Sakshi education logo

Advertisement

ఎంసెట్-2018 విజయానికి ప్రణాళిక..

తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు లక్షల్లో హాజరవుతుంటారు. తెలంగాణ, ఏపీ ఎంసెట్-2018 తేదీలు ఇప్పటికే వెలువడ్డాయి. మరోవైపు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఇంటర్ ఫైనలియర్ విద్యార్థుల ఏకైక లక్ష్యం.. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడంతోపాటు ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవడమే! ఈ లక్ష్యాన్ని సాధించాలంటే విద్యార్థులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ప్రిపరేషన్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
Edu newsతెలంగాణలో మే మొదటి వారంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ చివరి వారంలో ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. ఇక ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లోనూ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.

ఇంటర్‌కు ప్రాధాన్యం :
ప్రస్తుతం ఎంసెట్ ఔత్సాహిక విద్యార్థులు పూర్తిగా ఇంటర్ పరీక్షలపైనే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఎంసెట్ లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిచేసి ఉంటారు. ఒకట్రెండు అంశాల ప్రిపరేషన్ మిగిలుంటే.. జనవరి చివరివారంలోపు పూర్తి చేసుకోవాలి. ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఎంసెట్ గురించి ఆలోచించకుండా ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపడంపైనే దృష్టిసారించాలి.

పరీక్షలు పూర్తయ్యాక?
ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎంసెట్ కోణంలో ప్రిపరేషన్‌కు పదునుపెట్టాలి. ప్రిపరేషన్ పూర్తిచేసినవారు రివిజన్‌కి సమయం వెచ్చించాలి. ప్రిపరేషన్ సమయంలో సొంతంగా రాసుకున్న నోట్స్, షార్ట్‌కట్స్‌ను అనుసరిస్తూ రివిజన్ చేయాలి. తద్వారా సమయం ఆదా అవడంతోపాటు ఎంసెట్ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలను అధ్యయనం చేయొచ్చు. ఎంసెట్ ర్యాంకులకు సంబంధించి ఇంటర్ మార్కుల (వెయిటేజీ)తోపాటు ఎంసెట్‌లో చూపిన ప్రతిభా కీలకమే. రెండిట్లో ప్రతిభ కనబరిస్తేనే కోరుకున్న కాలేజీలో సీటు లభిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఎంసెట్ గురించి ఆలోచించి.. అనవసర ఒత్తిడికి గురికాకుండా ఇంటర్ పరీక్షలపైనే దృష్టిపెట్టడం ఉత్తమం.

జేఈఈ, నీట్..
ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు జేఈఈకి, బైపీసీ విద్యార్థులు నీట్‌కు సన్నద్ధం అవడం సహజం. జేఈఈ మెయిన్-2018ను ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 8న, ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. మెడికల్ కోర్సులకు ఉద్దేశించిన నీట్ (యూజీ)-2018ను సీబీఎస్‌ఈ మే 10న నిర్వహించనుంది. ఈ తేదీలను పరిగణనలోకి తీసుకుని.. ఇంటర్ పరీక్షల అనంతరం విద్యార్థులు జేఈఈ/నీట్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇలా చేస్తే ఒకే సమయంలో జేఈఈ/నీట్, ఎంసెట్‌లకు సన్నద్ధత లభిస్తుంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16నముగుస్తాయి. జేఈఈ మెయిన్ తర్వాత అందుబాటులో ఉండే సమయాన్ని ఎంసెట్‌కు కేటాయించడం ఉత్తమం. జేఈఈ మెయిన్ బాగా రాసిన అభ్యర్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోణంలో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎంసెట్‌లో మెరుగ్గా రాణించొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను మే 20న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. బైపీసీ విద్యార్థులు నీట్, ఎంసెట్‌ల ప్రిపరేషన్‌ను ఏకకాలంలో సాగించొచ్చు. రెండు పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉంది. కాబట్టి రెండిటి సిలబస్‌లను దగ్గరపెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి.

కాన్సెప్ట్ ఆధారంగా!
జేఈఈ/ఎంసెట్/నీట్‌లకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ, నీట్ గత ప్రశ్నపత్రాల్లో అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం దక్కింది. కాబట్టి ప్రిపరేషన్ దశ నుంచే కాన్సెప్ట్ ఆధారంగా ముందుకెళ్లాలి. దీనివల్ల ఎంసెట్‌లోనూ ప్రయోజనం ఉంటుంది. ఎంసెట్‌లో అడిగే ప్రశ్నలు ఎక్కువగా డెరైక్ట్‌గా ఉంటాయి. జేఈఈ స్థాయిని దృష్టిలో పెట్టుకుని విషయావగాహనతో ప్రిపరేషన్ సాగిస్తే ఎంసెట్‌లో విజయాన్ని అందుకోవచ్చు.

ఆన్‌లైన్ నైపుణ్యం..
ప్రస్తుతం ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్ పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవాలి. ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల ఎంసెట్‌లతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌లో జరగనుంది. జేఈఈ మెయిన్‌ను మాత్రం అన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇంటర్ పరీక్షల అనంతరం సబ్జెక్టు ప్రిపరేషన్‌తోపాటు ఆన్‌లైన్ విధానంలో మాక్‌టెస్ట్‌లకు హాజరైతే ప్రయోజనం ఉంటుంది.

సబ్జెక్టుకు మూడు గంటలు!
ఎంసెట్ ఔత్సాహిక విద్యార్థులు ఇంటర్ పరీక్షల అనంతరం ప్రతి సబ్జెక్టుకు మూడు గంటలు చొప్పున కేటాయించాలి. ఇలా నిర్దేశించుకున్న వ్యవధిలో మొదటి 15 నిమిషాలను అంతకుముందు రోజు చదివిన అంశాల పునశ్చరణకు వెచ్చించాలి. ఈ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే.. పరీక్షకు వారం ముందు క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.

సబ్జెక్టుల వారీగా ముఖ్యాంశాలు...
  1. మ్యాథమెటిక్స్: మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ వాల్యూ థీరమ్, వెక్టార్ అల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, బైనామియల్ థీరమ్, మ్యాట్రిసెస్, సర్కిల్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్.
  2. ఫిజిక్స్: హీట్, న్యూక్లియర్ ఎలక్ట్రోమ్యాగ్నటిజం, మ్యాగ్నటిజం, వేవ్‌మోషన్, అటామిక్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ డివెజైస్.
  3. కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాలు- వాటి ధర్మాలు..
  4. బయాలజీ: సూక్ష్మ జీవశాస్త్రం, కేంద్రక పూర్వ జీవులు, బ్యాక్టీరియా, వైరస్, మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర, ఖనిజ మూలకాల ఆవశ్యకత. జువాలజీలో కాలేయం, వానపాము, బొద్దింకల జీవవ్యవస్థ, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, క్షీర గ్రంథులు, నాడీ వ్యవస్థ, నేత్ర పటలం, జీవావరణం-పర్యావరణం, జన్యుశాస్త్రం, జీవ పరిమాణం, అనువర్తిత జీవశాస్త్రం.
ఎంసెట్-2018 సక్సెస్ టిప్స్...
  • ప్రాక్టీస్, మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలి.
  • గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
  • టాపిక్ వైజ్ వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని.. సమయం కేటాయించాలి.
  • జేఈఈ-ఎంసెట్, నీట్-ఎంసెట్‌లను అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
  • స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, ఏఆర్ టైప్ క్వశ్చన్స్ పాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
అప్లికేషన్ ఓరియెంటేషన్ ముఖ్యం :
ఎంసెట్ ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇవ్వగల సన్నద్ధత లభిస్తుంది. ఈ తరహా ప్రిపరేషన్ జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యా సంస్థలు.
Published on 1/10/2018 3:07:00 PM

సంబంధిత అంశాలు