Sakshi education logo
Sakshi education logo

ఒక పోస్టు నాదే అనుకుని చదివా

Join our Community

facebook Twitter Youtube
- గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు
గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆ యువకుడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు... తాను చదివింది బీఫార్మసీ అయినప్పటికీ.. ఆర్ట్స్ సబ్జెక్టులపై పట్టుసాధించాడు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. 2012లో జ‌రిగిన గ్రూప్ 2 ప‌రీక్షలో 380 మార్కులు సాధించారు. ఆయన సక్సెస్ స్టోరీ మీ కోసం!!

ఫస్ట్ ర్యాంక్ రావడంపై:
పరీక్ష రాసిన తర్వాత టాపర్లలో ఒకడిగా నిలుస్తానని అనుకున్నా. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలుస్తానని అసలు ఊహించలేదు. చదివింది బీ ఫార్మసీ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకున్నా. కాని టాపర్‌గా నిలవడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ ఫలితం ద్వారా భవిష్యత్తులో నా లక్ష్యాన్ని సాధించి తీరగలననే నమ్మకం పెరిగింది.

విద్యా, కుటుంబ నేపథ్యం:
మాది గుంటూరు జిల్లా, తాడికొండ మండలం బండారుపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబం. పదో తరగతి వరకు బండారుపల్లిలో, ఇంటర్ గుంటూరులో చదివాను. ఆ తర్వాత బీ ఫార్మసీలో చేరాను.

గ్రూప్ 2 వైపు రావడానికి:
చదివింది బీ ఫార్మసీ అయినా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికబద్ధంగా చదివాను. బీఫార్మసీ చదివిన నేను ఆర్‌‌ట్స బ్యాగ్రౌండ్‌తో కూడిన సబ్జెక్టులు ఉండే ఈ కాంపిటీటివ్ పరీక్షల్లో రాణించగలనా? అనుకున్నాను. కానీ సాధించగలను.. అనే నమ్మకమే ముందుకు నడిపించింది. కోచింగ్ కూడా తీసుకోలేదు. గ్రూప్ - 2 లో ఒక పోస్టు నాదే అనే ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు లక్ష్యంగా ఆఫ్షన్ ఇచ్చాను. గ్రూప్1లో విజయం సాధించి ఆర్డీవో కావాలనేదే లక్ష్యం.

ప్రిపరేషన్ ప్లాన్:
ముందుగా సిలబస్‌ను సబ్జెక్టుల వారీగా విభజించుకుని కష్టమైన పేపర్లకు ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఎక్కువ మార్కులు సాధించాలంటే... కచ్చితంగా ప్రామాణిక పుస్తకాలు చదవాల్సిందే. అందుకే దాదాపుగా పాఠ్యపుస్తకాలపై ఆధారపడే ప్రిపరేషన్ సాగించా. పేపర్1 విషయంలో 6 నుంచి పదో తరగతి వరకు టెక్ట్‌బుక్స్‌తోపాటు పత్రికలు, మ్యాగజైన్లు బాగా చదివాను. ప్రధానంగా సాక్షిలో భవిత, విద్యలో గ్రూప్ 2కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ చాలావరకు ఉపయోగపడింది. పేపర్ 2కు బీఎస్‌ఎల్ హనుమంతరావు, రఘునాథరావు పుస్తకాలు చదివాను. పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకాలు చాలావరకు ఉపయోగపడ్డాయి. పేపర్ 3కి అకాడమీ పుస్తకాలతోపాటు, ప్రభుత్వ ఆర్థిక సర్వే చదివాను. పరీక్ష సమయంలో పేపర్ 2 సులువుగానే అనిపించడంతో స్కోరింగ్‌కు అనుగుణంగా జాగ్రత్తగా రాశాను. పేపర్ 3 కొంచెం కష్టంగా అనిపించింది.

రోజుకు ఆరు గంటలు:
పరీక్షకు నాలుగు నెలల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఎన్నిగంటలు చదివాం అనేది ముఖ్యంకాకుండా.. ఎంతసేపు సబ్జెక్టుపై పట్టుసాధించేలా చదివాం.. అనే ధోరణిలోనే ప్రిపరేషన్ ప్రారంభించా. కనీసం రోజుకు ఆరుగంటల చొప్పున చదివాను. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిచ్చాను. అంతేకాకుండా సబ్జెక్ట్ ప్రిపరేషన్‌తోపాటు రివిజన్‌కు చాలా ప్రాముఖ్యత ఇచ్చాను. ఏ రోజు చదివిన సబ్జెక్టును అదే రోజు ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసేవాడిని. వారం తర్వాత అదే సబ్జెక్టును మళ్లీ రివిజన్ చేయడంతో సబ్జెక్టుపై పట్టు పెరిగింది.

ఇంటర్వ్యూ:
ఇంటర్వ్యూ మొత్తం పదిహేను నిమిషాలపాటు జరిగింది. బోర్డు సభ్యులు స్నేహపూర్వక వాతావరణంలో ఇంటర్వ్యూ చేశారు. వ్యక్తిగత, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పలు ప్రశ్నలు అడిగారు.

కోచింగ్ అవసరమా?

ప్రామాణిక పుస్తకాలు చదివి.. ఒకటికిరెండుసార్లు సబ్జెక్టును రివిజన్ చేసుకుని ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగిస్తే అసలు కోచింగ్ అవసరం లేదు. సరైన మెటీరియల్, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు.

గ్రూప్ 2కి ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీ సలహా?
ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచీ పరీక్ష ముందు వరకు అదే పనిగా ఒకే లక్ష్యంతో చదవాలి. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. కచ్చితంగా సాధించి తీరుతా.. అనే దృఢసంకల్పంతో బరిలోకి దిగితే విజయం సాధించడం సులువే. అదేవిధంగా సక్సెస్‌కు రివిజన్, ప్రాక్టీస్ చాలా కీలకం. ఈ రెండూ కచ్చితంగా పాటించితే విజయం వరించడం ఖాయం!!
Published on 4/5/2012 12:25:00 PM

Related Topics