పది తర్వాత పయనమెటు!

పది తర్వాత ఏం చదవాలి?
ఏ కోర్సు చేయాలి?
ఉద్యోగవకాశాలు ఏమున్నాయి?
Education News చదువుల పయనంలో మొదటి బోర్డు పరీక్షలు రాసిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడీ ప్రశ్నలతో సతమతం అవుతుంటారు. ఎందుకంటే.. ఇక్కడ వేసే అడుగే భవిష్యత్తుకు పునాది అవుతుంది. తప్పటడుగు వేస్తే కెరీర్‌లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అందుకే.. ఈ దశలో తీసుకునే నిర్ణయం విద్యార్థి ఆలోచన, ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. ఈ విషయంలో తోడ్పాటు అందించేందుకు పదోతరగతి తర్వాత కోర్సులు, ఉపాధి అవకాశాలపై సమగ్ర విశ్లేషణ మీ కోసం...

ఇంటర్మీడియెట్
ఇంజనీరింగ్‌కు ఎంపీసీ:
ఇంజనీరింగ్ దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారు ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరవచ్చు. గణితంపై ఆసక్తి, ఒక అంశాన్ని వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు సరైన గ్రూప్ ఎంపీసీ. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. (త్వరలో జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రానుంది). జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు.

ఇప్పుడు సైన్స్‌ పరిశోధనలకు ప్రాధాన్యం పెరగడంతో ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.

బైపీసీతో వైద్యం:
పరిశోధనలంటే బాగా ఆసక్తి ఉండి, వృక్ష, జీవశాస్త్ర సబ్జెక్టులపై ఇష్టం ఉన్నవారికి సరిపడే గ్రూప్ బైపీసీ. ఈ గ్రూప్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉన్నందున ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత కూడా అవసరం.

బైపీసీ తర్వాత నీట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. బైపీసీ తర్వాత బీడీఎస్, పారామెడికల్, అగ్రికల్చర్, హోమియోపతి తదితర కోర్సుల్లో కూడా చేరొచ్చు. లేదంటే వినూత్న కాంబినేషన్లతో డిగ్రీ స్థాయిలో కోర్సులు (బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులు) అందుబాటులో ఉన్నాయి. ఆసక్తినిబట్టి వాటిలో చేరొచ్చు.

సీఈసీ, ఎంఈసీ:
సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం, కొత్త విషయాల అభ్యాసంపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. అంతేకాకుండా ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కామర్స్‌లో నైపుణ్యాలు పొందిన వారికోసం అన్వేషణ సాగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. ఈ గ్రూపులు చదివిన వారు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో బీకాం చేయొచ్చు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు బీకాంలో ఇప్పుడు అనేక స్పెషలైజేషన్స్ వచ్చాయి. ( ఉదా : బీకాం కంప్యూటర్స్, బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ).

అత్యున్నత ప్రమాణాలతో రెసెడెన్షియల్ జూనియర్ కాలేజీలు
ఆశ్రమ తరహాలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులను ఉన్నత శిఖరాల దిశగా నడిపించే వేదికలు ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ముఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటునందించేందుకు ఈ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో సీటు పొందాలంటే ఆయా సంస్థల సొసైటీల సెట్ రాయాలి. ఇందులో సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్ : ఏపీఆర్‌జేసీ సెట్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 10 కాలేజీలు ఉన్నాయి.
వివరాలకు : http://apresidential.cgg.gov.in/

ఆఫర్ చేస్తున్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. వొకేషనల్ కోర్సులు: ఈఈటీ, సీజీడీటీ (కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీ మాత్రమే వొకేషనల్ కోర్సులను ఆఫర్ చేస్తుంది).

తెలంగాణ : టీస్‌ఆర్‌జేసీ సెట్. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 4 కళాశాలలు ఉన్నాయి.
వివరాలకు : http://tsrjdc.cgg.gov.in/

ఆఫర్ చేస్తున్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.

ఇంటర్మీడియెట్ వొకేషనల్
ఇంటర్మీడియెట్‌లో కేవలం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీనే కాకుండా అనేక ఇతర గ్రూపులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో వొకేషనల్ గ్రూపులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్‌‌సషిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్‌స్టక్ష్రన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌ అండ్ ఇంజనీరింగ్, ఎలక్టాన్రిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, డైరీయింగ్, కాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్, డెంటల్ టెక్నీషియన్ వంటి అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్మీడియెట్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. ఈ వొకేషనల్ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ అప్రోచ్, క్షేత్రస్థాయిలో పనిచేసే సన్నద్ధత అవసరం.

వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు
సాగు పద్ధతుల్లో మార్పులు, వ్యవసాయంపై ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో దేశంలోశాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లు వ్యవసాయ కోర్సులు యువతకు బంగారు బాటలు వేస్తున్నాయి.

వ్యవసాయ పాలిటెక్నిక్‌లు:
గ్రామీణ‌ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోనూ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆయా రాష్ట్రాల్లో ఈ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తాయి.

పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొ మా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా.

కోర్సు కాలపరిమితి : డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.

బోధన : డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ - తెలుగు. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ - ఇంగ్లీష్

అర్హత, ప్రవేశాలు:
పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కరిక్యులంలో సేద్య విజ్ఞాన శాస్త్ర అంశాలు, నేల సారం, చీడపీడలు-వాటి యాజమాన్యం, వ్యవసాయ శక్తివనరులు, యంత్ర పరికరాల వాడకం, సాగు పద్ధతులు తదితర అంశాలుంటారుు.

అవకాశాలు:
దేశంలో ఆహార భద్రత సవాలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని బాగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను నేర్చుకునే వారికి కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయ క్షేత్రాలు,టీ గార్డెన్లు, రబ్బర్ ప్లాంటేషన్లలోనూ అవకాశాలుంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు..
ఆంధ్రప్రదేశ్ : మొత్తం సీట్లు - 1315 ( అగ్రికల్చర్ పాలిటెక్నిక్ - 1010, సీడ్ టెక్నాలజీ - 125, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ - 180 )
వివరాలకు : http://www.angrau.ac.in/

తెలంగాణ : మొత్తం సీట్లు - 1015 ( అగ్రికల్చర్ పాలిటెక్నిక్ - 805, సీడ్ టెక్నాలజీ - 90, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ - 120 )
వివరాలకు : http://www.pjtsau.ac.in/

పాలిటెక్నిక్ కోర్సులు
పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందుబాటులో ఉన్న మరో మార్గం పాలిటెక్నిక్ కోర్సులు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు రాచబాటలు వేస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నారుు.

అర్హత:
పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

కోర్సులు:
మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్టిక్రల్ అండ్ ఎలక్టాన్రిక్స్ ఇంజనీరింగ్, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్‌స్టుమ్రెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ), కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్.

మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్టియ్రల్ ఎలక్టాన్రిక్స్, ఎలక్టాన్రిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్; పెట్రో కెమికల్స్; ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్‌ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.

కెరీర్:
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.

కోర్సులు- ఉపాధి వేదికలు:
సివిల్ ఇంజనీరింగ్: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వే లు, సర్వే, వాటర్ సప్లై తదితరాలతో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలుంటాయి. కాంట్రాక్టర్లుగా, డ్రాఫ్ట్‌మెన్‌గా స్వయం ఉపాధి పొందొచ్చు.

మెకానికల్ ఇంజనీరింగ్: మెషినరీ, ట్రాన్‌‌సపోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్‌తో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. యాన్సిలరీ యూనిట్లు, సేల్స్ ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు.

ఎలక్టిక్రల్ అండ్ ఎలక్టాన్రిక్స్ ఇంజనీరింగ్: ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్‌‌సకో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. ఎలక్టిక్ర్‌ టెక్నీషియన్లు, వైండర్లుగా స్వయం ఉపాధిని పొందొచ్చు.

ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్‌‌స, ఎలక్టాన్రిక్ ఇండస్ట్రీస్ తదితరాల్లో అవకాశాలు. సేల్స్, సర్వీసెస్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు.

కంప్యూటర్ ఇంజనీరింగ్: కంప్యూటర్ మెయింటెనెన్స్‌, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి వాటితో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. కంప్యూటర్ సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు.

ఐటీఐ/ఐటీసీ
ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించడంలో కీలకమైన పారిశ్రామిక రంగానికి నైపుణ్యాలున్న శ్రామిక శక్తి ఎంతో అవసరం. ఇలాంటి శక్తిని అందించే ఇంజిన్లు ఐటీఐలు! తొలుత దేశంలో పారిశ్రామికీకరణకు ఊపిరిలూదే క్రమంలో పుట్టిన ఇవి నేడు యువతకు ఉపాధి చూపడంలోనూ, పరిశ్రమల అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఉపాధికి నిచ్చెనలు:
ఇండస్టియ్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్టియ్రల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. పదో తరగతి తర్వాత వీటిలో చేరి, తక్కువ ఖర్చుతో వివిధ విభాగాల్లో శిక్షణ పొందొచ్చు. అనంతరం చిన్న వయసులోనే ఉపాధిని సొంతం చేసుకోవచ్చు.

అర్హత:
ఐటీఐ/ఐటీసీలలో అందుబాటులో ఉన్న చాలా ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు. జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎంపిక కమిటీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు:
ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అభ్యర్థులు తమకు అనువైన వాటిలో చేరవచ్చు. ఫిట్టర్, ఎలక్టీష్రియన్, ఇన్‌స్టుమ్రెంట్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, డ్రాఫ్ట్‌మెన్ మెకానికల్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, పెయింటర్, బుక్ బైండింగ్, కటింగ్ అండ్ స్యూయింగ్ తదితర కోర్సులున్నారుు.
కెరీర్:
కోర్సులు పూర్తిచేసిన తర్వాత మెరిట్ ప్రాతిపదికన అప్రెంటీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థి వేతనం (స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు వెలువడుతుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరవచ్చు.
Published on 4/12/2017 1:43:00 PM

సంబంధిత అంశాలు