మధ్యంతర రైల్వే బడ్జెట్ 2014 - 15


Current Affirsన్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకుండా, సాదాసీదాగా పట్టాలకెక్కింది. రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సారాంశం మీ కోసం...

రైల్వే బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో)
2014-15 2013-14
స్థూల ట్రాఫిక్ వసూళ్లు 1,60,000 1,31,500 (సవరించిన)
నిర్వహణ వ్యయం 1,44,199 1,27,260 (సవరించిన)
నికర ఆదాయం 19,655 19,400
డివిడెండ్ 9,117 6,250
నిర్వహణ నిష్పత్తి 89.8 87.8
మొత్తం మిగులు 12,728 8,018 (సవరించిన)

బడ్జెట్ హైలెట్స్
 • వచ్చే ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1.6 లక్షల కోట్ల ఆదాయార్జన లక్ష్యం. ఇందులో సరుకు రవాణా ఆదాయం రూ.1.05 లక్షలు, ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.45,255 లక్షలు, కోచింగ్ తదితర ఆదాయాలు రూ.9,700 కోట్లు
 • సరుకు రవాణా లక్ష్యం 110.1 కోట్ల టన్నులు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 4.97 కోట్ల టన్నులు అధికం.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేల మొత్తం ఆదాయం రూ.1.315 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా.
 • ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టదలచిన ప్రాజెక్టులు: స్టాక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, బహుళార్థ కాంప్లెక్సులు, లాజిస్టిక్స్ పార్కులు, ప్రైవేట్ సరుకు రవాణా టెర్మినళ్లు, పూర్తిస్థాయి రవాణా కారిడార్లు తదితరాలు.
 • 2014-15లో మార్కెట్ నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ, రైల్ వికాస్ నిగమ్‌ల ద్వారా రూ.13,800 కోట్లు సేకరించదలచారు.
17 ప్రీమియం ఏసీ రైళ్లు...
ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రవేశపెట్టిన ఏసీ ప్రీమియం రైలు విజయవంతం కావడంతో ఆ సేవలను విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రద్దీ మార్గాల్లో ‘జైహింద్’ పేరుతో మరో 17 ఏసీ ప్రీమియం రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఏసీ ప్రీమియం రైళ్లలో అత్యధికం వీక్లీ, బై వీక్లీలు. హౌరా-పుణే, హౌరా-ముంబై, కామాఖ్య-చెన్నై, త్రివేండ్రమ్-బెంగళూరు తదితర మార్గాల్లో వీటిని నడుపుతారు. 15 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి.

పార్సిల్ రైళ్లలో పాల రవాణా
పార్సిల్ రవాణా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్సిల్ రైళ్లలో పాల రవాణా చేపట్టనున్నట్లు ఖర్గే వెల్లడించారు.

రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటు
రైల్వే ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు స్వతంత్రప్రతిపత్తి గల రైల్వే టారిఫ్ అథారిటీ(ఆర్టీఏ)ను ఏర్పాటు చేయనున్నారు

అగ్ని, పొగ గుర్తింపు వ్యవస్థ
అగ్ని, పొగను పసిగట్టే సమగ్ర విధానాన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, పరీక్షలు విజయవంతమైతే త్వరలో అన్ని పెద్ద రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రైళ్లు ఢీకొనకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధిపరచిన పరికరాన్ని కూడా అమర్చుతారు.

కాపలా లేని క్రాసింగ్‌ల తొలగింపు
ప్రమాదాల నివారణకు నిర్దిష్ట కాలపరిమితిలోగా కాపలా లేని అన్ని క్రాసింగ్‌లను తొలగిస్తారు. క్రాసింగ్‌ల తొలగింపు, లేదా వాటి వద్ద కాపలా ఉంచడం, రద్దీ మార్గాల్లోని కాపలా క్రాసింగ్‌లను ఓవర్, అండర్ బ్రిడ్జిలుగా మార్చడం రైల్వే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో ఉన్న మొత్తం 18,672 క్రాసింగ్‌ల్లో 12,582 కాపలా లేనివి. గత ఐదేళ్లలో 5,400 కాపలా లేని క్రాసింగ్‌లను తొలగించారు.

సీటు ఖరారైతే ఎస్సెమ్మెస్... ఆన్‌లైన్‌లో మీల్స్ బుకింగ్
న్యూఢిల్లీ: రైళ్లలో బెర్త్, సీట్లు వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి అవి కన్ఫర్మ్ అయితే సెల్‌ఫోన్లకు ఆటోమేటిక్‌గా ఎస్సెమ్మెస్ వచ్చే విధానాన్ని తేనున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో భోజనాన్ని బుక్ చేసుకుని తెప్పించుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.

రాష్ట్రానికి మళ్లీ అరకొరే
 • రాష్ట్రానికి ప్రకటించింది 16 రైళ్లు. కానీ వాటిల్లో 15 కేవలం రాష్ట్రం మీదుగా ప్రయాణించేవే.
 • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే రెండు డబుల్ డెక్కర్ రైళ్లను, ఒకటి హైదరాబాద్-తిరుపతి మధ్య కాగా రెండోది సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడుస్తుంది.
ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయించిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
 • ఔరంగాబాద్-రేణిగుంట (వారానికో రోజు)
 • హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్‌సిటీ (ప్రతి రోజూ)
 • కాచిగూడ-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ -వయా కరూర్, నమక్కల్,సేలం (వారానికో రోజు)
 • సికింద్రాబాద్-విశాఖపట్టణం ఏసీ ఎక్స్‌ప్రెస్- వయా కాజీపేట్, విజయవాడ (వారానికొకరోజు)
వైష్ణోదేవి ప్రయాణికులకు రైలు
వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ అయిన కాత్రా వెళ్లేందుకు కాశ్మీర్ రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఉధంపూర్-కాట్రా రైలు మార్గ నిర్మాణం పూర్తయిందని, యాత్రికుల కోసం అతి త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభమవుతాయని ఖర్గే తెలిపారు.

2014-15లో వచ్చే కొత్త రైళ్లు -73
ప్రీమియం రైళ్లు -
17
ఎక్స్‌ప్రెస్ రైళ్లు - 39
ప్యాసింజర్ రైళ్లు - 10
మెమూ రైళ్లు - 4
డెమూ రైళ్లు - 3

మరి కొన్ని వివరాలు:
 • ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు యథాతథం. వీటిలో ఎలాంటి పెంపు లేదు.
 • మూడు రైళ్ల పొడిగింపు. మరో మూడు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు.
 • మరిన్ని హై స్పీడ్ రైళ్లు.
 • రైళ్లల్లో తదుపరి రాబోయే స్టేషన్లు, రైళ్ల చేరిక సమయాలను ప్రదర్శించేందుకు చర్యలు.
 • ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ల వేగాన్ని గంటకు 160-200 కి.మీ. పెంచే లక్ష్యాన్ని పరిమితవ్యయంతో సాధించేందుకు మార్గాల అన్వేషణ.
 • ఢిల్లీ-ముంబై ప్రీమియం ఏసీ రైళ్లు.
 • రైల్వే స్టేషన్లలో మరిన్ని జన్ ఆహార్ ఔట్‌లెట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు
 • అప్‌గ్రెడేషన్ పథకం ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌కూ విస్తరణ.
 • ప్రతిపాదిత రైల్వే వార్షిక ప్రణాళిక మొత్తం రూ.64,305 కోట్లు. ఇందుకోసం సాధారణ బడ్జెట్ నుంచి రూ.30,225 కోట్ల కేటాయింపు.
 • స్థూల రవాణా ఆదాయ లక్ష్యం రూ.1,60,775 కోట్లు. ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.45,255 కోట్లు. వస్తు రవాణా ద్వారా రూ.1,05,770 కోట్లు. ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం రూ.9,700 కోట్లు.
 • 2014-15లో 19 కొత్త లైన్ల కోసం సర్వే చేపడతారు. ప్రస్తుతమున్న ఐదు లైన్ల డబ్లింగ్ పనుల కోసం సర్వే.
 • అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు తొలిసారిగా రైలు మార్గాల ఏర్పాటు. మేఘాలయలోని దుద్నోయ్-మెహెందీపథర్ మార్గం నెలలోగా పూర్తి.
 • ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలపై సూచనలు కోసం స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటు.
 • రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంపై పరిశీలన.
 • మరిన్ని రైళ్లల్లో బయో టాయ్‌లెట్‌లు.
 • స్థూల రవాణా ఆదాయం రూ.1,60,775 కోట్లు. వ్యయం రూ.1,10,649 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే రూ.13,589 కోట్లు అదనం.
 • రవాణా సేవల ద్వారా ఆదాయలక్ష్యం రూ.94 వేల కోట్లు. లోడింగ్ లక్ష్యం 1,052 మిలియన్ టన్నులకు పెంపు.
 • పెన్షనర్ల పింఛన్ పద్దు వచ్చే ఏడాది రూ.27 వేల కోట్లకు పెంపు.
 • రైలు ప్రాజెక్టుల వ్యయాన్ని భరించే ప్రతిపాదనకు కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది.
 • రైళ్లు ఢీకొనడాన్ని నివారించేందుకు దేశీయంగా రూపొందించిన కొలిజన్ అవాయిడెన్స్ వ్యవస్థను, డ్రైవర్ల అప్రమత్తతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రైళ్లల్లో విజిలెన్స్ కంట్రోల్ పరికరాల ఏర్పాటు.
 • కోచ్‌ల లోపలి భాగాల్లో మంటల వ్యాప్తిని నిరోధించే సామగ్రి వినియోగం. విద్యుత్ సర్క్యూట్ల భద్రత కోసం మల్టీ టైర్ భద్రత. ఏసీ కోచ్‌ల్లో పోర్టబుల్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచుతారు.
 • ప్యాంట్రీల్లో ఎల్పీజీ సిలిండర్ల బదులు ఎలక్ట్రిక్ వంట పరికరాలు.
 • గాలిమరలు, సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రైల్వే ఇంధన నిర్వహణ కంపెనీ కృషి చేస్తోంది. ఈ విద్యుత్‌ను తొలుత 200 రైల్వేస్టేషన్లు, 26 రైల్వే భవనాలు, 2,000 లెవెల్ క్రాసింగులకు అందిస్తారు.
భారతీయ రైల్వే విశేషాలు...
 • ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్కుల్లో ఒకటి
 • రోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తోంది
 • రోజూ 26.5 లక్షల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది
 • 64 వేల కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన రూట్లలో రోజూ 12 వేల ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు నడుపుతోంది
 • భారతీయ రైల్వేలో 1.4 లక్షల మంది ఉద్యోగులున్నారు.
Published on 2/14/2014 2:51:00 PM

Related Topics