Sakshi education logo

స్టడీ అబ్రాడ్ జర్మనీ

Join our Community

facebook Twitter Youtube
స్టడీ అబ్రాడ్ అనగానే మన విద్యార్థులకు వెంటనే గుర్తొచ్చే దేశాలుఅమెరికా, బ్రిటన్! కానీ, గత మూడేళ్లుగా మరో దేశం బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.. అదే జర్మనీ!! యూఎస్, యూకేలతో పోల్చితే జర్మనీలో ఫీజులు తక్కువ.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు ఎక్కువ. అంతేకాదు.. ఆ దేశంలో ప్రస్తుతం స్టెమ్ నిపుణుల కొరత కారణంగా ఉద్యోగ అవకాశాలు సైతం అందుకునే వీలుంది. అందుకే గత మూడేళ్లుగా జర్మనీకి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా 12 నుంచి 14 శాతం మేర పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీలో విద్య, ప్రవేశాలు, ప్రత్యేకతలు, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల గురించి తెలుసుకుందాం...
Career Guidance అమెరికాలో చదవాలంటే.. సంవత్సరానికి దాదాపు రూ.30 లక్షల వ్యయం! యూకేలో చదవాలన్నా.. అంతకంటే కాస్త ఎక్కువే ఖర్చు చేయాలి!! కానీ, జర్మనీలో ట్యూషన్ ఫీజు మహా అయితే అయిదు వందల యూరోల నుంచి వెయ్యి యూరోల లోపే ఉంటుంది. నివాస వ్యయమూ తక్కువే. మరోవైపు ఆ దేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో నిపుణుల కొరత నెలకొంది. దాంతో విదేశీ విద్యార్థులకు సైతం అక్కడ ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులకు జర్మనీలో విద్యాభ్యాసంపై ఆసక్తి పెరుగుతోంది.

స్టెమ్ కోర్సులకు ప్రాధాన్యం:
 • జర్మనీలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల పరంగా భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. జర్మనీలో స్టెమ్ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. అక్కడియూనివర్సిటీల్లో చేరుతున్న భారత విద్యార్థుల్లో 80 శాతం మేర స్టెమ్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఎకనామిక్స్, లా, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్ కోర్సులు నిలుస్తున్నాయి.

రీసెర్చ్‌కు కేరాఫ్ :
వాస్తవానికి జర్మనీకి రీసెర్చ్‌కు కేరాఫ్ అనే పేరుంది. అక్కడ బ్యాచిలర్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో అకడమిక్ దశ నుంచే విద్యార్థులు పరిశోధనల్లో పాల్గొనేందుకు అవకాశముంది. దీంతో ఆ దేశంలో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవడుతున్నాయి. అధిక శాతం జర్మనీ యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కొలాబరేటెడ్ రీసెర్చ్, ఇండివిడ్యువల్ రీసెర్చ్ (ఫ్యాకల్టీ సభ్యులు సొంతంగా చేసే రీసెర్చ్) యాక్టివిటీస్‌లో పాల్పంచుకునే అవకాశం లభిస్తోంది. అందుకే మన విద్యార్థులు అధికంగా సైన్స్, అప్లయిడ్ సెన్సైస్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటున్నారు.

ప్రవేశాలు :
జర్మనీ యూనివర్సిటీలు వింటర్, సమ్మర్ సెమిస్టర్ల పేరుతో ఏటా రెండుసార్లు ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. వింటర్ సెషన్ సెప్టెంబర్/అక్టోబర్‌లో; సమ్మర్ సెషన్ మార్చి/ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ఔత్సాహిక విద్యార్థులు ఏడాది ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించడం మేలు. ఫలితంగా విశ్వవిద్యాలయాల అన్వేషణ, అర్హత నిబంధనలు, దరఖాస్తు చేసుకోవడం, వీసా దరఖాస్తు, మంజూరు వంటి వాటికి సమయం సరిపోతుంది.

చదువుతూనే పని :
జర్మనీ యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థులు చదువుతూనే పనిచేసుకునే వీలుంది. వారానికి 20 గంటల పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయొచ్చు. దీనికోసం ముందుగా యూనివర్సిటీ, ఇమిగ్రేషన్ అధికారుల అనుమతి పొందాలి. ఆ పార్ట్‌టైమ్ జాబ్ ప్రొఫైల్ విద్యార్థుల అకడమిక్ నేపథ్యానికి సంబంధించిందైతే.. సులువుగా అనుమతి లభిస్తుంది. తద్వారా నెలకు 200 యూరోల వరకూ సంపాదించుకునే అవకాశముంది.

పోస్ట్ స్టడీ వర్క్ :
జర్మనీలో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు సైతం పుష్కలమని చెప్పొచ్చు. అక్కడి ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం పీజీ స్థాయి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు 18 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే సదరు ఎంప్లాయర్ ద్వారా వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఈయూ బ్లూకార్డ్ విధానం మేరకు.. గుర్తింపు పొందిన సంస్థలో ఉద్యోగం లభించి, వర్క్ పర్మిట్ పొందితే పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం కూడా తేలికవుతుంది. బ్లూ కార్డ్ విధానం మేరకు 43 వేలకు పైగా యూరోల జీతం ఉంటే సులువుగా పర్మనెంట్ రెసిడెన్సీ లభిస్తుంది. గత మూడేళ్లుగా ఇంజనీరింగ్, ఐటీ విభాగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. సెమీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు సగటున నెలకు మూడు వేల యూరోల వేతనం లభిస్తోంది.

ఆర్థికంగా వెసులుబాటు :
జర్మనీలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉచిత విద్యా విధానం అమలవుతోంది. దాంతో ఈ యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ కింద 200 నుంచి 500 యూరోల మధ్యలో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల ఫీజులతో పోల్చితే ఇదేమంత పెద్ద విషయం కాదనే చెప్పొచ్చు. ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రం.. మాస్టర్ కోర్సులకు ఏడాదికి 15 వేల యూరోల నుంచి 30 వేల యూరోల వరకు ట్యూషన్ ఫీజును నిర్ణయించాయి. అకడమిక్‌గా మంచి ట్రాక్ రికార్డ్.. స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ బాగుంటే పబ్లిక్ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. తద్వారా ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నివాస వ్యయానికి నెలకు 800 యూరోల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది.

టాప్ యూనివర్సిటీలకు నెలవు :
నాణ్యత ప్రమాణాల పరంగా జర్మనీ టాప్ యూనివర్సిటీలకు నెలవని చెప్పొచ్చు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఏఆర్‌డబ్ల్యూయూ ర్యాంకింగ్స్‌లో జర్మనీ యూనివర్సిటీలు టాప్-10, 50, 100లో నిలవడమే ఇందుకు నిదర్శనం.

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2019 ప్రకారం జర్మనీలోని టాప్-10 యూనివర్సిటీలు..
 1. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్ (టీయూఎం).
 2. లడ్‌విగ్-మ్యాక్సీమిలియన్ యూనివర్సిటీ.
 3. రుప్రెచ్ కార్ల్స్ యూనివర్సిటీ.
 4. కార్ల్స్‌రుహె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
 5. హంబోల్ట్ యూనివర్సిటీ.
 6. ఫ్రేయి యూనివర్సిటీ.
 7. ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆషెన్ యూనివర్సిటీ.
 8. టెక్నిన్సే యూనివర్సిటీ.
 9. ఎబెర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ.
 10. ఆల్బర్ట్ లడ్‌విగ్స్ యూనివర్సిటీ.

జర్మన్ లాంగ్వేజ్ నైపుణ్యం :
పబ్లిక్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు జర్మన్ లాంగ్వేజ్ నైపుణ్యం పొందడం తప్పనిసరి. టెస్ట్ డీఏఎఫ్, టెస్ట్ డీఏఎఫ్4 పేరుతో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ టెస్ట్‌లు, వాటికి సంబంధించి భారత్‌లో శిక్షణ కేంద్రాల వివరాల కోసం www.testdaf.de వెబ్‌సైట్ చూడొచ్చు.

స్కాలర్‌షిప్ సదుపాయాలు :
 • జర్మనీలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డాడ్ (DAAD) స్కాలర్‌షిప్‌లను పేర్కొనొచ్చు. ఈ స్కాలర్‌షిప్ విధానం ప్రకారం విద్యార్థులకు రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి.
 • న్యాయ విద్యలో మాస్టర్ కోర్సుల విద్యార్థులకు జవహర్‌లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్-డాక్టర్ ఏంజెలా మెర్కెల్ స్కాలర్‌షిప్ స్కీమ్ అందుబాటులో ఉంది.
 • కనీసం ఏడాది వ్యవధి ఉన్న మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన విద్యార్థులకు కోఫి అన్నన్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ పేరుతో స్కాలర్‌షిప్ సదుపాయం అందుబాటులో ఉంది.

పెరుగుతున్న విద్యార్థులు..
జర్మనీలో లభిస్తున్న విద్య, ఆ తర్వాత లభిస్తున్న పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల నేపథ్యంలో ఏటా జర్మనీ వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.

గత అయిదేళ్ల వ్యవధిలో జర్మనీలో ప్రవేశించిన భారత విద్యార్థుల గణాంకాలు

సంవత్సరం

భారత విద్యార్థులు

2013-14

9,495

2014-15

10,500

2015-16

13,537

2016-17

15,261

2017-18

17,570


డాక్యుమెంట్లు, టెస్ట్‌ల స్కోర్ల వివరాలు..
జర్మనీలో ఉన్నతవిద్యకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్టంగా కొన్ని డాక్యుమెంట్లు, స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లు, అదే విధంగా వీసా కోసం అందుబాటులో ఉంచుకోవాల్సిన పత్రాలు...
 • అకడమిక్ సర్టిఫికెట్లు
 • రికమండేషన్ లెటర్
 • లెటర్ ఆఫ్ మోటివేషన్ (స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌నే లెటర్ ఆఫ్ మోటివేషన్‌గా పిలుస్తారు).
 • రెజ్యుమె
 • నిర్ణీత స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు

వీసా ఇలా..
జర్మనీ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ కన్ఫర్మేషన్ పొందిన విద్యార్థులు దాని ఆధారంగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీసా జారీకి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది.

వీసా దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు:
 1. ప్రవేశ ధ్రువీకరణ పత్రం.
 2. అకడమిక్ సర్టిఫికెట్లు
 3. ఆర్థిక ధ్రువీకరణ పత్రాలు.
 4. స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్.
Published on 3/6/2019 5:16:00 PM

సంబంధిత అంశాలు