Sakshi education logo

ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో... తెలుగులో కూడా ఫిర్యాదుల స్వీకరణ!

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుచేసిన ‘గ్రీవెన్సెస్ రీడ్రసెల్ సిస్టమ్’అందుబాటులోకి వచ్చింది.
Education Newsవిద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను (http://bigrs.telangana.gov.in/) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జనవరి 7 (మంగళవారం) న ప్రారంభించారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ను రూపొందించింది. వారం రోజుల్లో తెలుగులోనూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. సెలవుల నుంచి మొదలుకొని పరీక్ష ఫీజు చెల్లింపు, స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్, హాల్‌టికెట్లు, మెమోలు, ఫలితాలు, వాటిల్లో దొర్లే పొరపాట్లు తదితర 36 రకాల ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వాటితో పాటు ఇతర సమస్యలపైనా ఫిర్యాదు చేసేలా, పేపరుపై సమస్య రాసి అప్‌లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా విద్యార్థులు బోర్డుకు రాకుండా తాము ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేసి పరిష్కారం పొందేలా చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల పరిష్కారానికి గడువు విధించింది. సమస్య పరిష్కారమైనదీ లేనిదీ విద్యార్థికి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రిఫరెన్స్ నంబరును (విద్యార్థి మొబైల్ నంబరుకు పంపనుంది) ఇవ్వనుంది. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు రెండు మూడు రోజుల్లో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వెబ్‌సైట్‌లో విద్యార్థి తన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయి ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థి తన ఫిర్యాదును అధికారులు పరిష్కరించలేదని భావిస్తే మళ్లీ ఆన్‌లైన్‌లోనే రెయిజ్ చేసే అవకాశాన్ని కల్పించింది. విద్యార్థి చేసే ఫిర్యాదు కేటగిరీ ఆధారంగా ఆ ఫిర్యాదు సంబంధిత అధికారులకు, విభాగానికి వెళ్తుంది. సంబంధిత అధికారులు దానిని పరిష్కరించి ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తారు. ఆ సమాచారం విద్యార్థి మొబైల్‌కు వెళ్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, జీమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు: సీఎస్
వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, అందులో ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. సీఎస్ స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వం విద్యార్థుల విషయంలో ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. గతేడాది తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, బోర్డు అధికారులు పాల్గొన్నారు.
Published on 1/8/2020 1:16:00 PM

సంబంధిత అంశాలు