Sakshi education logo
Sakshi education logo

పేదరికం ఉన్నా... పోటీలో గెలవడం నేర్చుకున్నా

Join our Community

facebook Twitter Youtube
- అరుణశ్రీ, గ్రూప్-1 విజేత
పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆలంబనగా నిలవాలనే ఆలోచన.. తొలి విజయానికి పునాది వేస్తే.. ఆ విజయం స్ఫూర్తిగా మరో విజయం.. అదే ఉత్సాహంతో మరో విజయంతో అత్యున్నత స్థాయి ఆర్డీఓ పోస్టు సొంతమవడం.. ఇదీ అరుణశ్రీ సక్సెస్ స్టోరీ. పేదరికంపై పోరాడి పేరుకు తగినట్లుగానే డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 వరుస విజయాలతో ప్రకాశించి..  కరీంనగర్ జిల్లాకు చెందిన అరుణశ్రీ స‌క్సెస్ స్టోరీ...
 
ఆలంబనగా నిలవాలన్నదే ఆలోచన :
కుటుంబమంతటికీ నాన్న వస్త్ర వ్యాపారమే ఆదాయం. అది కూడా అరకొర సంపాదనే. దీంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని భావించా. దీనికి మొదటి మార్గం బాగా చదివి దాని ఆధారంగా చక్కటి ఉద్యోగం. ఈ ఆశయానికి ఇంట్లో వారి ప్రోత్సాహం ఉత్సాహాన్ని నింపింది.
 
 
ముందు టీచర్.. తర్వాత ఏసీటీఓ:
2008లో డీఎస్సీలో విజయం సాధించి టీచర్‌గా తొలి ఉద్యోగం పొందాను. అప్పటికి కొంత ఊరట కలిగినా.. ‘ఇంతేనా జీవితం.. ఉన్నత స్థానాలకు చేరుకోవడం పేదరికంతో సాధ్యం కాదా’ అనే అంతర్మథనం నాలో మొదలైంది. అప్పుడే వచ్చిన గ్రూప్-2కు రేయింబవళ్లు శ్రమించి విజయం సాధించి ఏసీటీవోగా ఎంపికయ్యాను. అప్పుడే అనిపించింది.. జీవితంలో ఎదగడానికి పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని.. అది ఓ సాధనమని!
గ్రూప్-1పై దృష్టి:
ప్రయత్నించిన రెండు పరీక్షల్లో సత్ఫలితమే. ఏసీటీఓ మంచి ఉద్యోగమే. కానీ కెరీర్ ఉన్నతి పరిమితం. ‘బాగా కష్టపడితే సీటీఓ స్థాయికి చేరతాం. అంతే కదా’ అనే ఆలోచన తలెత్తింది. ఆ ఆలోచనతో గ్రూప్-1పై దృష్టి సారించా. అదేసమయంలో ఖరీదైన కోచింగ్, నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం? ఇవన్నీ చేస్తేనే గ్రూప్-1 కొట్టడం సాధ్యం.. అనే మాటలు కొంత భయపెట్టినా గత విజయాలే స్ఫూర్తిగా కదిలాను. ధైర్యంగా దరఖాస్తు చేసి..ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రిపరేషన్ ప్రారంభించాను.
ప్రిలిమ్స్‌లో పాసయ్యాను:
దరఖాస్తు సమయంలో ధైర్యంగా ఉన్నప్పటికీ సక్సెస్ కాగలనా? అనే సందేహం. పరీక్షకు లభించిన సమయం కూడా కొంచెమే. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా ఉన్న కొద్ది సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలని భావించాను. అంతకుముందు గ్రూప్-2 ప్రిపరేషన్, మెటీరియల్ కొంత ఉపకరించింది. ప్రిలిమ్స్‌కు నెల ముందు ప్రిపరేషన్ మొదలుపెట్టి ప్రీవియస్ పేపర్లు బాగా పరిశీలించాను. ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నా. 6 నుంచి 10వ తరగతివరకు టెక్ట్స్‌బుక్స్‌ను బాగా ఔపోసన పట్టాను. దీంతో పరీక్ష బాగా రాసి ప్రిలిమ్స్ పాసయ్యాను.
మెయిన్స్‌కు చాలా కష్టపడ్డాను:
కోచింగ్ తీసుకోవాలా? వద్దా? మెయిన్స్ విషయంలో తర్జనభర్జన. చివరికి ప్రతి సబ్జెక్ట్‌కు ఇద్దరు ఫ్యాకల్టీల నోట్స్ సేకరించి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేశాను. సాక్షి విద్య, భవిత బాగా ఫాలో అయ్యాను. మెయిన్స్‌లో కీలకమైన రైటింగ్ కోసం కూడా ప్రాక్టీస్ చేశాను. రోజుకు సుమారు ఎనిమిది గంటలు చదివాను. మెయిన్స్ ‘తెలుగుమీడియంలో రాయగలనా?’ అనే భయం పోయింది. 494 మార్కులతో ఇంటర్వ్యూకి ఎంపికయ్యా.
ఇంటర్వ్యూలోనూ ఇబ్బందే:
ఇరవై నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో అప్పటికే నేను ఏసీటీఓగా పనిచేస్తున్న వాణిజ్య శాఖ సంబంధిత ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. ఇది ఊహించక ఇబ్బంది పడ్డాను. వాణిజ్య పన్నుల శాఖలో వివిధ అధికారుల స్థాయిల గురించి చెప్పండి? వాణిజ్య దుకాణాలకు లెసైన్సులు ఎలా జారీ చేస్తారు? వస్త్ర దుకాణాల నుంచి వసూలు చేస్తున్న వ్యాట్, వ్యాపారుల ఆందోళనల గురించి తెలిసింది చెప్పండి? మీ శాఖలో అవినీతి గురించి వివరించగలరా? ఓట్ ఆన్ అకౌంట్ అంటే? రాష్ట్ర బడ్జెట్‌లో వాణిజ్యపన్నుల శాఖ వాటా? గ్రూప్-1 రాకపోతే ఏంచేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోయాను.
ఆర్డీఓగా ఎంపికయ్యాను:
చివరకు ఫలితాల్లో.. 541 మార్కులతో బీసీ-డీ కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యానని తెలిశాక
జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందం పొందాను. ప్రస్తుతం జీవితంలో ఖాళీగా ఉండటం అనే పదానికి చోటు లేకుండా.. ఉద్యోగ పరిధిలో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం.
Published on 6/21/2012 8:03:00 PM

Related Topics