Sakshi education logo

ఏపీ విద్యా చట్టం బిల్లుకు అసెంబ్లీ రెండోసారి ఆమోదం!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982(సవరణ) బిల్లుకు శాసనమండలి చేసిన సవరణలను తోసిపుచ్చుతూ అసెంబ్లీ జనవరి 23 (గురువారం)న రెండోసారి బిల్లును ఆమోదించింది.
Education Newsగత సమావేశాల్లో తెచ్చిన ఈ బిల్లుపై చర్చించాక అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. అయితే మండలి దీన్ని ఆమోదించకుండా పలు సవరణలు సూచించింది. మండలి సవరణలను తిరస్కరించినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చలో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు మండలి తీరును తప్పుబట్టారు. అసెంబ్లీ గతంలో ఆమోదించిన బిల్లును యధాతథంగా ఉంచాలని సూచించారు.

బిల్లును మండలి తిప్పిపంపడం అన్యాయం
టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారని తిప్పేస్వామి అన్నారు. ప్రతి కుటుంబంపై ప్రభావం చూపే బిల్లు ఇదని, దీన్ని శాసనమండలి తిప్పి పంపడం అన్యాయమన్నారు. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికీ 6వ తరగతి చాలా కీలకమని, ఈ స్థాయిలోనే ఇంగ్లిష్‌లో చదవడం, వినడాన్ని తప్పనిసరి చేయాలన్నారు. అమ్మఒడితో అక్షరాస్యత పెరుగుతుందని, 15 ఏళ్లలో రాష్ట్రం అగ్రగామి అవుతుందన్నారు. కంబాల జోగులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతిపక్షం తిరస్కరించడం బాధాకరమన్నారు. జె.పద్మావతి మాట్లాడుతూ విద్యా విధానంలో సమూల మార్పులు తేవాలన్నది సీఎం ఆలోచనన్నారు. జగన్ అనుకుంటే ఏదయినా జరుగుతుందన్నారు. ‘’నువ్వు అనుకుంటే అవుద్ది స్వామీ.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం స్వామీ..’ అంటూ సీఎంనుద్దేశించి పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే విద్యార్థులకు ఇంగ్లిష్ విద్య తప్పనిసరని ఉషాశ్రీ చరణ్ అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారు? కౌన్సిల్ పెద్దల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? పేదల పిల్లలకు ఇంగ్లిష్ వద్దా? ఇలాంటి నిర్ణయాలతో కౌన్సిల్ చరిత్రహీనురాలవుతుందని నాగేశ్వరరావు తప్పుపట్టారు. జోగారావు మాట్లాడుతూ.. బడుగులకు ఇంగ్లిష్ నేర్పేందుకు నడుంకట్టిన జగన్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. పి.వెంకట్రావ్ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ విద్యను పులిపాలతో పోల్చిన అంబేడ్కర్ స్ఫూర్తితో వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లిష్ నేర్పితే చంద్రబాబుకు వచ్చిన బాధేమిటోనన్నారు. పేద బిడ్డలకు ఉచితంగా ఆంగ్లంలో బోధన అందించేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షం కుటిలబుద్ధితో అడ్డుకుంటోందని అదీప్‌రాజు, మధుసూదనరావు, కె.చినఅప్పలనాయుడు మండిపడ్డారు.

టీడీపీ మోకాలొడ్డడం సరికాదు
అసమానతలు తొలగడానికి పేద పిల్లలకు చిన్నతనం నుంచే ఇంగ్లిష్ విద్య అవసరమని, దీనికి టీడీపీ మోకాలొడ్డడం దారుణమని ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్పారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువపై గౌరవం లేదని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కౌన్సిల్‌లో అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ విద్య ఓ ఆస్తి అని, ఈ లక్ష్యంతోనే జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తున్నారని కరణం ధర్మశ్రీ తెలిపారు. ఇంగ్లిష్ చదువులకోసం గ్రామాల్లో ప్రజలు వలసలు వెళ్తున్నారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మాధ్యమం తీసుకొస్తే విద్యార్థుల మనోధైర్యం పెరుగుతుందన్నారు. పేదలను ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని గొల్ల బాబూరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందించే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
Published on 1/24/2020 1:29:00 PM

సంబంధిత అంశాలు