Sakshi education logo
Sakshi education logo

గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల్లో విజయానికి మార్గాలు...

Join our Community

facebook Twitter Youtube
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు ఫలితాలను కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. మొత్తం 6195 మంది మెయిన్‌కు అర్హత సాధించారు.
Edu news

ఇప్పుడు వీరంతా రెట్టించిన ఉత్సాహంతో మెయిన్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కీలకమైన మెయిన్స్‌లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌2 మెయిన్‌ పరీక్షల్లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

పరీక్ష స్వరూపం :
మెయిన్‌ పరీక్షలను ఈనెల(ఆగస్టు) 29,30 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. మెయిన్‌లో మూడు పేపర్లు 450 మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత విధిస్తారు.

పేపర్‌ 1.. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ:
పేపర్‌1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు, కరెంట్‌ అఫైర్స్, దైనందిన జీవితంలో సైన్స్‌ అనువర్తనాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో తాజా పరిణామాలు, స్వాతంత్య్రోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర; ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్, జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా(ఏపీ ప్రత్యేక దృష్టి), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్,ఏపీ పునర్‌వ్యవస్థీకరణ; డేటా అనాలసిస్‌; లాజికల్‌ రీజనింగ్‌ వంటి మొత్తం 11 టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. కోర్‌ సబ్జెక్టును సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదువుకోవడం ద్వారా ఈ పేపర్‌లో మంచి స్కోరింగ్‌కు అవకాశముంది.

పేపర్‌ 2.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, భారత రాజ్యాంగం :
పేపర్‌ 2లో రెండు ఉప విభాగాలు (పార్ట్‌1, పార్ట్‌2) ఉంటాయి. పార్ట్‌1లో.. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల చరిత్రపై ప్రశ్నలు ఎదురవుతాయి. ఏపీ భౌగోళిక లక్షణాలు, చరిత్ర, సంస్కృతిపై ప్రభావం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక–మత పరమైన పరిస్థితులు, సాహిత్యం, సంస్కృతి, కళలు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, తెలుగు భాష, ఐరోపా వాసుల రాక, కంపెనీ పాలనలో ఆం్ర«ధ, 1857 తిరుగుబాటు–దాని ప్రభావం, సామాజిక చైతన్యం, 1885–1947 మధ్యకాలంలో ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి, సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, విప్లవ సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం; ఆంధ్రోద్యమం పుట్టుక–వ్యాప్తి, ఆంధ్రమహాసభల పాత్ర, 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, వార్తాపత్రికల పాత్ర, గ్రం«థాలయోద్యమం; 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం, పెద్దమనుషుల ఒప్పందం, 1956–2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సామాజిక, సాంస్కృతిక కీలక పరిణామాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. ఇందులో స్కోరింగ్‌కు టాపిక్స్‌ వారీగా ప్రమాణిక పుస్తకాలను ఒకటికి నాలుగుసార్లు చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
పార్ట్‌ 2లో భారత రాజ్యాంగం అంశం ఉంటుంది.

ఇందులో...

 • భారత రాజ్యాంగ స్వభావం, భారత ప్రభుత్వ నిర్మాణం–విధులు;
 • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య న్యాయ, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ,
 • కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, 73, 74 రాజ్యాంగ సవరణలు.
 • భారతదేశం– రాజకీయ పార్టీలు; భారత్‌లో సంక్షేమ యంత్రాంగంపై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రధానంగా ఆయా సిలబస్‌ అంశాలపై తాజా పరిణామాలపై దృష్టిపెట్టి నిశితంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. మెమరీబేస్డ్‌ కాకుండా... సబ్జెక్టును అన్ని కోణాల్లో అవగాహన చేసుకోవాలి. అప్పుడే ప్రశ్నను ఏ రీతిలో అడిగినా సమాధానం గుర్తించే సామర్థ్యం సొంతమవుతుంది.
పేపర్‌ 3... ప్లానింగ్, ఎకానమీ :
పేపర్‌ 3లో.. భారత ప్రణాళికలు, భారత ఆర్థిక వ్యవస్థ–సమకాలీన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో గ్రామీణ సమాజ అభివృద్ధి అంశాలు ఉన్నాయి.
ఈ పేపర్‌ కోసం..
 • భారత ఆర్థిక వ్యవస్థ–ప్రస్తుత స్థితి,
 • ఆర్థిక విధానాలు,
 • వనరులు–అభివృద్ధి,
 • ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్‌ ఫైనాన్స్,
 • జాతీయ ఆదాయం,
 • ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు,
 • ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ–పారిశ్రామిక వృద్ధి,
 • ఆంధ్రప్రదేశ్‌లో వనరుల అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. ఇందులో మంచి మార్కుల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా ఎకనమిక్‌ సర్వేలు, బడ్జెట్‌ ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.

సమయస్ఫూర్తి :
గ్రూప్‌ 2 మెయిన్‌కు ప్రిపరేషన్‌ సాగిస్తున్న అభ్యర్థులు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన సమయమిది. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉన్నందున ప్రిపరేషన్‌ ప్రణాళికను పటిష్టంగా రూపొందించుకోవాలి. విలువైన ఈ సమయాన్ని సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు సిలబస్‌లోని ప్రతి అంశాన్ని చదవడం సాధ్యం కాదు. కాబట్టి ఆయా టాపిక్స్‌ను పరీక్ష దృష్ట్యా ప్రాధాన్య క్రమం గుర్తించి సిద్ధమవ్వాలి. ముఖ్యమైన సదరు కీలకాంశాలను ప్రతిరోజు చదివేలా టైం ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి.

డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌ :
గ్రూప్‌2 మెయిన్‌ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో జరుగుతుంది. దాంతో అధిక శాతం మంది అభ్యర్థులు బిట్స్‌ రూపంలో చదువుతున్నారు. ఇది అంతిమంగా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒక అంశంపై విభిన్న కోణాల్లో అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం ఇచ్చే సమర్థత లభిస్తుంది. డిస్క్రిప్టివ్‌ తరహాలో ప్రిపరేషన్‌ సాగిస్తున్నప్పుడు అభ్యర్థులు ముఖ్యాంశాలను షార్ట్‌ నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. ఈ విధానం వల్ల రివిజన్‌ను వేగంగా ముగించొచ్చు. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్‌ల్లో ఈ తరహా వ్యూహం లాభిస్తుంది.

సమకాలీన అంశాలు :
గ్రూప్‌ 2 ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవడం ఉపయుక్తం. జనరల్‌ సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ తదితర సబ్జెక్ట్‌లకు ఈ తరహా ప్రిపరేషన్‌ సాగించాలి. ఆయా విభాగాల్లో సమకాలీన పరిణామాలను తెలుసు కుంటూనే.. వాటికి నేపథ్యంగా సబ్జెక్ట్‌లో పేర్కొన్న అంశాలను అనుసంధానం చేసుకోవాలి.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం :
అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా.. ఇప్పటివరకు పూర్తిచేసిన అంశాల్లో తమ అవగాహనను విశ్లేషించుకోవాలి. ఇందుకోసం మాక్‌ టెస్టులకు హాజరుకావాలి. టెస్టుల్లో తాము చేసిన పొరపాట్లను గుర్తించి ఏయే టాపిక్స్‌పై మరింత అవగాహన పెంచుకోవాలో తెలుసుకోవాలి. పేపర్‌ వారీగా మాక్‌ టెస్ట్‌లకు హాజరుకావడం విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్‌ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీ, జాగ్రఫీల్లోనూ ప్రాక్టీస్‌ ఓరియెంటేషన్‌ మేలు చేస్తుంది. సమాధానాలు గుర్తించేటప్పుడు తార్కికంగా ఆలోచిస్తూ ప్రాక్టీస్‌ చేయాలి.

రివిజన్‌.. రివిజన్‌ :
అభ్యర్థులు చివరి పది రోజులను కేవలం రివిజన్‌కే కేటాయించాలి. పోటీ పరీక్షల్లో సక్సెస్‌ మంత్ర ‘రివిజన్‌’ అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎంత చదివాం అనే దానికంటే.. చదివింది ఏమేరకు గుర్తుంది అనేది ప్రధానంగా మారింది. బాగా గుర్తుండాలంటే.. ఒక్కో అంశాన్ని కనీసం నాలుగుసార్లు రివిజన్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. రివిజన్‌ సమయంలోనూ మాక్‌ టెస్టులు రాసేందుకు ప్రయత్నించాలి. పరీక్ష తేదీకి వారం ముందు నుంచి పూర్తిగా క్విక్‌ రివిజన్‌ విధానాన్ని అనుసరించాలి. వివిధ పద్ధతుల్లో రాసుకున్న షార్ట్‌ నోట్స్‌లు ఉపయోగించుకుంటూ వేగంగా రివిజన్‌ చేసుకోవాలి.

ఎగ్జామ్‌ టిప్స్‌...

 • ∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాలపై పట్టు సాధించాలి.
 • ∙ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంపై లోతైన అవగాహన అవసరం.
 • ∙సబ్జెక్ట్‌ వారీగా కోర్‌ అంశాలతోపాటు తాజా పరిణామాలను అధ్యయనం చేయాలి. ∙
 • ప్రతి రోజు మూడు పేపర్లు చదివే విధంగా సమయం కేటాయించుకోవాలి.
 • డిగ్రీ స్థాయి పుస్తకాల్లోని ముఖ్యాంశాలను తప్పక చదవాలి. ∙
 • ఎకానమీ వివిధ సర్వేల గణాంకాలను అధ్యయనం చేయాలి.
 • కొత్త మెటీరియల్‌ జోలికి వెళ్లకుండా చదివిన పుస్తకాలనే మళ్లీ మళ్లీ చదవాలి. ∙
 • బేసిక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. టెస్ట్‌ సిరీస్‌లు రాయాలి. ∙
 • ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఆత్మవిశ్వాసంతో మెలగాలి.
Published on 8/14/2019 6:12:00 PM

Related Topics