ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమీలోని ముఖ్యాంశాలు తెలియజేయండి?

-ఆర్.అనిల్‌కుమార్, హైదరాబాద్.
civilsఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాక్ అంశాలతో పాటు సమకాలీన పరిణామాలపై దృష్టిసారించడం ముఖ్యం. రాజ్యాంగ రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు-శాసన వ్యవస్థ; న్యాయ వ్యవస్థ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పారిభాషిక పదాలు, ప్రధాన రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి.

ప్రాథమిక హక్కులు-విస్తరణ, విద్యా హక్కు, సమాచార హక్కు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. వివిధ కమిషన్లు, వాటి కూర్పు, ప్రస్తుత చైర్మన్లు వంటి వాటిపై దృష్టిసారించాలి.

దేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థ, పరిణామ క్రమం, నిర్మాణాన్ని తెలుసుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లోని ముఖ్య అంశాలపై దృష్టిసారించాలి. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు/కార్యక్రమాల (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి) గురించి తెలుసుకోవాలి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు; నీతి ఆయోగ్; పేదరికం-నిర్మూలన కార్యక్రమాలు; నిరుద్యోగం-తగ్గించే ఏర్పాట్లు; జనాభా; సహజ వనరులు, పరిశ్రమల విస్తరణ; ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.

జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. జీడీపీలో వివిధ రంగాల వాటాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు; ఎగుమతులు తదితర అంశాలు ముఖ్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విధానాలు, భూ సంస్కరణల గురించి తెలుసుకోవాలి. ఆర్థిక సర్వే, బడ్జెట్‌లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించడం ముఖ్యం.
Tags:
indian polity Indian Economy Constitution competitives
Published on 4/12/2019 4:24:00 PM

Related Topics