నాణ్యమైన విద్యకు కేరాఫ్.. జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీలు). కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీబీఎస్ఈ సిలబస్‌తో పూర్తిగా ఉచిత విద్యను అందించడం నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు.. విద్యను అందించే నవోదయాల్లో ప్రవేశానికి ఏటా జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక (జేఎన్వీఎస్టీ) పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్వీఎస్టీ 2020కి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, ముఖ్య తేదీల వివరాలు...
లక్ష్యాలు:
- సంస్కృతి, విలువలు, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందిస్తూ నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం.
- గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. హిందీ, ఇంగ్లిష్, తెలుగు(స్థానిక భాష) మూడు భాషలపై చెప్పుకోదగ్గ స్థాయిలో పట్టుసాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం.
- జాతీయ సమైక్యతను పెంపొందించడం.
- ప్రతి జిల్లాలోని నవోదయ విద్యాలయాన్ని నాణ్యమైన విద్య, ఉన్నత విలువలుగల విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం.
ఆరో తరగతిలో ప్రవేశాలకు వివరాలు...
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు(జేఎన్వీఎస్టీ)ను నిర్వహిస్తారు. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. ఏపీ, తెలంగాణల్లో తొలిదశలో జరగనుంది.
అర్హతలు: ప్రవేశం కోరే జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. విద్యార్థి 15.09.2019లోపు ఐదో తరగతిలోకి ప్రమోట్ కాకపోతే.. దరఖాస్తుకు అనర్హులు. విద్యార్థి చదువుతున్న జిల్లాలోని నవోదయ విద్యాలయం లో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండుసార్లు హాజరయ్యేందుకు వీల్లేదు.
వయసు: మే 1, 2007- ఏప్రిల్ 30, 2011 మధ్య జన్మించిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
సీట్ల కేటాయింపు: జిల్లాలోని 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించిన సీట్ల కోసం.. ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో 3,4,5 తరగతులు పూర్తిగా చదివుండాలి. మూడు, నాలుగు, ఐదు తరగతుల్లో ఒక్క రోజు పట్టణ ప్రాంత పాఠశాలలో చదివినా..సదరు విద్యార్థులను అర్బన్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిసాయి. మొత్తం సీట్లలో బాలికలకు 1/3వంతు సీట్లు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: జేఎన్వీఎస్టీ-2020.. 80 ప్రశ్నలు-100 మార్కులకు జరుగుతుంది. పరీక్షను ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. రెండు గంటల పాటు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.
విభాగం |
ప్రశ్నల సంఖ్య |
మార్కులు |
సమయం |
మెంటల్ ఎబిలిటీ |
40 |
50 |
60 నిమిషాలు |
అర్థమెటిక్ |
20 |
25 |
30 నిమిషాలు |
లాంగ్వేజ్ |
20 |
25 |
30 నిమిషాలు |
మొత్తం |
80 |
100 |
రెండు గంటలు |
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2019.
హాల్ టిక్కెట్ల జారీ ప్రారంభం: డిసెంబర్ 1, 2019.
పరీక్ష తేదీ(తొలి దశ): జనవరి 11, 2020.
ఫలితాల వెల్లడి: మార్చి, 2020.
పూర్తి వివరాలకు వెబ్సైట్: nvsadmissionclasssix.in