Sakshi education logo

ఆన్‌లైన్ ‘డిగ్రీ’ కోర్సులతో...లాభమా..నష్టామా !

డిగ్రీ చదవాలని ఉన్నా.. సమయం అందుబాటులో లేదని చింతిస్తున్నారా?! ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ఇంటర్/డిప్లొమాతోనే ఆగిపోయామనే ఆందోళన ఉందా..? అయితే ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. జాతీయ స్థాయిలో టాప్-100 జాబితాలోని ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ కోర్సులు చదివేందుకు అవకాశం లభించనుంది! ఆ డిగ్రీ సర్టిఫికెట్‌తో జాబ్ మార్కెట్‌లో ధీటుగా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. దేశంలో
Career guidance లక్షల మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని భావిస్తున్న కేంద్రం.. యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అందుకోసం టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ‘ఆన్‌లైన్’ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులతో ప్రయోజనాలు, లాభనష్టాల గురించి తెలుసుకుందాం...

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్.. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ట్రెండ్. ఇప్పటికే పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మూక్స్ విధానంలో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశానికి సంబంధించి అవగాహన కల్పించే స్వల్పకాలిక కోర్సులు. ఇవి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు రూపొందించిన సర్టిఫికేషన్స్. ఇటీవల ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పలు ఇన్‌స్టిట్యూట్స్, మూక్స్ ప్రొవైడర్స్... ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐఓటీ వంటి అంశాల్లో ఆన్‌లైన్ విధానంలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. అయితే ఇవి పూర్తి స్థాయి కోర్సులు కావు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో డిగ్రీ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

టాప్-100 ఇన్‌స్టిట్యూట్స్ :
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-100 జాబితాలో నిలిచిన ఇన్‌స్టిట్యూట్‌లల్లో తొలిదశలో పూర్తి స్థాయి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ టీచింగ్-లెర్నింగ్ పరంగా సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు కలిగుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే పలు ఐఐఎంలు, ఐఐటీలు బీటెక్, ఎంటెక్, ఎంబీఏలకు సంబంధించి కొన్ని అంశాలను ఆన్‌లైన్‌లో చదివే అవకాశం కల్పిస్తూ.. వాటికి క్రెడిట్స్ కూడా ఇస్తున్నాయి. అలాగే పలు ప్రైవేటు యూనివర్సిటీలు ఆన్‌లైన్ విధానంలో పూర్తి స్థాయిలో పీజీ కోర్సులను సైతం అమలు చేస్తున్నాయి.

కారణాలు ఇవే..
పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడానికి కారణం ఏంటి? అంటే.. పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. మన దేశంలో వందల సంఖ్యలో యూనివర్సిటీలు.. వేల సంఖ్యలో కాలేజీలు ఉన్నా.. బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం-2018-19 విద్యాసంవత్సరంలో బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో నమోదు 26.3 శాతం మాత్రమే. ఉన్నత విద్యలో చేరుతున్న మారుమూల ప్రాంతాల విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా ఏదో ఒక ఉపాధి మార్గం ఎంచుకోవాల్సి రావడంతో రెగ్యులర్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభించడంలేదు. మరోవైపు 2022 నాటికి జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో నమోదును 30 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచే, వీలున్నప్పుడే చదువుకునేందుకు అవకాశం కల్పించే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టింది.

నచ్చిన కోర్సులకు అవకాశం :
పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు అందించాలని నిర్ణయించినప్పటికీ.. విద్యార్థులకు తాము నచ్చిన కోర్సులు చదివే అవకాశం ఉంటుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. తొలిదశలో ఈ కోర్సులను ఎన్‌ఐఆర్‌ఎఫ్ టాప్-100 ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రమే ప్రవేశపెట్టాలని ప్రకటించడమే ఇందుకు కారణం. గతేడాది టాప్-100 ఇన్‌స్టిట్యూట్స్‌లో..ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలదే పైచేయి. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల సంఖ్య 20 లోపే ఉంది. దాంతో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల పరంగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశం అంతంత మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టెక్నికల్ విద్యార్థులకే ప్రయోజనమా!
టాప్-100 జాబితాలో ఎక్కువగా ఐఐటీలు, నిట్‌లు, ఐఐఎంలే ఉన్నందున టెక్నికల్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థులకే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు అనుకూలమనే వాదన వినిపిస్తోంది. టెక్నికల్ కోర్సుల పరంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంటే క్లాస్ రూం ఇంటరాక్షన్‌తోనే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే..టెక్నికల్ కోర్సుల్లో ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంగా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. మరోవైపు ప్రస్తుతం ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల్లో సైతం ప్రాక్టికాలిటికీ పెద్దపీట వేస్తున్నారు. ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందే అవకాశం పెద్దగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కంప్యూటర్, ఇంటర్నెట్ తప్పనిసరి:
ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సొంతంగా అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్, ఇంటర్నెట్, స్కైప్ వంటివి తప్పనిసరి. గ్రామీణ ప్రాంత వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గంగా ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు అందించాలనేది ప్రభుత్వ విధానం. కాని సదరు విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఓ పేద విద్యార్థి కంప్యూటర్, ఇంటర్నెట్ వంటివి సొంతంగా సమకూర్చుకోవడం కొంత కష్టమేనని చెప్పొచ్చు.

సంప్రదాయ కోర్సులకు ఓకే :
సంప్రదాయ బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల విద్యార్థులకు ఆన్‌లైన్ డిగ్రీ విధానం అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అదే విధంగా ఇంటర్ లేదా డిప్లొమాతో చదువు మానేసి ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తమ కెరీర్ అవకాశాలు మెరుగుపరచుకునేందుకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు దోహదం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్యూర్ సెన్సైస్, లైఫ్ సైన్స్ కోర్సుల్లోనూ ప్రాక్టికల్స్ ద్వారా నైపుణ్యాలు పొందాల్సి ఉంటుంది. వాటి కోసం కొద్ది కాలం క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ విధానం అమలు చేయాలని సూచిస్తున్నారు.

రెండేళ్ల క్రితమే యూజీసీ ప్రతిపాదన :
  • వాస్తవానికి బ్యాచిలర్ స్థాయి ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశ పెట్టాలని రెండేళ్ల క్రితమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(ఆన్‌లైన్ కోర్సెస్/ప్రోగ్రామ్స్) రెగ్యులేషన్స్ 2018 పేరుతో ఈ ప్రతిపాదన చేసింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో టాప్-100 ఇన్‌స్టిట్యూట్స్, న్యాక్ స్కోర్ 3.26 ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు అందించాలని స్పష్టం చేసింది.
  • ఇంజనీరింగ్, లా, మెడిసిన్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపీ, అప్లైడ్ ఆర్ట్స్ మినహా ఇతర ప్రోగ్రామ్‌లను ఆన్‌లైన్ విధానంలో అందించాలని పేర్కొంది. కోర్సు కాల వ్యవధి ఆధారంగా డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను ఇవ్వాలని యూనివర్సిటీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
  • ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల వ్యవధిని మూడేళ్లుగా, పీజీ కోర్సుల వ్యవధిని రెండేళ్లుగా, డిప్లొమా కోర్సుల వ్యవధిని ఒక ఏడాదిగా నిర్ణయించింది. ఇలా ఆన్‌లైన్ లెర్నింగ్‌లో ఒక ప్రోగ్రామ్ వ్యవధి పూర్తయ్యాక పరీక్షలను నిర్దిష్ట పరీక్ష కేంద్రంలో అధ్యాపకుల పర్యవేక్షణలో నిర్వహించాలని స్పష్టం చేసింది.
సత్ఫలితం లభిస్తుందా?
ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల విధానం సత్ఫలితాల్ని ఇస్తుందా? అంటే అధిక శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగం చేస్తూనే డిగ్రీ కోర్సులు చదివేందుకు చక్కటి మార్గంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. టాప్-100 ఇన్‌స్టిట్యూట్స్ అనే నిబంధన కారణంగా ప్రవేశాల సంఖ్య, కోర్సుల సంఖ్య పరంగా పరిమితులు ఏర్పడతాయంటున్నారు. ఇలా కాకుండా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు చదివే అవకాశం కల్పించేలా విధి విధానాలు రూపొందించాలని సూచిస్తున్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది, లక్షల మందికి విద్యావకాశాలు లభిస్తాయని అంటున్నారు.

‘ఆన్‌లైన్’తోపాటు ఆఫ్‌లైన్..
ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల విధానం ఆహ్వానించదగ్గ పరిణామమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోర్సు వ్యవధిలో కొంత సమయం ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు, క్లాస్‌రూమ్ ఇంటరాక్షన్‌కు కేటాయించాలంటున్నారు. తద్వారా విద్యార్థులు తాము ఆన్‌లైన్ విధానంలో నేర్చుకున్న అంశాల్లో తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీల అవసరాలను తెలుసుకొని తమ నైపుణ్యాలు మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మంచి నిర్ణయమే.. కానీ..
డిగ్రీ కోర్సులను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విధానంలో అందించాలనే నిర్ణయం మంచిదే. కాని కొన్ని కోర్సుల విషయంలో ప్రాక్టికల్ ఓరియెంటేషన్ తప్పనిసరి. దీనిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు ఖరారు చేస్తే.. ఆన్‌లైన్ కోర్సుల్లో చేరిన వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఐసీటీ టూల్స్, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఎంతో కీలకం. వీటన్నింటినీ పకడ్బందీగా ఏర్పాటు చేసి కోర్సులు ప్రారంభించాలి.
- ప్రొఫెసర్ డి.ఎన్. రెడ్డి, డెరైక్టర్, C.R.Rao AIMSCS,యూజీసీ మాజీ సభ్యులు
Published on 2/12/2020 5:13:00 PM

సంబంధిత అంశాలు