ఉమ్మడి పరీక్షల దిశగా.. టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ).. మార్పుల దిశగా వేగంగా కదులుతోందా? తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పేరుతో సరికొత్త ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుందా? అంటే... అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ఆమోదం కోసం కమిషన్ పంపింది! వీటికి అనుమతి లభిస్తే గ్రూప్స్ పరీక్షల నియామకాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ విధానాన్ని అమలు చేస్తారనే వార్తల నేపథ్యంలో సంబంధిత అంశాలపై విశ్లేషణ...
Education News జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎంత ప్రతిష్టాత్మకమైందో.. రాష్ట్ర స్థాయిలో గ్రూప్స్ పరీక్షలకూ అంతే ప్రాధాన్యం ఉంది. అధిక శాతం మంది అభ్యర్థులు రెండు పరీక్షలకూ సన్నద్ధమవుతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ‘తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ (టీఎస్‌సీఎస్)’ పేరుతో కొత్త తరహా నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని టీఎస్‌పీఎస్సీ ఆలోచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియ తరహాలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతిపాదనలు...
తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రక్రియ, సిలబస్‌కు సంబంధించిన ప్రతిపాదనలను టీఎస్‌పీఎస్సీ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపాయి. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వి.రామకృష్ణయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వీటిని రూపొందించింది. ఈ సిఫార్సులకు ఆమోదం లభిస్తే.. టీఎస్‌సీఎస్ విధానం వచ్చే ఏడాది నుంచే అమలయ్యే అవకాశముంది.

గ్రూప్-1, 2 లకు ఉమ్మడి పరీక్ష :
ప్రతిపాదిత టీఎస్‌సీఎస్ ఎంపిక ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ కేడర్, గెజిటెడ్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. అంటే గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మెరిట్, వారు ఎంపిక చేసుకున్న పోస్టు ప్రాధాన్యం, సదరు పోస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని నియామకాలు ఖరారు చేస్తారు.

మూడంచెల ప్రక్రియ..
యూపీఎస్సీ సివిల్స్ తరహాలో ప్రతిపాదిత తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ కూడా మూడంచెలుగా ఉండనుంది. తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే తదుపరి దశలో డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇందులోనూ విజయం సాధిస్తే నిర్దిష్ట నిష్పత్తి (1:2గా ఉండే అవకాశం)లో అభ్యర్థులను ఎంపిక చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను కలిపి తుది జాబితా రూపొందించే అవకాశముంది. అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్‌లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉండనున్నాయి. ప్రస్తుతం గ్రూప్-2 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తున్నారు. కొత్త విధానం (గ్రూప్-1, గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష) అమలైతే.. గ్రూప్-1 ఔత్సాహికులందరూ గ్రూప్-2కూ హాజరవుతారు. అయితే కేవలం గ్రూప్-2ను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులందరూ గ్రూప్-1కు హాజరవుతారనుకోలేం. ఇలాంటి అభ్యర్థులు టీఎస్‌సీఎస్ విధానంలోని మూడంచెల ఎంపిక ప్రక్రియలో.. ముఖ్యంగా మెయిన్ ఎగ్జామినేషన్ కోణంలో ఇబ్బంది ఎదుర్కొంటారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉమ్మడి సిలబస్ విధానం :
యూపీఎస్సీ, టీఎస్‌సీఎస్ పరీక్షల విషయంలో ఉమ్మడి సిలబస్‌ను అమలుచేసే దిశగా అడుగులు సాగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే జరిగిన యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ సమావేశంలోనే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు ఉమ్మడి సిలబస్ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. దీనికి అన్ని కమిషన్లు ఆమోదం తెలిపాయి. 70 నుంచి 80 శాతం మేరకు సివిల్స్, స్టేట్ సివిల్ సర్వీసెస్‌కు ఉమ్మడి సిలబస్, మిగిలిన సిలబస్‌లో రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను పరిశీలించే అంశాలను చేర్చనున్నారు.

గ్రూప్-3, 4లకూ ప్రత్యేక వ్యవస్థ!
గ్రూప్స్ పరిధిలో ఎక్కువ మంది అభ్యర్థులు రాసే గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల నియామకానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహాలో రాష్ట్ర స్థాయిలోనూ ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ (తెలంగాణ స్టాఫ్ సెలక్షన్ కమిషన్)ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పరీక్షలే...
టీఎస్‌పీఎస్సీ నియామక ప్రక్రియల్లో చేస్తున్న మార్పుల్లోని మరో ప్రధాన అంశం.. అకడమిక్‌గా ఒకే అర్హతగా ఉండే వివిధ స్పెషలైజ్డ్ పోస్టులకు ఇక నుంచి ఉమ్మడి పరీక్షలు నిర్వహించడం. ఉదాహరణకు బీటెక్ అర్హతగా వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం వేర్వేరు నోటిఫికేషన్లు, ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. అయితే, ఇలాంటి ఉద్యోగాలకు ఇకపై ఉమ్మడి పరీక్ష నిర్వహించి.. అభ్యర్థులు పేర్కొన్న శాఖ ప్రాధాన్యం ఆధారంగా నియామకాలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని కూడా యూపీఎస్సీ విధానాన్ని పరిగణనలోకి తీసుకొనే చేపడుతున్నట్లు సమాచారం. యూపీఎస్సీ ఐఈఎస్ పేరుతో జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ చేపడుతున్న విషయం తెలిసిందే.

‘స్టాండింగ్ కమిటీ’లో తుది నిర్ణయం?
త్వరలో అన్ని రాష్ట్రాల కమిషన్లతో యూపీఎస్సీ మరోసారి నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో తుది విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఆ సమావేశంలోనే ఉమ్మడి సిలబస్, స్థానిక సిలబస్‌ల నిష్పత్తిపై స్పష్టత లభించనుంది.

అభ్యర్థులకు కలిసొచ్చే అంశం :
ఉమ్మడి సిలబస్‌తో పాటు తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ విధానం అమలైతే.. అది అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. సివిల్స్ ఔత్సాహికులందరూ గ్రూప్-1, 2లకు కూడా పోటీపడతారు. ఇలాంటి అభ్యర్థులు ఉమ్మడి సిలబస్ విధానం ఆధారంగా ఏకకాలంలో జాతీయ స్థాయిలోని సివిల్స్‌కు, రాష్ట్ర స్థాయిలోని స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సన్నద్ధత సాధించే అవకాశం లభిస్తుంది. గ్రూప్-2ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు మాత్రం ప్రతిపాదిత మూడంచెల ఎంపిక ప్రక్రియలోని రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్ కోసం డిస్క్రిప్టివ్ విధానంలో అధ్యయనం కొనసాగించడాన్ని అవరచుకోవాలి.

వేగంగా ఫలితాలు :
టీఎస్‌సీఎస్‌కు ఆమోదం లభిస్తే ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశముంది. ఇప్పటివరకు గ్రూప్-1, గ్రూప్-2లకు వేర్వేరుగా పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల విడుదల ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజా విధానం అమలైతే పరీక్షల నుంచి ఫలితాల వరకు ఒకే విధానం కారణంగా వేగంగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.

ఆ మూడు సబ్జెక్టుల్లో మార్పులు !
యూపీఎస్సీ సివిల్స్, టీఎస్‌సీఎస్‌కు ఉమ్మడి సిలబస్ ప్రతిపాదనల నేపథ్యంలో స్థానిక అంశాలకు 20 నుంచి 30 శాతం ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. గ్రూప్-1, 2 ఉమ్మడి పరీక్షకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భౌగోళిక శాస్త్రం విభాగాల్లో మార్పులు జరిగే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి సిలబస్ విధానంతో పోలిస్తేప్రస్తుత టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ సిలబస్‌లోని ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ల విషయంలో మార్పులు ఉండకపోవచ్చంటున్నారు. ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ సబ్జెక్టుల్లో మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెబుతున్నారు.

ఉమ్మడి సిలబస్‌తో ఉపయోగం..
యూపీఎస్సీ ఉమ్మడి సిలబస్ నిబంధన అభ్యర్థులకు కలిసొచ్చే అంశమే. సివిల్స్, గ్రూప్స్ ఔత్సాహికులకు ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రతిపాదిత స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు ఆమోదం లభిస్తే.. అభ్యర్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే పంజాబ్, గోవా, యూపీ తదితర ఐదు రాష్ట్రాల్లో ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సబార్డినేట్ సర్వీస్‌లకు, గెజిటెడ్ సర్వీసులకు వేర్వేరుగా ఉమ్మడి పరీక్షల విధానం అమలవుతోంది.
- ప్రొఫెసర్ వి.రామకృష్ణయ్య, మాజీ వీసీ-ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్.
Tags:
Changes in TSPSC Groups exams TSPSC Groups exams changes Telangana public service commission TSPSC Groups Common exams Union public service commission Telangana state civil services examination TSPSC syllabus Screening test TSPSC recruitments TSPSC Group-1 and 2 posts Professor ramakrishnaiah
Published on 1/3/2018 11:23:00 AM

Related Topics