English Version

టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు

దేశంలోకెల్లా నూతనంగా ఏర్పడి, నియామకాల్లో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ టీఎస్పీఎస్సీ. ఇది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 83 (2) కింద తెలంగాణ ఏర్పడిన రోజైన 2014 జూన్ 2 నుంచి అమల్లోకొచ్చింది. దీనికి చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్టు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.
TSPSCచరిత్ర
హైదరాబాద్ రాష్ట్రంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీపాషా (1869 - 1911) కాలంలోనే ప్రజాసేవకు ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత 1919 లో ఒక ఫర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పడింది. అనంతరం 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పాటు చేస్తూ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పర్మనా జారీ చేశారు. ఈ కమీషన్‌లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉండేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వేరువేరుగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవి. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Andhra Pradesh Public Service Commission) ఏర్పాటైంది. ఇది 1956 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

కమీషన్ చైర్మన్ & సభ్యులు: కమీషన్‌లో ప్రస్తుతం ఒక చైర్మన్ మరియు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు.

చైర్మన్ : ఘంటా చక్రపాణి

సభ్యులు
  • చింతలగట్టు విఠల్
  • డా.బానోతు చంద్రావతి
  • డా.మొహమ్మద్ మతీనుద్దీన్ ఖాద్రి
  • డి.కృష్ణారెడ్డి
  • డా.కె.రామమోహన్ రెడ్డి
  • సీహెచ్ విద్యాసాగర్ రావు
  • ప్రొ.సైలు చింత
  • బి.మన్మధ రెడ్డి
కమీషన్ నిర్మాణం
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక రాజ్యాంగపరమైన సంస్థ. రాజ్యాంగంలోని 14వ భాగంలో అధికరణ 315 నుంచి 323 వరకు కమీషన్ నిర్మాణం, విధుల గురించి తెలుపుతాయి.
  • అధికరణ 315 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఒక చైర్మన్ మరియు రాష్ట్ర గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులుంటారు (సభ్యుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగలో ప్రస్తావన లేదు). చైర్మన్, సభ్యులను గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు ఏది ముందైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. మౌలిక రాజ్యాంగంలో సభ్యుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉండేది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 62 సంవత్సరాలకు పెంచారు.
  • చైర్మన్, సభ్యులను నియమించడానికి ప్రత్యేకమైన అర్హతలు రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మందిని కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలి. మిగిలిన సగం మందిని రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ మేరకు వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వారిని నియమించుకోవచ్చు.
  • కమీషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ తరహాలోనే తొలగిస్తారు. అధికరణ 317 ప్రకారం అవినీతి (Corruption), అసమర్థత (Incapable), దివాళాతీయడం (Insolvent) వంటి కారణాలపైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి, రాష్ట్రపతి తొలగిస్తారు. అయితే గవర్నరుకు వీరిపై వచ్చిన అభియోగాలు నిరూపితం అయ్యే వరకు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది కానీ తొలగించే అధికారం లేదు.
  • చైర్మన్, సభ్యులు తమ రాజీనామా పత్రాలను గవర్నరుకు సమర్పిస్తారు.
  • వీరి జీతభత్యాలను రాష్ర్టపతి నిర్ణయిస్తారు. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
కమీషన్ విధులు
రాష్ట్ర సర్వీసుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల నియామకానికి పోటీ పరీక్షలు (Competitive Exams) నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
  • టీఎస్పీఎస్సీ పరిధిని పెంచి స్థానిక సంస్థలు, కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు చేపట్టే నియామక ప్రక్రియలను కూడా కమీషన్‌కు అప్పగించారు.
  • గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, రోడ్డు రవాణా సంస్థల నియామకాలు కూడా కమీషనే చేపడుతుంది.
  • వివిధ సాంకేతిక శాఖలు కార్యాలయాల్లో ఇంజనీర్ల నియామకాలు చేపడుతుంది.
  • జిల్లాల్లో, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు (Departmental Tests) నిర్వహిస్తుంది.
  • ఐఏఎస్, ఐపీఎస్‌లకు అర్ధవార్షిక పరీక్షలు (Half Yearly Exams) నిర్వహిస్తుంది.
  • ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన నియామకాలు (Recruitments), పదోన్నతులు (Promotions), బదిలీలు (Transfers), క్రమశిక్షణా చర్యలు (Disciplinary cases) వంటి వాటిపైన ప్రభుత్వానికి సలహాలిస్తుంది.
  • అధికరణ 323 ప్రకారం కమీషన్ తన వార్షిక నివేదికను గవర్నరుకు సమర్పిస్తుంది.
కమీషన్ విధులను తెలిపే అధికరణలు
  • ప్రత్యక్ష నియామకాలు (Direct Recruitment (అధికరణ 320 (1))
  • బదిలీల ద్వారా నియామకాలు (Recruitment by transfer (అధికరణ 320(3)(b))
  • సర్వీసు నియమ నిబంధనలు (Statutory rules relating to services (అధికరణ 320 (3)(a)&(b)
  • క్రమశిక్షణా చర్యలు, నిబంధనలు (Disciplinary cases (అధికరణ 320(3) and regulations 17(1)(a) to (e))
మరికొన్ని విశేషాలు
కమీషన్ నిర్వహించే ఒకటి లేదా రెండింటికి తప్ప అన్ని పోటీ పరీక్షలకు రాత పరీక్షలను తప్పనిసరి చేశారు. మిగిలిన వాటికి కేవలం మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
సమర్థవంతమైన పరిపాలకునికి ఉండాల్సిన లక్షణాలు లేదా నైపుణ్యాలను నిపుణుల కమిటీ గుర్తించి వాటిని కలిగిన వారినే ఎంపిక చేసేలా సిలబస్‌ను రూపొందించమని కమీషన్‌కు సిఫారసు చేసింది.
ఉత్తమ పరిపాలకునికి ఉండాల్సిన నైపుణ్యాలు
  • సమస్య విశ్లేషణ, పరిష్కార సూచన నైపుణ్యం కలిగి ఉండటం (Problem analysis and suggestion of solutions.)
  • సమాజం, ఆర్థిక వ్యవస్థ పై తగిన పరిజ్ఞానం ఉండటం(Knowledge of society and the economy)
  • సాంకేతికతపై కనీస అవగాహన కలిగి ఉండటం (Awareness of technology and its potentiality.)
  • పరిమాణాత్మక నైపుణ్యం, మానసిక సామర్థ్యం కలిగి ఉండటం (Quantitative skills and mental ability.)
  • రాజ్యాంగం, చట్టం, ప్రజా పరిపాలన పరిజ్ఞానం కలిగి ఉండటం (Knowledge of Constitution, Law and Public Administration.)
అన్ని పరీక్షలకు ఒకే నమోదు
 2015లో టీఎస్పీఎస్సీ ఒకేసారి నమోదు ప్రక్రియ (One Time Registration) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఒకసారి నమోదు చేసుకుంటే ఒక శాశ్వత రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దీని ద్వారా భవిషత్తులో జరిగే అన్ని పరీక్షలకు సులువుగా దరఖాస్తు చేయవచ్చు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది ఓటీఆర్ చేసుకున్నారు.
 - ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ లో జరిగే పరీక్షల్లో దాదాపు 90 శాతం పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్ష ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.
 
 కొత్త సిలబస్ ఒక సంస్కరణ
 టీఎస్పీఎస్సీ తెలంగాణ పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకోవడానికి కొత్త సిలబస్‌ను రూపొందించింది. ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొ.హరగోపాల్, వీ.ఎస్ ప్రసాద్, కోదండరామ్, కె.నాగేశ్వర్, చుక్కా రామయ్య వంటి విద్యా నిపుణులు, మేధావులతో సహా దాదాపు 30 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పరీక్షలకు కావాల్సిన సిలబస్, విధివిధానాలను రూపొందించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Tags:
History of TSPSC TS Public Service Commission TSPSC Telangana State Public Service Commission TSPSC History Structure of TSPSC Members of TSPSC Functions of TSPSC TSPSC One Time Registration TSPSC Group I Services TSPSC Group II Services TSPSC Group IV Services Constitution of TSPSC TSPSC Examslist
Published on 3/24/2018 5:58:00 PM

Related Topics