Sakshi education logo

Advertisement

కరెంట్ అఫైర్స్ (జనవరి 05 - 11, 2018)

అంతర్జాతీయం
పాక్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తామని అమెరికా ప్రకటన
Current Affairs ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పాక్‌కు మిలటరీ సాయం నిలివేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : అమెరికా
ఎందుకు : ఉగ్రవాదులపై చర్యలు తీసుకోనందుకు

అమెరికా-మెక్సికో గోడకు 1.14 లక్షల కోట్లు
మెక్సికో సరిహద్దులో గోడనిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడకు రూ. 1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్
కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విసృ్తతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌లో వేగంగా విస్తరిస్తున్న ఐఎస్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్

ఉభయ కొరియాల మధ్య మిలటరీ హాట్‌లైన్
ఉభయ కొరియా దేశాల మధ్య రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో జనవరి 9న ఈ చర్చలు మొదలయ్యాయి.

జాతీయం
జోజిలా పాస్ సొరంగానికి కేబినెట్ ఓకే
Current Affairs జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 3న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం-1లోని హల్దియా-వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : జోజిలా పాస్, జమ్ము కశ్మీర్
ఎందుకు : జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించేందుకు

మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్
మహిళలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఓ చోట అందించేందుకు వీలుగా రూపొందించిన "NARI" వెబ్ పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ పోర్టల్‌లో మహిళా సంక్షేమానికి సంబంధించిన 350కి పైగా పథకాల సమాచారాన్ని పొందు పరిచారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఫిర్యాదుల సదుపాయాన్ని కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎందుకు : మహిళలకు సంబంధించిన పథకాల సమాచారాన్ని అందించేందుకు

రక్తదాతలకు వేతనంతో కూడిన సెలవు
ఎదుటివారి ప్రాణాలు నిలపగలిగే శక్తి ఉన్న రక్తదాన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులు ఏడాదిలో ఇలాంటివి గరిష్టంగా నాలుగు సెలవులను వాడుకోవచ్చు. రక్తదానానికి సెలవులు మంజూరు చేసే విధానం కొన్ని విభాగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో.. రక్తదానంతో పాటు ప్లేట్‌లెట్స్, రక్త కణాలు, ప్లాస్మాను దానం చేసేవారికి కూడా సెలవులు వర్తింపజేసే విధంగా నిబంధనలు సవరించారు. ఉద్యోగులు దీనికి సంబంధించి లెసైన్‌‌సలు కలిగి ఉన్న రక్తనిధి కేంద్రాల్లోనే రక్తదానం చేయడమే కాకుండా.. అందుకు తగిన ఆధారాలను కూడా అందజేయాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నం ఆవిష్కరణ
పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నాన్ని (రాజముద్ర) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 5న ఆవిష్కరించారు. విశ్వ బంగ్లా, అశోక చక్రంతో కూడిన ఈ రాజముద్రని.. మమతా బెనర్జీయే స్వయంగా రూపొందించారు. అనంతరం ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ రాజముద్రకి ఆమోదం తెలపటంతో.. కోల్‌కతాలో అధికారంగా ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ జీవోలు, అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ఈ రాజముద్రను వినియోగించనున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఆలిండియా డీజీపీల సదస్సు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్‌ఎఫ్ అకాడమీలో జనవరి 6-8 వరకు జరిగిన డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో మోదీ విసృ్తతంగా చర్చించారు. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గతేడాది హైదరాబాద్..
ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విసృ్తత చర్చ జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలిండియా డీజీపీల సదస్సు - 2017
ఎప్పుడు : జనవరి 6 - 8
ఎక్కడ : గ్వాలియర్, మధ్యప్రదేశ్

సెక్షన్ 377ను పునఃపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విసృ్తత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విసృ్తత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది.
1861నుంచి నేరంగా...
ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు

డిసెంబర్‌కల్లా భారత్ నెట్ రెండో దశ పూర్తి
దాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా జనవరి 8న జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు.
తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నెట్ రెండో దశ పూర్తి గడువు
ఎప్పుడు : 2018 డిసెంబర్ నాటికి
ఎవరు : కేంద్ర టెలికం శాఖ
ఎందుకు : గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు

థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్రం ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు సినిమాహాళ్లలో జాతీయగీతం పాడటంపై మార్పులు చేసేందుకు 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కమిటీ ఆరు నెలల కాలంలో తమ నివేదికను సమర్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీలో ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ)’ తొలి సదస్సు జనవరి 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఏ దేశ భూభాగంపైగానీ, వనరులపైన గానీ భారత్‌కు కన్ను లేదని పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో ఆధిపత్యానికి ఇటీవల చైనా చేస్తున్న ప్రయత్నాల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇతర దేశాలకు అభివృద్ధి సాయం చేసే విషయంలో మానవతా దృక్పథమే తప్ప.. భారత్‌ది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదని స్పష్టం చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధికి సహాయకారిగా ఉండాలని ప్రవాస భారత పార్లమెంటేరియన్లను మోదీ కోరారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మహాత్మాగాంధీ వచ్చినరోజుకు సంబంధించిన 102వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు
ఎప్పుడు : జనవరి 9
ఎక్కడ : న్యూఢిల్లీలో

జడ్జీల వేతనాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లును లోక్‌సభ జనవరి 4న ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నెల వేతనం రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు; సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు; హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.80,000 నుంచి రూ.2.25 లక్షలకు చేరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు చేసిన ఈ మార్పులు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఎయిమ్స్
హిమాచల్‌ప్రదేశ్‌కు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ వద్ద రూ.1,350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తిచేస్తారు.

18వ అఖిల భారత విప్‌ల సదస్సు
18వ అఖిల భారత విప్‌ల సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జనవరి 8న ఉదయ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్‌లు పార్టీ సభ్యులను పర్యవేక్షించడంతోపాటు చైతన్యవంతులను చేయాలని సూచించారు. చట్టసభల్లో సభ్యల ప్రవర్తన, క్రమశిక్షణలను పరిశీలించాల్సింది విప్‌లేనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల విప్‌లు హాజరయ్యారు.

ద్వైపాక్షికం
స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు
Current Affairs
ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్‌‌స డిఫెన్‌‌స సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు. ఈ మేరకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందిందని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇజ్రాయెల్ కంపెనీతో స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : భారత ప్రభుత్వం

ఆసియాన్-ఇండియా రౌండ్ టేబుల్ సమావేశం
ఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న జకర్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ అనే రెండు సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆకాంక్షించారు. ఆసియాన్ దేశాలు.. దృఢ, గతిశీల ఆర్థిక బంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ దిశగా నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్
సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారన్నారు.

ప్రాంతీయం
ఏపీలో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2న ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించారు. జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగే కార్యక్రమంలో ప్రభుత్వ పాలనను మొత్తం ప్రజల ముందుకు తెస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. త్వరలో కొత్తగా మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని.. దీంతో మొత్తం 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 2 -11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకు తెచ్చేందుకు

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి 2న సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్

తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్
తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ మైనారిటీ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : చైర్మన్‌గా కమరుద్దీన్

తెలంగాణలో జనవరి 22 నుంచి పులుల గణన
Current Affairs రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. జనవరి 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పులుల గణన
ఎప్పుడు : జనవరి 22 నుంచి 29 వరకు
ఎవరు : తెలంగాణ అటవీశాఖ

దేశంలో తొలిసారిగా తెలంగాణలో కో-ఫైనాన్సింగ్ సంస్థ
ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఇది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది.
టీఐహెచ్‌సీలో రెండు విభాగాలు
 1. ఖాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం.
 2. ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు నిధులు సమకూర్చడం.
ఖాయిలా పరిశ్రమల విషయానికొస్తే.. బిల్ రీ డిస్కౌంట్ స్కీమ్, టెక్నో ఎకనామిక్ వాల్యూవేషన్ (టీఈవీ) స్టడీ, సాఫ్ట్ లోన్ అనే 3 రకాల సేవలుంటాయి.
బిల్ రీ డిస్కౌంట్‌లో.. గడువు ముగిసి బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పరిశ్రమలను గుర్తించి.. వాటి బ్యాంక్ పేమెంట్‌ను టీఐహెచ్‌సీ చెల్లిస్తుంది. పరిశ్రమలకు మరో 90 రోజుల సమయమిస్తారు. దీనికి పరిశ్రమలు టీఐహెచ్‌సీకి సంబంధిత బ్యాంక్ వడ్డీ కంటే 5 శాతం తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీకి అనుమతి
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆర్‌బీఐ
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) ఏర్పాటు కోసం

తెలంగాణ గురుకులాల్లో ‘భారత్ దర్శన్’
విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్ దర్శన్’ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్ దర్శన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘భారత్ దర్శన్’
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : తెలంగాణ గురుకుల సొసైటీ
ఎందుకు : వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచేందుకు

దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ పంజగుట్ట
దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : తొలి స్థానంలో తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్. రెండో స్థానంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్.

ఏపీ రుణభారం రూ.2 లక్షల కోట్లు
2018 బడ్జెట్ నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్ లోక్‌సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్ నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018 బడ్జెట్ నాటికి రూ.2,16,027 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఆర్థికం
మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం
Current Affairs ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ జనవరి 4న ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్‌‌స ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్‌బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం 2017 ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూలధన బాండ్ల జారీకి ఆమోదం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చేందుకు

2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్-2018 మార్చి) పేలవంగా ముగియనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు జనవరి 5న వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి.
గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది.
ముఖ్యాంశాలు చూస్తే..
 • 2014 మేలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014-15లో వృద్ధి రేటు 7.5 శాతం. 2015-16లో ఈ రేటు 8 శాతమయితే, 2016-17లో 7.1 శాతంగా నమోదయి్యంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3%గా నమోదవడం తెలిసిందే.
 • తాజా అంచనాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతం (2016-17) నుంచి 4.6%కి పడిపోనుంది.
 • ఇక వ్యవసాయ రంగం చూస్తే (అటవీ, మత్స్య రంగాలూ కలుపుకుని) వృద్ధి రేటు 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోనుంది.
 • 2017-18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4%కి పెరుగుతుందని విశ్లేషించింది.
 • ఇక 2017-18కి ఓఈసీడీ వృద్ధి అంచనా 6.7శాతం.
 • ఫిచ్ రేటింగ్‌‌స 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2018-19కి 7.4% నుంచి 7.3%కి తగ్గించింది.
 • ఇక మూడీస్ విషయంలో 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
 • 2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది.
 • ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7%.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ

ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో అదానీ గ్రూప్
అంతర్జాతీయంగా సోలార్ విద్యుదుత్పత్తి సంస్థల్లో అదానీ గ్రూపు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో యుటిలిటీ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పరంగా టాప్-15 జాబితాలో చేరిన అదానీ గ్రూపు 12వ స్థానం దక్కించుకుంది. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకై న భారతీయ కంపెనీ అదానీ ఒక్కటే. ఈ జాబితాలో ఫస్ట్ సోలార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,619 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన చేస్తుండగా, దీనికి అదనంగా 4,802 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. అదానీ గ్రూపు 788 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో 12వ స్థానంలో అదానీ గ్రూప్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : గ్రీన్‌టెక్ మీడియా

2018-19లో భారత వృద్ధి రేటు 7.6 శాతం: క్రిసిల్
రానున్న ఆర్థిక సంవత్సరాని(2018-19)కి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మరోసారి పునరుద్ఘాటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించడానికి డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల స్వల్ప కాలంలో ఎదురైన ప్రతికూలతలు, వ్యవసాయ వృద్ధి బలహీనంగా ఉండడమే కారణాలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రతికూల ప్రభావం కొనసాగుతుందన్న అంచనాలతోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.6 శాతంగా పేర్కొంటున్నట్టు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు అంచనా 7.6 శాతం
ఎప్పుడు : 2018-19లో
ఎవరు : క్రిసిల్

జౌళి సంచుల్లో ఆహార ధాన్యాలు, పంచదార
ఈ ఏడాది జూన్ వరకు ఆహార ధాన్యాలు, పంచదారను తప్పనిసరిగా జౌళి సంచుల్లోనే ప్యాక్ చేయాలని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) జనవరి 3న నిర్ణయించింది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, పంచదార ఉత్పత్తుల్లో 20 శాతాన్ని జౌళి సంచుల్లో ప్యాక్ చేస్తే 40 లక్షల మంది రైతులు; 3.7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు పర్యావరణ అనుకూల జౌళిని వినియోగించేలా దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని రైతులు, కార్మికులకు మేలు జరుగుతుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ
ఓక్కీ తుపాను రికార్డు ప్రయాణం
Current Affairs ఇటీవల తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లను కుదిపేసిన ఓక్కీ తుపాను 2,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వాతావరణ శాస్త్రవేత్త రామచంద్రన్ తెలిపారు. గత నలభై ఏళ్లలో బంగాళాఖాతంలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. 2017 నవంబర్ 28న ఓక్కీ అల్పపీడనంగా ప్రారంభమై 30వ తేదీన కన్యాకుమారి తీరాన్ని కుదిపేసింది. డిసెంబర్ 6న బలహీనపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2,400 కిలోమీటర్ల రికార్డు దూరం ప్రయాణించిన ఓక్కీ తుపాను
ఎప్పుడు : 2017 నవంబర్ 28
ఎవరు : భారత వాతావరణ శాఖ

అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎం77232917
ప్రపచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త ఒకరు కనుగొన్నారు. 2017 డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఎవరు : అమెరికాకు చెందిన జొనాథన్ పేస్
ఎందుకు : ఎం77232917 గా నామకరణం

క్రూయిజ్ క్షిపణి హర్భాను పరీక్షించిన పాక్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు.

క్రీడలు
జాతీయ సీనియర్ కబడ్డీ చాంప్స్ హిమాచల్, మహారాష్ట్ర
Current Affairs జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజేతలుగా నిలిచాయి. జనవరి 5న హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 38-35తో ఇండియన్ రైల్వేస్‌పై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల టైటిల్ పోరులో మహారాష్ట్ర 34-29తో సర్వీసెస్‌ను ఓడించింది. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు జేఎస్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : మహిళల టైటిల్ విజేత హిమాచల్ ప్రదేశ్, పురుషుల టైటిల్ విజేత మహారాష్ట్ర
ఎక్కడ : హైదరాబాద్‌లో

డోపింగ్‌లో పట్టుబడ్డ యూసుఫ్ పఠాన్
క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతేడాది మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు అతని నిషేధాన్ని తగ్గించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల నిషేధంతో సరిపెట్టింది. 2018 జనవరి 14న ఈ నిషేధం ముగుస్తుందని బోర్డు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడ్డాడని ప్రకటన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : అతడిపై విధించిన ఐదు నెలల నిషేధం జనవరి 14తో ముగుస్తుందని వెల్లడి

టాటా ఓపెన్ మహారాష్ట్ర విజేత సిమోన్
టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7-6 (7/4), 6-2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాటా ఓపెన్ - 2017
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత గైల్స్ సిమోన్

ఫెడరర్, బెన్సిచ్‌లకు హాప్‌మన్ కప్ - 2017
ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 6న జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. తొలుత ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6-7 (4/7), 6-0, 6-2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6-4, 6-1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-బెన్సిచ్ జోడీ 4-3 (5/3), 4-2తో కెర్బర్-జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది.
30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాప్‌మన్ కప్ - 2017
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : విజేత స్విట్జర్లాండ్ (ఫెడరర్, బెన్సిచ్)

యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా
ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. జనవరి 8న ముగిసిన సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్‌‌స 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్‌‌సకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య యాషెస్ సిరీస్ - 2017
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : విజేత ఆస్ట్రేలియా

వార్తల్లో వ్యక్తులు
విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే
Current Affairs భారత విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్ పదవీకాలం జనవరి 28తో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ఆయన 1981 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాంగ శాఖ కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : విజయ్ కేశవ్ గోఖలే

ఇన్ఫీ సీఈవో పరేఖ్‌కు రూ.16.25 కోట్ల ప్యాకేజీ
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వాహకఅధికారి (సీఈవో) సలీల్ పరేఖ్.. ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం తీసుకోనున్నారు. స్థిరవేతనంగా రూ.6.50 కోట్లు, భత్యాలరూపంలో మరో రూ.9.25 కోట్లను అదనంగా ఏడాది చివరన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కిరణ్ మజుందార్ వెల్లడించారు. ఇది వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసిన విశాల్ సిక్కాకు గత ఏడాది రూ.42.92 కోట్లను చెల్లించారు. మరోవైపు విప్రో కంపెనీ సీఈవో అబిదాలి నిమూచ్‌వాలా ఏడాదికి రూ.12.71 కోట్లను ఆర్జిస్తున్నారు. స్టాక్ ఆప్షన్ల కింద సలీల్‌కు అదనంగా మరో రూ.3.25 కోట్లు ఇవ్వనున్నారు. ఆయన ఐదేళ్లపాటు ఇన్ఫోసిస్‌కు సేవలు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ సీఈవోకు ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సలీల్ పరేఖ్

దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష
21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ జనవరి 6న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు

వ్యోమగామి జాన్ యంగ్ కన్నుమూత
అత్యధిక పర్యాయాలు అంతరిక్షయానం చేయటంతోపాటు, చంద్రునిపై నడిచిన ప్రముఖ అమెరికా వ్యోమగామి జాన్ వాట్స్ యంగ్(87) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన హూస్టన్‌లో తన నివాసంలో జనవరి 5న మృతి చెందారని నాసా తెలిపింది. అంతరిక్షయానంలో లెజెండ్‌గా అందరూ పిలిచే జాన్ యంగ్ నేవీ ఆఫీసర్, టెస్ట్ పెలైట్, ఏరోనాటికల్ ఇంజినీర్ కూడా. ఆయన పేరిట అనేక రికార్డులున్నాయి. జెమిని, అపొలోతోపాటు పలు అంతరిక్ష యాత్రల్లో కీలకంగా వ్యవహరించారు. 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత జెమిని మిషన్‌లో ఆయన కూడా సభ్యుడే. అంతరిక్షంలోకి ఆరుసార్లు వెళ్లి వచ్చిన ఏకైక వ్యోమగామిగా జాన్ రికార్డు నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక సార్లు అంతరిక్షయానం చేసిన వ్యోమగామి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : జాన్ వాట్స్ యంగ్

సిక్కిం ప్రచారకర్తగా రెహ్మాన్
సిక్కిం రాష్ట్ర ప్రచారకర్తగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నియమితులయ్యారు. గ్యాంగ్‌టక్‌లోని పాల్జోల్ స్టేడియంలో జనవరి 9న జరిగిన రెడ్ పాండా వింటర్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఇక నుంచి ఏఆర్ రెహ్మాన్ సిక్కిం పర్యాటక, వ్యాపార అంశాలలో ప్రచార కర్తగా కొనసాగుతారని ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో తొలి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న సిక్కింకు రెహ్మాన్ అంబాసిడర్‌గా కొనసాగడం.. ఆ రాష్ట్ర పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిక్కిం ప్రచారకర్తగా ఏఆర్ రెహ్మాన్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్

సంగీత విధ్వాంసురాలు రాధా విశ్వనాథన్ కన్నుమూత
కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. ఈమె ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి కూతురు.

అవార్డులు
అజిజ్ అన్సారీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు
Current Affairs లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు - 2018 ప్రదానోత్సవంలో భారత సంతతి నటుడు అజిజ్ అన్సారీ.. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద మాస్టర్ ఆఫ్ నన్ కామిడీ సిరీస్‌లో అజిజ్ అన్సారీ నటించాడు. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయినా అవార్డు రాలేదు.
Published on 1/11/2018 2:59:00 PM

సంబంధిత అంశాలు