Sakshi education logo

Advertisement

ఐబీపీఎస్క్లర్క్స్-7 విజయానికి వ్యూహాలు...

వరుస ప్రకటనలతో బ్యాంకు ఉద్యోగాల ఔత్సాహికులకు అద్భుత వేదికగా నిలుస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. తాజాగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 19 బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలను ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ, మెయిన్) ద్వారా భర్తీ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. తాజాగా 7883 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్ సమాచారం, విజయానికి వ్యూహాలపై ఫోకస్..
ఇప్పటికే ఆర్‌ఆర్‌బీ స్కేల్-1, మల్టీపర్పస్, పీఓ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఐబీపీఎస్.. ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఇప్పటికి వరకు వివిధ బ్యాంకుల నుంచి అందిన వివరాల ప్రకారం అందుబాటులో ఉన్న ఖాళీలు 7883. ఆంధ్రప్రదేశ్‌లో 485, తెలంగాణలో 344 ఖాళీలు ఉన్నాయి. తుది నియామకాలు చేపట్టే సమయానికి ఈ సంఖ్యలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

గత క్లర్క్ నోటిఫికేషన్‌తో పోల్చితే ఈసారి పరీక్ష విధానంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాన మార్పులు.. మెయిన్ పరీక్షలోని కంప్యూటర్ విభాగాన్ని రీజనింగ్ సెక్షన్‌కు జతచేశారు. గతంలో మెయిన్ పరీక్షకు 135 నిమిషాలు ఉండగా, ప్రస్తుతం అది 160 నిమిషాలకు పెరిగింది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగాల్లోని ప్రశ్నలు పెరిగాయి.

విద్యార్హత : దరఖాస్తు సమయానికి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్‌లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసి ఉండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది.

వయసు: 2017, సెప్టెంబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఆబ్జెక్టివ్ పరీక్షల ఆధారంగా ఉంటుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (100 మార్కులు) ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మా.), న్యూమరికల్ ఎబిలిటీ (35 మా.), రీజనింగ్ ఎబిలిటీ (35 మా.) విభాగాలు ఉంటాయి. పరీక్షకు గంట సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి మెయిన్ పరీక్షకు అర్హత లభిస్తుంది.

మెయిన్ పరీక్ష విధానం...
టెస్ట్ పేరు ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 50 35 ని.
జనరల్ ఇంగ్లిష్ 40 40 35 ని.
రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 60 45 ని.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 ని.
మొత్తం 190 200 160 ని.

మెరిట్ జాబితా..
  • మెయిన్‌లోని ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది.
  • మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితా రూపొందిస్తారు. ప్రతి సెక్షన్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్ కటాఫ్‌తో పాటుగా ఫైనల్ కటాఫ్ మార్కులు కూడా ఉంటాయి.
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు.
  • ప్రిలిమినరీ, మెయిన్ విభాగాలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కు ల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 12, 2017
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 3, 2017
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్) తేదీలు: 2017 డిసెంబరు 2, 3, 9,10.
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్) ఫలితాలు: డిసెంబరు, 2017.
మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్) తేదీ: జన వరి 21, 2018
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ibps.in


సన్నద్ధత...
ప్రిలిమ్స్+మెయిన్స్...
  • ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షలో ప్రిలిమ్స్‌కు సుమారు మూడు నెలల సమయం, మెయిన్స్కు నాలుగు నెలలు సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • సిలబస్ పరంగా చూస్తే ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా, మెయిన్స్ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది.
  • మెయిన్స్‌లో సెక్షన్ల వారీగా విడివిడిగా సమయం అందుబాటులో ఉంటుంది. మెయిన్ పరీక్షలో ప్రశ్నల సరళి కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఈ మూడు విభాగాల ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమ్స్‌లో సులువుగా గట్టెక్కొచ్చు.
వెయిటేజీ ఆధారంగా..
అభ్యర్థులు రెండు నెలల్లో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ఆయా విభాగాల్లోని పలు అంశాలకు ఇస్తున్న వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌కు కేటాయించాల్సిన సమయాన్ని వర్గీకరించుకోవాలి.

న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంట్:
బ్యాంకు పరీక్షల్లో ప్రశ్నల కాఠిన్యత పెరుగుతోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత సీరియస్‌గా ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి అర్థమెటిక్ అంశాలు పర్సంటేజ్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ - వర్క్, టైమ్ - డిస్టెన్స్, పెర్ముటేషన్స్ - కాంబినేషన్స్, ప్రాబబిలిటీ తదితర అంశాలు ముఖ్యమైనవి. ఈ సెక్షన్ల నుంచి ప్రశ్నలు లోతుగా వస్తున్నాయి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు సింప్లిఫికేషన్స్‌కు BODMA రూల్‌కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.

ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు ...
సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్షిమేషన్స్, బేసిక్ ఆల్జీబ్రా (క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్), డేటా ఇంటర్‌ప్రిటేషన్, మిస్సింగ్ నంబర్స్ (రాంగ్ నంబర్ సిరీస్). ఈ నాలుగు అంశాలు లేని బ్యాంకు పరీక్షలు కనిపించడం లేదు. ప్రతి పరీక్షల్లో వీటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ముఖ్యం.

ఇంగ్లిష్ లాంగ్వేజ్:
ఈ విభాగంలో రీడింగ్ కాంప్రెహెన్షన్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌లో మంచి స్కోరు చేయడానికి అభ్యర్థులు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. చాలా మంది అభ్యర్థులు అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరుస్తున్నా ఇంగ్లిష్‌లో వెనకబడుతున్నారు. కాబట్టి ఇంగ్లిష్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి.

రీజనింగ్ :
ఇది కూడా రెండు పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) ఉంటుంది. గత ప్రశ్నల సరళిని పరిశీలిస్తే తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్న అంశాలు: సీటింగ్ అరెంజ్‌మెంట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజమ్స్, ఇన్‌ఈక్వాలిటీస్, పజిల్స్. ఈ విభాగంలో విజయానికి ఏకైక మార్గం ప్రాక్టీస్. సాధ్యమైనన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయటం, వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

అదనంగా మెయిన్స్‌కు..
ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటు మెయిన్స్లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అంశాలను కూడా అధ్యయనం చేయాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్ బ్యాంక్ వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్‌‌జ కోణంలోనూ ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యమివ్వాలి. కంప్యూటర్ నాలెడ్‌‌జకు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్టక్చ్రర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షార్ట్‌కట్స్, హార్డ్‌వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి.

బేసిక్స్‌పై పట్టు సాధించాలి..
పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగేందుకు తగిన సమయం అందుబాటులో ఉంది కాబట్టి తొలుత బేసిక్స్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఆయా సబ్జెక్టుల్లో విభాగాలకు ఉన్న వెయిటేజీని అర్థం చేసుకొని తదనుగుణంగా సన్నద్ధమవ్వాలి. బేసిక్స్‌పై పట్టు వచ్చాక పూర్తిస్థాయిలో గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. ఈ సమయంలో తప్పులు దొర్లకుండా సమాధానాలు రాబట్టాలి. ఎక్కువగా ఆన్‌లైన్ పరీక్షలు రాసి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్‌లో ముందుకెళ్లడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
- ఎన్.వినయ్ కుమార్‌రెడ్డి, డెరైక్టర్, ఐఏసీఈ.

మాక్‌టెస్ట్‌లతో మేలు..
ఐబీపీఎస్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో కొన్ని అంశాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. అవేంటో తెలుసుకొని, వాటిని ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పరీక్ష విధానానికి అలవాటుపడేందుకు రోజుకో మాక్ టెస్టు రాయడం మేలు. తెలియని ప్రశ్నలను వదిలేయాలి. ఊహించి సమాధానాలు గుర్తించొద్దు. విభాగాల వారీగా టైం ప్రకారం టెస్ట్‌లు రాయడం మెయిన్ పరీక్షకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- రవి గార్లపాటి, డెరైక్టర్, ఐరైజ్ అకాడమీ, హైదరాబాద్.

వేగం, కచ్చితత్వం ప్రధానం...
వేగం (speed), కచ్చితత్వం (accuracy) ద్వారా బ్యాంకు పరీక్షలో విజయం సాధించవచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ సెక్షన్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగానికి కొంత సమయం కేటాయిస్తే మంచి మార్కులు పొందొచ్చు. మెయిన్ పరీక్షలో వచ్చే మార్కులే తుది ఎంపికకు కీలకం కాబట్టి ఏ ఒక్క సెక్షన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు. సమాధానాలు తెలియని ప్రశ్నలకు సమయం వృథా చేసుకోవద్దు.
- బి.జయంత్, ఐబీపీఎస్ క్లర్క్ -2014 విజేత, విజయా బ్యాంక్.
Published on 9/12/2017 4:55:00 PM

సంబంధిత అంశాలు