Sakshi education logo

Advertisement

మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం

అది 1982వ సంవత్సరం. ఒక వర్థమాన దర్శకుడు తాను తయారు చేసుకున్న స్క్రిప్టుతో సినిమాలు నిర్మించే ఒక ప్రొడక్షన్ కంపెనీకి వెళ్లాడు. కథ ఏంటని అడిగారు నిర్మాతలు. అడిగిందే తడవుగా... గంటన్నరసేపు కథ వివరించాడు ఆ దర్శకుడు. ఆ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నాడో కూడా చెప్పి.. నిర్మాతలు ఏం చెబుతారోనని ఆతృతతో ఎదురు చూశాడు. కథ అంతా విన్న ఆ నిర్మాతలు భారంగా నిట్టూర్చి, దర్శకుడితో ఇలా అన్నారు... మా కంపెనీతో నీకున్న పరిచయం వల్ల ఇంతసేపు ఓపికగా నీ కథ విన్నాం. అసలేం ఉందని ఈ కథలో? ఇలాంటి చప్పటి కథలకు పెట్టుబడి పెట్టడం అంటే.. కావాలని గోతిలో దూకటమే. కర్రలాంటి శరీరంతో, సగం బట్టలు లేకుండా.. కర్ర సాయంతో తిరిగే ముదుసలిని చూడటానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది.

ఈ కథను వదిలేసి, మరేదైనా రసవత్తరమైన కథ ఉంటే తెమ్మని కరాఖండిగా చెప్పారా నిర్మాతలు. నిరాశతో, నిస్పృహ ఆవరించినా.. పట్టువదలని ఆ దర్శకుడు నిర్మాతల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చివరకు అతని తపన, పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి.. 20th Century Fox అనే నిర్మాణ సంస్థ ఆ సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చింది. ఆ దర్శకుడి కల నెరవేరి, అతని కథ సినిమాగా రూపుదిద్దుకుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ అయింది. అంతేకాక ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు మొదలైన విభాగాల్లో.. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. నేటికీ అత్యధిక సీడీలు అమ్ముడయ్యే ఆ సినిమాయే ‘గాంధీ’. పట్టుదలని విక్రమార్కుడిలా ఆ సినిమాను పూర్తిచేసిన ఆ దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి.. సామాన్య మానవుడిలా జీవితాన్ని ఎదుర్కొని.. తన శరీరాన్ని, హృదయాన్ని, ఆత్మను ఒక ప్రయోగశాలగా మార్చుకొని.. మహాత్ముడిగా మారిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జీవిత ప్రస్థానంలో తొంగిచూస్తే.. మానవ జీవితంలో నిరంతరం ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవచ్చు.
 
బాల్యంలో పిల్లలు పెరిగే గృహ వాతావరణం.. వారి భావి జీవితానికి పునాది. గృహిణి అయిన తల్లి, ఉద్యోగస్థుడైన తండ్రి.. ఇది ఈ కాలంలోనూ మనకు సాధారణంగా కనిపించే గృహస్థాశ్రమ వ్యవస్థ. గాంధీ తల్లి పుతిలీభాయి. ఆమెకు చదువు లేదు. అయితే గొప్ప సంస్కారమున్న మహిళ. ఆమె ఆధ్యాత్మిక, తాత్విక చింతన.. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యుండే ఆమె దినచర్య... అవసరమైనంతమేరకే మాట్లాడి, మౌనంగా ఉండే ఆమె సహజ స్వభావం... తనను అమితంగా ప్రభావితం చేశాయంటారు గాంధీ. ఇంటి పరిసరాలు.. ఇరుగుపొరుగున ప్రబలంగా ఉన్న జైన మతస్థుల ఆచారా వ్యవహారాలు.. జీవమున్న ఏ ప్రాణినీ బాధించరాదన్న వారి సిద్ధాంతం.. దేహమే దేవాలయమని, జీవహింసతో దానిని పోషించరాదని.. దేహ పరిశుభ్రతకు ఉపవాస దీక్ష ఉత్తమ మార్గమని.. పరమత సహనం పరమోన్నతమని బోధించే ఆ మత సిద్ధాంతాలు.. గాంధీ భావి జీవితంలో పోరాట సాధనాలుగా ఉపయోగించిన అహింసా సత్యాగ్రహాలకు పునాది అయ్యాయంటే అతిశయోక్తి కాదు. మరి నిద్ర లేచింది మొదలు పడుకునేవరకూ... ఏదో ఒక టీవీ సీరియల్‌తోనో, మరో ప్రాయోజిత కార్యక్రమంతోనే తీరిక లేకుండా గడుపుతూ.. తమ పిల్లలు గొప్పవారు కావాలనుకునే తల్లులకైనా, తండ్రులకైనా.. గాంధీ బాల్యం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం- ‘‘పిల్లలు ఏది జీవిస్తారో.. అదే నేర్చుకుంటారు. ఏది నేర్చుకుంటారో.. అదే జీవిస్తారు’’.

ఈ కాలంలో అనేకమంది పిల్లల్లో, యువతలో తరచూ కనిపించే లక్షణం... నలుగురిలో తాము చెప్పదల్చుకున్న మాటల్ని, వ్యక్తం చేయదలుచుకున్న భావాలను స్పష్టంగా చెప్పటానికి సంకోచిం చటం. అది బిడియం వల్ల కావచ్చు. భయంతో కావచ్చు. ప్రతి రంగంలోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనివార్యం అయిన ఈ రోజుల్లో... అలాంటి బిడియస్థులు, భయస్థులు నెగ్గుకురాగలగడం కష్టమే. గాంధీ కూడా వీటికి అతీతుడేమీ కాదు. ఇంగ్లాండ్ లో ‘లా’ పూర్తయిన తర్వాత... తన మొట్టమొదటి కేసులో వాదిద్దామని నిలబడితే శరీరమంతా చెమటలు పట్టాయి. గొంతు తడారిపోయి, మాటలు పెగల్లేదు. ఈ కాలంలో అయితే అబ్బాయి కమ్యూనికేషన్ స్కిల్స్‌లో బలహీనంగా ఉన్నాడని.. ఏదో ఒక క్రాష్ కోర్సుకు పరిగెత్తిస్తారు. గాంధీ మాత్రం తన సమస్యకు పరిష్కారం బయట వెతికే ప్రయత్నం చేయలేదు. తనలోనే వెతుక్కున్నాడు. తన బిడియ స్వభావం కారణంగా.. ఎక్కువ మాట్లాడలేనని, అందుకని చెప్పాల్సిందంతా తక్కువ మాటలు, ఎక్కువ భావం ప్రతిబింబించేట్లుగా.. స్పష్టంగా, సూటిగా, సంక్షిప్తంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఆత్మావలోకనం ద్వారా అంతర్మథనం తన దినచర్యలో భాగంగా మార్చుకున్నాడు.

అలా అయిన అలవాటు, గాంధీజీకి భాషా గాంభీర్యాన్నే కాక... భావ గాంభీర్యాన్ని కూడా సమకూర్చి పెట్టింది. సున్నితమైన భాషలో సూక్ష్మ పదాలతో స్థూల భావాలను వ్యక్తం చేయగలిగిన గాంధీ శైలి.. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఆధారమైన..‘‘బలమైన తర్కంతో కూడిన మెత్తని, తియ్యటి పదాల సమాహారమైన భాష’’(Soft and Sweet Language with Strong Logic) కు మంచి ఉదాహరణ. ఆంగ్లభాషపై పట్టు సాధించాలనుకునే వారిని ఈ రోజుల్లో కూడా గాంధీ రచనలు చదవమనటమే ఇందుకు నిదర్శనం. తన బలహీనతకు భయపడకుండా, పట్టుదలతో దాన్ని బలంగా మార్చుకున్న గాంధీ వ్యక్తిత్వం... ఏదో ఒక వ్యక్తిత్వలోపాలతో ఆత్మనూన్యతకు గురయ్యే ప్రతి యువతకు ఆదర్శం కదూ! పర్వదినాల్లో, పుట్టిన రోజు వేడుకల్లో.. బాహ్య గాంభీర్యంపై దృష్టిసారించే ముందు... గాంధీలా అంతర్ గాంభీర్యం పెంపొందించుకోవడం పిల్లల భవిష్యత్‌కు ఎంత అవసరమో ఆలోచించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.

ఇది క్రెడిట్ కార్డుల యుగం. అవసరమున్నా, లేకపోయినా కనిపించిందల్లా కొనే విచ్ఛలవిడి మనుషులను, మనస్తత్వాలను చూస్తుంటాం. ఏం కావాలో తెలియని స్థితిలో.. ఏది కొనాలో నిర్ణయించుకోకుండా.. ఎవరినో సంతృప్తి పరచాలని, అవసరం లేని వస్తువులను తనవద్దలేని డబ్బు (క్రెడిట్ కార్డు)తో కొనటానికి నిత్యం షాపింగ్ మాల్స్ చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్లు... ఒక్కక్షణం గాంధీ జీవితంలోకి చూస్తే ఎంతో బాగుంటుంది. బ్రిటీష్ ప్రభుత్వంతో చర్చలు జరపటానికి ఇంగ్లాండుకు బయలుదేరిన గాంధీజీని తన వద్ద ఉన్న సామాన్లను డిక్లేర్ చేయమని కస్టమ్స్ అధికారులు ఆదేశించారు. దానికి సమాధానంగా గాంధీ ఇలా అన్నారు... ఈ భూమిమీద నాకంటూ ఉన్నవి..

1. అరడజను చరఖాలు, 2. నాలుగు చేనేత పంచెలు, 3. ఒక ఖద్దరు టవలు, 4. ఒక డబ్బా మేక పాలు, 5. ప్రజలు నాకు ఆపాదించిన పేరు ప్రతిష్టలు. మొదటి నాలుగు మీరు తనిఖీ చేయవచ్చు. మరి ఐదవది మీకు చూపించనూలేను, ధరించనూ లేను అని ప్రశాంతంగా సమాధానమిచ్చారు. ఎంతటి నిరాడంబరత? ఎలిజబెత్ మహారాణి వివాహానికి హాజరైన గాంధీ.. నూతన వధూవరులైన ఎలిజబెత్‌కు, యువరాజు ఫిలిప్‌కి ఇచ్చిన బహుమానం.. చేత్తో నేసిన ఒక నూలు పంచె. అనవసరంగా షాప్‌ల వెంట తిరుగుతూ, దొరికిందల్లా కొనేవారు.. గొప్పవారింటి ఫంక్షన్‌లకు హాజరవుతూ, తమ స్థోమతకు మించి బహుమతులనిచ్చి తర్వాత కష్టాలు పడేవారూ.. ఈ ఉదాహరణ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. అరువు తెచ్చుకున్న ఊపిరితిత్తులతో శ్వాస పీల్చటం ఎంత కష్టమో.. అరువు తెచ్చు కున్న పేరు ప్రతిష్టలతో జీవించటం కూడా అంతే కష్టమని అనేవారు గాంధీ.

మనిషికి అసలైన ఆభరణం ‘శీలం’. గులాబి పువ్వు.. తాను గులాబిని అని చాటి చెప్పుకోదు. ఎవరైనా తనను చేత్తో నలిపేసినా.. వారి చేతికి గులాబి వాసననిచ్చి తనువు చాలిస్తుంది. ప్రకృతిలో ప్రతిబింబించే ఈ సహజసిద్ధమైన క్షమాగుణాన్ని వ్యక్తుల్లో చూడాలనుకునేవారు గాంధీ. ఒక చెంపమీద దెబ్బపడితే మరో చెంప చూపించమనటం పిరికివాని లక్షణం కాదని... అసలైన ధైర్యవంతుల లక్షణమని, ధైర్యవంతులకు మాత్రమే క్షమించే శక్తి ఉంటుందని అనేవారు. సమాజంలో శాంతియుత సహజీవనానికి వ్యక్తుల్లోని ప్రతీకారభావమే అతిపెద్ద ఆటంకమని.. కన్నుకు కన్ను అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తే.. ప్రపంచమంతా గుడ్డిదవుతుందని గాంధీ అభిప్రాయం. ఒకరోజు మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో గాంధీ పర్యటిస్తున్నారు. ఒక మతం వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి.. తన ఇద్దరు పిల్లల్ని వేరే మతం వారు చంపేశారనీ, వారిని చంపేవరకు తన పగ చల్లారదని ఊగిపోయాడు. గాంధీజీ అతనిని వేచి ఉండమని చెప్పి.. కొంతసేపటి తర్వాత ఒక చిన్న బాలుడ్ని పిలిపించారు. కోపంతో ఉన్న ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచారు...‘‘ఈ బాలుడు మత ఘర్షణల్లోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇతని తల్లిదండ్రులను చంపిన వారు కూడా నీ మతం వాళ్లే. ఇతనిని నీతో తీసుకెళ్లి నీ కొడుకుగా పెంచు’’ అన్నారు. అప్పటివరకూ ప్రతీకారంతో ఊగిపోయిన ఆ వ్యక్తి... గాంధీ మాటలు విన్నాక పశ్చాత్తాపంతో మోకరిల్లాడు. ఉగ్రవాదం, మత కలహాలతో.. సమాజంలో ద్వేషం, అశాంతి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. గాంధీజీ మార్గం ఎంత సహజమైంది! ఎంత శాశ్వతమైంది!!

జీవితంలో ప్రతికూల పరిస్థితులు అందరికీ ఎదురవుతాయి. కొందరు వాటిని ప్రగతికి అవరోధంగా భావిస్తే.. మరి కొందరు సానుకూల దృక్పథంతో తమకు అనువుగా మార్చుకుంటారు. దక్షిణాఫ్రికాలో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత.. దక్షిణాఫ్రికా ప్రధానమంత్రికి గాంధీజీ రాసిన లేఖ సారాంశం ఏంటంటే?... ‘‘ఒక సంవత్సరం పాటు నిరాటంకంగా చదువుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు’’అని. జైల్లో ఉన్నప్పుడల్లా వీలైనంత సమయం చదువులో గడిపేవారు గాంధీ. క్షణం కూడా తీరిక లేకుండా ఉంటే మనసు ఎక్కడికి పరిగెత్తదని.. పిచ్చి పిచ్చి ఆలోచనలు రావని ఆయన అనేవారు. జైల్లోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ అధ్యయనం చేశారు గాంధీ. ఒక్కోసారి జైలు గదిలో ఉండి బయట వెలుగుతున్న చిన్న దీపం కాంతిలో.. గంటల తరబడి చదువు కునేవారు. జైల్లోనే తమిళం కూడా నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రాచీన గ్రంథాలు (క్లాసిక్స్) చదవాలనేవారాయన. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న కథలు వాస్తవంగా జరిగాయా లేదా అనే వితండవాదం కంటే... అందులో చెప్పిన అంశాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి, ఆచరించాలనేవారు.
 
‘‘ఎప్పుడైనా, ఏవైనా సందేహాలు వచ్చినా... నిరాశ, నిస్పృహ ఆవరించినా.. నాకు ఒకే ఒక చోట మనశ్శాంతి లభిస్తుంది.. అదే భగవద్గీత. భగవద్గీతను చదువుతుంటే.. ఏదో ఒక శ్లోకంలో నా సమస్యకు పరిష్కారం దొరికేది. నా జీవితంలో ఎన్నో అశాంతులు, విషాదాలు అనుభవించినా.. అవి నన్ను శాశ్వతంగా ప్రభావితం చేయలేకపోవటానికి కారణం భగవద్గీతే’’ అంటారు గాంధీ. మతం అంటే శిలా విగ్రహాలను ఏకాగ్రతతో చూస్తుండటం.. దేవాలయాల్లో ప్రదక్షణలు చేయటం.. దేవతల రూపాల ముందు సాష్టాంగపడటం.. జంతు బలుల ద్వారా ఆలయాలను రక్తసిక్తం చేయటం కాదని... ప్రశాంత హృదయంతో సమస్త ప్రాణికోటిని చల్లగా చూడటమని ఆయన విశ్వాసం. మనల్ని, మన పనుల్ని, మన ఆత్మకు జవాబుదారీగా చేసేదే మతం అని ఆయన నిర్వచనం. ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకుంటే.. ఏ నాగరికుడు, మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడడు.

‘‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడు పడవోయ్’’ అన్న గురజాడ మాటలను మనం ఎంత అర్థం చేసుకున్నామో కాని.. గాంధీజీ ప్రతి చర్యలో నిస్వార్ధం, సేవాతత్పరతే తొణికిసలాడతాయి. ఒకరోజు సహచరులతో కలిసి రైలు ఎక్కుతున్నారు గాంధీజీ. ఎక్కే హడావిడిలో ఆయన కాలికి ఉన్న చెప్పు జారి, ప్లాట్‌ఫారానికి పట్టాలకు మధ్య పడిపోయింది. రైలు కదులుతోంది.. పడిన చెప్పును తీసే అవకాశం లేదు. అందర్ని ఆశ్చర్యపరుస్తూ.. గాంధీ వెంటనే తన రెండో చెప్పును కూడా తీసి, అక్కడే జారవిడిచారు. విస్తుపోయిన అనుచరులతో గాంధీ ఇలా అన్నారు..‘‘ మొదటి చెప్పు దొరకపుచ్చుకున్న పేదవాడు, రెండోది కూడా తీసికొని ఆనందిస్తాడు. ఎవరికైనా చెప్పుల జత ఉంటేనే కదా ఉపయోగపడేది’’. ఇలాంటివన్నీ చిన్న చిన్న స్పందనలే. కాని ఆయనలో అణువణువు స్పందించబట్టే కదా అంత సహజంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు వింటే మహాభారతంలో ధర్మరాజు మాటలు గుర్తుకు వస్తాయి.

‘‘స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్య మిన్ద్రియ నిగ్రహః’’
(తన ధర్మం నుంచి చలించకుండా ఉండటం సైర్థ్యం. ఇంద్రియాల ఆవేశాన్ని నిగ్రహించట ధైర్యం.)

ఈ రెండు గాంధీజీలో కనిపిస్తాయి. ఒకసారి ఒక పాశ్చాత్య పాత్రికేయుడు గాంధీజీని ఇలా ప్రశ్నించాడు. ‘‘మీరు ఒక అడవిలో వెళుతున్నారు. మీరు చూస్తుండగానే ఒక జింక పరిగెత్తుతూ పారిపోయి, దగ్గరలో ఉన్న పొదలో దాక్కుంది. దాన్ని వెంబడిస్తూ వచ్చిన వేటగాడు.. మీ దగ్గరకు వచ్చి పారిపోయిన ఆ జింకను మీరు ఏమైనా చూశారా అని అడిగాడు. మీరు ఏం సమాధానం చెబుతారు? చూసానని చెబితే ఎక్కడ దాక్కుందో చెప్పెయ్యాలి. అలా చెబితే ఆ జింక వేటగాడి చేతిలో చనిపో తుంది. అహింసా నియమాన్ని అతిక్రమించినవారు అవుతారు. ఒకవేళ చూడలేదని చెబితే సత్యాన్ని వీడినవారవుతారు’’ అని అన్నాడు.. గాంధీజీ బాగా ఆలోచించి నేను మౌనంగా ఉంటానని సమాధానమిచ్చారు. అలా చెప్పటం ద్వారా.. తన సిద్ధాంతాలైన అహింస, సత్యం తప్పకుండా తన ధర్మం నుంచి చలించకుండా ఉండగలిగారు. కాస్త పొగిడితేనే మనం నేల విడిచి సాము చేస్తాం. అందరు మహాత్మా అంటున్నా తాను ఆ పదానికి సరితూగనని అనేవారు గాంధీ.
 
గాంధీజీ ఆత్మకు వారసులైన నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, ఆంగ్‌సాన్ సూకీ మొదలైన వారికి ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతి... గాంధీజీకి ఇవ్వలేదు. బుద్ధుడికి, మహావీరుడికి, క్రీస్తుకి ఏ బహుమతి ఇచ్చారు? బహుశా నోబెల్ బహుమతిని గాంధీజీకి ఇస్తే.. గాంధీజీ స్థాయి తగ్గిపోతుందని భావించారేమో. టిబెట్ నేత దలైలామాకు నోబెల్ ఇచ్చినపుడు.. ‘‘దలైలామాకు నోబెల్ బహుమతి ఇవ్వటం ద్వారా గాంధీజీకి నివాళులు అర్పించగలుగుతాం’’ అంది నోబెల్ కమిటీ. ఏసుక్రీస్తు మానవాళికి ఎక్కడికెళ్లాలో లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. గాంధీజీ అక్కడికి ఎలా వెళ్లాలో ఆచరించి చూపారు అంటారు... మార్టిన్ లూథర్ కింగ్. ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో సందేహాలు ఆవరిస్తే.. దేశంలోకెల్లా తాను చూసిన అతి నిరుపేద వ్యక్తి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుని, తన నిర్ణయం ఆ పేదవాడికి మేలు చేసేదిగా ఉంటే నిర్ణయం తీసుకోమని.. అలా మేలు చేయనిదైతే నిర్ణయం తీసుకోవద్దని, నిర్ణయాధికారం ఉన్న ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశం చేశారు గాంధీ.

‘‘నిరాశ నిస్పృహలు ఆవరించినపుడు.. నేను చరిత్రను ఒక్కసారి మననం చేసుకుంటాను. చరిత్రలో నియంతలు, దురాక్రమణదారులు, బలగర్వులు ఎంతోమంది వచ్చి వెళ్లారు. వారు అంతా వారి కాలంలో అజేయుల్లా కనిపించినా... చివరికి వారందరి ముగింపు కచ్చితంగా ఒకేలా ఉంటుంది. సహనాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి అని నిరాశ నిస్పృహతో ఉన్న జాతీయోద్యమ నాయకుల్ని ఉద్దేశించి ఆయన ఉత్సాహపరిచారు.

ఒక దేశ కరెన్సీపై ఈ విధంగా రాశారు. ‘‘సమయం అతి విలువైంది. పని చేస్తూ దానిని ఆదా చేయండి. ఎందుకంటే ఖాళీగా ఉండటం దొంగతనంతో సమానం’’, ఇవి గాంధీజీ మాటలే! మనం ప్రతి కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించుకున్నాం. కష్టపడకుండా డబ్బు ఖర్చు చేయాలనుకునే వాళ్లంతా... కరెన్సీ నోటుపై గాంధీ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆయన అన్న మాటల్ని స్మరణకు తెచ్చుకుంటే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. ఆయుధం పట్టనూ లేదు, ఆగ్రహించనూ లేదు. తను నమ్మిన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధితో ఆచరణ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగించగలిగారు. ఆయన ఆలోచించిందే చెప్పారు. చెప్పింది చేశారు. చేసిందే చెప్పారు. సమాజంలో తాను తేదలచిన మార్పుకు తానే నిదర్శనమై చూపారు. అందుకే జాతిపిత జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ...

‘‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం.’’
(మహాత్ముల మనసు, మాట, మార్గం
ఒకే విధంగా ఉంటాయి.)!!
పుండరీకాక్షుని మాటల్లో చెప్పాలంటే...

‘‘కత్తులు లేవు శూలమును గాండీవమున్
మొదలే హుళక్కి నోరెత్తి
ప్రచండ వాక్పటిమనేనియు జాటడు
వైరి మీద దండెత్తగ
సేనలేదు, బలహీనము కాయము
కోపతాపముల్
బొత్తిగ సున్న, యట్టి వరమూర్తి బలశాలి గాంధీ’’
Published on 9/6/2011 7:48:00 PM