ఆంధ్ర ప్రదేశ్ ఎకనమిక్ సర్వే 2011-12


ఆంధ్ర ప్రదేశ్
పుష్కలమైన సహజ వనరులు, సారవంతమైన నేలలు, వ్యవసాయానికి అత్యంత సానుకూలమైన వాతావరణం కలిగిన రాష్ట్రం అంధ్రప్రదేశ్. వీటితోపాటు గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి ప్రధాన నదులతో బాటు వాటి 36 ఉపనదులు రాష్ట్రాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయి. దేశంలో నాలుగో అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భూ విస్తీర్ణం 275.04 లక్షల హెక్టార్లు. ఇది దేశం మొత్తం విస్తీర్ణంలో 8.37 శాతం. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సామాజిక, ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. అతి పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోది. అడవులు 63,815 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ర్ట్ర మొత్తం భూ విస్తీర్ణంలో 23.2 శాతం. ఎత్తై పర్వతాలు, విశాలమైన మైదానాలు, పచ్చని కోస్తా డెల్టా ప్రాంతాలతో కూడి, వివిధ నైసర్గిక లక్షణాలను కలిగి ఉండటం రాష్ట్రం ప్రత్యేకత. దేశంలో అత్యధికంగా వరి పండే రాష్ట్రంగానే కాక, తేయాకు, వేరుశనగ, మిరప, పసుపు, నూనె గింజలు, పత్తి, చెరకు, జనుము వంటి వాణిజ్య పంటల ఉత్పత్తిలో ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. మామిడి, ద్రాక్ష, జామ, సపోట,బొప్పాయి, అరటి వంటి పండ్లు పుష్కలంగా పండుతాయి. ఐటీ రంగంలోను దాని అనుబంధ సేవల్లోను ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. ఎన్నో పుణ్య క్షేత్రాలు, పోర్టులు, నదులు, బీచ్‌లు, హిల్ స్టేషన్లతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం..
 • రాష్ట్ర జనాభా 8.47 కోట్లు
 • ఇది మొత్తం దేశ జనాభాలో 7 శాతం
 • ఐదో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం
 • గత దశాబ్ద (2001-2011) కాలంలో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. 1991-2001 కాలంలో 14.6 శాతంగా ఉన్న జనాభా పెరుగుదల రేటు 2001-2011 కాలంలో 11.1 శాతానికి తగ్గింది.
 • 2001లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 978 స్త్రీలుగా ఉంటే అది 2011 నాటికి 992 కి పెరిగింది. ఇది దేశ లింగ నిష్పత్తి 940 కంటే ఎక్కువ కావడం విశేషం.
 • 2001లో 60.47 శాతంగా ఉన్న రాష్ట్ర అక్షరాస్యతా రేటు 2011 నాటికి 67.66 శాతానికి పెరిగింది. ఇందులో పురుష అక్షరాస్యత 70.32 నుంచి 75.56 శాతానికి, మహిళా అక్షరాస్యత 50.43 నుంచి 59.74 శాతానికి పెరిగింది.
ఆర్థికాభివృద్ధి:
1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పరిశీలిస్తే, ఆర్థికాభివృద్ధిలో పెరుగుదల కొద్ది కాలంపాటు నెమ్మదిగా ఉన్నప్పటికీ, తర్వాత కాలంలో వేగం పుంజుకోవడాన్ని గమనించవచ్చు. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధితో ఇంచుమించు సమానంగా సాగినప్పటికీ .. 1980కి ముందు 3 శాతం వద్ద కదలాడిన అభివృద్ధి రేటు తర్వాత కాలంలో పెరగటం ప్రారంభించింది. రాష్ట్ర అవతరణ ఐదో పంచవర్ష ప్రణాళిక ప్రారంభ కాలంలో జరిగింది. ప్రణాళికలో అర్థికాభివృద్ధికి దోహదమిచ్చే బీదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన పథకాలను రాష్ట్రం విజయవంతంగా అమలు చేసింది. వీటి ఫలితాలు కనిపించనారంభించాయి. తర్వాత 9వ ప్రణాళికలో స్వల్ప అభివృద్ధిని నమోదు చేసినప్పటికీ పదో ప్రణాళిక (2002-03 నుంచి 2006-07)లో గణనీయమైన పెరుగుదల సాధించింది. ఇక 11 వ ప్రణాళిక (2007-8 నుంచి 2011-12) కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.94 శాతంకాగా రాష్ట్ర వృద్ధి రేటు దాన్ని మించి 8.33 శాతం సాధించింది. రాష్ట్రం ఆచరించిన ఆర్థిక విధానాలు పటిష్టంగా ఉండటం, పథకాల అమలులో గట్టి కృషి జరగడం వృద్ధి రేటు పెరగడానికి దోహదం చేశాయి. రాష్ర్టంలో పేదల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి.

స్థూల ఆర్ధికాభివృద్ధి అంశాలు:
 • అనతి కాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఆర్థికాభివృద్ధికి దోహదం చేశాయి.
 • 2004-05 నుంచి 2011-12 కాలంలో దేశ వృద్ధి రేటు 8.39 శాతం పెరగ్గా ,ఇదే కాలంలో రాష్ట్రం వృద్ధిరేటు సరాసరిన 9.26 శాతం కావటం విశేషం.
 • 2010-11 కాలంలో రాష్ర్ట జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమిస్టిక్ ప్రొడక్ట్) రూ.3,81,942 కోట్లు కాగా 2011-12 కాలంలో (ముందస్తు అంచనాల ప్రకారం) జీఎస్‌డీపీ రూ.4,07,949 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 6.81 శాతం వృద్ధి రేటును సూచిస్తోంది. అదే సమయంలో విభాగాల వారిగా చూస్తే వ్యవసాయం రంగంలో పెరుగుదల (-) 1.54 శాతంకాగా, పారిశ్రామిక రంగంలో 7.33 శాతం, సేవల రంగంలో 9.80 శాతం గణనీయమైన పెరుగుదల కనిపించింది.
 • తలసరి ఆదాయం ప్రజల జీవన స్థాయిని తెలుపుతుంది. 2010-11లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.62,912 కాగా, 2011-12లో (ముందస్తు అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల ప్రాతిపదికగా) తలసరి ఆదాయం రూ.71,540 కు పెరిగి 13.7 శాతం వృద్ధిని సూచిస్తోంది.
పబ్లిక్ ఫైనాన్స్:
 • 2010-11 లో రాష్ట్ర పన్ను రాబడి గత ఏడాది (2009-10) కంటే 28.33 శాతం పెరిగి రూ.45,140 కోట్లకు చేరింది.
 • 2009-10లో రాష్ట్ర సొంత పన్నేతర రాబడి 7,803 కోట్లు కాగా, 2010-11లో రూ.10,720 కోట్లకు పెరిగింది.
 • అమ్మకం పన్ను ఇప్పటికీ రాష్ట్ర ప్రధాన రెవెన్యూగా కొనసాగుతోంది. 2009-10లో అమ్మకం పన్ను ద్వారా రూ.23,640 కోట్లు ఆదాయం వస్తే, 2010-11లో రూ.29,145 కోట్లు వచ్చింది. అంటే 23.29 శాతం పెరుగుదల కనిపించింది.
 • 2010-11 మొత్తం వ్యయం రూ.92,799 కోట్లు కాగా ఇందులో మూలధన వ్యయం 11.99 శాతం.
ధరలు :
 • అన్ని నిత్యావసర వస్తువుల (కందిపప్పు రెండో రకం, ఉల్లిపాయలు గ్రేడ్ 2 మినహా) రోజువారీ సరాసరి చిల్లర ధరలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అయితే ఆహార ద్రవ్యోల్బణం ఇటీవల వారాల్లో గణనీయంగా తగ్గడం వల్ల మొత్తం మీద ధరల పెరుగుదల ఈ సంవత్సరం పెద్దగా ప్రభావం చూపదు.
 • రాష్ట్రంలో 2011 ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో గ్రామీణ,పట్టణ ,ఉమ్మడి వినియోగ ధరల సూచీలు దేశ వినియోగ ధరల సూచికంటే తక్కువ ఉన్నాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ:
 • 2011, నవంబర్ 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 44,579 చౌక ధరల దుకాణాలు పని చేస్తున్నాయి. ఇందులో 6,747 పట్టణ ప్రాంతాల్లోను, 37,832 గ్రామీణ ప్రాంతాల్లోను ఉన్నాయి. అంటే సగటున ప్రతి చౌక ధర దుకాణానికి 535 కార్డులు/కుటుంబాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రతి 2 వేల మందికి ఒక చౌక ధర దుకాణం ఉండాలని సూచిస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి 1,965 మందికి ఒక చౌక ధర దుకాణం ఉంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం 1 రూపాయి ధరకు అందించే పథకం రాష్ట్రంలో కొనసాగుతోంది.
సీజనల్ కండిషన్స్:
 • 2011-12లో నైరుతీ రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో 539 మీ.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఇది ఆ కాలంలో కురిసే సాధారణ వర్షపాతం 624 మీ.మీ. కంటే ఇది 13.6 శాతం తక్కువ.
 • 2011-12లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో 113 మీ.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఇది ఆ కాలంలో కురిసే సాధారణ వర్షపాతం 224 మీ.మీ. కంటే 49.6 శాతం తక్కువ.
పంట విస్తీర్ణం (ఖరీఫ్, రబీ)- రెండో ముందస్తు అంచనా:
 • రెండవ ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల పంట విస్తీర్ణం, దిగుబడి గత ఏడాదితో (2010-11)పోలిస్తే ఈ ఏడాది (2011-12) తగ్గనుంది. 2010-11లో ఆహార ధాన్యాల పంట విస్తీర్ణం 80.29 లక్షల హెక్టార్లు ఉండగా 2011-12 లో 70.60 లక్షల హెక్టార్లకు తగ్గి 12.07 శాతం తగ్గుదలను చూస్తోంది. అలాగే ఆహార ధాన్యాల దిగుబడికూడా గత ఏడాది కంటే 30 లక్షల టన్నుల తగ్గింది. 2010-11లో దిగుబడి 203.14 లక్షల టన్నులుండగా 2011-12లో 173.05 లక్షల టన్నులుగా అంచనా వేశారు. అంటే 14.81 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
వ్యవసాయ రుణం:
 • వార్షిక రుణ ప్రణాళిక 2010-11లో వ్యవసాయ రుణాలకు కేటాయించింది రూ.37,835 కోట్లు. వ్యవసాయ రుణ పంపిణీలో అందుకున్న లక్ష్యం మాత్రం రూ.47,930 కోట్లు (127 శాతం).
 • 2011 ఖరీఫ్ కాలంలో పంట రుణాల లక్ష్యం రూ.30,985 కోట్లు కాగా అందులో రూ.20,905 కోట్లు (67 శాతం) పంపిణీ చేశారు. అదే కాలంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.17,015 కోట్లు కాగా రూ.8,615 కోట్లు (51 శాతం) పంపిణీ చేశారు. 2011-12 లో మొత్తం మీద రుణాల పంపీణీ లక్ష్యం రూ. 48,000 కోట్లు కాగా రూ.29,520 కోట్లు (62 శాతం) పంపిణీ చేశారు.
వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్):
 • 2009 ఖరీఫ్ కాలంలో గుంటూరు జిల్లాలో ఎర్ర మిరప పంటకు ‘వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం’ ప్రవేశపెట్టారు. రైతుల ప్రయోజనార్థం ఈ పథకాన్ని 2010, 2011 సంవత్సరాల్లో ఇతర పంటలకు ఇతర జిల్లాలకు కూడా విస్తరించారు.
సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్):
 • 2010-11లో జాతీయ వ్యవసాయ బీమా పథకంతో పాటు సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని పైలట్ పథకంగా మూడు (ప్రకాశం, నెల్లూరు, వరంగల్) జిల్లాల్లో ప్రవేశపెట్టారు. సవరించిన పథకంలో రైతులకు మరింత ప్రయోజనం కలిగించే విధంగా వడగళ్ల వాన, కోత కాలం అనంతరం నష్టాలను కూడా చేర్చారు. సవరించిన పథకం 2011-12 ఖరీఫ్, రబీ కాలల్లో కూడా అమలులో ఉంటుంది.
సహకార రుణాలు:
 • రాష్ట్రంలోఉన్న 4465 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ (పీఏసీ)లను పునర్వ్యవస్థీకరణ ద్వారా 2949కు కుదించారు.
 • రివైవల్ ప్యాకేజ్ ఫర్ రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ కింద అందిన ఆర్థిక సాయం రూ.1868.69 కోట్లు. ఇందులో రాష్ట్ర వాట రూ.262.12 కోట్లు కూడా కలిసి ఉంది.
హార్టికల్చర్ (ఉద్యానవన పంటలు):
 • రాష్ట్రంలో హార్టీకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ఉద్యానవన పంటలు ఉత్పాదకత పెంచటానికి, పోస్ట్ హార్వెస్టింగ్ (పంట కోత తర్వాత నిల్వ, పంపిణీ, మార్కెటింగ్) నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు నిర్మాణం అభివృద్ధి చేస్తోంది.
 • రాష్ట్రం సుగంధ ద్రవ్యాలు, పండ్లు ఉత్పాదనలో మొదటి స్థానంలోను, పూల ఉత్పత్తిలో మూడవ స్థానంలోను ఉంది.
 • ఎన్‌హెచ్‌బీ (నేషనల్ హార్టికల్చర్ బోర్డు) డేటాబేస్ 2009 ప్రకారం రాష్ట్రం తీపి బత్తాయి, నిమ్మ, బొప్పాయి, ఆయిల్ పామ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, మామిడి, జీడిపప్పు, టమాటా ఉత్పత్తిలో రెండో స్థానంలోను, విడిపూలు, దానిమ్మ, కోకో, వంగ, బెండ, కర్ర పెండలం ఉత్పత్తిలో మూడో స్థానంలోను, అరటి పళ్ళు, ద్రాక్ష, సపోటా పండ్ల ఉత్పత్తిలో నాలుగో స్థానంలోను ఉంది.
 • 1982లో రాష్ట్రంలో 3.70 లక్షల హెక్టార్లుగా ఉన్న ఉద్యానవన పంటల విస్తీర్ణం 2010-11 నాటికి 24.97 లక్షల హెక్టార్లకు పెరిగింది. ముందుస్తు అంచనాల ప్రకారం ఇది 2011-12 కాలంలో 25.59 లక్షల హెక్టార్లకు చేరుతుంది.
పశుసంపద - పాడి పరిశ్రమ:
 • పశు సంపద, పాడి పరిశ్రమ రంగంలో రాష్ట్రం దేశంలోనే విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతులు లాభసాటి పద్ధతులు అవలంబించడంలో చైతన్యవంతులు అయ్యారు. దానికితోడు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ సహకారం అందుబాటులోకి రావడం కూడా ఈ రంగంలో అధిక వృద్ధిని సాధించటానికి వీలైంది. పెరటిలో పెంచుకునే కొద్ది పాటు కోళ్లు పెద్ద కోళ్ల పరిశ్రమగా రూపొందాయి. అలాగే పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వెటర్నరీ, యానిమల్ హజ్బెండరీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం కూడా ఈ ఉత్పత్తులు పెరగడానికి ఒక ప్రధాన కారణం. అననుకూల కాలంలో కూడా రాష్ట్రంలో ఈ రంగాలపై అధారపడి ఆకర్షణీయమైన ఆదాయంతో కనీసం 60 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి.
 • 2007 లెక్కల ప్రకారం రాష్ర్టంలో పశు సంపద వివరాలు: ఆవులు -112.23 లక్షలు, గేదెలు- 132.72 లక్షలు, గొర్రెలు- 255.39 లక్షలు, మేకలు-96.26 లక్షలు, కోళ్లు- 1239.85 లక్షలు.
 • రాష్ట్రంలో పశు ఆరోగ్యాన్ని కాపాడేందుకు 20 వెటర్నటీ పాలిటెక్నిక్‌లు , 3 సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రులు, 1823 వెటర్నరీ డిస్పెన్సరీలు, 42 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు, 3110 రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు పనిచేస్తున్నాయి.
 • 2010-11లో పశు ఆరోగ్యానికి సంబంధించి 270.73 లక్షల కేసులకు చికిత్స అందించారు.4.10 లక్షల కాస్ట్రేషన్ ఆపరేన్లు చేశారు. 478,73 వ్యాక్సినేషన్లు వేశారు.
మత్స్య సంపద:
 • ఉప్పునీటి (బ్రాకీష్ వాటర్) రొయ్యల ఉత్పత్తిలోను, మంచినీటి రొయ్యల ఉత్పత్తిలోను రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
 • మంచినీటి రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, మంచినీటి చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలోను, సుముద్ర చేపల ఉత్పత్తిలో ఐదోస్థానంలో ఉంది.
 • రాష్ట్రం నుంచి 3 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మొత్తం దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇది 40 శాతం.
అటవీ సంపద:
 • దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రెండో రాష్ట్రం. రాష్ట్రంలో అడవులు 63,815 చ.కి.మీ మేర వ్యాపించి రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో 23.2 శాతం ఆక్రమించి ఉన్నాయి.
 • మొత్తం అటవీ ప్రాంతంలో రిజర్వుడు అటవీ ప్రాంతం విస్తీర్ణం 50,478 చ.కి.మీ. రక్షిత అటవీ ప్రాంతం 12,365 చ.కి.మీ. ఏ విభజనలోకి రాని అటవీ ప్రాంతం 971 చ.కి.మీ.
 • కలప, వెదురు, వంటచెరుకు-నల్లబొగ్గు, బీడీ ఆకులు రాష్ర్ట ప్రధాన అటవీ ఉత్పత్తులు.
 • అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి 2006-07లో రూ.81.38 కోట్లు, 2007-08లో రూ.80.14 కోట్లు, 2008-09లో రూ.87.19 కోట్లు, 2009-10లో రూ.103.38 కోట్లు, 2010-11 (సెప్టెంబర్ దాకా) రూ.69.04 కోట్లు లభించాయి.
పట్టు ఉత్పత్తి:
 • పట్టు పరుగుల (మల్బరీ, టసార్ కకూన్లు) పెంపకంలో దేశంలో రాష్ట్రానిది రెండో స్థానం. ముగా కల్చర్‌లో మాత్రం రాష్ట్రం ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉంది.
 • రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో టసార్, ఇరి, ముగా, మల్బరీ పట్టు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు.
 • మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆముదం, కర్రపెండలం మొక్కలు అధికంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు వీటి అకుల్లో 30 శాతాన్ని ‘ఇరి’ పట్టు పరుగుల పెంపకానికి వినియోగిస్తున్నారు. ఆముదం, కర్రపెండలం ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా కొద్ది ఆకులు మాత్రమే తీసుకోవడం ద్వారా వీరు రూ.2 నుంచి 4 వేలు అధికంగా ఆదాయం పొందగలుగుతున్నారు.
మార్కెటింగ్:
 • రాష్ట్రంలో 330 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి కింద 906 మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయి.
 • మార్కెట్ కమిటీలు 2010-11లో మార్కెట్ ఫీజు కింద రూ.472.28 కోట్లు, 2011-12 (అక్టోబర్ వరకు)లో రూ.248.98 కోట్లు వసూలు చేశాయి.
 • రాష్ట్రంలో మొత్తం 106 రైతు బజార్లు ఉన్నాయి. వీటి ద్వారా 45 వేల మంది రైతులు ప్రతి వారం సగటును 1.75 లక్షల క్వింటాళ్లు కాయగూరలను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు.
పారిశ్రామికాభివృద్ధి:
 • ఏకగవాక్ష చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి 2011, జూన్ వరకు రాష్ర్టంలో 55,983 యూనిట్లకు సంబంధించి 86,447 పరిష్కారాలు జరిగాయి. వీటి మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల విలువ రూ. 4,23,003 కోట్లు. ఈ యూనిట్ల ద్వారా 13,28,696 మందికి ఉద్యోగ కల్పన సాధ్యం అవుతుంది.
 • 1991లో పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2011 జులై 21 వరకు రూ.7,78,494 కోట్ల పెట్టుబడులతో 13,49,084 మందికి ఉద్యోగాలు కల్పించగల 7,346 ప్రతిపాదనలు (యూనిట్లు) వచ్చాయి. ఇందులో 3,132 ప్రతిపాదనలు (యూనిట్లు) ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి మొత్తం పెట్టుబడుల విలువ రూ. 73,858 కోట్లు. వీటి ద్వారా 4,79,900 మందికి ఉపాధి లభించింది.
 • రాష్ట్రంలో 2010 నుంచి 2012 (నవంబర్ 31) వరకు 24,974 సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ.33,220,91 కోట్లు. 3,92,821 మందికి ఉద్యోగాలు లభించాయి.
 • 2011 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా రూ.35,257,40 కోట్లు వచ్చాయి.
 • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, భారీ పరిశ్రమలను ప్రొత్సహించటానికి అనేక రాయితీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2010లో ‘ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ పాలసీ 2010-15’ను ప్రకటించింది.
 • రాష్టంలో 114 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో 75 నోటిఫై చేయగా 25 సెజ్‌లు పనిచేయడం ప్రారంభించాయి. వీటిలో నేరుగా 8,50,022 మందికి నేరుగా, 97763 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వీటి మొత్తం ప్రతిపాదిత పెట్టుబడి రూ. 1,05,447 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.14,267.43 కోట్లు సాధించగలిగారు.
 • 2009 మార్చిలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు గల 603,58 చ.కి.మీ ప్రాంతాన్ని పెట్రో కారిడార్ గా కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాంతంలో పెట్రో కె మికల్ పరిశ్రమలను ప్రోత్సహిస్తారు.
 • రాష్ట్రంలోని 30 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం పెట్టుబడి రూ.32,580.96 కోట్లు. ఈ పెట్టుబడిలో 81.43 శాతం ఐదు ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలదే కావడం విశేషం.
 • 30 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో 23 సంస్థలు 2008-09 లో లాభాలు ఆర్జించాయి. వీటి మొత్తం విలువ రూ.2258.49 కోట్లు.
గనులు, భూగర్భ సంపద:
 • రాష్ట్రంలో 100 నుంచి 110 మిలియన్ టన్నులు పారిశ్రామిక ఖనిజాలు, 200 మిలియన్ల డెమైన్షనల్ స్టోన్ (ఫ్లోరింగ్‌కు వినియోగించే రాయి), భవన నిర్మాణ మెటీరియల్ ఉత్పత్తి అయ్యింది.
 • బైరేట్స్, పాలరాయి ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
 • రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే ఖనిజాల విలువ దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఖనిజాల విలువలో 15 శాతంగా ఉంది. వీటి ద్వారా సుమారు రూ.1000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది.
వాణిజ్యం, ఎగుమతులు:
 • 2009-10లో రాష్ట్రం నుంచి రూ.73,143 కోట్లు ఎగుమతులు జరగ్గా, 20010-11లో ఇవి రూ.91,614 కోట్లకు పెరిగాయి.
 • మొత్తం ఎగుమతుల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 30 శాతం ఆక్రమించాయి.
 • మిగిలిన ఎగుమతుల్లో ఇంజనీరింగ్ పరికరాలు, డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్ వాటి అనుబంధ రసాయనాలు, ప్లాస్టిక్‌లు, జంతు, సముద్ర, తోలు ఉత్పత్తులు, వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, ఖనిజాలు,ఖనిజ సంబంధిత ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, టెక్స్‌టైల్స్, రత్నాలు, నగలు, ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రధానమైనవి.
నీటిపారుదల :
 • రాష్ట్రంలో జలయజ్ఞం 86 ప్రాజెక్టులు (44 భారీ, 30 మధ్య తరహా,4 వరద కట్టలు, 9 ఆధునికీకరణ ప్రాజెక్టులు) నిర్మిస్తున్నారు.
 • పై వాటితో పాటు చిన్న నీటి పారుదల ప్రాజెక్టులతో కలుపుకుని రాష్ర్టంలో 97,03 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం, 9.45 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ లభిస్తుంది.
 • 2004-05 నుంచి 2010-11 వరకు రాష్ర్టంలో 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 21 ప్రాజెక్టులకు నీరు విడుదలైంది. మిగిలిన ప్రాజెక్టులు ప్రణాళికను అనుసరించి, కాలపరిమితి ప్రాతిపదికన పూర్తి చేస్తారు.
 • 2004-05 నుంచి 2010-11 వరకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 20.90 లక్షల ఎకారాలకు నీటి పారుదల సౌకర్యం కలిగింది. అలాగే చిన్ని నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా 4.89 లక్షల ఎకరాలకు, ఎపీఎస్‌ఐడీసీ ప్రాజెక్టుల ద్వారా 2.69 లక్షల ఎకరాలకు నీరు అందింది.
 • డెల్టా వ్యవస్థలతో పాటు ఇతర ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూ.15001.45 కోట్లు వెచ్చించారు.
 • చిన్న నీటి పారుదల కింద 78 వేల చెరువుల ద్వారా 46.50 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది.
 • రూ.1044 కోట్ల వ్యయం చేసి మధ్య తరహా నీటి పారుదల పథకాలను పునరుద్ధరించడం ద్వారా 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
భూగర్భ జలాలు:
 • 2008-09 డేటా బేస్ అధారంగా రాష్ట్రంలో భూగర్భ జలవనరులను 2010-11లో అంచనా వేశారు. దీని ప్రకారం 84 మండలాల్లో భూగర్భ నీటి వనరులు పూర్తిగా అడుగంటాయి, 26 మండలాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. 93 మండలాల్లో తీవ్రంగా ఉంది, 905 మండలాల్లో మాత్రమే భూగర్భ జలాలు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి.
విద్యుత్:
 • రాష్ట్రంలో 1959లో 213 మెగావాట్లు (ఎండబ్ల్యూ)గా ఉన్న స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం 2011 సెప్టెంబర్ నాటికి 15768.14 మెగావాట్లకు చేరింది. విద్యుత్ వినియోగదారుల సంఖ్య 2.7 లక్షల నుంచి 234.63 లక్షలకు పెరిగింది.
 • అలాగే విద్యుత్ అమ్మకం ద్వారా మొత్తం వార్షిక ఆదాయం (నాన్ టారిఫ్ ఆదాయంతో కలుపుకుని) రూ.5.50 కోట్లనుంచి రూ.17584 కోట్ల (రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి)కు పెరిగింది.
 • 2011-12లో రాష్ట్ర ప్రభుత్వం టారిఫ్ సబ్సిడీ కింద రూ.4209.95 కోట్లు ఇచ్చింది. వ్యవసాయ రంగానికి టారిఫ్ సబ్సిడీ కింద రూ.2401.32 కోట్లు, క్రాస్ సబ్సిడీ కింద రూ.2670.39 కోట్లు ఇచ్చింది.
 • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2004, మే 14 నుంచి రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వటం ప్రారంభించింది. అంతేకాక అంత వరకు డిస్కం, రెస్కోలకు వ్యవసాయ విద్యత్ వినియోగదారులు బాకాయి పడిన మొత్తాలను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందు నిమిత్తం రూ.975 కోట్లను వాటికి ప్రభుత్వం రీయింబర్స్ చేసింది.
రోడ్లు :
 • రాష్ట్రంలో 2011,సెప్టెంబర్ 30 నాటికి రోడ్లు భవనాల శాఖ నిర్మించిన మొత్తం రోడ్లు 70,394 కి.మీ. ఇందులో జాతీయ రహదారులు 4,730 కి.మీ. ,రాష్ట్ర రహదారులు 10,470 కి.మీ., ప్రధాన జిల్లా రోడ్లు 32,205 కి.మీ., గ్రామీణ రోడ్లు 22,989 కి.మీ. కలిగి ఉన్నాయి.
 • రాష్ట్రంలో రోడ్ల సాంద్రత చదరపు కిలోమీటరుకు 0.23 కి.మీ.గాను, 1000 మందికి 0.86 కి.మీ.గాను ఉంది.
 • 2011, ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్మించిన రోడ్ల మొత్తం పొడవు 1,38,781 కి.మీ. ఇందులో ఇతర జిల్లా రోడ్లు 5,506 కి.మీ.,ప్రధాన జిల్లా రోడ్లు 1,096 కి.మీ., గ్రామీణ రోడ్లు 1,32,179 కి.మీ.ఉన్నాయి.
 • పై రోడ్లలో సీసీ రోడ్లు 3,586 కి.మీ., బీటీ రోడ్లు 36,441 కి.మీ., డబ్ల్యూబీఎం (వాటర్ బౌండ్ మెకాడమ్) రోడ్లు 26,395 కి.మీ., గ్రావెల్ రోడ్లు 72,359 కి.మీ. విస్తరించి ఉన్నాయి.
రవాణా :
 • 2011,నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య 110.53 లక్షలు. రోడ్లపై తిరిగి వాటిలో 72.22 శాతం ద్విచక్రవాహనాలు కాగా మిగతా శాతం కార్లు, త్రిచక్ర వాహనాలు,బస్సులు, ట్రక్కులు ఆక్రమిస్తున్నాయి. రాష్ట్రంలో వాహనాల పెరుగుదల 14 శాతంగా ఉంది.
ఎపీఎస్‌ఆర్‌టీసీ:
 • 2011, సెప్టెంబర్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) 7 జోన్లు, 23 రీజియన్లు, 210 డిపోలుగా విస్తరించి ఉంది.
 • 22,216 బస్సులు, 1.21 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
 • మొత్తం 210 డిపోల్లో బస్సు రవాణా వ్యవస్థ అంతా కంప్యూటరీకరించారు. మొత్తం వ్యవస్థ డయల్ అప్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానమై పనిచేస్తుంది.
 • 2011 సెప్టెంబర్ నాటికి ఇంధన సామర్ధ్యం లీటరుకు 5.13 కి.మీ.గా ఉంది.
 • ఎపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు ప్రతి రోజు 77.94 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 1.37 కోట్ల మంది ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి.
 • సగటు వాహన ఉత్పాదకత రోజుకు 353 కి.మీ.
విమానాశ్రయాలు:
 • 2010-11లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ ప్రయాణీకుల సంఖ్య గత ఏడాది కంటే 20.03 శాతం పెరిగింది. అలాగే అంతర్జాతీయ ప్రయాణీకుల రవాణా 10.68 శాతం వృద్ధి చెందింది.
 • మొత్తం ప్రయాణీకుల రావాణా 17,59 శాతం పెరిగింది.
 • 2010-11 లో ఈ ఎయిర్ పోర్టు నుంచి 7.63 మిలియన్ల మంది ప్రయాణించారు.
 • 2011 డిసెంబర్ వరకు దేశీయ ప్రయాణీకుల వృద్ధి 18,22 శాతంగాను, అంత ర్జాతీయ ప్రయాణీకుల వృద్ధి 0.42 శాతంగాను ఉంది. మొత్తం ప్రయాణీకుల రవాణ వృద్ధి 13,74 శాతం. 2011లో డిసెంబర్ నాటికి ఈ విమానాశ్రయం ద్వారా 6.47 మిలియన్ల మంది ప్రయాణించారు.
నౌకాశ్రయాలు:
 • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ పట్నంలో ఒక ప్రధాన నౌకాశ్రయం పనిచేస్తోంది.
 • మరో 14 చిన్న తరహా నౌకాశ్రయాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి
 • ఈ పోర్టుల ద్వారా అంతర్జాతీయ, జాతీయ రవాణా జరుగుతుంది.
 • పోర్టులు చేపల వేటకు, నౌకల రిపేరుకు, వాతావరణ పరిశీలనకు, పర్యాటకం, క్రీడలకు వినియోగపడుతున్నాయి.
 • నిర్దేశిత పరిశ్రమలకు కొన్ని రేవులు క్యాప్టివ్ పోర్టులుగా సేవలందిస్తున్నాయి.
కమ్యూనికేషన్లు:
 • 2011, మార్చి 31 నాటికి రాష్ట్రంలో 16,150 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇందులో 105 హెడ్ పోస్టాపీసులు, 2,343 సబ్ పోస్టాఫీసులు, 13,703 బ్రాంచ్ పోస్టాఫీసులుగా సేవలందిస్తున్నాయి.
 • అలాగే టెలిగ్రాప్ విభాగం కలిగిన 169 వినియోగదారుల సేవా కేంద్రాలు, 4,266 టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లు పనిచేస్తున్నాయి.
 • 2011, అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో 677.90 లక్షల టెలిఫోన్ వినియోగదారులు (కనెక్షన్లు) ఉన్నారు. ఇందులో 23.48 లక్షల కనెక్షన్లు ల్యాండ్‌లైన్ వినియోగదార్లుకాగా, 654.42 లక్షల మంది వైర్‌లెస్ వినియోగదార్లు.
బ్యాంకింగ్:
 • రాష్ట్రంలో 2011 మార్చి అంతానికి షెడ్యూల్డు బ్యాంకు కార్యాలయాల సంఖ్య 8,211.
 • 2011, మార్చి 31 నాటికి ఈ బ్యాంకుల మొత్తం డిపాజిట్ల విలువ రూ.2,83,600 కోట్లు. ఇదే సమయానికి ఇవి అందించిన రుణాల విలువ రూ.3,27,275 కోట్లు.
 • ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం బ్యాంకుల క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 60 శాతంగా ఉండాలి. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ బ్యాంకుల క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 115.40 శాతంగా ఉంది.
 • నికర బ్యాంకు క్రెడిట్‌తో చూసుకుంటే ప్రాధాన్యత రంగాలకు 40 శాతం అడ్వాన్సులు మాత్రమే ఇవ్వాలని ఆర్‌బిఐ నిబంధనలు సూచిస్తుండగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ బ్యాంకులు 47.12 శాతం (రూ.1,54,227 కోట్లు) ఇచ్చాయి. అలాగే వ్యవసాయ రుణాలు 18 శాతం ఇవ్వాలని ఆర్‌బిఐ సూచిస్తుండగా బ్యాంకులు 25.39 శాతం (రూ.83,098 కోట్లు) ఇచ్చాయి.
పర్యాటక రంగం:
 • 600 పర్యాటక ప్రాంతాలతో రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి పర్యాటకులను విశేషంగా అకర్షిస్తోంది.
 • ఏటా రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య 7 మిలియన్లు దాటుతోంది.
 • ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ‘కోహినూర్ ఆఫ్ ఇండియా’ అభివర్ణిస్తారు.
 • ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) రాష్ర్టవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో 53 హోటళ్లు నడుపుతోంది. ఈ హోటళ్లలో మొత్తం గదులు సంఖ్య1049.
 • సంస్థ తనకు ఉన్న 126 బస్సుల ద్వారా రాష్ట్రంలోను, వెలుపల ఉన్న ప్రధాన పర్యాటక కేంద్రాలకు టూరిజం ప్యాకేజీలను అందిస్తోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ:
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. ఐటీ ఎగుమతుల్లో కూడా రాష్ట్రం ఎంతో ముందుంది. దేశం మొత్తం ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎగుమతులు 13.9 శాతంగా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని రంగాల మొత్తం ఎగుమతుల్లో ఐటీ ఎగుమతులు 49 శాతంగా ఉన్నాయి. ఇక దేశంలోని ఐటీ పనితీరులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.
పాఠశాల విద్య:
 • 201-11లో రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల్లో చేరిన వారి సంఖ్య 133.18 లక్షలు. ఇందులో ప్రాధమిక పాఠశాలల్లో 54.64 లక్షలు, ప్రాధమికోన్నత పాఠశాలల్లో 53.97 లక్షలు, ఉన్నత పాఠశాలల్లో 1.27 లక్షలు విద్యార్ధులు చేరారు. మొత్తం పాఠశాలల్లో చేరిన వారి సంఖ్యలో ప్రాధమిక స్థాయలో (1నుంచి 5వ తరగతి) చేరిన వారు 53.49 శాతం, ప్రాధమికోన్నత స్థాయి (6 నంచి 7వ తరగతి)లో చేరినవారు 18.96 శాతం, ఉన్నత స్థాయి (8 నుంచి 10వ తరగతి) లో చేరినవారు 24.45 శాతం కాగా మిగిలిన 3.10 శాతం మంది సిబీఎస్‌ఈ సిలబస్‌లో ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయిలో చేరారు.
 • చదువును కొనసాగించకుండా మధ్యలో నిలిపివేసిన (డ్రాపవుట్స్) విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 2010-11లో ప్రాధమిక స్థాయి ((1నుంచి 5వ తరగతి)లో డ్రాపవుట్స్ 17.43 శాతం, ప్రాధమికోన్నత స్థాయి (6 నంచి 7వ తరగతి)లో 22.34 శాతం, ఉన్నత స్థాయి (8 నుంచి 10వ తరగతి) లో 46.21 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం అన్ని పాఠశాలల్లో 4,76,555 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
 • పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 7 తరగతుల వరకు 2003,జనవరి నుంచి ప్రారంభించగా, 8 నుంచి 10వ తరగతుల వరకు 2008, అక్టోబర్ నుంచి ప్రారంభించారు. 2011-12 కాలంలో ఈ పథకం కింద మొత్తం 78.04 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందగా, వీరిలో 40.96 లక్షల మంది ప్రాధమిక విద్య, 22.61 లక్షల మంది ప్రాధమికోన్నత విద్య, 14.22 లక్షల మంది ఉన్నత విద్య గరుపుతున్న విద్యార్థులున్నారు. మిగిలిన 0.25 లక్షల మంది నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులకు సంబంధించినవారు.
ఇంటర్మీడియెట్ విద్య :
 • ఇంటర్మీడియెట్ విద్యకు సంబంధించి రాష్ట్రంలో 806 జూనియర్ కళాశాలలు, 12 ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 1,355 జూనియర్ కళాశాలల్లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హోమ్‌సైన్స్, పారా మెడికల్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్ రంగాలకు సంబంధించి 34 వృత్తి విద్యా కోర్సులను బోధిస్తున్నారు. 698 ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలతో పాటు 12 క్స్‌క్లూజివ్ గవర్నమెంట్ ఒకేషనల్ కళాశాలలు 753 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో కూడా వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. ఇంటర్మీడియెట్‌లో మొత్తం మీద ఉత్తీర్ణతా శాతం 64.69 శాతంగా ఉండగా ఇందులో విద్యార్థులు 63 శాతంగా విద్యార్థినులు 63 శాతంతో పై చేయిగా ఉన్నారు.
కళాశాల విద్య :
 • రాష్ట్రంలో 251 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం విద్యార్ధుల సంఖ్య 3,85,126. గత మూడేళ్లలో 78 డిగ్రీ కళాశాలల్లో 76 పునర్ సమీక్షించిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను, 59 కళాశాలల్లో 60 పునర్ సమీక్షించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు.
సాంకేతిక విద్య :
 • 705 విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యలో చేరిన వారి సంఖ్య 3,04,200.
 • 644 విద్యాసంస్థల్లో ఎంసీఏలో చేరిన వారి సంఖ్య 46,795.
 • 926 విద్యా సంస్థలో ఎంబీఏలో చేరిన వారి సంఖ్య 86,905.
 • 290 విద్యా సంస్థల్లో బీఫార్మసీలో చేరిన వారి సంఖ్య 29,520
 • 47 విద్యా సంస్థల్లో డీ ఫార్మసీలో చేరిన వారి సంఖ్య 2,560.
 • 251 విద్యా సంస్థలో పాలిటెక్నిక్‌లో చేరిన వారి సంఖ్య 69,450.
 • 134 గవర్నమెంట్ ఐటీఐలు, 611 ప్రైవేటు ఐటీసీల్లో క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ కోర్సును బోధిస్తున్నారు. 2011-12లో ప్రభుత్వ ఐటీఐలలో 31,555 మంది, ప్రైవేట్ ఐటీసీల్లో 1,00,030 మంది విద్యార్థులు చేరారు.
కుటుంబ సంక్షేమం:
 • రాష్ట్రంలోని 12,522 సబ్ సెంటర్లు, 1,624 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 281 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 58 ఏరియా ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, 11 మాతా శిశు సంరక్షణ ఆస్పత్రులు, 14 టీచింగ్ ఆస్పత్రుల్లో తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఇతర కుటుంబ సంక్షేమ సేవలను రాష్ట్ర కుటుం సంక్షేమ శాఖ అందిస్తోంది.
 • 2010లో రాష్ట్రంలో జన నాల రేటు 17.9, మరణాల రేటు 7.6, శిశు మరణాల రేటు 46గా అంచనా వేశారు. మొత్తం దేశంలో జననాల రేటు 22.1, మరణాల రేటు 7.2, శిశు మరణాల రేటు 47 గా ఉంది.
 • 2011-15లో రాష్ట్రంలో పురుషుల జీవిత కాల రేటును 66.9 సంవత్సరాలు, స్త్రీల జీవిత కాల రేటు 70.9 సంవత్సరాలుగా అంచనా వేశారు. అదే సమయంలో దేశంలో పురుషుల జీవిత కాల రేటు 67.3 సంవత్సరాలు, స్త్రీల జీవిత కాల రేటు 69.6 సంవత్సరాలుగా ఉంది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా పథకం:
 • 2011 సెప్టెంబర్ వరకు బీమా పథకం కింద రూ.2554.99 కోట్ల ఖర్చుతో 8.75 లక్షల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అదే సమయంలో ట్రస్టు నేరుగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్టు పథకం కింది రూ. 817.41 కోట్ల ఖర్చుతో 3.38 లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. ఈ రెండు పథకాల కింద నిర్దేశిత ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంపిక చేసిన వ్యాధులకు పూర్తి ఉచితంగా చికిత్సను అందించారు.
 • 2007, ఏప్రిల్ 1న ఈ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2011, సెప్టెంబర్ 30 వరకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో 29,021 మెడికల్ క్యాంపులను నిర్వహించి 48.89 లక్షల మంది రోగులకు స్క్రీనింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు 31.75 లక్షల మందికి అవుట్ పేషంట్లుగాను, 13.48 లక్షల మందికి ఇన్-పేషెంట్లుగాను చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ):
 • ఏపీపీపీపీ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ , ఇన్ పేషెంట్, రోగ నిర్ధారణ, లేబోరేటరీ సర్వీసులను అందిస్తున్నారు.
 • ఏపీవీవీపీ అధ్యర్యంలో 16,144 పడకలతో 233 ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిలో 4,550 పడకలతో 17 జిల్లా ఆస్పత్రులు, 6000 పడకలతో 60 ఏరియా ఆస్పత్రులు, 4740 పడకలతో 120 కమ్యూనిటీ ెహ ల్త్ సెంటర్లు, 824 పడకలతో 10 స్పెషాలిటీ ఆస్పత్రులు, 26 డిస్పెన్సరీలు ఉన్నాయి.
 • రాష్ట్రంలో 2535 మెడికల్, 4733 నర్సింగ్, 3893 పేరా మెడికల్, 2742 సపోర్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కేడర్లు ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి.
ఆరోగ్యం:
 • 2010 నవంబర్ 14న పాఠశాల విద్యార్ధుల ఆరోగ్య రక్షణకు ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష ’ (జేబీఏఆర్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద పిల్లల ఆరోగ్య రక్షణకు ముందుగానే వారికి వ్యాధి నివారణ, వ్యాధి నిర్ధారణ,చికిత్స అందిస్తూ ఆరోగ్య రక్షణకు అవసరమైన వాతావరణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన అలవాట్లు బోధిస్తారు. అంటు వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్తలు చెబుతారు.
 • ఈ పథకం కింద 66,230 పాఠశాలల్లో (87 శాతం) 59.58 లక్షల (78 శాతం) మంది విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 75,687 మందిని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేశారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం:
 • గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, బీద, అసంఘటిత రంగాలకు చెందిన స్త్రీలు, పిల్లలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి వనరులకు సంబంధించి అనేక విధాలుగా చేయూత నిచ్చేందుకు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వివిధ కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తోంది.
 • రాష్ర్టంలో పిల్లల సంక్షేమం కోసం 387 ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్), 91,307 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
 • కిశోర బాలికల (అడోలసెంట్ గర్ల్స్) సాధికారితకు, స్వయం వృద్ధికి ‘సబల’ (రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఎడోల్‌సెంట్ గర్ల్స్) పథకం కింద 2011-12 లో ( డిసెంబర్ 2011 వరకు) 13.77 లక్షల మంది బాలికలు లబ్ది పొందారు.
వికలాంగుల సంక్షేమం:
 • రాష్ట్రంలో బ్యాంకుల అనుసంధానంతో వికలాంగుల కోసం అనేక అర్థిక పునరావాస, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయి.
 • దృష్టి లోపాలు కలిగిన విద్యార్ధుల కోసం 5 రెసిడెన్షియల్ పాఠశాలలు, చెవిటి వారి కోసం 6 రెసిడెన్షియల్ పాఠశాలలు, బాపట్లలో చెవిటి వారి కోసం ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, దృష్టి దోషం కలిగిన వారికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, 40 హాస్టళ్లు, 3 హోమ్‌లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి.
వెనుకబడిన వర్గాల సంక్షేమం :
 • వెనుకబడిన వర్గాల సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న హాస్టళ్ళలో ఉతచిత ఆహారం, వసతి సౌకర్యాలతో విద్యార్ధులు ప్రీమెట్రిక్ వరకు విద్యనభ్యసించవచ్చు.
 • రాష్ర్టంలో ప్రస్తుతం 1,422 బీసీ హాస్టళ్లు (ఇందులో 1,102 బాలురకు, 320 బాలికలకు) నిర్వహిస్తున్నారు. ఇందులో 14 హాస్టళ్లు డీనోటిఫైడ్, సంచార తెగలకు కేటాయించారు.
 • 2011-12లో ఈ హాస్టళ్లలో మొత్తం 1,68,538 మందిని చేర్చుకున్నారు. వీరిలో 76 శాతం వెనుక బడిన తరగతులు, 10 శాతం షెడ్యూల్డ్ కులాలు, 5 శాతం షెడ్యూల్డ్ తెగలు, 3 శాతం మైనార్టీలు, 6 శాతం ఇతర కులాల వారు ఉన్నారు.
సాంఘిక సంక్షేమం:
 • 2011-12 నాటకి రాష్ర్టంలో మొత్తం 2,358 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 1640 బాలుర హాస్టళ్లు కాగా, 718 బాలికల హాస్టళ్లు.
 • ఈ హాస్టళ్లలో మొత్తం విద్యార్ధుల సంఖ్య 1.96 లక్షలు.
 • 2008-09 నుంచి ఈ హాస్టళ్లలో చదివే విద్యార్ధుల నెలవారీ మెస్ చార్జీలను (7వ తరగతి వరకు) రూ.338 నుంచి రూ.475 కు, 8 నుంచి 10వ తరగతి వరకు రూ.412 నుంచి రూ.535కు పెంచారు.
 • రాష్ర్టంలో 79 ఆనంద నిలయాలు పనిచేస్తున్నాయి. ఇందులో 50 శాతం సీట్లు అనాద విద్యార్ధులకు, మిగిలిన 50 శాతం అశుభ్ర వృత్తుల్లో పనిచేస్తున్న తల్లిదండ్రుల పిల్లలకు కేటాయించారు.
 • ఇందిరమ్మ పథకం కింది 2011, మార్చి నాటికి ఫేజ్-1 కింద 4,13,764 ఇండ్ల స్థలాలను, ఫేజ్-2 కింద 4,64,313 ఇండ్ల స్థలాలను పంపీణీ చేశారు. ఇక 2011 నవంబర్ నాటికి మూడవ ఫేజ్ కింద2,44,214 ఇండ్ల స్థలాలను ఇచ్చారు.
 • 2010-11 కాలంలో 6,03,151 షెడ్యూల్డ్ కులాల లబ్దిదారులకు ఆర్థిక సహాయం కింది రూ.1010.52 కోట్లను ఏపీఎస్‌సీఎఫ్‌సీ అందచేసింది. తర్వాత 2011 నవంబర్ వరకు 2,02,896 లబ్దిదారులకు రూ.283.93 కోట్లు ఇచ్చింది.
గిరిజన సంక్షేమం:
 • గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలో 1,41,099 గిరిజన విద్యార్థులతో 599 ఆశ్రమ పాఠశాలలను, 69,274 మందితో 442 హాస్టళ్లను, 90,289 మంది విద్యార్థులతో 3,060 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను, 22,861 ఎస్‌టీ విద్యార్థులతో 143 పోస్ట్ మెట్రిక్ పాఠశాలలను నడుపుతోంది. ఇందులో 81 శాతం మంది 2011,మార్చిలో జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
 • రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) కింద 19,66,658 ఎకరాలకు సంబంధించి 3,30479 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2011, సెప్టెంబర్ నాటికి 14,51,223 ఎకరాలకు సంబంధించి 1,67,797 పట్టాలను అందచేశారు.
 • మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌ల్లోని వివిధ పథకాలకు రూ.998.93 కోట్లు కేటాయించారు.
మైనార్టీల సంక్షేమం:
 • ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు మొదలైన మైనార్టీల్లోని బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేక పథకాలను చేపట్టింది. ఈ పథకాల కింద వివిధ బ్యాంకుల తోడ్పాటుతో వారికి సబ్సిడీలు, ఆర్థిక సాయం, గ్రాట్ ఇన్‌ఎయిడ్‌లను సమకూరుస్తోంది.
యువజన సర్వీసులు:
 • 2011-12లో రాష్ట్రంలో ‘రాజీవ్ యువశక్తి పథకం’ కింద 7667 మంది లబ్దిదారులకు రూ.53.66 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.23 కోట్లు సబ్సిడీగా, రూ.30.66 కోట్లు బ్యాంకు రుణంగా అందచేశారు.
 • 2010-11లో రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం కింద రాష్ట్ర యువజన సర్వీసుల విభాగం నిర్మాణ సంబంధ వృత్తుల్లో నైపుణ్యాల పెంపు శిక్షణ కార్యక్రమాలను నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ద్వారా చేపట్టింది.
హౌసింగ్ :
 • రాష్ర్టంలో బలహీన వర్గాల గృహనిర్మాణ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2011 మార్చి 31 వరకు 1,00,57,318 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో 92,42,451 ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోను, 8,14,867 ఇళ్లు పట్టణ ప్రాంతాల్లోను నిర్మించారు.
 • ఇక 2011 సెప్టెంబర్ వరకు ఈ పథకం కింద 2,21,972 ఇళ్లు నిర్మించారు. ఇందులో 2,06,492 ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లోను, 15,480 ఇళ్లు పట్టణ ప్రాంతాల్లోను నిర్మించారు.
గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం :
 • గ్రామీణ ప్రాంతాల్లోను, ఫ్లోరైడ్, సముద్రపునీరు (బ్రాకీష్ వాటర్) వల్ల కలుషితమైన ప్రాంతాల్లోను ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించి ,ఆ ప్రాంతాల్లో సరిపడా పరిశుభ్రమైన, రక్షిత తాగునీటిని అందించే వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2010-11లో రాష్ట్రంలో ఇటవంటి 6,971 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. వాటి పరిష్కారానికి రూ.790.03 కోట్లు ఖర్చు చేశారు.
టోటల్ శానిటేషన్ కాంపైన్ (పూర్తి పారిశుధ్య కార్యక్రమం):
 • ఈ పథకాన్ని రాష్ర్టంలోని 22 జిల్లాల్లో దశల వారిగా అమలు చేస్తునానరు. రాష్ట్ర పభుత్వం, లబ్దిదారులు, పంచాయతీలు లనుంచి మ్యాచింగ్ వాటాలను స్వీకరించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తుంది.
 • 2010-11లో ఈ పథకం కింద 6,56,048 లక్షల బీపీఎల్ కుటుంబాలకు మరుగు దొడ్లు, 3,961 పాఠశాల మరుగుదొడ్లు, 816 అంగన్‌వాడీ మరుగుదొడ్లు నిర్మించారు.
పట్టణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం :
 • పట్టణ స్థానిక సంస్థల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తలసరి నీటి సరఫరాను మెరుగుపరచేందుకు తగిన నీటి సరఫరా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
 • 2007 నంచి 2011 మధ్య కాలంలో 43 నీటి సరఫరా పథకాలకు రూ.919.63 కోట్లు ఖర్చు చేశారు. దీని ద్వారా అదనంగా రోజుకు 370.44 మిలియన్ లీటర్ల మంచి నీటి సరఫరాను పెంచగలిగారు. దీంతో 1,229.24 ఎంఎల్‌డీగా ఉన్న స్థాపిత సామర్ధ్యం 1599.68 ఎంఎల్‌డీలకు పెరిగింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ, ఔటర్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్టు:
 • హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం ద్వారా హైదరాబాద్‌కు వివిధ జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులు, ఎండీఆర్‌లతో సంధాన సదుపాయం ఏడ్పడుతుంది.
 • ఔటర్ రింగ్‌రోడ్డు కింద గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించే వీలుగల 8 లైన్‌ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం జరుగుతుంది. దీనికి అదనంగా ఇరువైపుల రెండు లైన్ల సర్వీసు రోడ్ల నిర్మాణం కూడా చేపడతారు. ఈ మొత్తం ప్రాజెక్టు మూడు దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో భాగంగా సర్వీసు రోడ్లు, గచ్చిబౌలీ వద్ద ఫ్లైఓవర్, ఇతర చిరు నిర్మాణాలు పూర్తయ్యాయి.
గ్రామీణాభివృద్ధి:
 • గ్రామీణాభివృద్ధి పథకాల కింద రాష్ట్రప్రభుత్వం వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, స్వయం సహాయక గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ)వాటి సంబంధిత కార్యక్రమాలు, ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ పథకాలు అమలు చేస్తోంది.
 • ప్రస్తుతం రాష్ట్రంలో 1098 మండల సమాఖ్యల్లోని 38,550 గ్రామీణ సంస్థల్లో 9,94,595 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,11,02,494 మంది స్వయం సహాయక సభ్యులు ఉన్నారు.
 • పై మండల సమాఖ్యలకు తోడు 262 మండల వికలాంగుల సంఘాలు, 17 చెంచు మండల సమాఖ్యలు, 7 మత్స్యకార మండల సమాఖ్యలు, 20 యానాది మండల సమాఖ్యలు రాష్ట్రంలో పని చేస్తున్నాయి.
 • రాష్ర్టంలోని స్వయం సహాయక సభ్యుల మొత్తం పొదుపు రూ.3383.10 కోట్లు, అలాగే కార్పస్ విలువ రూ.5070.51 కోట్లు. ఈ ప్రాజెక్టు కాలంలో 2011, సెప్టెంబర్ వరకు సమకూరిన సామాజిక మూలధనం రూ.1,73,841 కోట్లు.
 • ప్రతి నెలా 71,96,034 పింఛన్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010-11 కాలంలో 66,33,631 మంది పింఛనుదారులకు రూ.1922.18 కోట్లు పంపిణీ చేశారు.
 • ఇక 2011-12 కాలానికి పింఛన్ల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం రూ.1922.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1436.02 కోట్లు విడుదల చేశారు. 2011,నవంబర్ వరకు రూ.68,29,962 కోట్లు పించనుదార్లకు పంపిణీ చేశారు.
రిమోట్ అండ్ ఇంటీరియర్ ఏరియాస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (మారుమూల, లోతట్టు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం):
 • రాష్ట్రంలోని మారుమూల, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయటానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రిమోట్ అండ్ ఇంటీరియర్ ఏరియాస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఆర్‌ఐఏడీ)కు రూపకల్పన చేసింది.
బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ (బీఆర్‌జీఎఫ్):
 • ఈ పథకాన్ని డెవలప్‌మెంట్ గ్రాంటుగా లభించే రూ.376.77 కోట్లు, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా లభించే రూ.13 కోట్లు తో రాష్ర్టంలోని 13 జిల్లాల్లో అమలుచేస్తున్నారు.
 • 2010-11లో ఈ పథకం కింద 43,336 పనులకు రూ.520.31 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
రాజీవ్ పల్లెబాట:
 • రాజీవ్ పల్లెబాట కార్యక్రమం 2004లో ప్రారంభమైంది.
 • మొత్తం రాష్ట్రం నుంచి 54,541 ఫిర్యాదులు అందాయి. వీటిలో 98.02 శాతం ఫిర్యాదులకు రాష్ర్ట ప్రభుత్వం స్పందించిది.
 • మొత్తం మీద 1,195 ఫిర్యాదులకు హామీలు ఇచ్చారు. అందులో 1078 (90.38 శాతం) ఫిర్యాదులు పరిష్కరించారు. 107 (8.95 శాతం) ఫిర్యాదులు పరిష్కారం వివిధ దశల్లో ఉంది. 8 (0.67 శాతం) ఫిర్యాదులు పరిష్కరించాల్సి ఉంది.
రచ్చబండ:
 • ప్రజల సమస్యలను వారి వద్దకే వచ్చి పరిష్కరించే వినూత్న ప్రయోగమే ‘రచ్చబండ’ కార్యక్రమం.
 • ఈ పథకం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ట విశ్వాసం, నమ్మకం ఏర్పరిచి ప్రజల వద్దకే పాలన తీసుకురావాలన్నది ప్రభుత్వం ధ్యేయం.
 • మొదటి దశ రచ్చబండ కార్యక్రమం 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు రాష్ట్రంలోని 26,763 గ్రామ పంచాయతీలు/మున్సిపల్ వార్డుల్లోని 24,763 పంచాయతీలు/ మున్సిపల్ వార్డుల్లో (93 శాతం) జరిగింది.
 • రెండో దశ రచ్చబండ కార్యక్రమం 2011, నవంబర్‌లో జరిగింది. ఇందులో 20.73 లక్షల రేషన్ కార్డులు/కూపన్లు, 5.17 లక్షల పింఛన్లు పంపీణీ చేశారు. 3.07 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో అందిన అనేక తాజా దరఖాస్తులను పరిశీలించి దశల వారిగా పరిష్కరిస్తారు.
బీదరికం:
 • 2004-05 సంవత్సరానికి బీదరికంపై ప్రణాళికా సంఘం విడుదల చేసిన అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీదరికం నిష్పత్తి 15.8 శాతం. ఇందులో గ్రామీణ బీదరిక నిష్పత్తి 11.2 శాతం. పట్టణ బీదరిక నిష్పత్తి 28.0 శాతం.
 • ఇదే సమయంలో దేశ బీదరిక నిష్పత్తి 27.5 శాతం. గ్రామీణ పేదరిక నిష్పత్తి 28.3 శాతం, పట్టణ పేదరిక నిష్పత్తి 25.7 శాతం.
 • అయితే కాలం గడిచిన కొద్ది రాష్ట్ర, దేశ బీదరిక నిష్పత్తులు తగ్గుతూ వచ్చాయి.
ఉద్యోగ కల్పన:
 • 2011, మార్చి నాటికి రాష్ర్టంలోని సంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 20,867కు పెరిగింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు 13,814 కాగా ప్రైవేటు రంగ సంస్థలు 7,053.
 • 2011, మార్చి నాటికి సంఘటిత రంగంలో మొత్తం 20.59 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఇందులో ప్రభుత్వ రంగం 12,77 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగం 7.82 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది.
 • 2011-12 (సెప్టెంబర్ 2011 నాటికి) రాష్ట్రంలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ల్లో 1,44,553 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ కేంద్రాలకు 4,156 ఉద్యోగాలు నోటిఫై చేయగా 816 మందికి ఉద్యోగాలు లభించాయి.
 • 2011, సెప్టెంబర్ చివరి నాటికి ఎంప్లాయ్‌మెంట ఎక్స్చేంజ్‌ల లైవ్ రిజస్టర్లలో 18,33,231 మంది అభ్యర్ధులు నమోదై ఉన్నారు.
 • 1993-94 నుంచి 1999-2000 వరకు దేశ, రాష్ట్ర గ్రామీణ,పట్టణ నిరుద్యోగ రేట్లు పెరుగుతూ వచ్చాయి. అయితే 1999-2000 నుంచి 2005-05 వరకు రాష్ట్రంలో ఈ రేట్లు త గ్గాయి.
11వ పంచవర్ష ప్రణాళిక- సమీక్ష
 • 11వ ప్రణాళిక (2007-12) కాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 8.33 శాతానికి పెరిగి, దేశ జీడీపీ అంచనా రేటు 7.94 శాతాన్ని దాటి పోతుందని అంచనా.
 • వ్యవసాయ రంగం 10 వ ప్రణాళిక లాగ కాకుండా కోలుకుని ,11వ ప్రణాళిక కాలంలో 5.38 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా.
 • ఇదే కాలంలో పారిశ్రామిక రంగం 8.19 శాతం వృద్ధి రేటును, సేవల రంగం గతంలో వలే అరోగ్య కరమైన 9.62 శాతం వృద్ధి రేటును కొనసాగిస్తుంది.
12వ పంచవర్ష ప్రణాళిక- ఒక ముందడుగు:
 • ‘వేగవంతమైన, నిలకడైన, అదిక సమ్మిళిత వృద్ధి సాధన’ 12 వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం.
 • 12 వ ప్రణాళికలో రాష్ట్రం 10 శాతం వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 • అలాగే వ్యవసాయం రంగంలో 6 శాతం, పారిశ్రామిక రంగంలో 10.5 శాతం, సేవల రంగంలో 11.5 శాతం వృద్ధి రేట్లను లక్ష్యాలుగా నిర్దేశించుకుంది.
 • ఈ ప్రణాళికలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉద్యోగ కల్పన సాధించాలన్నది ప్రధాన లక్ష్యంగా ఉంది.
 • ఈ ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ, బీదరిక రేట్లను అదుపు చేసి వివిధ వ్యత్యాసాలను తగ్గించటానికి వీలవుతుంది.
Published on 3/29/2012 1:06:00 PM

Related Topics