోర్టులో వాదిస్తున్న సమయంలో భార్య మరణ వార్త టెలి గ్రాం ద్వారా తెలిసినా.. కీలకమైన ఆ కేసు వాదనలు పూర్తయిన తర్వాతే కోర్టు నుంచి బయటకు వెళ్లిన ఉక్కు మనిషి పటేల్ జీవితం మనిషిలో స్థిత ప్రజ్ఞతకు, వృత్తి నిబద్ధతకు నిదర్శనంగా వివరించవచ్చు.

దృక్పథం (అటిట్యూడ్)
ఇందులో విషయ అవగాహన; మనిషి ఆలోచనలు, ప్రవర్తనకు దృక్పథానికి మధ్యసంబంధం, దాని ప్రభావం; నైతిక, రాజకీయ వైఖరులు, సామాజికంగా వాటి ప్రభావం; భావోద్వేగ ప్రజ్ఞ వంటి అంశాలున్నాయి. వీటిని పరిశీలిస్తే... దృక్పథం అంటే ఏమిటి; దాని లక్షణాలు ఏమిటి? అది మనిషి ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలను వివరించేటప్పుడు ‘‘అల్ పోర్ట్’’ సూచించిన దృక్పథం లక్షణాలు రాయడం మంచిది. ‘దృక్పథం-ప్రవర్తన’కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగినప్పుడు.. ఐన్‌స్టీన్ చెప్పిన.. ‘‘ఒక వ్యక్తి దృక్పథంలో లోపం ఉంటే.. అది అతని ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది’’ వంటి మాటలను ప్రస్తావించాలి. వ్యక్తుల దృక్పథాలను ప్రభావితం చేసే పద్ధతులైన ‘ ETHOS, PATHOS, LOGOS ’’ వంటి అంశాలను వివరించడం అవసరం. ముఖ్యంగా కేస్‌స్టడీస్‌లో వీటిని ఉపయోగించి వివరిస్తే బాగుంటుంది.

భావోద్వేగ ప్రజ్ఞ
భావోద్వేగ ప్రజ్ఞ(ఎమోషనల్ ఇంటెలిజెన్స్), దాని ఉపయోగాలు; పాలనలో భావోద్వేగ ప్రజ్ఞ కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలి. భావోద్వేగ ప్రజ్ఞ అంటే.. వ్యక్తులు తమలోని ప్రేమ, ద్వేషం వంటి భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండటం. భారత్ వంటి అధిక జనాభా గల దేశంలో ప్రభుత్వ అధికారులు తీసుకునే ఏ చిన్న నిర్ణయం అయినా ఎక్కువ మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రజాసేవలో ఉండే అధికారులు మంచి పని సంస్కృతిని పెంపొందించడానికి భావోద్వేగ ప్రజ్ఞను కలిగి ఉండాలి. ప్రభుత్వాధికారులు బంధుప్రీతి, పక్షపాతం, స్వార్థపూరిత వైఖరి వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. పాలనలో భావోద్వేగ ప్రజ్ఞ వల్ల మంచి పని సంస్కృతి ఏర్పడుతుంది. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వాధికారుల ప్రవర్తన మారుతుంది. ఫలితంగా ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. వివాదాల పరిష్కారం, ఘర్షణ వాతావరణాన్ని నివారించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉద్యోగులకు భావోద్వేగ ప్రజ్ఞ అవసరం.

ప్రజాసేవ భావన
ఇందులో పాలనకు తాత్వికపరమైన సంపూర్ణ సాంకేతికతలపై దృష్టి, అవగాహనల నేపథ్యంలో వృత్తిపరమైన నైతికత, నైతికత నియమావళి, ప్రవర్తనా నియమావళి, ఆర్‌టీఐ, ప్రజా సేవా చట్టం, నాయకత్వ నైతికత, పని సంస్కృతి, సంస్థాగత పరమైన నైతిక సూత్రాలు, పాలనలో నైతిక, మానవ విలువలు, అంతర్జాతీయ సంబంధాలలో నైతిక అంశాలు, అవినీతి, లోక్‌పాల్, లోకాయుక్త తదితర అంశాలున్నాయి. ఈ అంశంలో ఎక్కువగా ప్రభుత్వ అధికారులకు గల చట్టబద్ధ పరిమితులు, వాటికి అనుగుణంగా వ్యక్తులు వృత్తి పరంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోలాన్ కమిటీ సిఫార్సులు, సీసీఎస్ రూల్స్ వంటి వాటిపై అవగాహన కలిగి ఉండటం అవసరం. ‘పాలనలో నైతికత’పై రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ నివేదికలోని ముఖ్య అంశాలపై దృష్టిసారించాలి.
-బాలలత మల్లవరపు, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
Published on 1/14/2019 3:15:00 PM

Related Topics