తెలంగాణ బడ్జెట్ 2019-20


తెలంగాణలో పేదలు, రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న చిత్తశుద్ధిని మరోసారి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019-20 బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.
Budget 19అన్ని రంగాల్లో శీఘ్రగతి అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. 2019-20 ఆర్థిక ఏడాదికిగాను మిగిలిన కాలానికి రూ. 1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆయన శాసనసభలో సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారిగా శాసనమండలిలో 2019-20 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ స్వరూపం (రూ. కోట్లలో)
మొత్తం బడ్జెట్ 1,46,492.3
రెవెన్యూ రాబడి 1,13,099.92
పన్ను రాబడి 69,328
పన్నేతర రాబడి 15,875
రుణాలు 33,444.86
మూలధన వ్యయం 17,274.67
రెవెన్యూ మిగులు 2,044.08

రాక.. (రూ. కోట్లలో)
రెవెన్యూ రాబడులు 1,13,099.92
అప్పులు 32,900
రుణ వసూళ్లు 44.86
ప్రజా పద్దు 500

పోక.. (రూ. కోట్లలో)
రెవెన్యూ వ్యయం 1,11,055.84
మూలధన వ్యయం 17,274.67
రుణాల చెల్లింపు 9,265.77
రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులు 8,896.02
మిగులు ఖాతా 52.48
Budget 19
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు-కేటాయింపులు
 • రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు
 • పంట రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు
 • గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు
 • పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు
 • ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.1,336 కోట్లు
 • ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం
 • ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు
 • రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,137 కోట్లు
 • ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లు.
 • యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు రూ.50 కోట్లు
 • ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05 శాతం వృద్ధి రేటు సాధించాం.
 • 2018-19 నాటికి రూ. లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు.
 • రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు
 • రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు
 • కొత్త సచివాలయ నిర్మాణం కోసం రూ.కోటి
 • ఆర్టీసీకి రూ.500 కోట్లు
 • ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి రూ. 5,37,373 కోట్లు ఖర్చు
 • మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం.
 • వందలాది గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది.
 • వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు సాధించాం.
 • తీవ్రమైన ఆర్థిక మాంద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గింది.
 • రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం.
 • 6.3 శాతం అదనపు వృద్ధి రేటు సాధించాం.
 • బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని నిర్ణయం.
 • పరిమితులకు లోబడి నిధుల ఖర్చు.
 • ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ.9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది.
 • విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.
 • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ.31,802 కోట్లు మాత్రమే.
 • పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ. 450 కోట్లను కేంద్రం ఇవ్వలేదు
 • 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం
 • 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం
 • గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్య 142కు పెంచుకున్నాం
 • కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని.. 13కి పెంచుకున్నాం
 • రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం
 • పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ
 • కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం
 • పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం
 • పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి 717కి పెంచాం
 • పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం
 • కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తెచ్చాం
 • గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం
 • బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
 • రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
 • ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది
 • గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ
 • కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు
 • త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్
 • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే
 • ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది
 • దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది
 • వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి
 • రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది
 • దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది
 • తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు
 • కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది.
 • 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రెట్టింపయింది
 • రాష్ట్ర జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది
 • ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05శాతం వృద్ధిరేటు సాధించాం.
శాఖలు, రంగాలు, ముఖ్యపథకాలకు కేటాయింపులు
వ్యవసాయరంగం Budget 18-19
ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయరంగానికి మాత్రం గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.3,340 కోట్ల మేర పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్య శాఖల నిధులు పెరిగాయి. అయితే, సహకార రంగం కేటాయింపుల్లో మాత్రం సుమారు 15 కోట్ల మేర తగ్గించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 11.4 శాతం మేర ఉంది. ్యవసాయం, మార్కెటింగ్ రంగాలకు రూ.15,196 కోట్లు, సహకార రంగానికి రూ.92.66 కోట్లు, పశు సంవర్థక, మత్స్య శాఖలకు రూ.1,431.96 కోట్లు కేటాయించారు.

పథకాలకు ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధిస్తూ.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.1 వృద్ధిరేటును సాధించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంతో, 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుబీమాను యథాతథంగా కొనసాగిస్తూ.. బీమా ప్రీమియం కింద రూ.1,137 కోట్లు ప్రతిపాదించగా, 57 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. రూ.6 వేల కోట్ల పంటరుణాల మాఫీ ద్వారా 48 లక్షల మంది రైతులకు రుణవిముక్తి లభిస్తుంది.

వ్యవసాయ, అనుబంధ రంగాల కేటాయింపు (రూ. కోట్లలో)
రంగం 2018-19 2019-20
వ్యవసాయం 11,856.48 15,196.84
సహకారం 109.30 92.66
పశు, మత్స్య శాఖ 1066.88 1431.96

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం... Budget 18-19
ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్‌లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్‌‌స కమిషన్ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. 2018-19 బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్‌లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

2019-20లో ఇలా... (రూ. కోట్లలో)
పంచాయతీరాజ్ మొత్తం: 6,700.17
నిర్వహణ పద్దు 4,011.30
ప్రగతి పద్దు 2,688.87
గతేడాది 8,069.46
గ్రామీణా భివృద్ధికి : 8,424.72
నిర్వహణ పద్దు 59.97
ప్రగతి పద్దు 8,364.75
గతేడాది 6,131.00

విద్యాశాఖకు కేటాయింపులు Edu news
ఆర్థిక మాంద్యం దెబ్బ విద్యాశాఖపైనా పడింది. గతేడాది ప్రతిపాదిత అంచనాలతో పోల్చితే ఈసారి రూ.3,378.35 కోట్లకు కోత పెట్టగా, సవరించిన అంచనాలతో పోల్చితే రూ. 2,929.75 కోట్లకు కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ విద్యారంగం వాటా 7.6 శాతం ఉండగా, ఈసారి మాత్రం 6.75 శాతానికి విద్యారంగం బడ్జెట్ తగ్గిపోయింది. గతేడాది బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.13,278.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 12,823.57 కోట్లకు సవరించింది. ఈసారి రూ.1,46,492 కోట్ల మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.9,899.82 కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.8,209.03 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.1,367.88 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.322.91 కోట్లు కేటాయించింది.

ఇవీ విభాగాల వారీగా కేటాయింపులు..
పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తంలో పాఠశాలవిద్యకు రూ.7,781.5 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.24.62 కోట్లు, వయోజన విద్యకు రూ.22.76 కోట్లు, ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.51.35 కోట్లు, జవహర్ బాలభవన్ కు రూ.4.21 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.35.9 కోట్లు, రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.147.52 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటాయించింది. ప్రగతిపద్దులో రూ.693.3 కోట్లే కేటాయించడంతో పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు ఈ కేటాయింపులు సరిపోవని విశ్లేషకులు అంటున్నారు.
Budget 19

వైద్యానికి 3,705 కోట్లు
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య, ఆరోగ్యశాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు చేసింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.200 కోట్లను అదనంగా వడ్డించింది. 2018-19లో రూ.3,522 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,705 కోట్లను ప్రతిపాదించింది. ఆరోగ్యశ్రీ పథకానికి 2018-19లో రూ.530 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.720 కోట్లను పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు భారీగా కత్తెర పెట్టింది. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర కేంద్ర పథకాలకు గత బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా రూ.18 కోట్లను కుదించింది.

వైద్యశాఖలో ముఖ్య కేటాయింపులు ఇలా..
 • ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు నిరుడు కంటే అధికంగా నిధులు ఇచ్చారు. గతేడాది రూ.460 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.529 కోట్లకు పెంచారు.
 • వైద్యం, ప్రజారోగ్యానికి ఈ సారి రూ.340 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.ఐదు కోట్లు అధికం.
 • వైద్య విద్య, శిక్షణ, పరిశోధనకు రూ.111 కోట్లను ఇచ్చారు.
 • జాతీయ కుష్టు నివారణ పథకానికి రూ.2.32 కోట్లు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి రూ.2.52 కోట్లు, అంటువ్యాధి నియంత్రణ కార్యక్రమానికి రూ.6.29 లక్షలను కేటాయించారు.
 • కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను కోత పెట్టింది. 2018-19తో పోలిస్తే రూ.450 కోట్లు తగ్గించింది. గత బడ్జెట్‌లో రూ.1,216 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.766 కోట్లను మాత్రమే చూపింది. ఇందులో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు రూ.175.51 కోట్లు కేటాయించింది.
 • ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియోపతి విభాగాలకు రూ.19 కోట్లు ఇచ్చింది. గతేడాది పోలిస్తే రూ.18 లక్షలు మాత్రమే అధికంగా ఇచ్చింది.
 • ఔషధ నియంత్రణకు రూ.16.88 కోట్లను కేటాయించింది.

సాగునీటి రంగానికి కేటాయింపులు

ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కోత పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్‌లలో రూ.25 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఈసారి రూ.8,476.17 కోట్లకే పరిమితం చేసింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.3 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.3 కోట్లు కేటాయించింది.

బడ్జెట్ కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)
ఏడాది మొత్తం సవరణ
201516 11,733.93 10,933.57
201617 26,625.32 15,723.72
201718 25,000 12,994.27
201819 25,000 19,985.50
201920 8,476.17 -

విభాగాల వారీగా (రూ.కోట్లలో)
విభాగం గతేడాది ఈ ఏడాది
మేజర్ ఇరిగేషన్ 17,481.64 7,794.3
మైనర్ ఇరిగేషన్ 2,208.5 642.36
ఆయకట్టు అభివృద్ధి 195.36 29.06
వరద నిర్వహణ 100 10.45
మొత్తం 19,985.5 8,476.17

ప్రాజెక్టులకు కేటాయింపులు (రూ.కోట్లలో)
ప్రాజెక్టు 2018-19 (సవరణ తర్వాత) 2019-20
కాళేశ్వరం 4,351.38 1,080.18
పాలమూరు 2,179.58 500
సీతారామ 854.35 1324
ఇందిరమ్మ వరద కాల్వ 305.34 191.51
ఎస్సారెస్పీ-2 164.82 135.4
డిండి 1,091.61 90.87
ఎల్లంపల్లి 254.9 38.11
తుపాకులగూడెం 518.51 235.71
దేవాదుల 1,423.55 529.12
దిగువ పెన్‌గంగ 216.32 84.18
శనిగరం 81.9 52.6
ప్రాణహిత 292.25 17.31
కల్వకుర్తి 394 4
నెట్టెంపాడు 200 25
భీమా 170 25
కోయిల్‌సాగర్ 120 25
జూరాల 45 5
ఎస్సారెస్పీ-1 145.94 8.1
ఆర్డీఎస్ 144.5 27.5
లెండి 40 1
సింగూరు 50 7
అలీసాగర్, గుత్ఫ 1 2.1
ఎస్‌ఎల్‌బీసీ 534.04 3
కడెం 159.54 35.45
నల్లవాగు 10 5
కొమురం భీమ్ ప్రాజెక్టు 100 14.45
ఘణఫూర్ 40 34
నల్లవాగు 15 5
కౌలాస్‌నాలా 15 2
చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి 6 4.6
జగన్నాథపూర్ 50 14.12

పురపాలక శాఖకుకోత
పుర ఎన్నికలకు ముందు పురపాలక శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీ కోత పడింది. 2018-19 బడ్జెట్‌లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లను కేటాయించగా, 2019-20 వార్షిక బడ్జెట్‌లో రూ.1,791.94 కోట్లకు తగ్గించింది. నిర్వహణ పద్దును సైతం రూ.2,570.46 కోట్ల నుంచి రూ.1,262.21 కోట్లకు కుదించింది. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.755.20 కోట్ల నుంచి రూ.521.73 కోట్లకు తగ్గించింది.

14వ ఆర్థిక సంఘం కింద 2018-19లో ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా, తాజాగా రూ.1,036.98 కోట్లు కేటాయించడం ఊరట కల్పించే అంశమని చెప్పవచ్చు. అయితే, సవరించిన అంచనాల కింద గతేడాది రూ.777.73 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను పురపాలికలకు ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ అమృత్ పథకం కింద కేటాయింపులు రూ.403 కోట్ల నుంచి రూ.49.70 కోట్లకు తగ్గాయి. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం కోసం టీయూఎఫ్‌ఐడీసీకి కేటాయింపులను రూ.200 కోట్ల నుంచి రూ.25.94 కోట్లకు తగ్గించింది. కొత్తగా మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్ల నుంచి రూ.5.51 కోట్లకు తగ్గించింది.

బీసీలకు రిక్తహస్తం
వెనుకబడిన వర్గాలను తాజా బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. 2018-19 సంవత్సరంలో రూ.5,690.04 కోట్లుగా (బడ్జెట్ అంచనా) కేటాయించారు. వార్షిక సంవత్సరం చివరినాటికి సవరించిన అంచనాగా రూ.5,311.44 కోట్లు ఖరారు చేశారు. 2019-20 సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.4,528.01 కోట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.2,990.04 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే బీసీలకు కేటాయింపులు 43.70 శాతం తగ్గడం గమనార్హం.

ఎంబీసీ కార్పొరేషన్‌కు మొండిచెయి్య
అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మొండిచెయి్య చూపింది. 2017-18 సంవత్సరంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా... ఆ తర్వాత సంవత్సరం రూ.వెయి్య కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించగా... ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించింది.

పోలీసుశాఖకు రూ.4,788కోట్లు
పోలీసుశాఖ ప్రగతిపద్దు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. 2018-19లో రూ.1,143 కోట్లుగా ఉన్న ప్రగతిపద్దు 2019-20లో కేవలం రూ.167 కోట్లకే పరిమితమైంది. రూ.4,297 కోట్ల మేరకు ఉన్న నిర్వహణ వ్యయాన్ని ఈసారి రూ.4,788 కోట్లకు పెంచారు. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో రూ.500 కోట్లు అదనంగా కేటాయించారు.

డిస్కంలకు ధమాకా!
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను పెంచింది. 2017-18లో రూ.3,728.25 కోట్లను వ్యవసాయ విద్యుత్ రాయితీలకు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.5,984 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్ మిల్లులకు విద్యుత్ రాయితీలను రూ.35 కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచింది. దీంతో మొత్తం విద్యుత్ రాయితీలు రూ.6,079 కోట్లకు పెరిగాయి. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు ఈసారి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. నిర్వహణ పద్దు కింద ఇంధన శాఖకు కేటాయింపులను రూ.622.86 కోట్ల నుంచి రూ.204.45 కోట్లకు తగ్గించింది. గతేడాది విద్యుత్ ప్రాజెక్టులకు రూ.598.24 కోట్ల రుణాలు కేటాయించగా, ఈసారి రూ.197.02 కోట్లకు తగ్గించింది.

ఐటీ, పారిశ్రామిక రంగాలకు కోత
ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో పారిశ్రామిక, ఐటీ రంగాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక రంగానికి ఏకంగా రూ.740.12 కోట్ల మేర కేటాయింపులు తగ్గిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. గతేడాది పారిశ్రామిక రంగానికి ప్రగతి పద్దు కింద రూ.904.19 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.172.28 కోట్లతో సరిపుచ్చారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.210.78 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.21.55 కోట్లతో సరిపెట్టారు.

కల్యాణలక్ష్మికి రూ.1,540 కోట్లు Budget 18-19
తాజా బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల కేటాయింపుల్లో ఎలాంటి కోత పడలేదు. నాలుగు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలకు 2018-19 వార్షిక సంవత్సరంలో రూ.1,450.46 కోట్లు కేటాయించారు. 2019-20 వార్షిక సంవత్సరంలో కూడా ఇదే మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. షాదీ ముబారక్ పథకం కింద మాత్రం అదనంగా రూ.89.99 కోట్లు కేటాయించింది.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కేటాయింపులు (రూ.కోట్లలో)
సంక్షేమశాఖ 2018-19 2019-20
బీసీ 700.00 700.00
ఎస్సీ 400.46 400.46
ఎస్టీ 150.00 150.00
మైనార్టీ 200.00 289.99
మొత్తం 1,450.46 1,540.45

‘ఇంటి’కి ఇబ్బందులే...
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో మరింత జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ప్రగతి పద్దుతో పోలిస్తే.. ఈసారి పగ్రతి పద్దులు పదింతలు తగ్గిపోయాయి. దీంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2018-19 బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.2,795.14 కేటాయించగా 2019-20లో కేవలం రూ.977.68 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏ శాఖకై నా ప్రగతి పద్దులు చాలా కీలకం. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.2,143.14 కోట్లు కేటాయించగా, ఈసారి వాటిని రూ.280 కోట్లకు కుదించారు. వాస్తవానికి ప్రభుత్వం 2,72,763 ఇళ్లకు ఆమోదం తెలిపింది.

బియ్యం సబ్సిడీకి రూ.1432 కోట్లు
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 1432.40 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ. 1,718.33 కోట్లు కాగా ఈసారి నిధుల్లో రూ. 285.93 కోట్ల కోత పడింది.

మహిళా, శిశు సంక్షేమ నిధులకు కోత
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కేటాయించే నిధుల్లో ప్రభుత్వం కోత విధించింది. 2019-20 వార్షిక సంవత్సరానికిగాను ఈ శాఖకు ప్రభుత్వం రూ. 663.80 కోట్లు కేటాయించింది. 2018-19 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనా రూ. 773.18 కోట్లు ఉండగా, ప్రస్తుత వార్షిక సంవత్సరంలో మహిళా, శిశు సంక్షేమ నిధులకు రూ. 110 కోట్లు కోత పడింది. ఈ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రానున్నాయి. అయితే వీటి కేటాయింపులకు తగినట్లుగా రాష్ట్ర సర్కారు వాటాను కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మైనార్టీ నిధులకు కోత
సాక్షి, హైదరాబాద్: 2019-20 వార్షిక సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖకు సర్కారు రూ. 1346.95 కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 1857.30 కోట్లు కేటాయింపులు జరిపిన ప్రభుత్వం మైనార్టీ నిధులకు ఈసారి దాదాపు రూ. 511 కోట్లు కోత పెట్టింది. మైనార్టీ శాఖకు కేంద్రం నుంచి వివిధ పద్దుల్లో నిధులు విడుదలవుతాయి.

ఎస్‌డీఎఫ్‌కు రూ.19,585.08 కోట్లు
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రత్యేక అభివృద్ధి నిధికి (ఎస్‌డీఎఫ్) భారీ కోత పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్ కింద రూ.19,585.08 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.12,400.22 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,184.86 కోట్ల చొప్పున కేటాయించింది. 2018-19 వార్షిక సంవత్సరం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద రూ.26,145.9 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో రూ.6,560.82 కోట్లు కోత పడింది.

రాష్ట్ర అప్పులు రూ.2.03 లక్షల కోట్లు..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.58,202 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంతంటే.. 2,03,730 కోట్లు. తలసరి అప్పు తెలుసుకోవడమెలా అంటే... రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పును రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి అప్పు. ఏటేటా అప్పులు పెరుగుతుండటం గమనార్హం. ఆయా కార్పొరేషన్ల అప్పులకు భారీగా గ్యారంటీలు ఇస్తోంది. గ్యారంటీల రూపంలోనే రూ. 77,314 కోట్లు ఇచ్చింది. మూలధనం వ్యయంలో తగ్గుదల కూడా ఆందోళనకరంగా ఉంది. జీఎస్‌డీపీలో 21% అప్పులు ఉన్నాయి. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదించిన మొత్తం బడ్జెట్‌లో 10 శాతం నిధులు అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోనుంది. ఈ మేరకు 2019-20 బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయపట్టికలో రూ.14,574.73 కోట్లు వడ్డీ చెల్లింపుల కిందే చూపెట్టారు.
Published on 9/11/2019 2:28:00 PM

Related Topics