Sakshi education logo

ఇంగ్లిష్‌ మీడియం జీవోలు రద్దు : ఏపీ హైకోర్టు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది.
Education Newsఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమంది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు తెలిపింది. అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం 92 పేజీల తీర్పు వెలువరించింది.

ఇంగ్లిష్‌ మీడియం జీవోలను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలివీ..
  • ప్రాంతీయ, మాతృ భాషగా తెలుగుకు ఓ పెద్ద చరిత్రే ఉంది. స్వాతంత్య్రం తర్వాత తెలుగు భాషాభివృద్ధి కోసం ఓ కమిటీ ఏర్పాటైంది. దీని ఫలితంగానే ‘అధికార తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమి’ ఆవిర్భవించాయి. దీని సిఫారసుల మేరకే ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగు బోధనా మాధ్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు లేకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఓ జీవో ద్వారా ఈ విధానాన్ని మార్చింది.
  • మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా హక్కు చట్ట నిబంధనలను సంతృప్తి పరచలేరు. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అభ్యర్థన మేరకు ఇంగ్లిష్‌ మీడియంను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్న విషయాన్ని చట్ట ప్రకారం తల్లిదండ్రుల కమిటీలు నిర్ణయించజాలవు.
  • 81, 85 జీవోలు జారీ చేసే నాటికి రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు సమాంతరంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి. తద్వారా ఇంగ్లిష్‌ మీడియంలో తమ పిల్లలను చేర్చాలనుకునే వారికి ఆ అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేశామన్న ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదు.

కేసు పూర్వాపరాలు
విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ 20న జీవో 85 (అంతకు ముందు 81) జారీ చేసింది.
  • ఈ జీవోను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్, తూర్పు గోదావరికి చెందిన సుధీష్‌ రాంభొట్ల హైకోర్టులో వేర్వేరుగా గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.
  • ఈ వ్యాజ్యాల్లో తల్లిదండ్రుల కమిటీలు కూడా ఇంప్లీడ్‌ అయ్యాయి. అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపి ఈ ఏడాది ఫిబ్రవరి 14న తీర్పు వాయిదా వేసింది.

సుప్రీం కోర్టుకు వెళతాం: విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఇంగ్లిష్‌ మీడియం జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అపజయంగానో చూడొద్దన్నారు. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు.

మంత్రి ఇంకా ఏమన్నారంటే..
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలని, ఆ తర్వాత ఒక్కో తరగతికి పెంచుకుంటూ పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన చేశారు.
  • ఇదే అంశంపై అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్‌ కమిటీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాయి. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 90 శాతం పేరెంట్స్‌ కమిటీలు తీర్మానం చేశాయి.
  • ఆంగ్ల మాధ్యమంపై అసెంబ్లీలో చర్చించాం. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా స్వాగతించారు. ఇప్పుడు హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేయడం చూస్తుంటే వారి ఆలోచన ఏమిటో అర్థమైంది.
  • బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవడం, ఆంగ్ల మాద్యమంలో విద్యనభ్యసించడం టీడీపీకి ఇష్టం లేదు.
  • తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ.. అన్ని భాషల్లో ప్రాథమిక విద్యను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చాం. బ్రిడ్జి కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. సీఎం ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం సీఎం ఎంత దూరమైనా వెళ్తారు.

న్యాయ పోరాటం చేస్తాం
ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలు ఒకటో తరగతి నుంచే పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఇంగ్లిష్‌ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని నిలిపివేయడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా సుప్రీంకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసి ఆంగ్ల మాధ్యమం కోసం న్యాయ పోరాటం చేస్తాం.
– వై.కోటేశ్వరరావు (వైకే), హైకోర్టు సీనియర్‌ న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్‌
Published on 4/16/2020 7:44:00 PM

సంబంధిత అంశాలు