ఎంసెట్.. గెలుపు గమ్యానికి మార్గాలు

Join our Community

Whatsup Telegram Playstore
ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరడానికే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తోన్న ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడమే మార్గం. సాధించిన ర్యాంక్ ఆధారంగానే టాప్ కాలేజీల్లో సీటు వస్తుంది. కాబట్టి మంచి ర్యాంక్ పొందడం కోసం అభ్యర్థులంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ గెలుపు గమ్యం చేరుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు..
Bavitha ఇంటర్మీడియెట్‌లో చేరినప్పటి నుంచే ఎంసెట్ కోసం కసరత్తు చేసిన విద్యార్థులకు నిజంగానే పరీక్షా సమయమిది. ఎంసెట్‌కు మరో నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ సమయంలో ప్రిపరయ్యే తీరుపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ తక్కువ సమయాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే అంత మెరుగైన ర్యాంకు సొంతం చేసుకోవచ్చనేది నిపుణుల సలహా. ఈ నేపథ్యంలో సబ్జెక్ట్‌ల వారీగా అనుసరించాల్సిన వ్యూహం..

రివిజన్‌కే ప్రాధాన్యం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని, సబ్జెక్ట్‌ల వారీగా ప్రాధాన్యతలను బేరీజు వేసుకుని ప్రిపరేషన్ కోసం ప్రణాళికను రూపొందించుకోవాలి. చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌తో పాటు ఎంసెట్‌కు ప్రిపరేషన్ కొనసాగించి ఉంటారు. ఈ నెల రోజుల సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ఈ క్రమంలో షార్ట్ కట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, ఫ్లో చార్ట్స్ వంటి షార్ట్ నోట్స్‌ను రివిజన్‌కు వినియోగించుకోవాలి.

తప్పదనిపిస్తేనే కొత్త అంశాలవైపు
అకడమిక్ పరీక్షల కోణంలో విద్యార్థులు తమకు క్లిష్టంగా భావించే అంశాలను ఛాయిస్ విధానం మేరకు వదిలేస్తుంటారు. ఇలా విస్మరించిన అంశాలు.. ఎంసెట్‌లో ముఖ్యమైన అంశాలుగా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే వాటిపై దృష్టి పెట్టాలి. అది కూడా ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి. మిగతా సమయాన్ని రివిజన్‌కే కేటాయించాలి.

రివిజన్ విత్ ప్రాక్టీస్
ఎంసెట్ ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు అనుసరించాల్సిన మరో ప్రధాన వ్యూహం.. పునశ్చరణ సమయంలోనూ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిచ్చేలా వ్యవహరించడం. ఈ క్రమంలో ప్రతి రోజు కనీసం 12 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. విద్యార్థులు తాము రాసే స్ట్రీమ్ ఆధారంగా ఆ సమయాన్ని విభజించుకోవాలి.
  • ఇంజనీరింగ్ విభాగం కోసం ప్రిపేరయ్యేవారు ప్రతి సబ్జెక్ట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కి నాలుగు గంటల చొప్పున కేటాయించుకోవాలి. ఈ నాలుగు గంటల సమయంలో కచ్చితంగా ఒక గంటపాటు ఆయా అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
  • అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ విద్యార్థులు కూడా ఇదే విధంగా వ్యవహరించాలి. బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీలకు నాలుగు గంటలు చొప్పున సమయం కేటాయించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా బయాలజీలో డయాగ్రమ్స్, అసెర్షన్ అండ్ రీసెన్, స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ప్రాక్టీస్ ఎంతో మేలు చేస్తుంది.
  • ప్రాక్టీస్ ఆధారిత రివిజన్ ఫలితంగా ఒక సమస్యను భిన్న కోణాల్లో పరిష్కరించే నైపుణ్యం అలవడుతుంది.

కాన్సెప్ట్‌లపై క్షుణ్నంగా
ఇంజనీరింగ్, మెడికల్.. రెండు స్ట్రీమ్‌ల అభ్యర్థులు ఎంసెట్‌లో పేర్కొన్న సిలబస్ ఆధారంగా ఆయా అంశాల కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. వాస్తవానికి విద్యార్థులు ఇప్పటికే ఈ విషయంలో నేర్పు పొంది ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన కాన్సెప్ట్‌లను, థీరమ్స్‌ను, ఫార్ములాలను వేగవంతంగా రివిజన్ చేసుకునేందుకు రెడీ రెకనర్స్‌ను వినియోగించుకోవాలి. ఈ విషయంలో తాము సొంతంగా రూపొందించుకున్న షార్ట్ నోట్స్‌లు లేదా మార్కెట్లో లభించే ప్రామాణిక మెటీరియల్‌ను వినియోగించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ నుంచి గత ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మ్యాథమెటిక్స్.. మోర్ ఫోకస్
సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ విషయానికొస్తే.. ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కారణం.. మొత్తం 160 మార్కులకు నిర్వహించే పరీక్షలో 80 మార్కులు మ్యాథమెటిక్స్ నుంచే. దీన్ని పరిగణనలోకి తీసుకుని, గత ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే.. విద్యార్థులు మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మ్యాథమటిక్స్‌లో మంచి మార్కుల కోసం వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులేషన్ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.

ఫిజిక్స్
ఫిజిక్స్ విభాగంలో ఆశించిన రీతిలో ప్రతిభ చూపేందుకు మార్గం.. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం. ఆయా అంశాల ఫార్ములాలపై పట్టు సాధించడంతోపాటు.. వాటిని అన్వయించే తీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఒక ప్రశ్న లేదా సమస్యను కనీసం రెండు లేదా మూడు విధానాల్లో పరిష్కరించేలా సాధన చేయాలి. ఈ క్రమంలో ఫిజిక్స్‌లో ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ఎలక్ట్రో మ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్‌మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెజైస్ అంశాల రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగానూ ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది.

కెమిస్ట్రీ తులనాత్మక వ్యూహం
కెమిస్ట్రీ సిలబస్ పరంగా విద్యార్థులు తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్స్‌పై పట్టు సాధించాలి. ఇవి మార్కుల సాధనలో కీలకంగా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ అధ్యయనం చేయాలి.

బోటనీ.. అనుసంధాన అప్రోచ్
బోటనీ విషయంలో ఒక అంశాన్ని మరో అంశంతో అనుసంధానం చేయగలిగే ఇంటర్ రిలేటివ్ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. మొదటి సంవత్సరంలోని అంశాల్లో అధిక శాతం రెండో సంవత్సరంలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను ఒకే సమయంలో చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్లపై అవగాహన కూడా బోటనీ పరంగా కలిసొచ్చే అంశం.

కాన్సెప్ట్స్‌తో జువాలజీలో పట్టు
జువాలజీ విషయంలో ప్రాథమికాంశాలపై పట్టు సాధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంటర్మీడియెట్ సిలబస్‌లోని కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్‌లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిమాణం; అనువర్తిత జీవ శాస్త్రం చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేసే విధంగా టైం ప్లాన్ రూపొందించుకోవాలి.

ఎంసెట్ విజయానికి మరికొన్ని వ్యూహాలు..
  • ఎంసెట్‌లో ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అయితే అవి ఇన్‌డెరైక్ట్‌గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి.
  • అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివర్లో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి.
  • టేబుల్స్; చార్ట్స్; పాయింటర్స్ రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు.
  • ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అంశాలు; ద్వితీయ సంవత్సరం అంశాల ప్రిపరేషన్‌కు నిర్దిష్ట టైం ప్లానింగ్ అనుసరించాలి.
  • ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.
  • కనీసం మూడు గ్రాండ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది.
  • ఇంజనీరింగ్ విద్యార్థులు 110 నుంచి 130 మార్కులు; మెడికల్ విభాగం విద్యార్థులు 120 నుంచి 145 మార్కులు పొందే విధంగా చదవాలి. అప్పుడు సీట్లు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏపీలో టీఎస్ ఎంసెట్ పరీక్ష కేంద్రాలు..
టీఎస్ ఎంసెట్ -2016ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌ను ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాలని నిర్ణయించాం. 25 వేల మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాయాలని భావించే విద్యార్థులు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఆన్‌లైన్ పరీక్షను హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మాత్రమే నిర్వహిస్తాం. మొదట్లో ఏపీలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో టీఎస్ ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించాం. కాబట్టి ఏపీ విద్యార్థులు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన సెంటర్ చిరునామా తెలుసుకుంటే పరీక్ష రోజు అమల్లో ఉండే ‘ఒక నిమిషం’ నిబంధన టెన్షన్‌కు స్వస్తి పలకొచ్చు.
- ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు, కన్వీనర్, టీఎస్ ఎంసెట్ - 2016

విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా
ఏపీ ఎంసెట్ - 2016 ఔత్సాహిక విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతేడాదితో పోలిస్తే 30,680 దరఖాస్తులు పెరిగాయి. తెలంగాణ నుంచి కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లోనూ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం.
- ప్రొఫెసర్ సీహెచ్. సాయిబాబు, కన్వీనర్, ఏపీ ఎంసెట్ - 2016

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి
ఎంసెట్ ప్రిపరేషన్‌లో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇంటర్మీడియెట్ సిలబస్‌తోపాటు ఎంసెట్‌కు ప్రిపేరైనప్పుడు చదివిన అంశాలను.. ఎంసెట్‌కు ముందు నెల రోజులు పూర్తిగా ప్రాక్టీస్ ఆధారిత రివిజన్ చేసే విధంగా వ్యవహరించాలి. అప్పుడే అవకాశాలు మెరుగవుతాయి.
- ఎం.సాయి సందీప్, టీఎస్ ఎంసెట్-2015 టాపర్

కాన్సెప్ట్స్‌పై క్లారిటీ
మెడికల్ స్ట్రీమ్ విద్యార్థులు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలోని అన్ని కాన్సెప్ట్‌లపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించిన మూల భావనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వాటిని అన్వయించుకుంటూ సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేస్తే పరీక్ష రోజు అందుబాటులో ఉన్న సమయంలో సులభంగా అన్ని సమస్యలకు పొరపాట్లు లేకుండా సమాధానం రాయొచ్చు.
- యు.ప్రియాంక, టీఎస్ ఎంసెట్ (2015) విజేత
Published on 3/31/2016 6:00:00 PM

Related Topics