Facebook LinkedIn Twitter google+  
4ఏళ్లు ఇంజనీరింగ్‌లో రాణించాలంటే...
Engineering 
బీటెక్‌లో అడుగుపెట్టాక నాలుగేళ్ల కోర్సులో అత్యుత్తమంగా రాణించడానికి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగేందుకు నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు..

మానసిక దృక్పథంలో మార్పు
ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థి మొట్టమొదటగా దృష్టి సారించాల్సిన అంశం మానసిక దృక్పథంలో మార్పు. దీన్ని సాధిస్తే లక్ష్యం దిశగా సగం గమ్యం చేరినట్లే. ఎంసెట్‌లో ర్యాంకు కోసం బట్టీ పద్ధతిలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఈ విధానం సరిపడదని తెలుసుకోవాలి. టెక్నికల్, సైన్స్ అంశాల సమ్మేళనంగా ఉండే ఇంజనీరింగ్ కోర్సులో లాజికల్ థింకింగ్, ఎనలిటికల్ స్కిల్స్ ఎంతో అవసరం. అప్పుడే ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించొచ్చు. ఇప్పటి వరకు ఆబ్జెక్టివ్ విధానంలో కొశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో చదివిన విద్యార్థులు ఆ పద్ధతికి స్వస్తి పలికి తులనాత్మక అధ్యయనం చేయాలి. క్లాస్ రూం కల్చర్‌లో నిరంతరం అధ్యాపకులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఇంజనీరింగ్‌లో అడుగు పెట్టిన వెంటనే స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టినట్లు భావిస్తారు. వ్యవహార శైలిలోనూ మార్పు వస్తుంది. కానీ తాము నిర్దిష్ట లక్ష్యంతో ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టామనే భావనను నిరంతరం గుర్తెరిగి నడుచు కోవాలి.

ఆప్టిట్యూడ్ పెంచుకుంటూ
కోర్సులో చేరిన తర్వాత ఆప్టిట్యూడ్‌ను, సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పెంచుకునే విధంగా కృషి చేయాలి. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను పరిశీలించాలి. క్లిష్టంగా తోచిన అంశాలు.. భవిష్యత్తులో ప్రిపరేషన్ ఆధారంగా రాణించగలమా, లేదా అని విశ్లేషించుకోవాలి. కష్టంగా ఉన్న అంశాల కోసం సీనియర్లు, అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉపయుక్తం.

నిరంతర అధ్యయనం
తరగతులకు ప్రతిరోజూ హాజరు కావాలి. క్లాస్ రూంలో బోధించే పాఠాలను శ్రద్ధగా వింటే 50 శాతం మేర సదరు అంశంలో నాలెడ్జ్ సొంతమవు తుంది. దీంతోపాటు విద్యార్థులు లైబ్రరీకి వెళ్లడాన్ని కూడా ఒక అలవాటు గా చేసుకోవాలనేది నిపుణుల సూచన. అధ్యాపకులు సాధారణంగా సిలబస్‌లోని అంశాలకే పరిమితమై బోధిస్తారు. కానీ ఆయా అంశాలపై లోతైన అధ్యయనం, తాజా పరిణామాలపై అవగాహనకు లైబ్రరీలలో అందుబాటులో ఉండే రిఫరెన్స్ బుక్స్, జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్‌ను పరిశీలించాలి. అప్పుడే నిర్దిష్ట అంశంపై పరిపూర్ణత లభిస్తుంది.

ప్రాక్టికల్ అప్రోచ్‌తో ముందడుగు
ఇంజనీరింగ్‌లో ప్రతి సబ్జెక్ట్‌ను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవాలి. దీంతోపాటు సంబంధిత అంశాన్ని ప్రాక్టీస్ చేసే విధంగా.. ప్రతి అంశంపై పేపర్ వర్క్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెమిస్టర్ విధానంలో మూల్యాంకనం చేసే బీటెక్ కోర్సులో ప్రతి అంశం ప్రధానమే అని గుర్తించాలి. పరీక్షలో ఉత్తీర్ణతకు పుస్తకాలు సరిపోతాయి. కానీ భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బుక్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికాలిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులు నిరంతరం గుర్తుంచుకోవాలి.

ఇంటరాక్టివ్ అప్రోచ్
విద్యార్థులు గ్రూప్ డిస్కషన్స్, సీనియర్స్‌తో ఇంటరాక్షన్ ద్వారా సబ్జెక్ట్ అంశాలపై పట్టు సాధించాలి. దీనివల్ల ఇతరుల నుంచి కూడా కొత్త అంశాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తరచుగా లెక్చరర్స్‌ను కలుస్తుండాలి. సందేహం చిన్నపాటిదైనా వెంటనే నివృత్తి చేసుకోవాలి. ఈ విషయంలో బిడియం, సహచరులు ఏమనుకుంటారో అనే మానసిక భావనలకు స్వస్తి పలకాలి. ఆత్మన్యూనతను వీడాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. నిర్దిష్ట సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రతి అంశానికి మధ్య అనుసంధానం ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలో ఒక్క అంశంలో వెనుకంజలో ఉన్నా అది నాలుగేళ్లపాటు కొనసాగి అకడమిక్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలి. ఇంటరాక్టివ్ అప్రోచ్ విషయంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాధనం సోషల్ నెట్‌వర్క్, ఆన్‌లైన్ లెక్చర్స్. ఇంటర్నెట్ వినియోగంతో ఈ రెండు మార్గాల ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో సంప్రదించొచ్చు. ఇటీవల కాలంలో బాగా ఆదరణ పొందుతున్న ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆయా సబ్జెక్ట్ నిపుణులు అందించే వర్చువల్ ట్రైనింగ్ క్లాస్‌లకు హాజరవచ్చు. నలుగురిలో బిడియంగా ఉండే వారికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

లక్ష్యంపై స్పష్టంగా
బీటెక్ తర్వాత భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఉన్నత విద్య, ఉపాధి ఈ రెండింటిలో తమ ప్రాధాన్యం ఏంటో దానికి అనుగుణంగా లక్ష్యం ఉండాలి. స్వదేశంలోనే ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుంటే రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఐఐటీలు, ఇతర జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్. గేట్ లేదా పీజీఈసెట్ రెండింటిలో దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ దిశగా ప్రిపరేషన్‌ను ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచే మొదలు పెట్టాలి. ఈ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సంబంధిత అంశాల నుంచే ప్రశ్నలు ఎదురవుతాయి కానీ ప్రశ్నల తీరు అప్లికేషన్ ఓరియెంటేషన్‌గా ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ సాగించాలి. ఇక.. విదేశాల్లో ఎంఎస్, ఇతర పీజీ కోర్సులు లక్ష్యంగా పెట్టుకుంటే అందుకు సంబంధించిన పనులను కూడా మూడో ఏడాది చివరి నుంచే మొదలుపెట్టాలి. ముఖ్యంగా యు.ఎస్., యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్యను కోరుకునే విద్యార్థులు సంబంధిత అకడమిక్ సెషన్ ప్రారంభానికి ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు చేయాలి. విదేశీ విద్యకు అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇందుకోసం టార్గెట్ డెస్టినేషన్స్, అక్కడి యూనివర్సిటీల వెబ్‌సైట్స్‌ను చూసి ఏ స్థాయి స్కోర్‌కు ప్రవేశాలు ఖరారవుతున్నాయో పరిశీలించాలి. ప్రవేశ ప్రక్రియకు అవసరమైన ఇతర విధివిధానాలు, ఇతర పత్రాల సమాచారం తెలుసుకుని ఇంజనీరింగ్ పూర్తయ్యేనాటికి వాటిని సిద్ధం చేసుకునే విధంగా ఉండాలి.

క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో విజయానికి
బీటెక్ తర్వాత ఉపాధి కోరుకునే విద్యార్థులకు.. తమ చేతిలోనే ఉన్న సాధనం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్. ప్రస్తుతం సంస్థలు పాస్ పర్సంటేజ్‌తోపాటు మరెన్నో అంశాలను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. వాటిలో ప్రధానమైనవి సాప్ట్‌స్కిల్స్‌.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో విజయం సాధించాలనుకునే విద్యార్థులు సదరు కంపెనీలు అప్పటికే నిర్వహించిన కొశ్చన్ పేపర్స్‌ను పరిశీలించడం కూడా కొంత మేలు చేస్తుంది.

దృష్టి సారించాల్సిన ఇతర అంశాలు
అకడమిక్స్, ప్రాక్టికల్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి అంశాలతోపాటు ఇంజనీరింగ్ కోర్సు సమయంలో విద్యార్థులు ఇతర అంశాలపైనా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. వీటితోపాటు ఆయా అంశాలకు సంబంధించి పలు సంస్థలు నిర్వహించే సెమినార్లకు హాజరవడం, అక్కడి నిపుణుల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవడం వంటివి చేయాలి. నాస్కామ్, అసోచామ్, ఫిక్కీ, తదితర సంస్థలు పేర్కొంటున్నట్లు విద్యార్థుల్లో లోపిస్తున్న ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకునే విషయంలో ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కొంతవరకు పాత్ర పోషిస్తున్నాయి.

సబ్జెక్ట్ టు... సొసైటీ
ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.. నిరంతరం సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంటూనే సామాజిక పరిస్థితులు, తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులను తెలుసుకోవాలి. అప్పుడే శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో.. పోటీదారులకంటే ఒకడుగు ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.

రీసెర్చ్ ఓరియెంటేషన్
బీటెక్ విద్యార్థులు థియరాటికల్, ప్రాక్టికల్ అప్రోచ్‌తోపాటు రీసెర్చ్ ఓరియెంటెడ్ అధ్యయనానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. దేశంలో ఆర్ అండ్ డీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే ఈ దృక్పథంతో అడుగులు వేస్తే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తమను తాము తీర్చిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే బిట్స్, వీఐటీ, మణిపాల్ యూనివర్సిటీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్ స్థాయిలోనే రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిస్తూ తమ సంస్థల పరిధిలో సాగుతున్న పరిశోధనల్లో బీటెక్ విద్యార్థులు పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

ఇంటర్న్‌షిప్స్
క్షేత్రస్థాయి నైపుణ్యం సాధించేందుకు, ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందేందుకు దోహదపడే సాధనం ఇంటర్న్‌షిప్స్. అంటే విద్యార్థులు తమ బ్రాంచ్, కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్ణీత వ్యవధిలో పనిచేయడం. వాస్తవానికి మన ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్ లేకున్నప్పటికీ.. విద్యార్థులే స్వయంగా చొరవ తీసుకుని ఈ దిశగా దృష్టి సారించాలి. ఇందుకోసం సీనియర్లు, లెక్చరర్స్, ఇప్పటికే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కాలేజ్ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సులో తొలి ఏడాది అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు దాదాపు ఒకే సిలబస్ ఉంటుంది. కోర్ సబ్జెక్ట్‌ల సిలబస్ రెండో ఏడాది నుంచి మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్న్‌షిప్ విషయంలో రెండో ఏడాది చివర్లో లభించే సెలవుల్లో దృష్టి సారించాలనేది నిపుణుల అభిప్రాయం.

ప్రాజెక్ట్ వర్క్ :
కోర్సులో అత్యంత కీలకమైన అంశం ప్రాజెక్ట్ వర్క్. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. లైవ్ ప్రాజెక్ట్‌లు చేయడానికి కృషి చేయాలి. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు లైవ్ ప్రాజెక్ట్‌లు చేయడం ఎంతో అవసరం. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు లైవ్ ప్రాజెక్ట్స్ దొరకని నేపథ్యంలో సహచరులతో కలిసి సొంతగా ఏదైనా నిర్దిష్ట ప్రోగ్రామింగ్ లేదా అప్లికేషన్‌పై ‘టీం-ప్రాజెక్ట్ వర్క్స్’ చేయొచ్చు. సీనియర్లు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లను కాపీ-పేస్ట్ పద్ధతిలో రిపోర్ట్ తయారు చేస్తే.. తర్వాత ఎదురయ్యే వైవాలో చుక్కెదురయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వర్‌‌క కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ హెడ్స్, సీనియర్‌‌స సహకారం తీసుకోవాలి.


Engineering 3-సి దృక్పథంతో విజయాలు
ఇంజనీరింగ్ విద్యార్థులు 3-సి (కాన్సెప్ట్స్, కాంటెంపరరీ నాలెడ్జ్, కాంపిటీటివ్‌నెస్) దృక్పథంతో వ్యవహరిస్తే నాలుగేళ్ల కోర్సులో సులువుగా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా లెక్చర్స్‌పైనే ఆధారపడకుండా స్వీయ అధ్యయనం దిశగా కృషి చేయాలి. స్పూన్ ఫీడింగ్ ఆలోచనకు స్వస్తి పలకాలి. టెక్నాలజీ యుగంలో నిరంతరం నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. డే-వన్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ వరకు ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి సార్థకత లభిస్తుంది.

- ప్రొఫెసర్ జి.వి.వి. శర్మ, డీన్, ఐఐటీ, హైదరాబాద్.


ప్రాక్టికల్ అప్రోచ్‌తో..
బీటెక్ నాలుగేళ్లు అనునిత్యం ప్రాక్టికల్ అప్రోచ్‌తో అధ్యయనం సాగించాలి. థియరటికల్ నాలెడ్జ్ పొందడానికే పరిమితం కాకుండా సదరు అంశంలో ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందేందుకు కృషి చేయాలి. బీటెక్‌లో ప్రవేశం కోసం నిర్వహించే ఆయా ఎంట్రెన్స్‌లలో విజయానికి రెండు, మూడేళ్లు శ్రమించిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టాక కొంత ఉపశమనం కోరుకోవడం సహజమే. అయితే దీన్ని స్వల్ప వ్యవధికి పరిమితం చేయాలి. తాము ఇంజనీరింగ్‌లో చేరిన ఉద్దేశాన్ని గుర్తుచేసుకుంటూ సాగితే నైపుణ్యాల విషయంలో సహజ ఆసక్తి దానంతటదే వస్తుంది.

- ప్రొఫెసర్ సుమన్ కపూర్
డీన్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ కొలాబరేషన్స్,  బిట్స్ పిలానీ,  హైదరాబాద్ క్యాంపస్


Engineering మలి లక్ష్యంపై ముందస్తుగా..
బీటెక్ కోర్సులో చేరడం తొలి లక్ష్యమైతే.. మలి లక్ష్యం ఏంటనే విషయంలోనూ ముందుగానే స్పష్టత ఏర్పరచుకోవాలి. ఉన్నత విద్య, ఉపాధి లక్ష్యమేంటో నిర్దేశించుకుని దానికి అనుగుణంగా రెండో సంవత్సరం చివరి నుంచి లేదా మూడో సంవత్సరం మొదటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలి. స్థూలంగా భవిష్యత్తులో ఒక సంస్థ మనుగడలో కీలక పాత్ర పోషించే వ్యక్తులుగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తిస్తూ థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు సాగాలి.

- ప్రొఫెసర్ కె. కమలాకర్, డీన్, అకడమిక్స్, ఐఐఐటీ,  హైదరాబాద్
www.sakshieducation.com
Published on 8/25/2014 1:49:00 PM
Related Topics...
pixel