తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2017 పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించేందుకు తెలంగాణ సాంకేతిక విద్యా, పరిశోధన మండలి (ఎస్‌బీటీఈటీ) చర్యలు చేపట్టింది.
Education Newsఈ మేరకు ఈనెల 11న పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 పట్టణాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ప్రభుత్వ కాలేజీలు, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాలు, టీఎస్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డులతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీటీఈటీ పేర్కొంది. జనరల్, బీసీ విద్యార్థులు రూ. 350.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 200 పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే పాలిసెట్ పరీక్షలో మ్యాథమెటిక్స్‌లో 60, ఫిజిక్స్‌లో 30, కెమెస్ట్రీలో 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని ఎస్‌బీటీఈటీ వివరించింది. మొత్తంగా 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయని, 36 మార్కులొస్తే అర్హత సాధించినట్లు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. పదో తరగతి పూర్తయి పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పరీక్ష రాయొచ్చని, రాష్ట్రవ్యాప్తంగా 53,470 సీట్లను పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించింది. ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరు కావచ్చని ఎస్‌బీటీఈటీ తెలిపింది. గతేడాది 1,24,747 మంది పరీక్షకు హాజరవగా.. 1,03,001 మంది అర్హత సాధించారు.
Published on 3/13/2017 3:13:00 PM

సంబంధిత అంశాలు