Sakshi education logo

Advertisement

గేట్- 2019 విజయానికి వ్యూహాలు...

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఉన్నత విద్య పరంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిచయం అక్కర్లేని పరీక్ష.
Education News ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ-బెంగళూరు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో మాస్టర్స్, డెరైక్ట్ డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుకల్పిస్తుంది. తాజాగా గేట్-2019 తేదీలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసేందుకు అర్హతలు, గేట్‌లో విజయానికి వ్యూహాలపై ఫోకస్..

దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో గేట్ ఒకటి. ఏటా ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరవుతారు. అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్ విభాగాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో చేరి, ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గేట్ మంచి మార్గం. అంతేకాదు.. ప్రభుత్వ రంగ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న హోదా కలిగిన కంపెనీలు.. కీలకమైన ఉద్యోగాలను గేట్ స్కోరుతో భర్తీ చేస్తున్నాయి.

దరఖాస్తుకు అర్హతలు...
  • ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
  • ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
  • నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్).
  • సైన్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ / తత్సమాన విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ.
  • ఇంజనీరింగ్/టెక్నాలజీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ (పోస్ట్ బీఎస్సీ).
  • ఇంజనీరింగ్/టెక్నాలజీలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ.
  • అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ/ఎంఎస్సీ. (లేదా) తత్సమాన అర్హతలు ఉన్నవారు గేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నిబంధనల మేరకు కోర్సులో చివరి సంవత్సరం లేదా ఇతర సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం :
  1. గేట్-2019ను 24 సబ్జెక్టుల్లో 2019, ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది. అన్ని పేపర్లకూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది.
  2. గేట్ పరీక్ష విధానం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించిన పేపర్లతో పాటు ఇంజనీరింగ్ సైన్స్, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టు పేపర్లు కూడా ఉంటాయి.
  3. పరీక్షలో మొత్తం 65 ప్రశ్నలుంటాయి. వీటికి 100 మార్కులు కేటాయిస్తారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
  4. తప్పనిసరి విభాగమైన జనరల్ ఆప్టిట్యూడ్ (జీఏ) నుంచి 10 ప్రశ్నలు, 15 మార్కులకు ఉంటాయి. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి 55 ప్రశ్నలు (కొన్ని పేపర్లకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది) 85 మార్కులకు ఉంటాయి.

సన్నద్ధత..
  • గేట్ వంటి పరీక్షల్లో సత్తా చాటాలంటే ప్రణాళిక ప్రకారం దీర్ఘకాలిక ప్రిపరేషన్ అవసరం. కాబట్టి ఇప్పటి నుంచే పరీక్షకు సన్నద్ధతను ప్రారంభించాలి. ప్రిపరేషన్‌లో భాగంగా మొదట సిలబస్‌ను క్షుణ్నంగా విశ్లేషించాలి. ఇంజనీరింగ్‌లో చదివిన సిలబస్ మొత్తం గేట్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడదు. ఎంపిక చేసిన సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి వాటిపై దృష్టిసారించాలి.
  • ఫైనలియర్ విద్యార్థులు ఒకవైపు అకడమిక్‌గా ప్రాజెక్టువర్క్‌లు, పరీక్షలు, అసైన్‌మెంట్లకు సయయం కేటాయిస్తూనే గేట్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలి. శిక్షణకు వెళ్లేవారు ఉదయం 8 గంటల లోపు క్లాసులు విని తర్వాత కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. వీరు సాయంత్రం ఇంటికి వచ్చాక కనీసం 3 గంటలు గేట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
  • గేట్ సిలబస్‌ను అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అప్లికేషన్ అప్రోచ్‌తో సాగితే.. ఇటు అకడమిక్స్‌గా.. అటు గేట్ ఎగ్జామ్‌లోనూ రాణించడానికి వీలుంటుంది. గేట్ స్కోరుకు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.
  • గేట్‌లో ప్రశ్నలు నేరుగా కాకుండా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉంటాయి. అందువల్ల తొలుత బేసిక్స్‌పై పట్టు సాధించాలి. వాటికి సంబంధించిన ఫార్ములాలను అనువర్తిస్తూ సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలైతే వాటిని వివిధ కోణాల్లో స్పృశిస్తూ సమాధానాలు రాబట్టడం ప్రాక్టీస్ చేయాలి.

ప్రిపరేషన్ టిప్స్...
  • సమస్య పరిష్కార విధానంలో షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవడం ముఖ్యం. దీనివల్ల తక్కువ సమయంలో, కచ్చితమైన సమాధానాలు రాబట్టొచ్చు.
  • కోచింగ్ తప్పనిసరి కాకపోయినా సరైన గెడైన్స్, సందేహాల నివృత్తికి శిక్షణ ఉపయోగపడుతుంది. శిక్షణ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు మాక్‌టెస్ట్‌లు నిర్వహిస్తుండటం, సబ్జెక్టు నిపుణులు ఉండటం వల్ల ప్రిపరేషన్ సులువు అవుతుంది.
  • జనవరి 1 నాటికి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని రివిజన్, ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవాలి.
  • గేట్ అకడమిక్‌గా అత్యున్నత స్థాయి పరీక్ష కాబట్టి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలు, సరైన మెటీరియల్‌ను ఉపయోగించుకోవాలి.
  • మాక్‌టెస్టులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల పరీక్ష విధానంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. అదే విధంగా సమయపాలన అలవడుతుంది. మాక్‌టెస్టుల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. వాటిని తప్పనిసరిగా సమీక్షించుకుంటూ తప్పులు సరిదిద్దుకోవాలి.
  • వర్చువల్ క్యాలికులేటర్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. దీనికి ఆన్‌లైన్ మోడల్ టెస్టులు రాయడం దోహదపడుతుంది.
  • పరీక్షల్లో ఎక్కువగా న్యూమరికల్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వీటికి సమాధానాలు కచ్చితంగా గుర్తించేలా జాగ్రత్త పడాలి.

రిఫరెన్స్ బుక్స్
జనరల్ ఆప్టిట్యూడ్ (జీఏ)
  1. Quantitative Aptitude – R.S.Aggarwal.
  2. Logical Reasoning – R.S.Aggarwal.
  3. Objective English – Hari Mohan Prasad.

గేట్‌తో ప్రయోజనాలు...
  1. గేట్ ద్వారా పీజీ, డాక్టోరల్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలే కాదు ఇంకా ఎన్నో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇస్రో వంటి సంస్థల్లో సైంటిస్టు ఉద్యోగంతో పాటు బీహెచ్‌ఈఎల్, గెయిల్, హెచ్‌ఏఎల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, వంటి మహారత్న, నవరత్న, మినీరత్న హోదా ఉన్న పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
  2. 2012 నుంచి పీఎస్‌యూలు గేట్ స్కోరు ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. దాదాపు 30కి పైగా పీఎస్‌యూలు గేట్ స్కోరు ద్వారా నియామకాలు జరుపుతున్నాయి. వీటిలో వార్షిక వేతనాలు రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటున్నాయి. ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
  3. విదేశాల్లోనూ ఉన్నతవిద్యకు ‘గేట్’ దారి చూపుతుంది. సింగపూర్, జర్మనీలోని వివిధ యూనివర్సిటీలు గేట్‌లో మంచి స్కోరు పొందిన వారికి స్వాగతం పలుకుతున్నాయి.
  4. గేట్ స్కోరుతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరులో చేరే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు ఐఐటీలు.. ఎన్‌ఐటీలను ప్రాధాన్య క్రమంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు డీమ్డ్ యూనివర్సిటీలు, రాష్ట్రాల్లోని క్యాంపస్ కాలేజీల్లో చేరొచ్చు. ఇక్కడ నిర్వహించే పీజీఈసెట్ ర్యాంకుల కంటే గేట్ విద్యార్థులకే ప్రాధాన్యం ఉంటుంది.
  5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లు నిర్వహిస్తున్న టెక్నికల్ ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి కూడా గేట్ స్కోరు ప్రామాణికంగా ఉంటోంది.
  6. గేట్‌లో ఉత్తమ ప్రతిభ ద్వారా వివిధ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు స్కాలర్‌షిప్/అసిస్టెంట్‌షిప్ అందుకోవచ్చు. సాధారణంగా పీజీలో చేరే విద్యార్థులకు నెలకు రూ.12,400 అందుతుంది.
  7. గేట్‌లో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులకు సీఎస్‌ఐఆర్ లేబొరేటరీల్లో రూ.25 వేలు-రూ.28 వేల వరకు ఫెలోషిప్ అందుతుంది.

గేట్-2019 షెడ్యూల్ :
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు రూ.750; ఇతరులకు రూ.1500.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 1, 2018
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2018
రూ.500 అదనపు రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2018
పరీక్ష తేదీలు: 2019, ఫిబ్రవరి 2, 3, 9, 10.
ఫలితాల వెల్లడి మార్చి 16, 2019

అయిదు నెలలు చాలు..
గేట్-2019 రాయాలనుకునే వారు ప్రస్తుతం బేసిక్స్‌పై దృష్టిసారించాలి. డిసెంబర్ నాటికి ప్రిపరేషన్ పూర్తిచేసుకొని, రివిజన్‌కు సమయం కేటాయించాలి. సిలబస్‌లో పేర్కొన్న ఏ ఒక్క సబ్జెక్టునూ వదిలేయకూడదు. పటిష్ట ప్రణాళిక ప్రకారం అయిదు నెలలు ప్రిపరేషన్ కొనసాగిస్తే గేట్‌లో మంచి స్కోరు సాధించొచ్చు. ఆప్టిట్యూడ్‌కు పదో తరగతి వరకు ఉన్న పుస్తకాలు రిఫర్ చేస్తే 12-13 మార్కులు సులువుగా వస్తాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌కు బీటెక్‌లో చదివిన పుస్తకాలను ఉపయోగించుకోవాలి.
- యాదగిరి శశాంక్, సివిల్ ఇంజనీరింగ్, 9వ ర్యాంకు, గేట్ 2018.
Published on 7/12/2018 3:57:00 PM

సంబంధిత అంశాలు