తెలంగాణ బడ్జెట్ 2018-19


సమైక్య పాలన చివరి రెండేళ్లలో తెలంగాణ ప్రాంత జీఎస్‌డీపీ వృద్ధి రేటు (4.2 శాతం) దేశ సగటు (5.9 శాతం) కన్నా తక్కువగా ఉందని.. స్వపరిపాలనలో ఇప్పుడు 10.4 శాతం దిశగా దూసుకెళ్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
Current Affairs తెలంగాణకు ఉన్న వనరులు, అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగటం వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను ఈటల రాజేందర్ మార్చి 15న శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులతోపాటు వివిధ రంగాల్లో రాష్ట్ర పురోగతిని వివరించారు.
సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం రూ.1,74,453.83 కోట్ల బడ్జెట్‌లో ఏకంగా 26 శాతం నిధులను.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు(రూ.20,820 కోట్లు) కేటాయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్‌లో, యాసంగి పంటలకు నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ‘రైతు బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది.
2018-19 బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో)
మొత్తం బడ్జెట్ 1,74,453.83
ప్రగతి పద్దు 1,04,757.90
నిర్వహణ పద్దు 69,695.93
రెవెన్యూ ఆదాయం 1,30,975.11
రెవెన్యూ వ్యయం 1,25,454.70
రెవెన్యూ మిగులు 5,520.41
మొత్తం ఆదాయం
రాష్ట్రం సొంత పన్నులు 73,751.88
పన్నేతర ఆదాయం 8,973.92
కేంద్రం పన్నుల వాటా 19,207.43
కేంద్రం నుంచి గ్రాంట్లు 29,041.88
మొత్తం ఖర్చు
రెవెన్యూ వ్యయం 1,25,454.70
పెట్టుబడి వ్యయం 33,369.10
రుణాలు, అడ్వాన్సులు 9,035.56
పెట్టుబడులకు చెల్లింపులు 6,594.48
ద్రవ్య లోటు 29,077.07

Budget 18-19

రూ.1,80,238 కోట్లకు రాష్ట్ర అప్పులు

2018-19 ఆర్థిక సంవత్సరానికి అప్పుల మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇప్పటికే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.41,538 కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించింది. వెరసి మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టుల రుణ సమీకరణకు తెలంగాణ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ను ఇటీవలే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్‌కు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్పొరేషన్ల అప్పు అంతకంతకూ పెరిగిపోనుంది.
 • సాధారణంగా కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు కేంద్రం 3.50 శాతం వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23 వేల కోట్ల మేర అప్పు తీసుకున్న ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.29 వేల అప్పులు తీసుకోనుంది. అంతమేరకు జీఎస్‌డీపీలో 3.45 శాతం ద్రవ్యలోటును బడ్జెట్‌లో ప్రస్తావించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు జీఎస్‌డీపీలో 21.39 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన నాలుగేళ్లలో ఈ అప్పు అంతకంతకు పెరిగిపోయింది.
Download 2018-19 Budget Documents
Budget Speech_Telugu
Budget Speech_English
Budget in Brief
Budget Estimates
Annual Financial Statement
Detailed Estimates of Revenue & Receipts
Pragathi Paddu (Scheme Expenditure)
Scheduled Castes Special Develop Fund (SCSDF)
Scheduled Tribes Special Develop Fund (STSDF)
Statement of Demands for Grants

Budget 18-19
శాఖల వారీగా కేటాయింపులు
వ్యవసాయ రంగానికి రూ.15,511 కోట్లు
ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2017-18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018-19 ప్రగతి బడ్జెట్లో రూ.15,511 కోట్లు కేటాయించింది. ఇది ఏకంగా రూ.9,013 కోట్లు అదనం. అందులో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టబోయే ‘పెట్టుబడి’ పథకానికి రూ.12 వేల కోట్లు, రైతు బీమాకు రూ.500 కోట్లు కేటాయించారు.
 • ఇవిగాక వ్యవసాయ యాంత్రీకరణకు 2017-18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018-19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. ఈసారి వరినాటు యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు పంచేందుకు సర్కారు సన్నద్ధం కావడంతో ఈ మేరకు నిధులు కేటాయించారు.
 • పంటల బీమా పథకానికి గత బడ్జెట్లో రూ.343 కోట్లు కేటాయిస్తే, ఈసారి 500 కోట్లు కేటాయించారు. విత్తన సరఫరాకు గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.178 కోట్లు కేటాయించారు.
 • ఉద్యానశాఖకు 2017-18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించారు.
 • వ్యవసాయ మార్కెటింగ్‌కు 2017-18 బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో కేవలం రూ.122 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏకంగా రూ. 335 కోట్లు తగ్గించారు.

పెట్టుబడి పథకానికి ఇలా...

ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 72 లక్షల మంది రైతులకు 1.65 కోట్ల ఎకరాల భూమికి పెట్టుబడి పథకం కింద సీజన్‌కు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఏప్రిల్ 19 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తారు. రబీ సీజన్‌కు నవంబర్‌లో పెట్టుబడి సాయం అందజేస్తారు. చెక్కుల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారు. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేస్తారు. 1.65 కోట్ల ఎకరాలకు రైతులకు రూ. 6,600 కోట్లు అందజేస్తారు. ఇక మిగిలే రూ. 5,400 కోట్లు రబీలో రైతులకు ఇస్తారు. రబీలో పంట సాగు చేసే రైతులను గుర్తించి వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తారు.
రైతు బీమాకు రూ. 500 కోట్లు
కొత్తగా ప్రవేశపెడుతున్న రైతు బీమా పథకం కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. కొత్త పథకంలో.. అన్నదాతలు ఒకవేళ సాధారణ మరణం పొందినా, ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, కీలకమైన రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్లను మూలనిధి కింద విడుదల చేయడంతో బడ్జెట్‌లో కేటాయింపులేవీ చూపించలేదు.
ఇతర విభాగాలకు ఇవీ కేటాయింపులు (రూ. కోట్లలో)
 • పశుసంవర్థకశాఖ నిర్వహణ, ప్రగతి బడ్జెట్ - రూ.1,920
 • వ్యవసాయ యాంత్రీకరణకు - రూ.522
 • వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు - రూ.500
 • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు - రూ.775
 • విత్తన సరఫరాకు - రూ.178.68
 • రైతు వేదికల నిర్మాణానికి - రూ.158.94
 • గ్రీన్‌హౌస్, పాలీహౌస్‌ల నిర్మాణానికి - రూ.120
 • వెటర్నరీ వర్సిటీకి - రూ. 21.25
 • పంటల బీమాకు - రూ.210
 • సూక్ష్మసేద్యానికి - రూ.127
 • పొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి - రూ.105
 • రాష్ట్ర ఉద్యాన వర్సిటీకి - రూ.17.60
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.15,562 కోట్లు
బడ్జెట్‌లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. సాగునీటి శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం కల్పించింది. 2018-19 బడ్జెట్‌లో ఈ శాఖకు ఏకంగా రూ.15,562.84 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.12,776 కోట్లను ప్రగతి పద్దుగా, రూ.2,786.78 కోట్లను నిర్వహణ పద్దుగా పేర్కొన్నారు. అలాగే.. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవికాక ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల పేర్కొన్నారు.
ఆసరాకు రూ.5,388.89 కోట్లు
ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5,388.89 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో కొత్తగా ఒంటరి మహిళలకు పింఛన్‌ను ప్రకటించి.. ప్రస్తుతం అమలు చేస్తోంది. తాజాగా బడ్జెట్‌లో బోదకాలు వ్యాధి బాధితులకు ప్రతి నెల రూ.వెయి్య ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 41,78,291 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకు ఏటా సగటున రూ.5,300 కోట్లను ఖర్చు చేస్తోంది.
‘భగీరథ’కు రూ.1,803 కోట్లు
రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,803.35 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 పట్టణాలకు, 2,900 గ్రామాలు, 5,752 ఆవాసాలకు లబ్ధి చేకూరింది.
రాష్ట్రంలోని ప్రాంతాలను 26 సెగ్మెంట్లుగా విభజించి భగరీథ పనులు చేపడుతున్నారు. 67 ఇన్‌టెక్ వెల్స్, 153 వాటర్ ఫిల్టర్స్, 1,69,705 కిలోమీటర్ల పైపులైన్లు, 35,514 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు 80 శాతం రుణాల రూపంలోనే నిధులు సమకూరుతున్నాయి. మిగిలిన 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తోంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి రూ.3 వేల కోట్లను కేటాయించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు
ఏడాది కేటాయింపులు(రూ. కోట్లలో)
2014-15 13,761
2015-16 13,896
2016-17 14,262
2017-18 14,775
2018-19 15,562
సాగునీటికి రూ.25 వేల కోట్లు
సాగునీటి కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని రెండేళ్ల కింద సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు.. 2018-19 బడ్జెట్‌లోనూ రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.22,301.35 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,698.65 కోట్లు ఇచ్చారు.
ఈ ఏడాది కేటాయింపులు ఇవీ.. (రూ.కోట్లలో)
భారీ నీటిపారుదల - 21,890.87
చిన్న నీటిపారుదల - 2,743.65
ఆయకట్టు ప్రాంత అభివృద్ధి - 251
వరద నిర్వహణ - 114.48

Budget 18-19

రెండు ప్రాజెక్టులకు భారీగా..

ఈసారి సాగునీటి బడ్జెట్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.6,094 కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతోపాటు కార్పొరేషన్ ద్వారా రూ.9 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మొత్తంగా రూ.13 వేల కోట్ల మేర ఖర్చు చేశారు.
చిన్న నీటి వనరులకు రూ.2,415 కోట్లు
చిన్న నీటి వనరులకు గతేడాది రూ.2 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.2,415 కోట్లు ఇచ్చారు. ఇందులో మిషన్ కాకతీయకు రూ.1,500 కోట్లు కేటాయించారు. గతేడాది మిషన్ కాకతీయకు రూ.1,243 కోట్లు కేటాయించగా.. రూ.1,233 కోట్లకు సవరించారు. భూగర్భ జల వనరుల అభివృద్ధికి రూ.77.50 కోట్లు ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం కేంద్ర పథకాలైన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) నుంచి రూ.244 కోట్లు, సాగునీటి సత్వర ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద రూ.65 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపుల తీరు (రూ.కోట్లలో)
ప్రాజెక్టు 2017-18 2017-18 (సవరణ) 2018-19
కాళేశ్వరం 6,681.87 8,298.11 6,094.41
ప్రాణహిత 775.44 220 350
పాలమూరు 4,000 1,660.45 3,035.10
సీతారామ, 990 380 1,225,01
భక్తరామదాస డిండి 500 260 524.93
సాగర్ ఆధునీకరణ 488.17 488.17 197.30
ఎల్లంపల్లి 397.97 150 300
తుపాకులగూడెం 505 120 500
దేవాదుల 1,500 1,373.86 1,966.46
ఎస్‌ఎల్‌బీసీ 900 652.85 700
ఎస్సారెస్పీ-1 198.25 190 200
ఎస్సారెస్పీ-2 150 118.86 200
వరద కాల్వ 799.30 890.59 689.93
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.7,375 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు గత ఏడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో రూ.1,339 కోట్లు పెంచి, రూ.7,375.20 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల కోసం ప్రగతి పద్దు కింద రూ.3,852.49 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,522.71 కోట్లు కేటాయించారు. వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.
 • అమ్మ ఒడి (కేసీఆర్ కిట్) పథకానికి గత బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.560.50 కోట్లు కేటాయించారు.
 • గత బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.503.20 కోట్లు ఇవ్వగా, ఈ సారి రూ.699.44 కోట్లు కేటాయించారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య, వైద్య సేవల కోసం రూ.300 కోట్లు కేటాయించారు.

వైద్య, ఆరోగ్య శాఖ కేటాయింపులు ఇలా..
విభాగం 2015-16 2016-17 2017-18 2018-19
అర్బన్ హెల్త్ సర్వీసెస్ 2,013.22 2,301.93 2,304.32 2,747.65
అల్లోపతి 1895.95 2,211.53 2204.29 2635.30
ఔషధ వ్యవస్థలు 117.27 90.40 100.03 112.35
గ్రామీణ ఆరోగ్య 1641.90 2287.66 3517.21 3674.96
సేవలు అల్లోపతి 418.38 455.47 617.73 654.25
ఔషధ సేవలు 25.72 26.19 53.65 58.38
వైద్య విద్య, పరిశోధన 241.59 267.66 220.12 360.73
ప్రజారోగ్యం 261.24 290.17 456.40 532.78
జనరల్ 120.23 1.77 303.76 448.41
కుటుంబ సంక్షేమం 574.73 1246.40 1865.55 1620.41
మొత్తం 3655.12 4589.59 5821.53 6422.61
మహిళా, శిశు సంక్షేమానికి రూ.1,798.82 కోట్లు
మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 1,798.82 కోట్లు ఇచ్చింది. నిర్వహణ పద్దు కింద రూ. 859.43 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 939.39 కోట్లుగా పేర్కొంది.
 • ఈసారి బడ్జెట్‌లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థకు రూ. 70.14కోట్లు కేటాయించింది.
 • పౌష్టికాహార పథకాలకు రూ. 240.95 కోట్లు
 • సబల కార్యక్రమానికి రూ. 34.68 కోట్లు
 • ఆరోగ్యలక్ష్మికి రూ. 153.79 కోట్లు
విద్యాశాఖకు రూ.13,278 కోట్లు
2017-18 సంవత్సరంలో విద్యాశాఖకు ప్రభుత్వం రూ. 12,705.65.72 కోట్లు కేటాయించగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 13,278.19 కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన బడ్జెట్ (రూ. 12,635.54 కోట్లు) ప్రకారం చూస్తే ఈసారి రూ. 642.65 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి.

Budget 18-19
 • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన పథకాలకు గతేడాది రూ. 1,939.31 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్‌లో దాదాపు వెయ్యి కోట్లు అదనంగా రూ. 2,903.06 కోట్లు కేటాయించారు.
 • కేంద్ర పథకాలకు రూ.1,876 కోట్లు (సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద రూ.1,058 కోట్లు. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మధ్యాహ్న భోజనం, వయోజన విద్య, ఇతర విద్యా కార్యక్రమాల కింద రూ.818 కోట్లు).
 • గురుకులాలకు రూ.2,713.55 కోట్లు
కల్యాణ కానుకకు రూ.1,400 కోట్లు
పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.1,400 కోట్లు కేటాయించింది. దీంతో ఇప్పటివరకు రూ.వెయి్య కోట్ల లోపే ఉన్న బడ్జెట్ ఒక్కసారిగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ సాయం చేయాలన్న లక్ష్యంతో ఈ మేరకు నిధులు పెంచింది. ఈ పథకాల కింద బీసీలకు రూ. 700 కోట్లు, ఎస్సీలకు రూ. 400 కోట్లు, ఎస్టీలకు రూ. 150 కోట్లు, మైనార్టీలకు రూ. 150 కోట్లు కేటాయించింది.
పోలీసు విభాగానికి భారీ కేటాయింపులు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసిన ప్రభుత్వం హోంశాఖలో పోలీస్ విభాగానికి బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద రూ.1,389 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.975.95 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద ఈ ఏడాది రూ.4,400.68 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.3,852.21 కోట్లు కేటాయించింది.

‘హైదరాబాద్’కే అగ్ర తాంబూలం..
రాష్ట్ర పోలీస్ శాఖకు కేటాయించిన మొత్తం ప్రగతి బడ్జెట్‌లో రూ.574 కోట్లు హైదరాబాద్ నగర కమిషనరేట్ కోసమే కేటాయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి ఇందులో నుంచి రూ.280 కోట్లు కేటాయించారు. ఐటీ బ్యాక్‌బోన్ సపోర్ట్, సీక్రెట్ సర్వీస్ ఫండ్, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, రంజాన్, బక్రీద్, బతుకమ్మ, దసరా తదితర పండగల బందోబస్తుకు రూ.10 కోట్ల మేర నిధులు ఇచ్చారు.
 • స్టాఫ్ క్వార్టర్స్, కార్యాలయాలు, నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.40 కోట్లు ప్రగతి పద్దులో ప్రభుత్వం కేటాయించింది.
 • డీజీపీకి గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దానిని 98 శాతం పెంచుతూ రూ.604.86 కోట్లు కేటాయించింది.
 • కొత్త జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రగతి బడ్జెట్‌లో ఒక్కో జిల్లాకు రూ.20 కోట్ల చొప్పున రూ.400 కోట్లు కేటాయించింది.
బీసీ సంక్షేమానికి రూ.5,919.83 కోట్లు
వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమానికి 2017-18 వార్షిక బడ్జెట్‌లో రూ.5,,070.36 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2018-19 బడ్జెట్‌లో రూ.5,919.83 కోట్లు కేటాయించింది. వీటిని గురుకులాలు, కల్యాణలక్ష్మి, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కోసం ఖర్చు చేయనుంది. బీసీ సంక్షేమశాఖకు ప్రగతి పద్దు కింద రూ.5,690.04 కోట్లు, నిర్వహణ కింద రూ.229.78 కోట్లు ఇచ్చింది.
 • అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) సంక్షేమ కార్పొరేషన్‌కు గతేడాది రూ.వెయి్య కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించారు.
 • చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.1,200 కోట్లు కేటాయించారు.
 • బీసీ కార్పొరేషన్‌కు రూ. 5 కోట్లు, పెట్టుబడుల కింద రూ. 50 కోట్లు కేటాయించారు.
 • బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని రజక ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించింది. వడ్డెర ఫెడరేషన్‌కు రూ. 5.45 కోట్లు, క్రిష్ణబలిజ, పూసల ఫెడరేషన్‌కు రూ.5 కోట్లు, వాల్మీకి బోయ ఫెడరేషన్‌కు రూ.2.10 కోట్లు, భట్రాజ్ ఫెడరేషన్‌కు రూ.2 కోట్లు, మేదర ఫెడరేషన్‌కు రూ.3 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు, కుమ్మరి(శాలివాహన) ఫెడరేషన్‌కు రూ.8 కోట్లు, గీతకార్మిక ఫెడరేషన్‌కు రూ.10 కోట్లు చొప్పున కేటాయించింది.
మైనార్టీ సంక్షేమానికి 2 వేల కోట్లు
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,999.99 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.25.57 కోట్లు, ప్రగతి పద్దు కింద 1974.42 కోట్లు కేటాయించింది. 2017-18లో రూ. 1,249.66 కోట్లు ఇవ్వగా ఈసారి అదనంగా రూ.750 కోట్లు ఇచ్చారు. షాదీముబారక్ పథకానికి రూ.200 కోట్లు, ‘సీఎం విదేశీ విద్యానిధి’కి రూ.100 కోట్లు, దావత్ ఐ ఇఫ్తార్, క్రిస్మస్ ఫెస్ట్‌లకు 66 కోట్లు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణకు రూ.735 కోట్లుగా పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు రూ.26,145 కోట్లు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం అమల్లోకి తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)కి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.26,145.90 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.16,452.79 కోట్లు, ఎస్టీలకు రూ.9,693.11 కోట్లు చొప్పున ఖర్చు చేయనుంది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖలకు విడదీస్తూ శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. వ్యవసాయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు ఎక్కువగా నిధులిచ్చింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలున్నాయి. ఎస్సీ ఎస్‌డీఎఫ్‌లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రూ.2,551.67 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో రూ.2,800.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రోడ్లు భవనాల శాఖకు రూ.5,363 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.5,363 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద కేటాయించింది రూ.3,501 కోట్లు మాత్రమే. ఇది ఇంచుమించు గతేడాది బడ్జెట్ కేటాయింపులంతే ఉంది. జిల్లా రహదారులకు రూ.810 కోట్లు, గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.80 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లకు రూ.460 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.80 కోట్లు కేటాయించారు. కొత్త కలెక్టర్ భవనాలకు రూ.500 కోట్లు, ఎమ్మెల్యే భవనాలకు రూ.30 కోట్లు, కళాభారతి నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించారు.
గృహనిర్మాణ శాఖకు రూ.2,795.15 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు 2018-19 బడ్జెట్‌లో రూ.2,795.15 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.652.05 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.2,143.10 కోట్లుగా పేర్కొన్నారు.
 • ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడింది. ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు అవసరముండగా.. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,500 కోట్లే కేటాయించింది. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని ఈసారి మూడు రెట్లకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 9,522 ఇళ్లను పూర్తిచేసింది. 1,68,981 ఇళ్లు ఇంకా వివిధ స్థాయిలో ఉన్నాయి. హడ్కో నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకుని దాన్ని దశలవారీగా ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.1,143 కోట్లు మంజూరైనట్టు తాజా బడ్జెట్‌లో పేర్కొంది. పీఎంఏవై పట్టణ ఇళ్లకు రూ.766.50 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.376.60 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించింది.
పురపాలక శాఖకు రూ.4,680 కోట్లు
వచ్చే ఏడాది పురపాలికలకు జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. ప్రగతి పద్దు కింద పురపాలక శాఖకు 2017-18లో రూ.2,869.22 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ.4,680.09 కోట్లకు పెంచింది.
 • వరంగల్ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్ల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది.
 • పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.117.23 కోట్ల నుంచి రూ.755.20 కోట్లకు పెంచింది.
 • పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం అందించే టీయూఎఫ్‌ఐడీసీకి తొలిసారిగా రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది.
 • కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150 కోట్ల నుంచి రూ.89.39 కోట్లకు కేటాయింపులను తగ్గించి, అమృత్ పథకానికి రూ.203.96 కోట్ల నుంచి రూ.313.63 కోట్లకు పెంచింది. స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్ల కేటాయింపులను కొనసాగించింది.
 • ప్రగతి పద్దు కింద హైదరాబాద్‌లో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్ల కేటాయింపులను కొనసాగించి, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులను రూ.377.35 కోట్ల నుంచి రూ.566.02 కోట్లకు పెంచింది. హైదరాబాద్ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుకు తొలిసారిగా రూ.400 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ జలమండలికి రూ.1,420.50 కోట్ల రుణం, మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం, హెచ్‌ఎండీఏకు రూ.250 కోట్ల రుణం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణాల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది.
ఇతర శాఖలకు కేటాయింపులు
 • రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు పెంచింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.250 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లను కేటాయించింది. తొలిసారిగా భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లు, ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు చెరో రూ.50 కోట్లను కేటాయించింది.
 • గత బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయి్య కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.975 కోట్లు ఇచ్చింది. అయితే.. అసలు గతేడాదికి సంబంధించిన నిధులే ఇంకా రూ.600 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది.
 • యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని మిగతా ప్రధాన ఆలయాలనూ అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. భద్రాచలం, వేములవాడ, బాసర, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయించింది. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.100 కోట్లు, బాసర, ధర్మపురి దేవాలయాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. యాదాద్రికి బడ్జెట్‌లో రూ.250 కోట్లు ప్రతిపాదించారు.
 • 2017-18లో డిస్కంలకు ప్రభుత్వం రూ.4,484.30 కోట్ల విద్యుత్ సబ్సిడీ కేటాయిం చగా, 2018-19 బడ్జెట్‌లో రూ.5,650 కోట్లకు పెంచింది. అయినా, తీవ్ర నష్టాల నుంచి డిస్కంలు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను సర్దుబాటు చేసినా రూ.4320.98 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి.
Published on 3/17/2018 4:54:00 PM