ఎంసెట్‌తో ఏయే కోర్సుల్లో చేరవచ్చో తెలుసా..?

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశం కావాలంటే ఎంసెట్ రాయాల్సిందే. అంత ప్రాముఖ్యత ఉన్న ఏపీ ఎంసెట్-2020 నోటిఫికేషన్ ఇటీవ‌ల‌ విడుదలైంది.
ఏటా నిర్వహించే ఎంసెట్‌ను ఈ ఏడాది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) నిర్వహించనుంది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీ ఎంసెట్ 2020 పూర్తి వివరాలు...

కోర్సులు
 • ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెడికల్ విభాగంలో జరుగుతుంది.
 • ఇంజనీరింగ్ విభాగంలో..
  బీఈ/బీటెక్, బయో టెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఫార్మసీ కోర్సులు ఉన్నాయి.
 • అగ్రికల్చరల్/మెడికల్ విభాగంలో..
  బీఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(బీఎఫ్‌ఎస్సీ), బీటెక్ (ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ(కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-సీఏ అండ్ బీఏం), బీ-ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మ్-డీ కోర్సు(బైపీసీ)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇంజనీరింగ్ విభాగం అర్హతలు
 • ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత లేదా రెండో ఏడాది పరీక్ష రాసినవారు అర్హులు.
 • ఇంజనీరింగ్/బీ ఫార్మసీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 • జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
 • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్/తెలంగాణకు చెందినవారై ఉండాలి. నిబంధనల మేరకు ప్రవాస భారతీయులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.
 • ఇంజనీరింగ్, ఫార్మసీ అభ్యర్థుల వయసు 2020 డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. బీటెక్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివేందుకు 17 ఏళ్లు పూర్తవ్వాలి. గరిష్టంగా 22 ఏళ్ల వయసు మించరాదు. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు.
అగ్రికల్చరల్/మెడికల్ విభాగం అర్హతలు
 • బీఎస్సీ అగ్రికల్చర్/హార్టికల్చర్: ఫిజికల్ సైన్‌‌స, బయోలాజికల్ సైన్స్/నేచురల్ సైన్స్‌, అగ్రికల్చరల్, ఒకేషనల్ ఇన్ అగ్రికల్చరల్.. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులను ఇంటర్/10+2 స్థాయిలో చదివి ఉండాలి.
 • బీవీఎస్సీ: ఫిజికల్ సైన్స్‌, బయోలాజికల్ సైన్స్ లేదా నేచురల్ సైన్స్‌, ఒకేషనల్ కోర్సెస్ ఇన్ వెటర్నరీ సైన్స్. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు ఇంటర్/10+2 స్థాయిలో చదివి ఉండాలి.
 • బీఎఫ్‌ఎస్సీ: ఫిజికల్ సైన్స్‌, బయోలాజికల్ సైన్స్/నేచురల్ సైన్స్‌, ఒకేషనల్ కోర్సెస్ ఇన్ ఫిషరీ సైన్స్‌. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు ఇంటర్/10+2 స్థాయిలో చదివి ఉండాలి.
 • బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ): మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌ లేదా ఫిజికల్ సైన్స్‌, బయోలాజికల్/నేచురల్ సైన్స్‌ చదివి ఉండాలి. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు ఇంటర్/10+2 స్థాయిలో చదివి ఉండాలి.
 • బీఫార్మసీ, ఫార్మ్-డీ: మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌ లేదా ఫిజికల్ సైన్స్‌, బయోలాజికల్/నేచురల్ సైన్స్‌ చదివి ఉండాలి. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు ఇంటర్/10+2 స్థాయిలో చదివి ఉండాలి.
 • 17 ఏళ్లు వయసు నిండి, 22 ఏళ్లు దాటరాదు, ఎస్సీ/ఎస్టీలకు 25 ఏళ్లు మించరాదు.

పరీక్ష విధానం :
ఎంసెట్ పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. ఇంజనీరింగ్‌కు సంబంధించి మొత్తం 160 ప్రశ్నల్లో(ఆబ్జెక్టివ్ విధానం) 80 ప్రశ్నలు-80 మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి; ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నలు-40 మార్కుల చొప్పున అడుగుతారు. అలాగే అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో.. బయాలజీ 80 ప్రశ్నలు-80 మార్కులు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్‌లో 40ప్రశ్నలు-40 మార్కులు; కెమిస్ట్రీ 40 ప్రశ్నలు-40 మార్కుల చొప్పున ఉంటాయి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటాయి.

ర్యాంకింగ్ ఇలా...
 • ఎంసెట్ ర్యాంక్‌తోపాటు ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా తుది ర్యాంక్ ప్రకటిస్తారు. ఇందులో ఎంసెట్‌కు 75శాతం, ఇంటర్‌లో ఎంపీసీ/బైపీసీ ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులకు 25శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంక్‌ను నిర్ణయిస్తారు.
 • ఎంసెట్ ఎంట్రన్స్ లో మొత్తం మార్కుల్లో కనీసం 25శాతం సాధిస్తేనే క్వాలిఫయింగ్‌గా పరిగణిస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.
దరఖాస్తు ఫీజు: రూ.500
 • అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీ ఆన్‌లైన్/టీఎస్ ఆన్‌లైన్/క్రెడిట్/ డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
పరీక్షల షెడ్యూల్ :
 • ఇంజనీరింగ్ పరీక్ష: ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు ఉంటుంది.
 • అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష: ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు ఉంటుంది.
 • ఏపీ ఎంసెట్ (రెండు విభాగాలు) ఏప్రిల్ 22, 23 తేదీల్లో..
ముఖ్య సమాచారం
 • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
 • చివరి తేదీ: 29-03-2020
 • ఏప్రిల్ 5 వరకు: ఆలస్య రుసుం రూ.500
 • ఏప్రిల్ 10 వరకు: ఆలస్య రుసుం రూ.1000
 • ఏప్రిల్ 15 వరకు: రూ.5000
 • ఏప్రిల్ 19 వరకు: రూ.10,000
 • హాల్‌టికెట్ల జారీ: ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sche.ap.gov.in/eamcet
Published on 3/19/2020 2:51:00 PM

Related Topics