tenthclass telugu medium image

సి.వి.రామన్ జీవిత విశేషాలు ...

ఒక రోజు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రముఖ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఇలియట్ డిగ్రీ తరగతి గదిలోకి ప్రవేశించారు. గదిలో మూడో వరుసలో కూర్చున్న ఓ విద్యార్థిని చూసి ఆశ్చర్యంతో..‘నీవు ఈ క్లాసు విద్యార్థివేనా?’ అని ప్రశ్నించాడు. కళాశాలలో కొత్తగా చేరిన ఆ విద్యార్థి లేచి నిలబడి..‘‘ఔను, సర్ నేను ఈ తరగతి విద్యార్థినే. కాని నా వయసు 13 ఏళ్లు. నేను ఇంటర్ మీడియట్ విద్యను వాల్టేర్ కాలేజీలో పూర్తి చేశాను. నా పేరు సి.వి. రామన్’’ అని సమాధానం నిర్భయంగా చెప్పాడు. ప్రొఫెసర్ వేసిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా చకచకా జవాబు చెప్పాడు. ప్రొఫెసర్, ఆ బాలుని తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. నాటి నుంచి ప్రొఫెసర్ ఇలియట్ ప్రియశిష్యులలో ఒకడయ్యాడు సి.వి. రామన్. ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ గురించి ఈరోజు తెలుసుకుందాం!
మేగజైన్‌లోకి రామన్ వ్యాసం..
రామన్ ఫిజిక్స్ నుంచి పీజీ పూర్తి చేసింనందున భౌతిక శాస్త్రంలో పరిశోధనలు ప్రారంభించారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై రాసిన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభి రుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్లి పరిశోధన చేయమన్నారు. కానీ, ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు. వైద్యులు ఇంగ్లండ్ వాతావరణంలో ఇబ్బందులు ఎదుర్కొంటావని హెచ్చరించారు. దీంతో ఆయన ఇంగ్లండ్ ప్రయాణం రద్దు చేసుకున్నాడు. అనంతరం ఎంఏ చదివి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు.

బాల్యంలోనే గోల్డ్‌మెడల్..:
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తమిళనాడులోని తిరుచునాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. రామన్ విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపుమరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సీ (ఫిజిక్స్)లో యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో నిలిచారు.

ఉపాధ్యాయ వృత్తిలో...:
1917లో ప్రభుత్వ ఫైనాన్స్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్.. యూనివర్శిటీ ఆఫ్ కలకత్తాలో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరారు. అదే సమయంలో కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (ఐఏసీఎస్)లో పరిశోధనను కొనసాగించాడు. ఈ సమయంలో ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో చాలా మంది జాతీయ స్థాయిలో తర్వాత కాలంలో ప్రముఖ శాస్త్రవేత్తలుగా ఎదిగారు. 1920 ఫిబ్రవరి 28న కె.ఎస్ కృష్ణన్‌తో సహా ఐఏసీఎస్‌లో కాంతి విక్షేపణంపై పరిశోధన చేయడం ప్రారంభించారు. తర్వాత కాలంలో ఇది రామన్ ఎఫెక్ట్‌గా రూపుదిద్దుకుంది. రామన్ ఎఫెక్ట్ అన్వేషణలో కె.ఎస్ కృష్ణన్ పాత్ర కూడా ఎంతో ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ఆయన నోబెల్ పురస్కారాన్ని ఉమ్మడిగా అందుకోలేక పోయారు. కానీ, నోబెల్ పురస్కార ప్రసంగంలో ఆయన పేరును ప్రముఖంగా ప్రస్తావించ డం గమనార్హం.

రామన్ ఎఫెక్ట్..:
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుంది ఇది రామన్ ఎఫెక్ట్ ఫలితం. ‘‘కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో వెనుదిరుగుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీని ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు నిర్మాణాల పరిశీలన చేయవచ్చు. పలు పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాలను కూడా పరీక్షించవచ్చు.

నోబెల్ బహుమతి పొందిన తొలి శాస్త్రవేత్త...:
భారతదేశంలోనేగాక ఆసియా ఖండంలోనూ నోబెల్ అందుకున్న మొదటి శాస్త్రవేత్త సర్.సి.వి రామన్. భౌతిక శాస్త్రంలో ‘రామన్ ఎఫెక్ట్’కుగానూ ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. అనంతరం 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
మరికొన్ని అంశాలు..:
  • రామన్ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
  • ప్రముఖ బెనారస్ హిందూ యూనివర్శిటీకి రామన్ శంకుస్థాపన చేశారు.
  • 1947లో సీవీ రామన్‌ను కేంద్ర ప్రభుత్వం మొదటి జాతీయ ప్రొఫెసర్‌గా నియమించింది.
  • లెనిన్ శాంతి పురస్కారం, హ్యగ్స్‌ పురస్కారం, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ కూడా రామన్‌ను వరించాయి.
  • నేటికి వైద్య రంగంలో మందుల విశ్లేషణకు రామన్ ఎఫెక్ట్‌నే వినియోగిస్తున్నారు.
Published on 9/26/2016 11:56:00 AM
టాగ్లు:
Sir CV Raman life history Sir CV Raman Teacher life Nobel prize winner Sir CV Raman National science day Physics scientist Raman

Related Topics