సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.

గోవాలో జనవరి 11, 12 తేదీల్లో జరిగిన కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సును గోవా రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభించారు. గత ఏడాది కమిటీ చేపట్టిన కార్యక్రమాలను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. ఈ నిర్ణయంతో ఇక సివిల్స్, గ్రూప్-1 స్థాయి పరీక్షలకు 60 శాతం ఉమ్మడి సిలబస్ ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఏకకాలంలో రెండు పరీక్షలకు సిద్ధమయ్యే వెసులుబాటు కలగనుంది.
ఈ సమావేశంలో వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్లలో అమలు చేస్తున్న విధానాలు, సమస్యలు, కొత్త చర్యలపై చర్చించారు. అన్ని పీఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ సిస్టం (ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టం)పై ఎక్కువ సమయం చర్చించారు. అన్ని పీఎస్సీలు ఇప్పటికే ఆన్లైన్ పరీక్షలు, మూల్యాంకనం చేపట్టాయి. డిస్క్రిప్టివ్‌లో ఆన్లైన్ మూల్యాంకనం, మార్కులు వేయడం వంటి అంశాలపై చర్చించారు. వయోపరిమితులు, సర్వీసు అంశాలు, న్యాయ వివాదాలు, పరిష్కారాలపై చర్చించారు.భ భవిష్యత్తులో అన్ని పీఎస్సీల అధికారుల వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా లోక్‌సేవా వెబ్‌సైట్‌ను యూపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ డేవిడ్ ఆర్ శిమ్లీ ప్రారంభించారు.
స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రెండోసారి చక్రపాణి ఎన్నిక :
యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు ఆయన కొనసాగుతారు.