Sakshi education logo

మా విద్యార్థులకు 25% సీట్లివ్వాలి

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయింది.
Edu newsఆసక్తి కలిగిన విద్యాసంస్థలు ఆగస్టు 20 నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి యూనివర్సిటీల ఏర్పాటుకు అమలు చేయనున్న మార్గదర్శకాలతో నోటిఫికేషన్‌ను (జీవో నెంబరు 26) జారీ చేశారు. జూలై 15వ తేదీన ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఆగస్టు 20న యూనివర్సిటీల ఏర్పాటుకు అనుసరించాల్సిన నిబంధనలను (తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) రూల్స్-2019) జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆసక్తి కలిగిన విద్యాసంస్థలు రూ.50వేలను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్ www.tsche.ac.in డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఏర్పాటుచేసే యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 25% సీట్లు కచ్చితంగా కేటాయించాల్సిందేనని నిబంధనల్లో పొందుపరిచింది. ఆసక్తి కనబరుస్తున్న సంస్థల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రారంభించేలా అనుమతులు జారీచేయనుంది.

ఇవీ ప్రధాన నిబంధనలు...
 • ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ నుంచి రూ.50 వేలు చెల్లించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే సంస్థలు యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను విద్యాశాఖ కార్యదర్శికి అందజేయాలి. రూ.10లక్షలను నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద చెల్లించాలి.
 • హెచ్‌ఎండీఏ పరిధిలో యూనివర్సిటీని ఏర్పాటుచేయాలనుకుంటే.. అయితే కనీసంగా 20 ఎకరాలు, మిగతా ప్రాంతాల్లో అయితే కనీసంగా 30 ఎకరాలు సొసైటీ పేరుతో రిజిస్టర్ అయి ఉండాలి.
 • పరిపాలన భవనం కనీసంగా 1,000 చదరపు మీటర్లు, లైబ్రరీ, లెక్చర్ హాల్, లేబొరేటరీలతో కూడిన అకడమిక్ భవనాలు రూ.10వేల చదరపు మీటర్లు (దాదాపుగా రెండున్నర ఎకరాలు) ఉండాలి.
 • యూనివర్సిటీ ఏర్పాటు చేసే సమయంలో రూ.10 కోట్లు కార్పస్ ఫండ్‌గా వెచ్చించాలి. అలాగే భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన, క్యాంపస్ అభివృద్ధి కోసం రూ.30 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద చూపించాలి.
 • డీపీఆర్‌తోపాటు సంస్థల ప్రతిపాదలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీకి ఎక్స్-అఫిషియో చైర్‌పర్సన్‌గా విద్యాశాఖ కార్యదర్శి, సభ్యులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల వైస్ ఛాన్‌‌సలర్లు, మరో ఇద్దరు (కమిటీ ఎంపిక చేసేవారు) ఉంటారు. కళాశాల విద్యా కమిషనర్ ఈ నిపుణుల కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థ స్థితిగతులను కమిటీ పరిశీలిస్తుంది. ఆ సంస్థకున్న పేరు ప్రఖ్యాతులు, విద్యారంగంలో అనుభవాన్ని పరిశీలిస్తుంది. సంప్రదాయ కోర్సులే కాకుండా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆఫర్ చేయబోయే కోర్సుల రూపకల్పనను పరిశీలిస్తుంది. ప్రతిపాదనలు అందిన 60రోజుల్లో నిపుణుల కమిటీ తమ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాలి.
 • నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 30రోజుల్లో ఆమోదించడమా? రిజెక్టు చేయడమా? మార్పులు కోరడమా? అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’రూపంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఆ సంస్థకు తెలియజేస్తుంది.
 • నిపుణుల కమిటీ, ప్రభుత్వం ఏమైనా మార్పులను సూచిస్తే వాటిని ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పొందిన 6నెలల్లో చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అవసరమైతే మరో ఏడాది గడువును పొండగించవచ్చు. లోపాల సవరణ నివేదిక వచ్చాక నెల రోజుల్లో నిపుణుల కమిటీ వాటిని పరిశీలిస్తుంది. ఆ నివేదిక వచ్చాక అన్ని సరిగ్గా ఉంటే చట్టంలోని నిర్దేశిత షెడ్యూలులో యూనివర్సిటీ పేరును చేర్చుతుంది.
 • యూనివర్సిటీ చాన్‌‌సలర్ నియామకం కోసం దరఖాస్తులను స్వీకరించాలి. దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల గడువు ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులు అన్నింటిని సెర్చ్ కమిటీ ముందుంచాలి. సెర్చ్ కమిటీ సూచించే ముగ్గురి పేర్లలో ఒకరిని ఆ సంస్థ యూనివర్సిటీ చాన్‌‌సలర్‌గా నియమిస్తుంది.
 • చాన్‌‌సలర్‌ను నియమించాక వర్సిటీ తమ మొదటి నివేదికను 90 రోజుల్లోగా అందజేయాలి. వైస్-చాన్‌‌సలర్‌ను నియమించాక 60 రోజుల్లో ఆర్డినెన్‌‌సను జారీ చేయాలి.
 • తెలంగాణలో కనీసంగా రెండేళ్లు చదివిన రాష్ట్ర విద్యార్థులకు యూనివర్సిటీ ప్రవేశాల్లో, అన్ని కోర్సుల్లో 25% సీట్లను కేటాయించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణలో రెండేళ్లు పని చేసి ఉన్నా వారి పిల్లలను రాష్ట్ర విద్యార్థులుగా పరిగణనలోకి తీసుకోవాలి.
 • యాక్ట్‌లో వర్సిటీ పేరు చేర్చాక నెల రోజుల్లోగా ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ఫండ్ ప్రాజెక్టు వ్యయంలో 1% లేదా రూ.10 కోట్లు వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తంతో ఫండ్ ఏర్పాటుచేయాలి. నిర్దేశిత బ్యాంకులో దానిని యూనివర్సిటీ పేరు, కళాశాల విద్యా కమిషనర్ పేరుతో జాయింట్ అకౌంట్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. అనుమతి లేకుండా ఆ ఫండ్‌ను వినియోగించడానికి వీల్లేదు. ఆర్థిక సంవత్సర పూర్తయ్యాక 6నెలల్లోగా వార్షిక నివేదిక ఇవ్వాలి.
 • సొసైటీని రద్దు చేయాలనుకుంటే అడ్మినిస్ట్రేటర్‌ను నియమిస్తారు. అడ్మినిస్ట్రేటర్ నేతృత్వంలో కోర్సులు పూర్తయి.. విద్యార్థులకు డిగ్రీలు అందజేసే వరకు యూనివర్సిటీ కొనసాగుతుంది. ప్రభుత్వం యూనివర్సిటీని చట్టం ద్వారా రద్దు చేయవచ్చు.
Published on 8/21/2019 4:13:00 PM

సంబంధిత అంశాలు