ఎంసెట్- ఇంజనీరింగ్ (సబ్జెక్టుల వారీగా సన్నద్ధత మార్గాలు)

ఎంసెట్ ర్యాంకింగ్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది.
Bavitha
అందువల్ల ఇంటర్ సెకండియర్ విద్యార్థులు మార్చి 26 వరకు పూర్తిగా ఇంటర్మీడియెట్‌లో అధిక మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు 50 రోజుల సమయం ఉంటుంది. రాష్ట్రంలో 716 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం సీట్లు 2.75 లక్షలు. వీటికోసం పోటీపడే వారి సంఖ్య దాదాపు మూడు లక్షలు. ఇందులో 50-60 వేల మంది వివిధ జాతీయస్థాయి కళాశాలలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని కళాశాలలకు వెళ్తుంటారు. కాబట్టి ఇంజనీరింగ్ సీటు అందరికీ వస్తుంది. ఏటా దాదాపు లక్ష సీట్లు మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీటు రావడం ముఖ్యం కాదు.. మంచి కళాశాలలో సీటు రావడం ప్రధానం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలోగానీ, టాప్ 20 కళాశాలల్లోగానీ సీటు సాధించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలి. ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలల్లో దాదాపు ఆరు వేల సీట్లున్నాయి. వీటిలో సీటు పొందాలంటే ఎంసెట్‌లో 100-120 (160 మార్కులకు) మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ప్రణాళిక ప్రకారం ఎంసెట్‌కు సిద్ధమవాలి. దీనికి సమయ పాలన అవసరం.

 • 2012-14 ఇంటర్మీడియెట్ కొత్త సిలబస్ ప్రకారం ఎంసెట్-2015 జరగనుంది. ఈ విషయాన్ని గత సంవత్సరం లేదా అంతకంటే ముందు ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
మ్యాథమెటిక్స్
పోలార్ కోఆర్డినేట్స్, స్పియర్, కోయాక్సియల్ సిస్టం, లిమిటింగ్ పాయింట్స్, కోనిక్స్(హైపర్‌బోలా, పారాబోలా, ఎలిప్స్)లోని పోల్, పోలార్, కాంజుగేట్ పాయింట్స్ అంశాలు ఎంసెట్-2015 సిలబస్‌లో లేవు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలి. అదే విధంగా సక్సెసివ్, పార్షియల్ డెరివేటివ్స్; Exponential, Logarithmic Series అంశాలు సిలబస్‌లో లేవు.
గతేడాదితో పోల్చితే సిలబస్‌లోని కొత్త అంశాలు: మీన్ వాల్యూ థీరమ్; స్టాటిస్టిక్స్ (మీన్; వేరియన్స్; స్టాండర్డ్ డీవియేషన్).

ప్రిపరేషన్ ప్రణాళిక:
మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ద్వారా ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్ ప్రధానం. దీనివల్ల కచ్చితత్వం, వేగం అలవడుతుంది. కాలేజీలో లెక్చరర్ చెప్పిన షార్ట్‌కట్ టిప్స్‌తో పాటు, ఇలాంటి మార్గాలున్న పుస్తకాల్లోని సమస్యల్ని ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సమయం ఆదా అవుతుంది.
 • ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌ను పూర్తిగా చదవాలి. ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌గా రాసుకోవాలి. ఇవి పరీక్షకు ముందు పునశ్చరణకు ఉపయోగపడతాయి.
 • ఇంటెగ్రెల్ కాలిక్యులస్, 3డీ, వెక్టార్ ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, బైనామియల్ థీరమ్, మ్యాట్రిసెస్, సర్కిల్స్, పెయిర్ ఆఫ్ స్ట్రయిట్ లైన్స్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
 • బైనామియల్ థీరమ్, మ్యాథమెటికల్ ఇండక్షన్ సమస్యలు సాధన చేసేటప్పుడు లాజిక్ మినహాయింపులను గుర్తించడం ద్వారా సులువుగా సాధించవచ్చు.
 • ట్రిగనోమెట్రీ సమస్యల సాధనలో assumption ఉపయోగించాలి. కోఆర్డినేట్ జామెట్రీ సమస్యలకు సాధనలను చాలా వరకు ఆప్షన్స్ నుంచి రాబట్టవచ్చు.
రిఫరెన్స్:
 • లిల్లీపుట్ వ్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్
కెమిస్ట్రీ
తొలగించినవి:
నైట్రో బెంజీన్; ఆప్టికల్ ఐసోమెరిజం; క్లోరో ఫాం; మొలాసిస్; సైక్లో ఆల్కేన్స్; ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీలోని నల్గొండ ఎఫెక్ట్; సోడి యం, మెగ్నీషియం వెలికితీత; బ్లాస్ట్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్; సూపర్ పాస్ఫేట్ ఆఫ్ లైమ్; హైపో.

చేర్చినవి:
ఆర్గానిక్ కెమిస్ట్రీలో సైనైడ్స్, ఐసో సైనైడ్స్, నైట్రో కాంపౌండ్స్ అంశాలను కొత్తగా సిలబస్‌లో చేర్చారు. నిత్యజీవితంలో కెమిస్ట్రీ యూనిట్‌లో డిటర్జెంట్స్; ఎన్విరాన్‌మెంటర్ కెమిస్ట్రీలో గ్రీన్ కెమిస్ట్రీ; మెటలర్జీలో ఎలింగమ్ డయాగ్రమ్; గ్రూప్స్‌లో PH3, PCl3, PCl5, ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్.

ప్రిపరేషన్ ప్రణాళిక:
మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే కెమిస్ట్రీ ప్రశ్నలను తక్కువ సమయంలో తేలిగ్గా సాధించవచ్చు. 70% - 80% వరకు ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి.

 • ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్ అంశాలు స్కోరింగ్‌కు ఉపయోగపడతాయి.
 • ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారంగా ఉంటాయి.
 • తెలుగు అకాడమీ పుస్తకంలోని అన్ని చాప్టర్లను క్షుణ్నంగా చదవాలి. ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌గా రాసుకోవాలి.
 • ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8-10 ప్రశ్నలు వస్తాయి. ఆల్కహాల్స్, అమైన్స్, ఫినోల్స్ - నేమ్డ్ రియాక్షన్స్, ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిస్ నేచర్, ఇంటర్ కన్వర్షన్స్ ముఖ్యమైనవి.
 • ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్; సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; కెమికల్ కైనటిక్స్ నుంచి10-12 ప్రశ్నలు వస్తాయి. వీటి నుంచి సమస్యలు కూడా వస్తాయి.
 • ఇనార్గానిక్ కెమిస్ట్రీ కొంత క్లిష్టమైనది. ఇందులో మూలకాల ధర్మాలను ఒకదాంతో మరొకటి బేరీజువేస్తూ చదవాలి.
ఎక్కువగా దృష్టిసారించాల్సిన అంశాలు:
 • అటామిక్ స్ట్రక్చర్; పీరియాడిక్ టేబుల్; పీరియాడిసిటీ; కెమికల్ బాండింగ్; సొల్యూషన్స్; స్టాకియో మెట్రీ; కెమికల్ కైనటిక్స్; పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీ.
రిఫరెన్స్:
 • తెలుగు అకాడమీ ఎంసెట్ కెమిస్ట్రీ.
 • లిల్లీపుట్ వ్యూ ఆఫ్ కెమిస్ట్రీ.
గుర్తుంచుకోండి..!
 • ఎంసెట్‌లో వచ్చే ప్రశ్నల్లో 50 శాతం-60 శాతం ప్రశ్నలు నేరుగా వస్తాయి. గత ఎంసెట్ ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. కాలేజీలో నిర్వహించే మోడల్, గ్రాండ్ పరీక్షలు రాసి, తప్పులను సరిదిద్దుకోవాలి.
 • ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు 50 రోజులు అందుబాటులో ఉంటాయి. ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మొదటి 20 రోజుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంశాలను చాప్లర్ల వారీగా చదవాలి. తర్వాత వీలైనన్ని గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి.
 • గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల సమయ పాలన అలవడుతుంది. చాప్టర్ల వారీగా రివిజన్ టెస్ట్‌లు రాయడం వల్ల నిర్దిష్ట అంశాల్లో ప్రిపరేషన్ లోపాలను తెలుసుకునేందుకు, అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఫిజిక్స్
ఫిజిక్స్ సిలబస్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ, టాపిక్స్, సబ్ టాపిక్స్ అమరికలో మార్పు జరిగింది. సెకండియర్ సిలబస్ ప్రకారం ఎంసెట్‌లో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్, ఆటమ్స్ అంశాలను కలిపారు. ఎక్స్-రే అంశాన్ని తొలగించారు. అదే విధంగా కాంప్టన్ ఎఫెక్ట్, సీబెక్ ఎఫెక్ట్, పెల్టియర్ ఎఫెక్ట్, థామ్సన్ ఎఫెక్ట్ అంశాలను తొలగించారు.

ప్రిపరేషన్ ప్రణాళిక:
మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పోలిస్తే ఎంసెట్ పరంగా ఫిజిక్స్ క్లిష్టమైనది. దీని ప్రిపరేషన్‌లో conceptual preparation కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 • సూత్రాలను తెలుసుకోవడంతో పాటు వాటిని సమస్యల రూపంలోకి అనువర్తింపజేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఒక సమస్యను రెండు మూడు పద్ధతుల్లో ప్రాక్టీస్ చేయాలి.
 • వీలైనన్ని నమూనా పరీక్షలు రాయడం, ఫలితాలను విశ్లేషించుకోవడం వల్ల సబ్జెక్టుపై పట్టు చిక్కుతుంది.
 • ముఖ్యంగా ఎలక్ట్రో మ్యాగ్నటిజం, వేవ్ మోషన్, హీట్, మ్యాగ్నటిజంపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
 • న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, సెమీకండక్టర్ డివెసైస్ అంశాలను ఎక్కువగా చదవాలి. ఇవి తేలికైన చాప్టర్లు.
 • మెకానిక్స్ నుంచి 30 శాతం ప్రశ్నలు, హీట్ నుంచి 10 శాతం ప్రశ్నలు, సౌండ్ అండ్ వేవ్ మోషన్ నుంచి 15 శాతం, ఎలక్ట్రిసిటీ నుంచి 15 శాతం, మ్యాగ్నటిజం నుంచి 13 శాతం, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 10 శాతం ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది.
రిఫరెన్స్:
 • ఆబ్జెక్టివ్ ఫిజిక్స్- దీప్తి పబ్లిషర్స్.
 • తెలుగు అకాడమీ ఎంసెట్ ఫిజిక్స్.
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్
(సబ్జెక్టుల వారీగా సన్నద్ధత వ్యూహాలు)


బోటనీ
ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్ పరీక్ష మారిన సిలబస్‌తో నిర్వహించే తొలి పరీక్ష. సిలబస్ పూర్తిగా మారడం వల్ల రెగ్యులర్ విద్యార్థులతో పోలిస్తే లాంగ్ టర్మ్ విద్యార్థులు అనుసరించే ప్రిపరేషన్ విధానం తప్పనిసరిగా భిన్నంగా ఉండాలి. ఎంసెట్ 2015 ఔత్సాహిక విద్యార్థులు పరీక్షకు 15 రోజుల ముందే సిలబస్ పూర్తిచేస్తే, మెరుగైన పునశ్చరణకు అవకాశం ఉంటుంది. పునశ్చరణ లేకుండా పరీక్ష రాయడం చాలా కష్టం. ఎంసెట్ మెడిసిన్ విభాగంలో పది వేల మంది మధ్యే అసలైన పోటీ ఉంటుంది. పటిష్ట ప్రణాళిక లేకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే పోటీలో ఉండే అవకాశాలు తక్కువ.

సమయ పాలన:
రెగ్యులర్ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సి ఉంటుంది. ఐపీఈ పరీక్షలు ముగిసిన వెంటనే తిరిగి ఎంసెట్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాలి. తొలుత మొదటి సంవత్సరం పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదవాలి. దీనికి కనీసం 20 రోజులు కేటాయించాలి. రెండో సంవత్సరం సిలబస్‌కు పది రోజుల సమయం సరిపోతుంది. మిగిలిన సమయాన్ని పునశ్చరణకు కేటాయించాలి.
ఎప్పటి మాదిరిగానే పరీక్షలో 40 ప్రశ్నలలో 20 ప్రశ్నలు ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ నుంచి, 20 ప్రశ్నలు రెండో సంవత్సరం సిలబస్ నుంచి వస్తాయి.

వెయిటేజీ అంచనా:
మొదటి సంవత్సరం
చాప్టర్ ప్రశ్నల సంఖ్య
2, 4 4
5 2-3
6, 7 4-5
8 2
9, 10, 11 3
12 2-3
1, 3, 13 1-2

రెండో సంవత్సరం
చాప్టర్ ప్రశ్నల సంఖ్య
1-6 6-7
7, 8, 14 5-6
9, 10 3-4
11, 12 2-3
13 1-2
 • ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం సిలబస్‌లోని 4, 12 చాప్టర్లు, రెండో సంవత్సరంలోని 1 నుంచి 6 చాప్టర్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ పాఠ్యాంశాలను కనీసం మూడుసార్లు చదవాల్సి ఉంటుంది.
 • రెండు సంవత్సరాల సిలబస్‌లో చాలా పాఠ్యాంశాలు ఒకదాంతో మరొకటి సంబంధం ఉంటాయి. ఇలాంటి అంశాలను గుర్తించి, ఒకేసారి చదవాలి. ఈసారి సూక్ష్మజీవ శాస్త్రం నుంచి కనీసం 8 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి మొదటి సంవత్సరంలోని చాప్టర్ 2, చాప్టర్ 9లోని కేంద్రక పూర్వజీవులు; రెండో సంవత్సరం చాప్టర్ 7, చాప్టర్ 8 (బ్యాక్టీరియా, వైరస్), చాప్టర్ 14 (మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల పాత్ర) ఒకేసారి కలిపి చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 • రెండో సంవత్సరంలో యూనిట్ 1 (శరీర ధర్మశాస్త్రం)లోని చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 వరకు ప్రతి చాప్టర్ నుంచి ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. ముఖ్యంగా విద్యార్థులు ఖనిజ మూలకాల ఆవశ్యకత, వాటి లోప లక్షణాలు, మొక్కల హార్మోన్లు వంటి అంశాలను ఎక్కువగా చదవాలి. ఇవన్నీ విషయ పరిజ్ఞానం ఆధారిత చాప్టర్లు. ఈ ఏడాది కాన్సెప్టు ఆధారిత ప్రశ్నలు తక్కువగా ఉండొచ్చు.
జువాలజీ
ఇంటర్ జంతుశాస్త్రం సిలబస్‌ను జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా 2012 నుంచి మార్పు చేస్తూ వచ్చారు.

ప్రిపరేషన్ ప్రణాళిక:
విద్యార్థులు ప్రణాళికాబగా సాధన చేస్తే ఎంసెట్ పరీక్షలో జంతుశాస్త్రానికి నిర్దేశించిన 40 మార్కుల్లో 38-40 మార్కులు సాధించవచ్చు. మొత్తం బయాలజీకి కేటాయించిన 80 మార్కుల్లో 75-80 మార్కులు పొందొచ్చు.
 • విద్యార్థులు ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవాలి. ఏ పాఠ్యాంశాన్నయినా నిశితంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి సన్నద్ధత ఎంసెట్‌లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించేందుకు దోహదపడుతుంది.
 • పాత ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రశ్న అడిగే విధానాన్ని అర్థం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే దాదాపు 90 శాతం ప్రశ్నలు ప్రాథమిక భావనల నుంచి ఇచ్చారు.
 • జతపరచడం తరహా ప్రశ్నలు 2-4 వచ్చే అవకాశముంటుంది. వివిధ అధ్యాయాలలో ఈ తరహా ప్రశ్నలు అడిగేందుకు అవకాశమున్న అంశాలను గుర్తించి, చదవాలి.
 • వివిధ ప్రక్రియలలో అంశాలను సరైన క్రమంలో అమర్చుట తరహా ప్రశ్నలు కూడా 2-3 వచ్చేందుకు అవకాశముంది.
ఉదాహరణలు:
 • ఏదైనా జీవి వర్గీకరణ అంతస్తులు.
 • వానపాము, బొద్దింకల ఆహారనాళాలలోని వివిధ భాగాల క్రమం.
 • కాలేయం నుంచి పైత్యరసం విడుదలయ్యే క్రమం.
 • ప్రోటీన్ల జీర్ణక్రియలో వివిధ ఎంజైమ్‌ల చర్యాక్రమం.
 • కపాల నాడులు- క్రమం.
 • హార్మోన్‌ల చర్యా విధానం.
 • శుక్రకణోత్పత్తి దశలు.
 • రుతుచక్రం- దశలు.
 • భౌమకాలమాన పట్టిక.
 • క్షీరగ్రంథుల నుంచి క్షీరం స్రవించుట.
 • ఎంసెట్‌లో పటాల ఆధారంగా అడిగే ప్రశ్నలు 2 వరకు ఉండొచ్చు.
  ఉదా: ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ.
 • పుర్రె, మానవుని పూర్వాంగ, చరమాంగ ఎముకలు.
 • నాడీ ప్రచోదనలో అయాన్ చానళ్లు.
 • మోకాలు కుదుపు- ప్రతిచర్య.
 • నేత్రపటలం- సూక్ష్మ నిర్మాణం.
 • ప్రకృతి వరణం- రకాలు.
 • ఈసీజీ.
 • జతపరచడం తరహా ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి.
వెయిటేజీ అంచనా:
మొదటి సంవత్సరం:
1. జీవ ప్రపంచ వైవిధ్యం- 2 ప్రశ్నలు; 2. జంతుదేహ నిర్మాణం- 2; 3. జంతు వైవిధ్యం (1)- 2; 4. జంతు వైవిధ్యం (2)- 2; 5. గమనం, ప్రత్యుత్పత్తి- 2; 6. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం- 3-4; 7. బొద్దింక- 3-4; 8. జీవావరణం, పర్యావరణం- 3-4.

ద్వితీయ సంవత్సరం:
1 నుంచి 5 యూనిట్ల వరకు రెండు చొప్పున ప్రశ్నలు వచ్చే అవకాశముంది. జన్యుశాస్త్రం, జీవ పరిణామం, అనువర్తిత జీవశాస్త్రం యూనిట్ల నుంచి 3 నుంచి 4 ప్రశ్నల చొప్పున వస్తాయి.
 • ప్రతి ప్రశ్నను జాగ్రత్తగాచదవాలి. సరైన అవగాహన లేకుండా సమాధానం ఇవ్వాలని చూస్తే పొరపాటు దొర్లే అవకాశముంది. ఒకసారి ఓఎంఆర్ పత్రంపై బాల్ పాయింట్ పెన్‌తో సమాధానం గుర్తిస్తే దిద్దుకోవడానికి అవకాశం ఉండదు.
 • ఒత్తిడికి తావులేని విధంగా పరీక్షకు సిద్ధం కావాలి. పరీక్ష జరుగుతున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాకుండా జగ్రత్తపడాలి.
కొత్త సిలబస్.. సరికొత్త ప్రయోగం
Bavitha మారిన సిలబస్‌తో ఎంసెట్-2015కు నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, పక్కా ప్రణాళికతో పరీక్షను నిర్వహించి, విజయవంతంగా కౌన్సెలింగ్ పూర్తిచేస్తామని భరోసా ఇస్తున్నారు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు. కొత్త సిలబస్‌తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు చెబుతున్న ఆయనతో ‘భవిత’ ఇంటర్వ్యూ...

ఎంసెట్-2015లో ప్రధాన మార్పులు ఏవి?
ఇంటర్మీడియట్ సిలబస్ మారిన నేపథ్యంలో ఎంసెట్ సిలబస్‌లోనూ మార్పులు చేయడం అనివార్యమైంది. దీనివల్ల ఎంసెట్ తొలిసారి రాయబోతున్న విద్యార్థులకు ఇబ్బందేమీ ఉండదు. కానీ, రెండోసారి పరీక్షకు సిద్ధమయ్యే వారు కొంచెం ఎక్కువ కసరత్తు చేయక తప్పదు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే, పరీక్ష తేదీకి ముందే వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నాం. అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఈ-భద్రతా చర్యలు తీసుకున్నాం. ఈసారి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ సమాధాన పత్రాలను ఉంచనున్నాం.

ఈ ఏడాది పరీక్షకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశముంది?
గతేడాది ఇంజనీరింగ్ పరీక్షను 2.95 లక్షల మంది, మెడిసిన్ పరీక్షను 1.5 లక్షల మంది రాశారు. కెరీర్ పరంగా అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎంసెట్‌కు 4.10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశముంది. పరీక్ష నిర్వహణలో గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.

ఎంసెట్-2015 ద్వారా ఏయే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు?
గతేడాది తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్ ద్వారా మొత్తం 17 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఇంజనీరింగ్ విభాగంలో మూడు లక్షల సీట్లున్నాయి. మెడిసిన్‌లో వెయ్యి సీట్లు పెరగడం వల్ల అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 6 వేలకు చేరింది. బీఫార్మసీ సీట్లను ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు చెరిసగం కేటాయిస్తాం.

ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి?
10+2 అర్హత ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 40శాతం మార్కులుంటే సరిపోతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు ఫీజు ఎక్కడ చెల్లించాలి?
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ విభాగానికి రూ.250; అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాలకు రూ.250 ఫీజు ఉంటుంది. రెండూ రాసే వారికి రూ.500 ఫీజు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. సూచనలన్నీ పూర్తిగా చదివిన తర్వాత దరఖాస్తు నింపాలి. ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లితే, నిర్దేశ తేదీలోగా వాటిని సరిచేసుకోవచ్చు. దరఖాస్తు పంపాక, ప్రింటవుట్‌ను జాగ్రత్తపరచుకోవాలి. పరీక్ష రోజున ప్రింటవుట్ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి.

ఎంసెట్ ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ జాప్యంతో వేల మంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. ఈసారైనా అంతా సకాలంలో జరుగుతుందని ఆశించవచ్చా?
ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, జాప్యాన్ని నివారించేలా ఏర్పాట్లు చేశాం. ప్రణాళిక ప్రకారం పరీక్ష నిర్వహణ నుంచి కౌన్సెలింగ్ వరకు అన్నీ సకాలంలో జరిగేలా చూస్తాం.

రాష్ట్రంలో ఎంసెట్ కీలక పరీక్ష. దీనికి సంబంధించి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్, హైటెక్ సాధనాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నాం. పరీక్ష గదిలోకి ఎలాంటి వస్తువులనూ అనుమతించం. చివరకు ఎలక్ట్రానిక్ వాచీలనూ నిషేధించాం. జామర్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల వేలిముద్రలను కూడా తీసుకుంటాం.

చాలా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులను వారి కళాశాలల్లో చేరేలా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను మార్చడం, అప్షన్స్ మార్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఈ ఏడాది నుంచి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు విద్యార్థులు తల్లిదండ్రుల ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వారిని మాత్రమే కౌన్సెలింగ్ కేంద్రాలకు అనుమతిస్తాం. హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే వెబ్ అప్షన్లు ఇవ్వాలి. అప్షన్లు మార్చుకోవాలంటే విద్యార్థి తప్పనిసరిగా హెల్ప్‌లైన్ కేంద్రానికి రావాల్సిందే!

మంచి ర్యాంకు సాధించేందుకు అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన అవసరం. దీనికి తగినట్లు ప్రిపరేషన్‌ను మలచుకోవాలి. కేవలం విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే కాకుండా, వారి తెలివితేటలను అంచనా వేసేందుకు వీలుగా ప్రశ్నపత్రం ఉంటుంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా?
లోకల్, నాన్‌లోకల్ విషయంలో గతేడాది విధానాన్నే అమలుచేస్తాం.

పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 160 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. బైపీసీ విద్యార్థులకు జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

Published on 3/11/2014 2:11:00 PM