Sakshi education logo
Sakshi education logo

పటిష్ట వ్యూహంతో పక్కా ఫలితం

Join our Community

facebook Twitter Youtube
జనరల్ స్టడీస్‌లో ఇండియన్ పాలిటీ విభాగానిది ప్రత్యేక స్థానం.
Bavitha ఎందుకంటే రాజకీయ, రాజ్యాంగ గతి విధానాలు నిరంతరం మారుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి సారీ తాజా సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి సమకాలీన రాజకీయ పరిణామం రాజ్యాంగంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు అటువంటి అంశాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ పటిష్ట వ్యూహాంతో ముందుకు సాగితేనే పాలిటీలో మెరుగైన మార్కులు సాధించడం సాధ్యమవుతుంది.

ఇండియన్ పాలిటీ లేదా భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ అనే అంశం నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య పరీక్ష ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. పరీక్షను బట్టి ప్రశ్నల సంఖ్య, క్లిష్టతలో తేడాను గమనించవచ్చు. సిలబస్ పరిధి, ప్రశ్నల స్థాయి-సరళిని విశ్లేషించగలిగితే ఇందులో గరిష్ట మార్కులు సాధించవచ్చు.

ఉండే అంశాలు
Bavitha సాధారణంగా ఈ విభాగంలో ఉండే అంశాలు.. రాజ్యాంగ చరిత్ర-రచన, రాజ్యాంగ ఆధారాలు, పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, నిర్దేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ నిర్మాణం, బిల్లులు-రకాలు, శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంట్ కమిటీలు, న్యాయ వ్యవస్థ-సుప్రీంకోర్టు-హైకోర్టు, కేంద్ర-రాష్ట్ర సం బంధాలు, గవర్నర్-ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలు-పంచాయతీ వ్యవస్థ,రాజ్యాంగ సంస్థలు,రాజ్యాంగ సవరణలు.

పరిపాలన-తాజా పరిణామాలు
ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో రాజ్య విధులు, అధికారాలలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలన- సుపరిపాలన, ఈ-గవర్నెన్స్, హక్కుల సమస్యలు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, అంతర్జాతీయ తీవ్రవాదం, పౌర సమాజం వంటి అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.

పశ్నల స్థాయి
ప్రస్తుత పోటీ పరీక్షల్లో బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని క్షుణ్నంగా చదువుతూ తర్కబద్ధంగా, విశ్లేషణాత్మకంగా విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రిపరేషన్ సమగ్రంగా ఉంటుంది. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
 1. జ్ఞానాత్మక లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించే ప్రశ్నలు
 2. విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు
 3. విషయ అనువర్తనాలపై ప్రశ్నలు
జ్ఞానాత్మక లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించే ప్రశ్నలు: ఈ తరహా ప్రశ్నల్లో ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి అభ్యర్థి జ్ఞాపకశక్తిని పరిశీలిస్తారు. వీటికి సమాధానాలు గుర్తించాలంటే విస్తృత పఠనంతోపాటు పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష స్థాయిని బట్టి ఇటువంటి ప్రశ్నల క్లిష్టత మారుతూ ఉంటుంది.

ఉదాహరణ: ఒక రాష్ట్రంలో పంచాయతీ లేదా మున్సిపాలిటీ ల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) రాష్ట్ర ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) జాల్లా కలెక్టర్
4) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమాధానం: 1
వివరణ: ఇటువంటి ప్రశ్నకు సమాధానం గుర్తించడం తేలిక. ఎందుకంటే ఎటువంటి తార్కికత ఉపయోగించాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ప్రశ్నలు ముఖ్యంగా సమాచారానికి సంబంధించిన వాటి విషయంలో ‘రేర్ లేదా రిమోట్’ అంశం విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది.

ఉదాహరణ: ఏ రాజ్యాంగ నిపుణుడు బర్మా (మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2) డాక్టర్ బి.ఎన్. రావు
3) కె.టి.షా
4) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సమాధానం: డాక్టర్ బి.ఎన్. రావు
వివరణ: ఇక్కడ పేర్కొన్న వ్యక్తులు అందరికీ తెలుసు. కానీ వారి గురించి విస్తృత స్థాయిలో చదివితేనే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలం.

విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఒక విషయంపై అవగాహన అనేది నిరంతర సాధన ద్వారానే సాధ్యమవుతుంది.

ఉదాహరణ: కింది వారిలో ఎవరు అత్యధిక ఎన్నికలలో ఓటర్లుగా ఉంటారు?
1) పార్లమెంట్ సభ్యులు
2) రాష్ట్ర విధాన సభ సభ్యులు
3) విధానపరిషత్ సభ్యులు
4) సాధారణ ఓటరు
సమాధానం: రాష్ట్ర విధానసభ సభ్యులు
వివరణ: ఇటువంటి ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో వాటి మధ్య సంబంధం, విస్తృత అవగాహన ఉన్నప్పుడే సమాధానం ఇవ్వడం సాధ్యం. అంతేకాకుండా ఏ ఎన్నికలలో ఎవరు ఓటర్లుగా ఉంటారు? అనే విషయాన్ని విశ్లేషించగలగాలి. రాష్ట్ర విధానసభ సభ్యులు.. రాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధానపరిషత్ సభ్యులను ఎన్నుకోవడమే కాకుండా సాధారణ ఓటరుగా లోక్‌సభ, విధానసభ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లుగా ఉంటారు.

విషయ అనువర్తనకు సంబంధించిన ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నల విషయంలో కేవలం అవగాహన ఉంటే సరిపోదు. లోతుగా ఆలోచించాలి. సహజ ప్రతిభ, విచక్షణా శక్తిని ఉపయోగించాలి.

ఉదాహరణ: ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఉన్న అధికారాలు..?
ఎ) వాయిదా వేసే అధికారం
బి) సవరించే అధికారం
సి) సిఫార్సులు చేసే అధికారం
డి) ఓటు చేసే అధికారం
1) పైవన్నీ
2) ఎ, బి, సి
3) సి, డి
4) ఎ, సి.
సమాధానం: 4.
వివరణ: ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే.. రాజ్యసభకు ద్రవ్య బిల్లుపై ఎటువంటి అధికారం ఉంటుంది? అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. అంతేకాకుండా అవగాహనతోపాటు ఇచ్చిన ఐచ్ఛికాలలో సందర్భాన్ని బట్టి సరిపోయే అంశాలను గుర్తించాలి. ఇందుకు అభ్యర్థికి స్వతాహాగా విచక్షణతోపాటు నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉండాలి.

అంశాల వారీగా
విభాగాల వారీగా చదవాల్సిన అంశాలను, ఎటువంటి ప్రశ్నలు అడుగుతన్నారనే విషయాన్ని పరిశీలిస్తే..
 • రాజ్యాంగ రచన ముఖ్య లక్షణాల విభాగంలో వచ్చే ప్రశ్నలు ప్రధానంగా సమాచారానికి సంబంధించి ఉంటాయి. సమావేశాలు, సంబంధిత తేదీలు, చైర్మన్లు, తీర్మానాలు వంటి వాటిపై నేరుగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
 • ప్రవేశిక రాజ్యాంగ తత్వం అనే అంశం నుంచి ప్రవేశిక లక్ష్యాలు, ఆదేశాలు, వాటి అనువర్తనకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. అదే సమయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను కూడా గుర్తుంచుకోవాలి.
 • ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలపై వచ్చే ప్రతి ప్రశ్న ప్రకరణకు సంబంధించినదై ఉంటుంది. కాబట్టి ప్రకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
 • ప్రాథమిక హక్కులు, విస్తృతి, సుప్రీంకోర్టు తీర్పులు, తాజా పరిణామాలు, రాజ్యాంగ సవరణలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.
 • కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి విభాగంలో ఎన్నిక, ఎంపిక ప్రక్రియ, అర్హతలు, అధికార విధులు, వివిధ స్థాయిల్లో వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి, ప్రధానమంత్రికి సంబంధించి జీకేతో ముడిపడి ఉ న్న అదనపు సమాచారాన్ని సేకరించాలి. ఉదాహరణకు..
 • ఎంత మంది ముఖ్యమంత్రులు రాష్ట్రపతులయ్యారు?
 • అవిశ్వాస తీర్మానాన్ని అత్యధికంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి?
 • కేంద్రంలో ఏ పదవి చేపట్టకుండా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది?
 • కేంద్ర శాసనసభ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ నిర్మాణం అనే అంశంలో ఎన్నిక, అర్హతలు, వివాదాలు, బిల్లులు-రకాలు, పార్లమెంట్ కమిటీలు, పార్లమెంట్-శాసన సభ మధ్య పోలికలు వంటి అంశాలను బాగా చదవాలి.
 • భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు, హైకోర్టు విభాగంలో నిర్మాణం, నియామకం, అధికార విధులు, తాజా పరిణామాలు, జాతీయ న్యాయ నియమకాల కమిషన్, సుప్రీంకోర్టు తాజా తీర్పులను విస్తృతంగా అధ్యయనం చేయాలి.
 • భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశంలో ఆర్థిక వనరుల విభజన, ముఖ్య ప్రకరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్ష కోసం నియమించిన కమిషన్లు, వాటి సిఫార్సులను క్షుణ్నంగా చదవాలి.
 • నూతన పంచాయతీ వ్యవస్థ 73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రత్యేకతలు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, స్థానిక సంస్థల పనితీరు -పరిమితులను సమగ్రంగా ప్రిపేర్ కావాలి.
 • రాజ్యాంగ సంస్థలు, చట్టపర సంస్థలు, రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అనే అంశాన్ని విస్తృత ంగా అధ్యయనం చేయాలి. వీటి నిర్మాణం, నియామకంపై సమకాలీన సమాచార సంబంధ ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
సాధ్యమే
ఇండియన్ పాలిటీలో వివిధ ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లు, కనీస-గరిష్ట వయసులు, జీతభత్యాలు, తొలగింపులు, వివిధ వ్యవస్థల అధికారాలు, విధులు, సమకాలీన సవరణలు..ఇలా విస్తారమైన సమాచారాన్ని చదివి గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రాథమిక సమాచారంపై కనీసం 8-10 ప్రశ్నలు వస్తున్నాయి. అయితే అంశాల విస్తృతి దృష్ట్యా వీటి ప్రిపరేషన్ విషయంలో కొంత మంది అభ్యర్థులు కష్టంగా భావిస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న చిట్కాను పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం ముఖ్య సమాచారాన్ని గుర్తుంచుకోవటానికి సంబంధిత పాఠ్యాంశాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసుకోవాలి. ఉదాహరణకు కనిష్ట-గరిష్ట వయసులు, అర్హతకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే..
 • కనీస వయసు ఉన్న పదవులకు గరిష్ట వయో పరిమితులు ఉండవు. ఉదాహరణ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ.
 • గరిష్ట వయో పరిమితి ఉన్న పదవులకు కనీస వయసు ఉండదు. ఉదాహరణ-సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తులు.
 • పదవీ కాలం ఉన్న పదవీ విరమణ వయసు ఉండదు. ఉదాహరణ-రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ.
 • తొలగింపు ప్రక్రియ, బిల్లుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే..
 • ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మినహా మిగతా ఎవరిని తొలగించాలన్న సదరు తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
 • సాధారణ బిల్లు, రెండో రకం ఆర్థిక బిల్లు విషయంలో తప్ప మిగతా బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు.
 • రాష్ట్ర శాసనసభలో ఏ బిల్లుపై కూడా సంయుక్త సమావేశం ఉండదు. దిగువ సభ మాటే నెగ్గుతుంది.
 • ఇలా పాఠ్యాంశాలను అనుసంధానం చేసుకోవాలి.
పతి అంశం.. సమకాలీనమే
రాజ్యాంగంలోని మూల సూత్రాలు, వివిధ వ్యవస్థలు సమకాలీన రాజకీయాల వల్ల ప్రభావితం అవుతూంటాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, వాస్తవికతకూ గుణాత్మక తేడా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు, వ్యాఖ్యానాలు, సవరణలు తదితర అంశాలకు సమకాలీన సమచారాన్ని జోడించి చదవాలి.

ఉదాహరణ:
 • మత ప్రతిపాదికన రిజర్వేషన్లు వాక్ స్వాతంత్య్రం
 • పార్లమెంట్ సభ్యుల అధికారాలు-అనుచిత ప్రవర్తన
 • నూతన రాష్ట్రాల ఏర్పాటు
 • రాష్ట్ర విధాన మండలి పునరుద్ధరణ
 • జాతీయ న్యాయ నియమకాల కమిషన్
 • స్థానిక సంస్థల నిర్బంధ ఓటింగ్
 • ప్రకరణ 370-జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ప్రతిపాదన
 • గ్రీన్ ట్రిబ్యునల్స్
 • లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థ.
రిఫరెన్స్ బుక్స్
ప్రాథమిక సమాచారం కోసం 1-2 పుస్తకాలు చాలు. కానీ మెరుగైన మార్కులు సాధించాలంటే మాత్రం విస్తృత స్థాయి ప్రిపరేషన్ అవసరం. ఇందుకోసం పలు పుస్తకాలను చదవాల్సి ఉంటుంది.
 • భారత రాజ్యాంగ, రాజకీయాలు-తెలుగు అకాడమీ
 • సమకాలీన సమాచారం కోసం ప్రామాణిక దినపత్రికలు, మ్యాగజీన్లు.
Published on 11/22/2014 11:19:00 AM

Related Topics