Sakshi education logo

Advertisement

గేట్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ చేసే అవకాశం మరోసారి తలుపు తడుతోంది.
Education Newsప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువుదీరేందుకు అదృష్టాన్ని పరీక్షించుకునే వేళ ఆసన్నమవుతోంది. వీటిని సాకారం చేసే గేట్-2018 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్.. గేట్‌గా విద్యార్థి లోకానికి సుపరిచితం. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్‌ఐటీలు, ఇతర జీఎఫ్‌టీఐలలో ఉన్నత విద్య కోర్సుల్లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అదే విధంగా గేట్ స్కోర్ ఆధారంగా మహారత్న, మినీ రత్న, నవరత్న హోదాలు పొందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత కొలువులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థులు ఏటా గేట్ నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాజాగా గేట్-2018 షెడ్యూల్ విడుదలైంది.

మొత్తం 23 పేపర్లలో...
గతంలో మాదిరిగానే మొత్తం 23 పేపర్లలో పరీక్ష జరగనుంది. వీటిలో ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి 21 పేపర్లు, ఇంజనీరింగ్ సైన్స్ కోర్సుల ఔత్సాహికులకు ఎక్స్‌ఈ పేరుతో సంబంధిత సబ్జెక్టుల పేపర్లు, లైఫ్ సెన్సైస్ కోర్సుల ఔత్సాహికులకు ఎక్స్‌ఎల్ పేరుతో సంబంధిత సబ్జెక్టుల పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు తమ అర్హతలకు తగిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం...
  1. గేట్ పరీక్ష ఏ పేపర్‌లోనైనా 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో కంపల్సరీ విభాగంగా పేర్కొనే జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి పది ప్రశ్నలు, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి 55 ప్రశ్నలు మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి.
  2. జనరల్ స్టడీస్ విభాగంలో అధిక శాతం ప్రశ్నలు.. వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన సెంటెన్స్ కంప్లీషన్, వెర్బల్ అనాలజీస్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నుంచే ఉంటాయి.
  3. గేట్ పరీక్ష సబ్జెక్టు పేపర్లలో అడిగే ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయి. అవి.. బహుళైచ్ఛిక ప్రశ్నలు (మల్టిపుల్ ఛాయిస్), న్యూమరికల్ బేస్డ్ ఆన్సర్ ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు లేదా రెండు మార్కులు కేటాయిస్తారు.
  4. పరీక్ష ఆసాంతం ఆన్‌లైన్ విధానంలోనే సాగుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులకు 2018, ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లుగా మొత్తం ఎనిమిది స్లాట్లలో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు పేపర్ ఆధారంగా స్లాట్‌ను కేటాయిస్తారు.

అప్లికేషన్ ఓరియెంటేషన్...
అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఈ క్రమంలో గేట్ వెబ్‌సైట్లో పొందుపర్చిన సిలబస్‌ను పరిశీలించి, వాటిని అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అప్లికేషన్ అప్రోచ్‌తో సాగాలి. అదే విధంగా విద్యార్థులు అనుసరించాల్సిన మరో విధానం మల్టిపుల్ అప్రోచ్. ఒక ప్రశ్నను నాలుగైదు విధానాల్లో సాల్వ్ చేసేలా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం సంబంధిత బేసిక్స్‌పై పట్టు సాధించాలి. అప్పుడు ప్రశ్న ఏ విధంగా వచ్చినా సమాధానమిచ్చే సంసిద్ధత లభిస్తుంది.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం :
గేట్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం.. ప్రాక్టీస్. కేవలం రీడింగ్, నోట్స్ రాసుకోవడానికే పరిమితం కాకుండా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఈ క్రమంలో గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా అడిగే ప్రశ్నల తీరుపై అవగాహన ఏర్పడుతుంది. టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అలవడుతుంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఒకవైపు అకడమిక్స్, ప్రాజెక్ట్ వర్క్ తదితర అంశాలకు సమాంతరంగా గేట్ ప్రిపరేషన్‌కు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.

స్కోర్.. 600కు పైగా ఉండేలా...
100 మార్కులకు నిర్వహించే గేట్ పరీక్షలో పొందిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో 1000 మార్కుల స్కోరింగ్ విధానంలోకి మార్చుతారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఐఐటీల్లో సీటు సొంతం చేసుకోవాలంటే 600కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. ప్రముఖ ఐఐటీల విషయంలో ఈ స్కోర్ 700కుపైగా ఉంటేనే మలి దశ ఎంపిక ప్రక్రియకు అవకాశం లభిస్తుంది. గత గణాంకాలే ఇందుకు నిదర్శనం.

పీఎస్‌యూలకూ గేట్ స్కోర్ :
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహారత్న, నవరత్న, మినీరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇంజనీరింగ్) తదితర హోదాల్లోని నియామకాలకు సైతం గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. నిర్దిష్ట గేట్ స్కోర్ పొందిన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలను ఖరారు చేస్తున్నారు. పీఎస్‌యూ ఎంపిక ప్రక్రియలో మలిదశ అవకాశం అందుకోవాలంటే గేట్ స్కోర్ జనరల్ కేటగిరీలో 750 నుంచి 800కు పైగానే ఉండాలి.

ప్రిపరేషన్ టిప్స్...
సబ్జెక్టు పేపర్ ఏదైనా గేట్ ప్రిపరేషన్‌కు అభ్యర్థులు అనుసరించాల్సిన మార్గాలు..
  • అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్
  • ప్రాక్టికల్ అప్రోచ్
  • ప్రాక్టీస్ ఓరియెంటేషన్
  • కాన్సెప్టులపై అవగాహన పెంపొందించుకోవడం
  • బేసిక్ ఫార్ములాల ఆధారంగా ఒక సమస్యను భిన్న కోణాల్లో పరిష్కరించే విధంగా ప్రాక్టీస్ చేయడం.

అర్హత: బీటెక్/బీఈ, బీఆర్క్, ఎమ్మెస్సీ (సైన్స్/ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్), నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్, నాలుగేళ్ల బీఎస్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా అయిదేళ్ల బీఎస్సీ/ఎమ్మెస్సీ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు అర్హులు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్ విద్యార్థుల విషయంలో మూడో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఫీజు : జనరల్ కేటగిరీ రూ.1500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ రూ.750, మహిళా అభ్యర్థులు రూ.750 చెల్లించి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2017, సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 5, 2017 వరకు.
పరీక్ష తేదీలు: 2018, ఫిబ్రవరి 3, 4, 10, 11.
వెబ్‌సైట్: www.gate.iitg.ac.in

ప్రాక్టీస్, మాక్‌టెస్ట్‌లు...
గేట్‌లో విజయం సొంతం కావాలంటే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వడం ఎంతో అవసరం. అదే విధంగా మాక్‌టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా తమ నైపుణ్యాలపై అవగాహన లభిస్తుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ సబ్జెక్టు పేపర్ల అభ్యర్థుల విషయంలో ఈ దృక్పథం ఎంతో మేలు చేస్తుంది. మూడో ఏడాది నుంచే గేట్‌ను లక్ష్యంగా చేసుకొంటే.. తొలి ప్రయత్నంలో కాకున్నా.. రెండోసారైనా విజయం సాధించేందుకు వీలవుతుంది.
-కోవూరు సుధీర్, గేట్-2017 మెకానికల్ ఫస్ట్ ర్యాంకర్.
Published on 7/25/2017 12:37:00 PM

సంబంధిత అంశాలు