ఏపీ పదో తరగతిలో 10/10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలంటే...

పదో తరగతి మైలురాయిని ఘనమైన ‘గ్రేడ్’తో దాటితే అత్యున్నత కెరీర్ దిశగా అడుగులు పడుతున్నట్లే! మార్చిలో జరగబోయే ‘పది’ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం తాజాగా తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్షల్లో 10/10 గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) సాధనకు సబ్జెక్టు నిపుణుల సూచనలు..
Career Guidanceతెలుగు
 • రోజూ తెలుగుకు కొంత సమయాన్ని కేటాయించి, మనసుపెట్టి చదివితే 10 జీపీఏ సాధించడం కష్టం కాదు. తెలుగు వాచకంలో 12 పాఠాలు, ఉపవాచకం ‘రామాయణం’ ఉన్నాయి. వీటిని ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేయాలి. మొత్తంమీద 12 పాఠాలు, 6 కాండలు ఉన్నట్లు భావించాలి.
 • తొలిదశలో మూడు రోజులకు ఒక పాఠాన్ని (18x3=54 రోజులు) పూర్తిగా చదవాలి. రెండో దశలో రెండు రోజులకు ఒక పాఠాన్ని (18x2=36) పునశ్చరణ చేయాలి. తర్వాత మిగిలిన సమయాన్ని చదివిన అంశాలు మస్తిష్కంలో ఎంతమేరకు పదిలంగా ఉన్నాయో చూసుకోవాలి. వాటిని రాయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇలాచేస్తే పరీక్ష సమయంలో చేతికి అలుపు అనే పరిస్థితి ఎదురుకాకుండా ఉంటుంది.
 • పాఠాలను అవగాహన చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్న ఏ రూపంలో వచ్చినా, తేలిగ్గా సరైన సమాధానం రాయొచ్చు.
 • చదవడం పూర్తయ్యాక ప్రశ్నపత్ర విధానాన్ని అనుసరించి అవగాహన-ప్రతిస్పందన; వ్యక్తీకరణ-సృజనాత్మకత; భాషాంశాల పరంగా పాఠాల వెనుక ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి.
 • భావం, భాష, అక్షర దోషాలు లేకుండా సరిచూసుకోవాలి. సందేహాలుంటే ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ఉదాహరణకు పద్యాలకు ప్రతిపదార్థాలు, పద్య పూరణలు, భావాలు, లఘు సమాధానాలు, వ్యాసరూప సమాధానాలు, భాషాంశాలు తదితర అంశాలు.
 • పాఠాలకు మధ్యలో ఇచ్చిన ‘‘ఆలోచించండి-చెప్పండి’’ అనే వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
 • ప్రతి పాఠానికి చివర ఉన్న, పాఠ్యపుస్తకం చివర్లో ఇచ్చిన పద విజ్ఞానంలోని అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలను క్షుణ్నంగా నేర్చుకుంటే పేపర్-1 బిట్ల సమాధానాలను తేలిగ్గా రాయొచ్చు.
 • రామాయణాన్ని కనీసం నాలుగైదు సార్లు అర్థం చేసుకుంటూ వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే కథ పూర్వాపరాలు, సంఘటనలు బాగా గుర్తుంటాయి. పాత్రలు, వాటి ఔచిత్యం తెలుస్తుంది. సందర్భానుసారంగా గ్రహించిన విషయాలు, కథ మనసులో నిలుస్తుంది. ప్రశ్నలు ఏ రకంగా అడిగినా సమాధానాలు తేలిగ్గా రాయగలరు.
 • ‘సృజనాత్మకత’ కింద లేఖ, వ్యాసం, కరపత్రం, సంభాషణ, వర్ణన, ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, కథ, కవిత తదితర ప్రక్రియల్లో రెండింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నియమ నిబంధనలు పాటిస్తూ వీటిని రాయాలి. పేపర్-2 భాషాంశాలకు సంబంధించి వాక్యాలు-రకాలు, భేదాలుపై పట్టు సాధించాలి.
 • ఆధునిక వచనాలను; కర్తరి, కర్మణి వాక్యాలను; ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలను గుర్తించాల్సి ఉంటుంది. మూడు జాతీయాలను వివరించి రాయాలి. మూడు పదాలు/పదబంధాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయాలి.

జీవశాస్త్రం
 • పాఠ్యాంశాల్లోని అన్ని భావనలను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి.
 • పోషణ-స్వయం పోషణ, పరాన్న జీవ పోషణ; మానవునిలో జీర్ణక్రియ, జీర్ణ గ్రంథులు, విటమిన్లు, పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు.. ఇలాంటివన్నీ భావనలే.
 • పట్టికలు, ఫ్లోచార్టులు, వ్యవస్థీకృత చార్టులు తదితరాలు పరీక్షల కోణంలో ముఖ్యమైనవి. వీటిని అధ్యయనం చేయడం వల్ల అధిక మార్కులు సాధించొచ్చు.
 • పటాలు గీయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆకు అడ్డుకోత, హరితరేణువు, మైటోకాండ్రియా, ఊపిరితిత్తులు, హృదయం, మూత్రపిండం అడ్డుకోత, మానవ విసర్జన వ్యవస్థ, మెదడు, జీవావరణ పిరమిడ్ తదితర పటాలను నేర్చుకోవాలి.
 • గతంలో మాదిరి ప్రయోగాన్ని నేరుగా అడక్కుండా, భిన్నంగా ఇస్తున్నారు. ఉదాహరణకు ప్రయోగ చిత్రం ఇచ్చి వివరించమని అడగొచ్చు. అందువల్ల పరికరాలు, విధానం, పరిశీలనలు, ఫలితాలపై అవగాహన పెంపొందించుకుంటే ప్రశ్న ఏ విధంగా వచ్చినా కచ్చితమైన సమాధానం ఇవ్వొచ్చు. పాఠం చివర ఉన్న ‘అభ్యసనం మెరుగుపరచుకుందాం’ ప్రశ్నలపై దృష్టిసారించాలి. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఎంత పెద్ద సమాచారాన్నయినా క్లుప్తంగా చెప్పడాన్ని కూడా అలవరచుకోవాలి. 10 జీపీఏ సాధనకు ఇవి కీలకం.
 • మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. దీనివల్ల ఏ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలనేది అలవడుతుంది. ఇలా సమాధానాలు రాసేటప్పుడు 1 మార్కు ప్రశ్నకు ఒకట్రెండు వాక్యాలు; రెండు మార్కుల ప్రశ్నకు మూడునాలుగు వాక్యాలు; 4 మార్కుల ప్రశ్నకు ఏడెనిమిది వాక్యాలు సరిపోతాయి. అవసరమైన చోట బొమ్మలు గీయాలి.
 • ఒక మార్కు, రెండు మార్కులు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై దృష్టిసారించాలి. పది గ్రేడ్ పాయింట్ల సాధనకు ఇవి కీలకం. ఎంత పెద్ద సమాచారాన్నయినా క్లుప్తంగా రాయగలిగే నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి.

ఇంగ్లిష్
 • Class X Our World Through English is designed as per CCE.
 • It is a process intertwined with learning which takes place everyday.
 • It includes the discourses that are targeted at a certain level and various skills of language. Students have to prepare for public exams basing on this.
 • When we look at the question paper much weightage ( 37.5%) is given to Reading Comprehension. So prepare accordingly by thorough reading of all the three Readings ( A, B & C ) to answer the questions.
 • Students should know about the speaker of the context and content if all the three readings.
  Ex: Read the following passage.
 • I realized why God has made us like this - to give hope to others.

Now answer the questions:
 1. Who is " I " in the passage?
 2. What did God do to him?
 • At the same time maximum weightage is also given to Grammar (37.5%) for 15 marks in Paper 1 and Vocabulary (37.5% ) for 15 marks in Paper 2.
 • The exercises that are given at the end each Unit will help the students to get full marks.
  Ex: 1) The Defining and Non- Defining Relative Clause in page no 12.
  2) Verb forms in page no 66 & 67.
  3) Prepositions in page no 127.
  4) One word substitutions in page no 29.
 • Students must be aware of the indicators of the Discourses (Creative Expression) while attempting. There are no fixed responses to these questions. Hence they have to keep in mind the indicators.
  Ex: Indicators of a Conversation
  1) It should have 6 to 10 exchanges.
  2) Proper sequence of exchanges.
  3) Use of discourse markers ( well, precisely etc.,)
  4) Dialogues apt to the context.
  5) Well formed sentences.

మ్యాథమెటిక్స్:
 • గణితం సబ్జెక్టుకు రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. ఏ రోజు పూర్తిచేయాల్సిన చాప్టర్లను ఆ రోజే పూర్తిచేయాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
 • ప్రశ్నపత్రం సీసీఈ పద్ధతిలో ఉంటుంది కాబట్టి గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళి, భారత్వం (వెయిటేజీ)పై అవగాహన పెంపొందించుకోవచ్చు.
 • క్లిష్టంగా అనిపించే సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి, శ్రేఢులు, నిరూపక జ్యామితిలోని అన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సిలబస్‌ను డిసెంబర్/జనవరి నాటికి పూర్తిచేయాలి.
 • గణితం.. సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు కాబట్టి, ప్రతి చాప్టర్‌లోని సూత్రాలను ఒకచోట రాసుకొని, నేర్చుకోవాలి.
 • కచ్చితంగా వ్యాసరూప ప్రశ్నల విభాగంలో గ్రాఫ్ సమస్యలు వస్తాయి. కాబట్టి బహుపదులు, రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల చాప్టర్లలోని గ్రాఫ్ సమస్యలు; సాంఖ్యక శాస్త్రం చాప్టర్‌లోని ఓజీవ్ వక్రం గ్రాఫ్ సమస్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి.
 • కచ్చితంగా నిర్మాణ సమస్యలు వ్యాసరూప ప్రశ్నలుగా వస్తాయి. కాబట్టి సరూప త్రిభుజాలు చాప్టర్‌లోని ఇచ్చిన త్రిభుజానికి సరూపంగా ఉండే మరో త్రిభుజాన్ని నిర్మించే సమస్య; వృత్తాలకు స్పర్శరేఖలు-ఛేదనరేఖలు చాప్టర్‌లో వృత్తానికి స్పర్శరేఖలను నిర్మించే సమస్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి.
 • సిద్ధాంతాలు కూడా ముఖ్యమైనవే కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం (థేల్స్ సిద్ధాంతం), పైథాగరస్ సిద్ధాంతం, వాటిపై సమస్యలు, వృత్తఖండ వైశాల్యాన్ని కనుగొనే సమస్యను కచ్చితంగా నేర్చుకోవాలి.
 • 20 మార్కులను బిట్లకు కేటాయించారు. కాబట్టి పది గ్రేడ్ పాయింట్లు సాధించడంలో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి చాప్టర్‌లోని అన్ని బిట్లను ప్రాక్టీస్ చేయాలి.

భౌతికరసాయన శాస్త్రం
 • విద్యా ప్రమాణాల వారీగా భారత్వాన్ని పరిశీలిస్తే విషయావగాహనకు అధిక ప్రాధాన్యముంటుంది. దీనికి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టిసారించాలి.
 • పాఠ్యాంశాల్లోని భావనలను అర్థం చేసుకొని, సొంతంగా వివరించడం, ఉదాహరణలివ్వడం; పోలికలు-భేదాలు చెప్పడం; కారణాలు వివరించడం; విధానాలను విశదీకరించడం అనే అంశాల ఆధారంగా విద్యార్థులు అభ్యసనను కొనసాగించాలి.
 • విద్యార్థులు విషయాన్ని అర్థం చేసుకునేందుకు; సందేహాలను నివృత్తి చేసుకునేందుకు; చర్చించేందుకు ప్రశ్నలు తయారుచేసుకోవాలి.
 • ప్రయోగాలు చేసే విధానాన్ని మాత్రమే కాకుండా పరికరాల అమరిక, నివేదికలు రూపొందించడంపై అవగాహన పెంపొందించుకోవాలి.
 • పాఠ్యపుస్తకంలోని విభిన్న భావనలను అర్థం చేసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించగలిగే నైపుణ్యాలు కలిగి ఉండాలి.
 • భౌతికశాస్త్రంలో భేదాలు రాయడం, ఉదాహరణల ద్వారా వివరించడం, కారణ సంబంధ ఫలితాలను తెల్పడం, కిరణ రేఖాచిత్రాలు గీయడం, ఉత్పాదనలు-అనువర్తనాలు, ఉపయోగాలు, ప్రయోగ కృత్యాలు తదితరాలపై దృష్టిసారించాలి.
 • రసాయనశాస్త్రంలో క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాలు, అణువుల నిర్మాణం, ఐయూపీఏసీ నామకరణ విధానం, పరమాణు ధర్మాలు, ఆవర్తనక్రమం, లోహసంగ్రహణ విధానం, పీహెచ్ విలువలు; రసాయన చర్యలు-రకాలు; తుల్య సమీకరణాలు; పరమాణు సిద్ధాంతాలు; సంకరీకరణం; ఆమ్ల, క్షార లవణాల ఉపయోగాలు; అణువులు-ఆకృతులు తదితరాలపై దృష్టిసారించాలి.
 • ఉష్ణం, కాంతి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం, కార్బన్ దాని సమ్మేళనాలు అధ్యాయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 • భౌతికశాస్త్రంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం అధ్యాయాల నుంచి పటాలు అడిగే అవకాశాలు ఎక్కువ. రసాయనశాస్త్రంలో రసాయన చర్యలు-సమీకరణాలు; ఆమ్ల-క్షార, లవణాలు; పరమాణు నిర్మాణం; లోహ సంగ్రహణ శాస్త్రంలోని పటాలను ప్రాక్టీస్ చేయాలి.
 • బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలిమి; ఏసీ, డీసీ జనరేటర్లు; విద్యుత్ మోటార్; ఎస్, పీ, డీ ఆర్బిటాళ్ల ఆకృతులు; మాయలర్ చిత్రం; విద్యుత్ విశ్లేషణను చూపే పటం; ఆమ్ల ద్రావణంలో విద్యుత్ ప్రభావాన్ని చూపే పటం, కిరణ రేఖా చిత్రాలు, మానవుని కన్ను పటాన్ని నేర్చుకోవాలి.
 • ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలను నేర్చుకోవడం వల్ల స్వల్ప సమాధాన ప్రశ్నలు, బిట్లకు తేలిగ్గా కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు.

సాంఘికశాస్త్రం :
 • ప్రశ్నస్వరూపాన్ని అర్థం చేసుకొని, సమాధానం రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. పాఠ్యపుస్తకంలోని భావనలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి.
 • ‘సమాచార నైపుణ్యం’ నుంచి 12 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. సమాచారాన్ని గ్రాఫ్/పట్టిక రూపంలోకి; అదే విధంగా గ్రాఫ్‌ను సమాచారం రూపంలోకి మార్చాలంటూ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు ఈ విభాగం వీలుకల్పిస్తుంది. అందువల్ల దీనిపై దృష్టిసారించాలి.
 • పాఠ్యపుస్తకంలోని వివిధ చాప్టర్లలో పొందుపరచిన మ్యాపులు, పట్టికలు, గ్రాఫ్‌లకు సంబంధించి రకరకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
 • పర్యావరణ పరిరక్షణ, భూగోళం వేడెక్కడం, జనాభా పెరుగుదలనుఅరికట్టడం, ఆహార పొదుపు, ప్రపంచ శాంతి, స్వచ్ఛ భారత్ తదితర అంశాలపై నినాదాలు రాయాలంటూ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల కొన్ని నినాదాలను ప్రాక్టీస్ చేయాలి.
 • సాంఘికశాస్త్రంలో చాలా ముఖ్యమైన అంశం మ్యాపులు. దీన్నుంచి 12 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేపర్-1కు సంబంధించి భారతదేశం రాష్ట్రాలు-రాజధానులు, నదులు, పర్వతాలు, పీఠభూములు, ఎల్లలు, తీరరేఖలు, సరిహద్దు దేశాలు, ముఖ్య అక్షాంశ, రేఖాంశాలను గుర్తించడం నేర్చుకోవాలి.
 • పేపర్-2లో ముఖ్య దేశాలు; అక్షాంశ, రేఖాంశాలు; సముద్రాల గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఉదా: అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లండ్, జపాన్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక, నైజీరియా, ఈజిప్టు, వియత్నాం తదితర దేశాలు.
 • మ్యాపుల్లో గుర్తించమనే అంశం నేరుగా అడక్కుండా, దాని ప్రాధాన్యతను ఇచ్చి, గుర్తించమంటారు. ఉదా: పాఠశాల విద్యా విప్లవం సంభవించిన రాష్ట్రం, భారత ప్రామాణిక కాల రేఖాంశం..
 • సాంఘిక శాస్త్రంలో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే తప్పనిసరిగా బిట్ పేపర్‌కు ప్రాధాన్యమివ్వాలి. ప్రతి బిట్‌ను బాగా అర్థం చేసుకుంటూ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బిట్లు డెరైక్ట్‌గా కాకుండా విభిన్న కోణాల్లో వస్తున్నాయి. ఉదా: కింది వాటిని కాలం ఆధారంగా వరుసలో అమర్చండి.
Published on 11/27/2017 5:18:00 PM
టాగ్లు:
Tenth Class Guidance

Related Topics