‘సచివాలయ’ కొలువుల విజయానికి వ్యూహాలు...

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టింది. రాష్ర్టంలో సంక్షేమ పాలన సాకారం చేసేందుకు తాజాగా 1,26,728కొలువుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇదో గొప్ప అవకాశం. గ్రామీణ, పట్టణ స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి. వీటితో పాటు ఆయా ఉద్యోగాలను బట్టి ప్రత్యేక అంశాలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలో విభాగాల వారీ ఖాళీలు, అర్హతలు, ముఖ్య తేదీలు, జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ముఖ్య విభాగాల సన్నద్ధతకు సూచనలు...
Career Guidanceఉద్యోగాల వారీ ఖాళీల వివరాలు...
మొత్తం పోస్టులు:
1,26,728

గ్రామీణం: పోస్టు - ఖాళీలు...
 1. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-5): 7040
 2. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్-2): 2880
 3. ఏఎన్‌ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు)-గ్రేడ్3: 13,540
 4. యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్: 9886
 5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్: 794
 6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్: 4000
 7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్-2): 6714
 8. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్స్: 400
 9. మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్/వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ (మహిళలు): 14,944
 10. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2): 11,158
 11. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (డిజిటల్ అసిస్టెంట్): 11,158
 12. విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3: 11,158
 13. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 11,158

పట్టణం: పోస్టు - ఖాళీలు...
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 3307
వార్డు అమెనిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2): 3601
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2): 3648
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 3786
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2): 3770
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2): 3786

అర్హతలు: పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-5), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. అదే విధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్-2)కు పదో తర గతి ఉత్తీర్ణత, ఏదైనా ఐటీఐ నుంచి సర్వేయింగ్ ఓ సబ్జెక్టుగా రెండేళ్ల డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) కోర్సు ఉత్తీర్ణత. ఇదే ట్రేడ్‌లో ఉన్నత అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 • వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2)కు సెన్సైస్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ఏదైనా డిగ్రీ.
వయసు: 2019, జూలై 1 నాటికి 18-42 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.400 (అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.200); ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు రూ.200 చెల్లించనవసరం లేదు.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 10, 2019. ఊ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 1, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://vsws.ap.gov.in

జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ :
ఇది అభ్యర్థుల తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం. ఇందులోని ప్రశ్నలు వివిధ సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించగల నేర్పును పరీక్షించేవిగా ఉంటాయి. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్-ఆర్డర్, సిరీస్, అరేంజ్‌మెంట్స్, డెరైక్షన్స్-డిస్టెన్సెస్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. కోడింగ్-డీకోడింగ్ కోసం ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ విభాగాల సన్నద్ధతకు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డీఐ :
 • సర్కారీ కొలువు సొంతం కావాలంటే ఈ విభాగంలో మంచి స్కోరు చేయడం తప్పనిసరి. ఇందులో పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్; సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్; సింప్లిఫికేషన్స్, కేలండర్, క్లాక్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగాప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలను గుర్తుంచుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్ ప్రశ్నలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు.
 • డేటా ఇంటర్‌ప్రిటేషన్.. పట్టికలు, గ్రాఫ్‌లు తదితరాల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే విభాగం. ఇందులోని ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించాలంటే పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన ఉండాలి. క్యూఏ, డీఐ విభాగాల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదు.

జనరల్ ఇంగ్లిష్; కాంప్రెహెన్షన్ :
 • ప్రస్తుతం దాదాపు అన్ని పరీక్షల్లోనూ జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంటోంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్; స్పాటింగ్ ది ఎర్రర్స్; ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్; డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జనరల్ ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలంటే తొలుత బేసిక్ గ్రామర్ అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వ్యాయిస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తదితర ముఖ్యాంశాలపై దృష్టిసారించాలి. వొకాబ్యులరీపై పట్టు సాధించడం వల్ల కాంప్రెహెన్షన్ విభాగానికి కూడా ఉపయోగపడుతుంది.
 • తెలుగు, ఇంగ్లిష్ ప్యాసేజ్‌లు, వాటి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి.

బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ :
ప్రస్తుతం పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యకలాపాలూ కంప్యూటర్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థికి ఉన్న ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షించేందుకు ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. కంప్యూటర్ అబ్రివేషన్స్, షార్ట్‌కట్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్; బేసిక్ కంప్యూటర్ కాన్సెప్ట్స్, టెర్మినాలజీ; కంప్యూటర్ లాంగ్వేజెస్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ విభాగం అనుకూలమని చెప్పొచ్చు.

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు..
 • కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది.
 • ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న ముఖ్యాంశాలపై దృష్టిసారించాలి. అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు, వార్తల్లో ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు-ప్రాజెక్టులు, పర్యావరణం-జీవవైవిధ్యం, అంతర్జాతీయ సంబంధాలు, సదస్సులు-వేదికలు ఇలా వివిధ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • శాస్త్రసాంకేతిక రంగంలో అంతరిక్షం, రక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి; ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి.
 • అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెసే, ఆస్కార్, భారత రత్న, పద్మ పురస్కారాలు ముఖ్యమైనవి. సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డులపైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్ట్టిసారించాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్, గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలు-విజేతలు, రికార్డులు, మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి.

జనరల్ సైన్స్ :
జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. శరీర అవయవాలు- పనితీరు- వ్యాధులు; విటమిన్లు, రక్త వర్గీకరణ, హార్మోన్లు, సూక్ష్మ జీవులు తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అంతేకాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితమైన ప్రశ్నలూ వస్తాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అందుబాటులోకి వచ్చిన టీకాలు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తాయి. విద్యుత్, ఉష్ణం, ధ్వని, కాంతి, పరమాణు భౌతిక శాస్త్రం తదితరాలకు సంబంధించిన అనువర్తనాలపై దృష్టిసారించాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి నిత్య జీవితంలో మనిషి వినియోగించే పలు రసాయనాలు, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక, మూలకాలపై దృష్టిసారించాలి.
 • బిగ్‌డేటా, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ తదితర ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను తెలుసుకోవాలి.

పర్యావరణం :
అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సమస్యలు - కారణాలు- వీటి నివారణకు ఐక్యరాజ్య సమితితోపాటు వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలపై దృష్టిసారించాలి. మన దేశంలోనూ పర్యావరణ కాలుష్య నివారణ చట్టాలు రూపొందించారు. ఉదాహరణకు జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం- 1974. ఇలాంటి చట్టాల పరిధిలో ఏర్పాటు చేసిన నియంత్రణ సంస్థలు, వాటి విధులు గురించి తెలుసుకోవాలి. ఆయా చట్టాలు, చర్యలు, వాటి ప్రాథమిక ఉద్దేశం, వాటిని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలపై అవగాహన ఏర్పరచుకోవాలి. రాష్ట్రాల స్థాయిలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండళ్లు, వాటి నియామకాలకు సంబంధించిన వివరాలు గురించి అధ్యయనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాయు కాలుష్యం- అందుకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలపై ప్రాథమిక అవగాహన ముఖ్యం. పర్యావరణ కాలుష్య నివారణలోనే ‘వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్)’ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్, రీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి ఆధారంగా ఉన్న బేసిక్ సైన్స్ అంశాలపైనా ప్రాథమిక పరిజ్ఞానం సొంతం చేసుకోవడం ముఖ్యం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాలు..
 • అందరికీ విద్య.. అందరికీ ఆరోగ్యం.. అందరికీ సంక్షేమం.. అందరికీ అభ్యున్నతి.. ఇవీ.. ప్రస్తుత ప్రభుత్వ ఆశయాలు.. వీటి సాధనకు పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వివిధ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వైఎస్‌ఆర్ రైతు భరోసా,వైఎస్‌ఆర్ వడ్డీలేని రుణాలు, వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, వైఎస్‌ఆర్ ఆసరా, వైఎస్‌ఆర్ చేయూత, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్ గృహ వసతి, జగనన్న అమ్మ ఒడి తదితర పథకాల గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా నవరత్నాలపై అవగాహన అవసరం.
 • రైతు సంక్షేమం, మత్స్యకారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, పరిశ్రమలు; గ్రామ/వార్డు సచివాలయాలు, మౌలిక వసతులు-అభివృద్ధి, ఎస్‌హెచ్‌జీ మహిళలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ, పౌర సరఫరాలు, సంక్షేమ పెన్షన్లు తదితర విభాగాల్లోని ముఖ్య పథకాలు/విధానాలు/కార్యక్రమాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

ప్రిపరేషన్ టిప్స్..
 • రాష్ర్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రభుత్వ విధానాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చు. ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 • 2019-20కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్; సామాజిక, ఆర్థిక సర్వే (2018-19)లోని ముఖ్యాంశాలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి. బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆర్థిక శాఖామంత్రి చేసిన ప్రసంగంలోని కీలక అంశాలను చదవాలి.
 • ప్రిపరేషన్ సమయంలో ముఖ్యాంశాలను క్లుప్తంగా ప్రత్యేక నోట్స్‌లో రాసుకోవాలి. ఇది చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
 • పరీక్షకు ముందు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల తప్పులను సరిదిద్దుకొని, ఆపై ఆత్మస్థైర్యంతో వాస్తవ పరీక్షను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది.
 • ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పరీక్షలు రాస్తున్నవారికి తాజా ప్రకటనలతో మరింత లబ్ధి చేకూరనుంది. వీరికి సగం సన్నద్ధత పూర్తయినట్లే.
 • ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను సేకరించి, విధిగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పడుతుంది.
- బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల నిపుణులు.
Published on 7/30/2019 11:38:00 AM

సంబంధిత అంశాలు