ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు-2019 రాత పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచిన వారి స‌క్సెస్ స్టోరీలు..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన వారి మనోగతాలు ఇలా..
అన్ని అంశాలను అర్థం చేసుకుని రాయడం వల్లే... Education News
ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని సచివాలయ పరీక్షల్లో కష్టపడి చదివాను. అవగాహన మేరకు అన్ని అంశాలను అర్థం చేసుకుని రాయడం వల్లే విజయం వరించింది. సచివాలయ పోస్టుల్లో కేటగిరీ–1కు సంబంధించిన పోస్టుల పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్‌ సాధించడం పట్ల చాలా సంతోషిస్తున్నాను.
- జి.అనితమ్మ,కేటగిరీ–1లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్, అనంతపురం జిల్లా

కష్టపడి చదివి ర్యాంకు సాధించా... Education News
కష్టపడి చదవడం వల్లే తాను ర్యాంకులు సాధించానని గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాల్లో రెండు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన దొడ్డా వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సెప్టెంబర్‌ 20న ఆయన మీడియాతో మాట్లాడారు. తనది పెద్దారవీడు మండలంలోని మద్దిలకట్ట గ్రామమని.. మొదటి నుంచి తాను చదువుల్లో ప్రతిభావంతుడైన విద్యార్థినని చెప్పారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్‌గా, దూరవిద్యా విధానంలో నాలుగు పీజీలు చేశానని వివరించారు. పోటీ పరీక్షల కోసం హైదరాబాద్, మార్కాపురంలలో శిక్షణ కూడా తీసుకున్నానన్నారు. పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌లో ఐదో ర్యాంకు, ఉమ్మడి ఏపీలో నిర్వహించిన డీఎస్సీలో రంగారెడ్డి జిల్లాలో 21వ ర్యాంకు సాధించానని తెలిపారు. ఏపీటెట్, పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడనయ్యానని పేర్కొన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కర్నూలు జిల్లా శ్రీశైలంలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నానన్నారు. తన తండ్రి రామసుబ్బారెడ్డి, చెల్లెలు విజయలక్ష్మి, బావ చెన్నారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, తన అన్న నాగ మల్లికార్జునరెడ్డి ఏపీపీఎస్సీలో ఏఎస్‌వోగా పనిచేస్తున్నారని తెలిపారు. తన తండ్రి, అన్న స్ఫూర్తిగా కష్టపడి చదివి సచివాలయ పరీక్షల్లో ర్యాంకులు సాధించానని వివరించారు.
- దొడ్డా వెంకటరామిరెడ్డి ,

సీఎంకు కృతజ్ఞతలు Education News
నాకు ఇప్పటికే చిన్నచిన్న ఉద్యోగాలు చాలా వచ్చాయి. వ్యవసాయానికి సంబంధించిన ఉద్యోగం చేయాలన్నదే నా లక్ష్యం. అందు కోసమే ఇన్నేళ్లు వేచి చూశా. ముఖ్యమంత్రి గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసి నా లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
- నల్లమిల్లి సురేష్, అగ్రికల్చర్ అసిస్టెంట్ మొదటి స్థానం

వ్యవసాయం లాభసాటి అయ్యేలా చేస్తా... Education News
గామ సచివాలయంలో విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ ఉద్యోగానికి జరిగిన పోటీపరీక్షలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సును గత ఏడాది పూర్తి చేశా. గ్రామ సచివాలయంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతా. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారేలా నా వంతు కృషి చేస్తా.
- పొన్నాడ జ్యోతిర్మయి (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ స్టేట్ టాపర్)

వ్యాన్ డ్రైవర్ కుమారుడికి రెండు స్టేట్ ర్యాంకులు Education News
విశాఖ జిల్లా సీతంపేటకు చెందిన సవ్వాన గోపీకృష్ణ 2016లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గ్రామ సచివాలయ పరీక్షలో కేటగిరీ-2 గ్రూప్-బిలో 118.75 మార్కులు సాధించి స్టేట్ మూడో ర్యాంక్, కేటగిరీ-3లో 93.25 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. గోపీకృష్ణ తండ్రి కనకమురళి వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

పలాస యువకుడికి అత్యుత్తమ ర్యాంకు Education News
శ్రీకాకుళం జిల్లా పెసరపాడు గ్రామానికి చెందిన సంపతిరావు దిలీప్ గ్రామ సచివాలయ పరీక్షలో కేటగిరీ-2 గ్రూప్-2ఏలో 120.50 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. అతడి తల్లి ఈశ్వరమ్మ, తండ్రి కూర్మయ్య వ్యవసాయం చేస్తున్నారు. దిలీప్ విశాఖపట్నంలో చైతన్య కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు.

కర్నూలు జిల్లా యువకుడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ Education News
గామ/వార్డు సచివాలయ పరీక్షలో కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన యువకుడు ఉపేంద్రం సాయికుమార్ రాజు మొదటి ర్యాంక్ సాధించాడు. సత్యనారాయణ, వెంకటలక్ష్మీ దంపతుల కుమారుడు సాయికుమార్ రాజు కేటగిరీ-2లో(వీఆర్వో, సర్వే అసిస్టెంట్) 122.5 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. సాయికుమార్ పదో తరగతి అనంతపురం జిల్లా తాడిపత్రిలో, ఇంటర్మీడియెట్ కర్నూలులోని నారాయణ జూనియర్ కాలేజ్‌లో, బీటెక్ (సివిల్) నంద్యాల శాంతిరామ్ కళాశాలలో పూర్తి చేశాడు.

ఎలాంటి కోచింగూ తీసుకోలేదు: Education News
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు వి.సాయిరామన్ ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటి వద్దనే సన్నద్ధమై వార్డు ప్లానింగ్ ఆండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ(గ్రేడ్-2) విభాగంలో స్టేట్ ఫస్టు ర్యాంకు సొంతం చేసుకున్నాడు. సాయిరామన్ పదో తరగతి వరకు వీటీపీఎస్‌లోని డీఏవీ స్కూల్‌లో చదివాడు. ఇంటర్ నారాయణ కళాశాలలో చదివాడు. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ అభ్యసించాడు.

ప్రతిభ చాటిన ప్రకాశం జిల్లా అభ్యర్థులు
Education News కేటగిరీ-3లో ఏఎన్‌ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్ష గ్రేడ్-3లో సంతనూతలపాడు మండలం ఎం.వేములపాడుకు చెందిన దాసరి భాగ్యలక్ష్మి స్టేట్ టాపర్‌గా నిలిచారు. భాగ్యలక్ష్మి స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం సంతనూతలపాడు మండలం వేములపాడు పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్:
Career Guidance నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్న మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో వీఆర్‌వో, సర్వేయర్ విభాగంలో 109 మార్కులతో కృష్ణా జిల్లాలో ప్రథమం సాధించిన పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన ఆళ్ల రాజశేఖరరెడ్డి తెలిపారు. తన తండ్రి శ్రీనివాసరెడ్డి మృతి చెంది పదేళ్లు అయి్యందని, తల్లి కృష్ణకుమారి కష్టపడి చదివించిందని చెప్పారు.

ప్రజలకు సేవ చేస్తా...
Career Guidance ఇంజనీర్ కావాలన్నది నా లక్ష్యం. పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టు రాత పరీక్షలో 114.75 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాను. ప్రజలకు చేతనైనంత సేవ చేసేందుకు కృషి చేస్తాను. వ్యవసాయం చేస్తూ మా నాన్న నన్ను చదివించాడు. ఉద్యోగం పొందడంతో ఇప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు.
- పొట్టేళ్ల సురేష్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కష్టానికి తగిన ఫలితం :
Career Guidance పోటీ పరీక్షల్లో రాణించాలన్న లక్ష్యంతో పలు అంశాలకు సంబంధించిన విషయాలపై నిరంతరం అభ్యసనం చేస్తూ కష్టపడ్డాను. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో సచివాలయ ఉద్యోగం సాధించాలన్న ధ్యేయంతో పరీక్షలకు సిద్ధపడుతూ వచ్చాను. నేను పడిన కష్టానికి ఫలితంగా కేటగిరీ-2 విభాగంలో 117.5 మార్కులతో జిల్లాలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించగలిగాను. ఈ స్థాయిలో రాణించడానికి కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది.
- సనక సూరిబాబు, గుంటూరు జిల్లా టాప్ ర్యాంకర్

దర్జీ కుమార్తె టాప్ ర్యాంకర్ :
Career Guidance గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి లక్షలాది మంది రాసిన పరీక్షల్లో నెల్లూరు నగర్‌కి చెందిన ఓ సాధారణ దర్జీ కుమార్తె లక్ష్మీ మౌనిక కేటగిరీ-1లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించి నెల్లూరు జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఏసీ నగర్‌కు చెందిన బొద్దుకూరి చంద్రమోహన్- చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మీ మౌనిక ఇటీవల తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. తండ్రి చంద్రమోహన్ ట్రంక్ రోడ్డులోని రిట్జ్ టైలర్ షాపులో దర్జీగా పనిచేస్తున్నాడు. చంద్రమోహన్ సంపాదనతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక ఇటీవల గ్రామ వార్డు సచివాలయాలకు జరిగిన పరీక్షలకు ప్రిపేర్ అయి్యంది. కేటగిరీ-1లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఉద్యోగం వస్తున్నందున ఇప్పుడు తన తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపింది.

సీఎం చలువతో ..తమ లాంటి అర్హులకు ఉద్యోగాలు వస్తున్నాయ్..
Career Guidance
గ్రామ సచివాలయ పరీక్షల్లో మత్స్యశాఖ సహాయకుల ఉద్యోగ విభాగంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లికి చెందిన గాలిదేవర సురేష్ 97.25 మార్కులు సాధించి జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. సురేష్ తండ్రి జీవీ.కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి భద్రకాళీ మాణిక్యాంబ గృహిణి. తండ్రి ప్రోత్సాహం, ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు సురేష్ తెలిపాడు. సురేష్ ముమ్మిడివరం ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్య, అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నెల్లూరు జిల్లా ముత్కూరు కాలేజీ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎంఎఫ్‌ఎస్‌సీ పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు రాశాడు. సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో తమ లాంటి అర్హులకు ఉద్యోగాలు వస్తున్నాయని సురేష్ ఆనందం వ్యక్తం చేశాడు.
Published on 9/21/2019 10:52:00 AM

సంబంధిత అంశాలు