Advertisement

నాన్-వెజ్ పికిల్స్‌తో వెళితే యు.ఎస్.లో భారీ జరిమానాలు!

అమెరికాలో కొన్నాళ్లు ఉండటానికి వెళ్లేటప్పుడు అక్కడి ఫుడ్‌కి అలవాటయ్యేలోగా ఇబ్బందిపడకుండా ఇక్కడి నుంచి కొన్ని పచ్చళ్లు, స్నాక్స్ తీసుకెళ్లడం సహజం. అయితే కొన్ని యు.ఎస్. ఎయిర్‌పోర్టుల్లో వాటిని అనుమతించడం లేదని అక్కడికి వెళ్లినవాళ్లు కొందరు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లేవారి ఆహారపు అవసరాలని అమెరికా అధికారులు గుర్తించకపోతే ఎలా? (అనసూయమ్మ)

ఈ అంశంపైన ‘హలో అమెరికా’లో ఇప్పటికే కొంత సమాచారం ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించి నాకు అనుభవపూర్వకంగా తెలిసిన తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. అంతా చదివిన తర్వాత కూడా అమెరికా ఈ విషయంలో కొన్ని నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయడం సమంజసం కాదని మీకు అనిపిస్తే, అప్పుడు మళ్లీ నాకు రాయండి (ఈ టాపిక్‌పై పూర్వ సమాచారాన్ని ‘సాక్షి’ హోమ్ పేజీలోకి వెళ్లి ‘హలో అమెరికా’ అర్కైవ్స్‌లో చదువుకోండి).

మన రాష్ట్రం నుంచి ప్రతిరోజూ అనేకమంది విద్యార్థులు, టూరిస్టులు, ఇతర వీసా క్యాటగిరీల వారు అమెరికా వెళుతున్నారు. వీరిలో కనీసం ఒక పికిల్ ప్యాకెట్, లేదా అరిసెల పొట్లం లేకుండా యు.ఎస్. ఎయిర్‌పోర్టుల్లో దిగేవారు ఒక్కరు కూడా ఉండరేమో.

దాదాపు రెండువందల దేశాల నుంచి అనేక వేల రుచుల పట్ల అభిరుచి ఉన్న లక్షలాది మంది ఏటా ఆ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. వీరందరూ అసంఖ్యాక రకాల ఆహార పదార్థాలను అమెరికాలోకి తీసుకువెళ్లినప్పుడే అసలు సమస్య ఏర్పడుతుంది. వాటి నుంచి అమెరికాలోకి ప్రవేశించి, వ్యాప్తిచెందే జంతు, వృక్ష, మానవసంబంధమైన వ్యాధులకు అమెరికా ఇప్పటికే కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించింది.

ఈ మధ్య మేము ఇండియా నుంచి అమెరికాకు తిరిగి చేరుకున్నప్పుడు అక్కడ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనల గురించి మీకు చెబుతాను.

కస్టమ్స్ ఏరియాలోకి వెళ్లకముందే ఒక అధికారి మా దగ్గరకు వచ్చి సూట్‌కేసుల మీద ఉన్న లేబుల్ చూసి ‘తెలుగా?’ అని అడిగి ‘సూట్‌కేసులలో ఏమేం తెస్తున్నారు?’ అని స్వచ్ఛమైన తెలుగులో అడిగాడు. నేను యు.ఎస్. కాన్సులేట్‌లో పనిచేసినవాడిని కాబట్టి అమెరికన్ ఆఫీసర్లు ఏదో ఒక ఇతర భాష అదనంగా నేర్చుకోవడం నాకు కొత్త కాదు. అయితే ఈ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏకంగా అయిదారు భారతీయ భాషలు నిండుగా నేర్చుకున్న అఖండుడు. నన్ను అలా ఉంచే అయిదారుగుర్ని వారి వారి భాషలలో ప్రశ్నలు అడిగి ఆ తర్వాత వారిని కస్టమ్స్ చెకింగ్‌లోకి పంపించాడు.

మేము చాలా కొద్ది పరిమాణంలో పికిల్స్, కొద్దిగా స్వీట్స్ అండ్ శావరీస్ సొంత వినియోగానికి తెచ్చుకుంటున్నామని చెప్పాను. ‘‘వాటిలో నాన్-వెజిటేరియన్ ఏమైనా ఉన్నాయా?’’ అని ప్రత్యేకంగా ఆయన అడిగాడు. లేవని చెప్పాను.

ఆయన హాయిగా నిట్టూర్చి తన ‘గోడు’ కాసేపు నా దగ్గర వెళ్లబోసుకున్నాడు. ‘ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్లలో చాలామంది నాన్-వెజిటేరియన్ పికిల్స్, ఇతర ఎన్.వి. పదార్థాలు తెస్తున్నారు. ఇవి అమెరికా లోపలికి రాకూడదని నిషేధం ఉన్నా అనేకమంది వీటిని తెస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేవారి దగ్గర ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటిని తెస్తున్నవారికి ఇప్పుడు 15వేల డాలర్ల వరకు ఫైన్ కూడా వేస్తున్నాము. ఈ సమస్యని టాకిల్ చేయటానికి నాలాంటి అధికారులకి విదేశీ భాషలు నేర్పడం పైన యు.ఎస్. ప్రభుత్వం లక్షల డాలర్లు ఖర్చు పెడుతోంది.’’

విన్నారు కదా? ఇది ‘లేటెస్ట్, ఫస్ట్ హ్యాండ్ ఇన్‌ఫర్మేషన్’ యు.ఎస్.కి వెళ్లేవారు మాంసాహార ఉత్పత్తులు తీసుకెళితే అక్కడ ఇబ్బందుల్లో పడతారు. శాకాహార పదార్థాలు కూడా వండినవి, పికిల్స్ లాంటివి చాలా కొద్ది పరిమాణంలో అయితేనే అనుమతించే వీలుంటుంది.

Published on 3/29/2013 1:49:00 PM
టాగ్లు:
నాన్-వెజ్ పికిల్స్‌తో వెళితే యు.ఎస్.లో భారీ జరిమానాలు!

Related Topics