ఆ ఓటములే గెలుపు మెట్లు


ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015 ఫలితాల్లో బండ సునీల్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో 32వ ర్యాంకు సాధించారు. సివిల్స్ పరీక్షల్లో వరుసగా నాలుగుసార్లు పరాజయం ఎదురైనా నిరుత్సాహపడలేదు.. కఠోర దీక్ష, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికయ్యారు. సునీల్ కుమార్ రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
Career Guidanceమాది నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని చిప్పలపల్లి గ్రామం. నాన్న సాగర్‌రెడ్డి బోర్‌వెల్ వ్యాపారి, అమ్మ అనిత గృహిణి. సోదరి సుష్మారెడ్డి యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నాన్న వ్యాపార రీత్యా మా కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. పదో తరగతి వరకు గురుకుల విద్యాపీఠ్ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్ విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో పూర్తిచేశాను. తర్వాత బిట్స్ పిలానీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో చేరాను.

సీనియర్‌ను చూసి స్ఫూర్తి పొందా
సివిల్స్, ఐఎఫ్‌ఎస్ సాధించడమంటే చాలా కష్టమనే భావన ఉండేది. బిట్స్ పిలానీలోని నా సీనియర్ విజయరామరాజు సివిల్స్‌లో 44వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. దీంతో నేను కూడా సివిల్స్ సాధించగలననే నమ్మకం కలిగింది. 2010లో ఇంజనీరింగ్ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లి శ్రీరామ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జనరల్ స్టడీస్‌కు కోచింగ్ లో చేరాను. ఆప్షనల్స్‌గా సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా.

నాలుగుసార్లు వైఫల్యం
సివిల్స్‌లో ప్రిలిమ్స్ దశను సులువుగానే అధిగమించినప్పటికీ.. మెయిన్స్ స్టేజ్‌ను దాటలేకపోయాను. చాలా తక్కువ మార్కులతో ఇంటర్వ్యూ అవకాశం కోల్పోయాను. గతంలో ఎప్పుడూ ఐఎఫ్‌ఎస్ పరీక్ష రాయలేదు. అయితే నా స్నేహితుడు మేకల ఆదిత్య సివిల్స్‌కు ప్రయత్నించి విజయం సాధించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఐఎఫ్‌ఎస్ రాసి ఎంపికయ్యాడు. తన సలహాతో ఐఎఫ్‌ఎస్‌కు దరఖాస్తు చేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాను.

కుటుంబ ప్రోత్సాహం మరవలేనిది
సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలం కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యాను. ఒక దశలో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనే ఆలోచన వచ్చింది. కానీ కుటుంబ సభ్యులు నేను సాధించగలననే నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. దాంతో సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాను.

మెటీరియల్ కొరత
ప్రిలిమ్స్‌తో పాటే మెయిన్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించాను. ఆప్షనల్ సబ్జెక్టులు.. ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ప్రిలిమ్స్‌కు నెలన్నర ముందే ఆప్షనల్స్ ప్రిపరేషన్ పూర్తిచేశాను. ఆ తర్వాత ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించా. ఫలితాలు వచ్చాక ఆప్షనల్స్ సబ్జెక్టులను రివిజన్ చేశాను. ఐఎఫ్‌ఎస్ ప్రిపరేషన్‌లో మెటీరియల్ సేకరణకు చాలా సమయం పట్టింది. ప్రత్యేకంగా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మెటీరియల్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది.

ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రొఫైల్‌పై ప్రశ్నలు అడిగారు. నదుల అనుసంధానం, గవర్నమెంట్‌కు గవర్నెన్స్‌కు తేడా? ఐయూసీఎన్ అంటే? వంటిఅంశాలపై ప్రశ్నించారు.

ప్రొఫైల్

పదో తరగతి మార్కులు

522

ఇంటర్

910

ఎంసెట్ ర్యాంకు

300

ఏఐఈఈఈ

640

ఐఎఫ్‌ఎస్ ర్యాంకు

32

Published on 9/29/2016 12:37:00 PM
టాగ్లు:
Banda Sunil Kumar IFS 2015 32 Ranker IFS Ranker Banda Sunil Kumar Reddy Banda Sunil Kumar Reddy Success story Banda Sunil Kumar Advice and tips for Groups and civils aspirants

Related Topics