విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ సోపానం... టెట్ ప్రిపరేషన్ ప్లాన్


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆకర్షణీయ వేతనాలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించే ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్‌తో పాటు డీఎస్సీలో మంచి స్కోర్ సాధించాల్సిందే! ఈ నేపథ్యంలో టెట్‌తో పాటు డీఎస్సీ ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్..

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)
ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తోంది. గత ఆగస్టు 25న మరోసారి టెట్ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసినా, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. డీఈడీ, బీఈడీ, భాషా పండిత శిక్షణ, తత్సమాన అర్హత ఉన్న వారందరూ టెట్ రాయొచ్చు. ఎస్‌జీటీ అభ్యర్థులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఔత్సాహికులు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

వెయిటేజ్:
డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించే ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీలో సక్సెస్‌కు టెట్ కీలకం.

సిలబస్:
శిశు వికాసం - పెడగాజి:
  1. ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను ఒకటికి రెండుసార్లు చదవాలి.
  2. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. మనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీ) అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
  3. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్) గురించి అధ్యయనం చేయాలి.
  4. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు? అనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
కంటెంట్ -సోషల్ స్టడీస్:
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూ, జరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి.

సైన్స్: పేపర్-1 కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం ఉత్తమం.

మ్యాథమెటిక్స్: అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. గణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగిస్తే ఎక్కువ ఉపయోగం. మ్యాథ్స్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి.

మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.

Ex: హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం తర్వాత సోపానం ఏది?
  1. సంసర్గం
  2. పునర్విమర్శ
  3. విషయ విశదీకరణం
  4. అన్వయం
Ans: 4

Ex: ‘విద్యార్థి దేన్నీ అసంపూర్తిగా వదిలేయడు’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
  1. ఆత్మవిశ్వాసం
  2. అనుకూల వైఖరి
  3. అభినందన
  4. శాస్త్రీయ వైఖరి
Ans: 1

లాంగ్వేజ్‌లు:
లాంగ్వేజ్ 1, లాగ్వేజ్ 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనపద్ధతులు గురించి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి.

ఇంగ్లిష్:
పేపర్-1, పేపర్-2లలో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. గతంలో నిర్వహించిన టెట్‌లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్; ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్; డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ ఇలా అన్ని అంశాలపైనా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

రిఫరెన్స్ బుక్స్:
కంటెంట్: పేపర్-1:
1-5వ తరగతి టెక్ట్స్ బుక్స్
పేపర్-2: 6-8వ తరగతి టెక్ట్స్ బుక్స్
మెథడాలజీ కోసం-తెలుగు అకాడమీ పుస్తకాలు
విద్యా మనో విజ్ఞాన శాస్త్రం- డీఈడీ, బీఈడీ పుస్తకాలు.

ఏపీ టెట్ శిశు వికాసం, పెడగాజి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు.. అభ్యర్థులు డీఎడ్, బీఎడ్ స్థాయిలో సైకాలజీలో చదువుకున్నవే. వీటితో పాటు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు:
ఛోమ్‌స్కీ, కార్ల్‌రోజర్స్ వికాస సిద్ధాంతాలు.
వైగాట్‌స్కీ అభ్యసన సిద్ధాంతం
బోధన దశలు.
ఉపాధ్యాయ నైపుణ్యాలు.
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం, విద్యా హక్కు చట్టం.

Ex: ‘స్కిమాట’ అనేది?
  1. ప్రవర్తనా నమూనా లేదా సంజ్ఞానాత్మక నిర్మితి
  2. భాషా వికాసం వల్ల ఏర్పడేది
  3. అనర్గళంగా సంభాషించడం
  4. ఒకరకమైన భాషా దోషం
Ans: 1

Ex: మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది?
  1. కొఠారి కమిషన్
  2. మొదలియార్ కమిషన్
  3. నూతన విద్యా విధానం-1968
  4. నూతన విద్యా విధానం- 1986
Ans: 4

టెట్ పరీక్ష విధానం
పేపర్-1
విభాగం మార్కులు
కంటెంట్
మార్కులు
మెథడాలజీ
మొత్తం
చైల్డ్ డెవలప్ మెంట్, పెడగాగి - - 30
లాంగ్వేజ్1(తెలుగు) 24 6 30
లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) 24 6 30
గణితం 24 6 30
పరిసరాల విజ్ఞానం 24 6 30
మొత్తం - - 150

పేపర్-2

చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగాగి - - 30
లాంగ్వేజ్1 (తెలుగు) 24 6 30
లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) 24 6 30
సోషల్ స్టడీస్ (బీఏ, బీకాం అభ్యర్థులకు) 48 12 60
గణితం 24 6 30
సైన్స్ (బీఎస్సీ అభ్యర్థులకు) 24 6 30
మొత్తం - - 150

విద్యార్థికి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ..
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే భావించకూడదు. అది ఒక పోటీ పరీక్ష. ఎందుకంటే అభ్యర్థులు టెట్‌లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో రెండు మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్, కంటెంట్, మెథడాలజీలపై పట్టుసాధించాలి.

సెకాలజీలోని భావనలు, సిద్ధాంతాలు, నియమాలను బట్టీ పద్ధతిలో కాకుండా, తార్కికంగా విశ్లేషించుకొని చదవాలి. సైకాలజీలోని అంశాలను విద్యార్థి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ అభ్యసించాలి.

ఇంగ్లిష్, తెలుగు విభాగంలో అభ్యర్థులు వ్యాకరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.

ప్రస్తుతం ముఖ్యమైన అంశాలను చదవడానికే సమయాన్ని కేటాయించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లిష్, తెలుగు, పెడగాజి విభాగాన్ని అధ్యయనం చేయాలి.

కంటెంట్ విభాగంలో పేపర్-1 రాసే అభ్యర్థులు.. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి. పేపర్-2 రాసే అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. కంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి టెట్‌లో క్లిష్టమైన విభాగం మెథడాలజీ. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు, స్పష్టీకరణాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.

ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి, సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. అప్పుడు ఆయా అంశాలకు ఎక్కువ సమాయాన్ని కేటాయించొచ్చు.
Published on 7/12/2013 4:03:00 PM
టాగ్లు:
TET Preparation plan TET AP TET Guidance TET Exam Study Material AP TET