English Version

కరెంట్ అఫైర్స్ (జూన్ 1 - 7, 2018)

అంతర్జాతీయం
అమెరికా పసిఫిక్ కమాండ్ పేరు మార్పు
Current Affairs అసియా, పసిఫిక్ ప్రాంత వ్యవహారాలనుపర్యవేక్షించే (హవాయి) సైనిక స్థావరం ‘అమెరికా పసిఫిక్ కమాండ్’ పేరును ‘అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్’గా మారుస్తూ అమెరికా మే 31న ఒక ప్రకటన విడుదల చేసింది. సైనికపరంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భారత్ పాత్రకు ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తమ అధికారిక పత్రాల్లో ఇండో-పసిఫిక్ అనే పదాన్ని ఉపయోగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా పసిఫిక్ కమాండ్ పేరు మార్పు
ఎప్పుడు : మే 31
ఎవరు : అమెరికా

ఐరాస అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ జూన్ 5న ఎన్నికయ్యారు. 2018 సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్‌కు ఆమె నేతృత్వం వహిస్తారు. దీంతో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళగా మరియా గుర్తింపు పొందారు. మొదటిసారిగా 1953లో భారత్‌కి చెందిన విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్‌కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఐరాసలో మొత్తం 198 సభ్య దేశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్ష ఎన్నిక
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్

స్పెయిన్ ప్రధాని రాజీనామా
అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్ ప్రధాని మరియానో రాజొయ్ ఈనెల 1న పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత పెడ్రో సాంచెజ్ బాధ్యతలు చేపట్టారు. రాజొయ్‌కు చెందిన పాపులర్ పార్టీపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సోషలిస్టులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సోషలిస్టులను వ్యతిరేకించే ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో రాజొయ్ ఓటమి అనివార్యమైంది. పరిస్థితులను గమనించిన రాజొయ్ పదవి నుంచి తప్పుకున్నారు.

ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ
ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 97% ఓట్లతో ఆయన విజయం సాధించారు. మహమ్మద్ మోర్సీని సైన్యం పదవీచ్యుతుడిని చేసిన అనంతరం 2014లో సీసీ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టారు.

గ్వాటెమాలాలో అగ్నిపర్వతం బద్దలు - 25 మంది మృతి
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలు కావడంతో 25 మరణించారు. గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మడంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడుతుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జాతీయం
చైల్డ్‌హుడ్ ఇండెక్స్‌లో భారత్‌కు 113వ స్థానం
Current Affairs ప్రపంచ బాల్యసూచీ 2018లో భారత్ 113 స్థానంలో నిలిచింది. 2017లో భారత్ ర్యాంక్ 116 కాగా తాజాగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. అయితే పౌష్టికాహారం, శిశు మరణాలు, బాలకార్మికులు వంటి అంశాలు భారత్‌లో తీవ్ర సమస్యగా పరిణమించాయని గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్ మే 31న తెలిపింది. 2016లో భారత్‌లో శిశు మరణాల రేటు 39 గా నమోదైంది. 30 శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బాల్యసూచీలో భారత్‌కు 113వ ర్యాంక్
ఎప్పుడు : మే 31
ఎవరు : గ్లోబల్ చైల్డ్ రైట్స్ గ్రూప్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

కావేరీ’ యాజమాన్య సంస్థ ఏర్పాటు
కావేరీ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు కావేరీ నదీజలాల యాజమాన్య సంస్థ (సీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం జూన్ 1న ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో చైర్మన్, సెక్రటరీతో పాటు మొత్తం ఎనిమిది మంది సభ్యులుంటారు. వీరిలో కేంద్రం తరపున ఇద్దరు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు ఉండగా కావేరి నది భాగస్వామ్య రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల నుంచి నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు. కమిటీ నదీ జలాల నిల్వ, పంపకం, వివాదాల పరిష్కారం తదితర వివాదాలను సమీక్షించి ఆదేశాలిస్తుంది. కావేరీ జలాల్లో కర్ణాటక వాటాను పెంచి.. తమిళనాడు వాటాను సుప్రీంకోర్టు ఇటీవల స్వల్పంగా తగ్గించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కావేరీ’ యాజమాన్య సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కావేరీ నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం

తొలి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పరిశీలించిన మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను మే 30న తిరస్కరించారు. 2006లో బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉండే రాఘోపూర్ మండలంలో జగత్ రాయ్ అనే వ్యక్తి ఏడుగురిని సజీవదహనం చేశాడు. ఈ కేసులో అతనికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చేప్పడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నాడు.
2006లో రాఘోపూర్ మండలంలో తన గేదెను దొంగిలించారని జగత్ రాయ్, వాజిర్ రాయ్, అజయ్ రాయ్ అనే ముగ్గురిపై విజేంద్ర మహతో కేసు పెట్టాడు. కేసు ఉపసంహరించుకోవాలన్న నిందితుల ఒత్తిడికి మహతో తలొగ్గకపోవడంతో ఆయన ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆయన భార్య, ఐదుగురు పిల్లలు మంటల్లో చిక్కుకుని మరణించగా మహతో చికిత్స పొందుతూ చనిపోయాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి
ఎప్పుడు : మే 30
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్

నో హోంవర్క్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇంటి పని ఇవ్వకూడదనే ‘నో హోంవర్క్’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం జూన్ 3న తెలిపింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009కు అనుగుణంగా ఈ బిల్లును ప్రవేశపెడతారు.
1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు ఎలాంటి హోంవర్క్ ఇవ్వకుండా, వీరికి భాష, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టులు బోధించకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు మే 30న కేంద్రాన్ని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో హోంవర్క్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు : జూన్ 3
ఎక్కడ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో
ఎందుకు : 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటిపని ఇవ్వకుండా

రాష్ట్రపతి భవన్‌లో 49వ గవర్నర్‌ల సదుస్సు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 49వ గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌ల సదస్సు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జూన్ 4న ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్రపతి ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్‌లు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 49వ గవర్నర్‌ల సదస్సు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ

ఈ-చెత్త ఉత్పత్తిలో భారత్ కు ఐదోస్థానం
ఈ-చెత్త (ఎలక్ట్రానిక్ చెత్త)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా, జపాన్, జర్మనీలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా అసోచామ్, ఎన్‌ఈసీ లు ఈ వివరాలను వెల్లడించాయి.
అదే విధంగా దేశంలో అత్యధిక ఈ-చెత్తను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో 19.8 శాతం ఈ-చెత్తతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 13 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి.
2016లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 శాతం ఈ-చెత్తను మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ-చెత్తలో 95 శాతం అసంఘటిత రంగాలకు సంబంధించినది కాగా ఇందులో 70 శాతం కంప్యూటర్, సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వస్తోంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 52.2 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ పేరుకుపోనుందని కొన్ని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-చెత్త ఉత్పత్తిలో భారత్ కు ఐదోస్థానం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : అసోచామ్, ఎన్‌ఈసీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

గ్రామ్ బంద్ ఆందోళన చేపట్టిన రైతులు
రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు 10 రోజులపాటు గ్రామ్ బంద్ ఆందోళన చేపట్టారు. ఆందోళన మొదటి రోజు అయిన జూన్ 1 నుంచి రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతోపాటు కేంద్రానికి వ్యతిరే కంగా నినదిస్తున్నారు. మరో వైపు ఆందోళన చివరి రోజైన జూన్ 10న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ్ బంద్ ఆందోళన
ఎప్పుడు : జూన్ 1 నుంచి 10
ఎవరు : రైతులు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర కల్పించాలని


ఢిల్లీలో పర్యావరణ దినోత్సవ ప్లీనరీ

న్యూఢిల్లీలో 43వ అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సవ ప్లీనరీ కార్యక్రమం జూన్ 5న జరిగింది. ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ ప్లీనరీకి చెర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ అభివృద్ధి పర్యావరణహితంగా ఉండాలని, ప్రకృతిని పణంగా పెట్టి దాన్ని సాధించకూడదని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 43వ అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సవ ప్లీనరీ
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు జూన్ 5న స్పష్టం చేసింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 16 (4ఏ) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పదోన్నతులు కల్పించే అధికారం ఉందని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల వెకేషన్ బెంచ్ (సెలవుకాల బెంచ్) పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు 2017లో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ప్రభుత్వం ఉద్యోగాల్లో

తాజ్ డిక్లరేషన్‌కు ఆమోదం
ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ చుట్టూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిషేధించడానికి ఉద్దేశించిన తాజ్ డిక్లరేషన్ ఈ నెల 3న ఆమోదం పొందింది. దీని ప్రకారం తాజ్ చుట్టూ 500 మీటర్ల మేర చెత్తాచెదారం లేకుండా చూడటంతో పాటు వాడిపారేసే ప్లాస్టిక్‌ను క్రమంగా విడనాడాలి. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) సుహృద్భావ రాయబారి దియా మీర్జా ఈ తాజ్ డిక్లరేషన్‌ను ప్రకటించారు.

ద్వైపాక్షికం
ఇండోనేసియాతో భారత్ 15 ఒప్పందాలు
Current Affairs విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తో మే 30న జకార్తాలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్, ఇండోనేసియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర-సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి.
1982లో చేసిన సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (యూఎన్‌సీఎల్‌ఓఎస్), 1976 నాటి ఆగ్నేయాసియా మైత్రి, సహకార ఒప్పందం (టీఏసీ)ల ప్రకారం భారత్, ఇండోనేసియా, ఇతర ఇండో-పసిఫిక్ దేశాల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతనూ ఇరువురు నేతలు చర్చించారు. భారత్‌లో పర్యటించే ఇండోనేసియా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత వీసా ఇస్తామని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండోనేసియాతో భారత్ 15 ఒప్పందాలు
ఎప్పుడు : మే 30
ఎవరు : భారత ప్రధాని మోదీ - ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
ఎక్కడ : జకార్తా, ఇండోనేసియా

సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 31న సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతర్జాతీయీకరణలో భాగంగా భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌లు భీమ్, రూపే, ఎస్‌బీఐలను సింగపూర్‌లో మోదీ ఆవిష్కరించారు. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ (నెట్స్)తో రూపే యాప్‌ను అనుసంధానించారు.
సింగపూర్ పర్యటనకు ముందుగా ఇండోనేసియా పర్యటన ముగించుకుని మలేషియా చేరుకున్న మోదీ ఆ దేశ ప్రధాని మహాథిర్ మొహమ్మద్‌తో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : మే 31
ఎందుకు : మూడు దేశాల పర్యటనలో భాగంగా

షాంగ్రీ-లా సమావేశంలో పాల్గొన్న మోదీ
సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 8 ఆసియా-పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన షాంగ్రీలా సదస్సులో జూన్ 1న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సముద్ర తీరం ఇండో-పసిఫిక్ ప్రాంత వివాదాలను ఈ ప్రాంత దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అనంతరం సింగపూర్‌లోని నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు.
సదస్సులో ఎన్‌టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదరగా భారత్ సింగపూర్‌ల నావికా దళాల మధ్య రవాణా సహకారంతో సహా 8 ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సును 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి-లా అనే హోటల్‌లో ఏటా నిర్వహిస్తున్నారు.
సింగపూర్ మాజీ దౌత్యవేత ప్రొఫెసర్ టామీ కోహ్‌కి మోదీ పద్మశ్రీ అవార్డును అందజేశారు. ఏసియాన్ (అసోసియేన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) రజతోత్సవాలు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018 జనవరిలో టామీ కి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో ఏసియాన్ సభ్యదేశానికి చెంది ఈ అవార్డు అందుకున్న పదో వ్యక్తిగా టామీ నిలిచారు. టామీ 1981, 82లలో సముద్ర చట్టాలపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుకు అధ్యక్షత వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షాంగ్రీ-లా సమావేశంలో పాల్గొన్న మోదీ
ఎప్పుడు : జూన్ 1
ఎందుకు : సింగపూర్ పర్యటనలో భాగంగా

అమెరికా రక్షణ కార్యదర్శితో మోదీ భేటీ
అమెరికా రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌లో జూన్ 2 న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ బంధం, భద్రతా, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన ప్రాంతంలో సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ తోంగ్‌తో కలిసి మోదీ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత సింగపూర్‌లోని జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సంద ర్శించడంతో మోదీ పర్యటనకు జ్ఞాపకంగా ఉద్యానవనంలోని ఓ పుష్పానికి ‘డెండ్రోబియమ్ నరేంద్ర మోదీ’ అని పేరు పెట్టారు. అనంతరం సింగపూర్‌లోని చాంగీ నౌకా కేంద్రం, మరియమ్మన్ అనే హిందూ దేవాలయం, చులియా మసీదు, బౌద్ధ దేవాలయం, మ్యూజియంను మోదీ సందర్శించారు.
భారత యాక్ట్ ఈస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇండోనేసియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో మే 29 నుంచి ఐదురోజుల పాటు మోదీ పర్యటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా రక్షణ కార్యదర్శితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : జిమ్ మాటిస్
ఎక్కడ : సింగపూర్

అమెరికాలో మలబార్ సైనిక విన్యాసాలు
భారత్, అమెరికా, జపాన్ ల సంయుక్త సైనిక యుద్ధ విన్యాసాలు ‘మలబార్ ఎక్సర్‌సైజ్’ ను అమెరికాలో తొలిసారిగా నిర్వహించనున్నారు. మలబార్ విన్యాసాలు - 2018 పేరిట జూన్ 7 నుంచి 10 వరకు గ్వామ్‌లోని హార్బర్ ఫేజ్, 11 నుంచి 16 వరకు సముద్ర తీరంలో నిర్వహిస్తారు. ఈ విన్యాసాల్లో భారత తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కమోర్తా పాల్గొననున్నాయి. ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ విన్యాసాలు-2018
ఎప్పుడు : జూన్ 7 నుంచి 16 వరకు
ఎవరు : భారత్, జపాన్, అమెరికా
ఎక్కడ : గ్వామ్, అమెరికా
ఎందుకు : తీరప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు

దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సు దక్షిణాఫ్రికాలో జూన్ 4న ప్రారంభమైంది. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, లిండివె సిసులు, మార్కస్ బెజెరా అబ్బాట్ గల్వాయో, సెర్జీ లావ్రోవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్య కార్యాచరణ చేపట్టాలని సుష్మా పిలుపినిచ్చారు. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలసిన సుష్మా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. తదుపరి ఐబీఎస్‌ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సుకు సుష్మా స్వరాజ్ అధ్యక్షత వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 4
ఎక్కడ : దక్షిణాఫ్రికా

ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప
Current Affairs ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేపచెట్టును ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాష్ట్ర పుష్పంగా మల్లె, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఔషధ నిలయమైన వేపచెట్టు శాస్త్రీయ నామం అజాడిరక్ట ఇండికా కాగా కృష్ణ జింక శాస్త్రీయ నామం ఆంటిలోప్ సెర్వికాప్రా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల జాబితా

చిహ్నం

వాడుక పేరు

శాస్త్రీయనామం

రాష్ట్ర వృక్షం

వేప

అజాడిరక్ట ఇండికా

రాష్ట్ర పుష్పం

మల్లె

జాస్మినమ్

రాష్ట్ర జంతువు

కృష్ణజింక

ఆంటిలోప్ సెర్వికాప్రా

రాష్ట్ర పక్షి

రామచిలుక

సిట్టేసిఫోమ్స్


తెలంగాణ ఐటీ వృద్ధి 9.32 శాతం
2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ వృద్ధి రేటు 9.32 శాతంగా నమోదుకాగా రూ.93,442 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తులను రాష్ట్రం ఎగుమతి చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జూన్ 1న ఒక నివేదికను విడుదల చేశారు.
2017-18లో జాతీయ సగటు ఐటీ వృద్ధి రేటు 7-9 శాతంగా ఉంది. 2020 నాటికి 16 శాతం ఐటీ వృద్ధి రేటుతో రూ.1.2 లక్షల కోట్ల వార్షిక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాధించి 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు, 20 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఐటీ వృద్ధి 9.32 శాతం
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

రైతుబంధు’కు స్కోచ్ అవార్డు
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’పథకానికి స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ గ్రూప్ సంస్థ జూన్ 2న వ్యవసాయశాఖకు లేఖ రాసింది. ఢిల్లీలో జూన్ 23న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
మే 10న కరీంనగర్ జిల్లాలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు పథకానికి స్కోచ్ అవార్డు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : స్కోచ్ గ్రూప్ సంస్థ

ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ అవార్డు
భారీ పరిశ్రమల కేటగిరీ కింద ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ సృజనాత్మక అవార్డు జూన్ 4న లభించింది. పామాయిల్ తోటల ద్వారా రైతులకు చేస్తున్న సేవలు, పామాయిల్ గెలల నుంచి రైతులకు రికవరీ శాతం అధికంగా చూపిస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పనకు చేస్తున్న కృషికిగాను ఆయిల్‌ఫెడ్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయిల్‌ఫెడ్‌కు తెలంగాణ ఉత్తమ అవార్డు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : భారీ పరిశ్రమల కేటగిరీ కింద
ఎందుకు : రైతులకు సేవలు చేస్తున్నందుకు

ఏపీలో మనఊరు-మనబడి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం జూన్ 4న ప్రారంభమైంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం, సమర్థత, అంకితభావం కలిగిన టీచర్లు ఉంటారని ప్రజలకు తెలియజేస్తారు. జూన్ 5 నుంచి 11 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే కార్యక్రమాలు చేపడతారు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రారంభమైన మనఊరు-మనబడి
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి

ఏపీఐఐసీకి స్కోచ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి వరుసగా రెండోసారి స్కోచ్ అవార్డు లభించింది. పారిశ్రామిక ప్రాజెక్టుల్లో థర్డ్ పార్టీ మానిటరింగ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. 2017లో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్స్, స్కోచ్ సిల్వర్ అవార్డులను ఏపీఐఐసీ గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కోచ్ అవార్డు 2018
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్
ఎక్కడ : పారిశ్రామిక ప్రాజెక్టుల్లో థర్డ్ పార్టీ మానిటరింగ్ విభాగంలో

సాక్షి’ కార్టూనిస్ట్‌కు అంతర్జాతీయ అవార్డు
‘సాక్షి’ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. ‘ఎండ్ ఆఫ్ టైజం’ పేరిట ఇరాన్‌లో జరిగిన కార్టూన్ల పోటీలో మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ ద్వితీయ బహుమతి పొందింది. ఇప్పటికే వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు (2015)తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్ అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘సాక్షి’ కార్టూనిస్ట్‌కు అంతర్జాతీయ అవార్డు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : పామర్తి శంకర్
ఎక్కడ : ‘ఎండ్ ఆఫ్ టైజం’ పోటీలు, ఇరాన్
ఎందుకు : ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ కు


బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్

తెలంగాణలో బాలల రక్షణకు పోలీసు శాఖ 1098 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. చిన్నారులు ఆపదలో ఉన్నారని ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే పోలీస్ శాఖ త క్షణమే వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతుంది. పిల్లలపై ఎవరైనా హింస, అఘాయిత్యం, బాల్య వివాహాలు, యాచన చేయించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడు, తప్పిపోయినా లేదా అనాథ బాలలు ఎదురైనప్పుడు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1098 హెల్ప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : తెలంగాణ పోలీస్ శాఖ
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు

ఆర్థికం
భారత్ వృద్ధిరేటు 7.3 శాతం
Current Affairs 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై రూపొందించిన నివేదిక ను మే 30న విడుదల చేసింది.
2018లో జీ-20 దేశాల కూటమి వృద్ధి 3.3 శాతం, 2019లో 3.2 శాతంగా నమోదు కావచ్చొని పేర్కొంది. అలాగే సంపన్న దేశాలు 2018లో 2.3 శాతం, 2019లో 2 శాతం వృద్ధిని సాధిస్తే జీ-20లోని వర్ధమాన మార్కెట్లు 2018, 2019లో 5.2 శాతం వృద్ధిని సాధించవచ్చని తెలిపింది. 2017లో ఇది 5.3 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : మే 30
ఎవరు : మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్

7.7 శాతంగా నమోదైన భారత్ వృద్ధి
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయి్యంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) మే 31న ఈ వివరాలను వెల్లడించింది. దేశ జీడీపీలో తయారీ రంగం 15 శాతం వాటా కలిగి ఉండగా సేవల రంగం 55 శాతంపైగా వాటాను కలిగి ఉంది.
జీడీపీ ముఖ్యాంశాలు
  • 2017-18లో తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.6 శాతం, తర్వాతి నెలల్లో వరుసగా 6.3 శాతం, 7 శాతం, చివరి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి నమోదయ్యింది.
  • వ్యవసాయ వృద్ధి 4.5 శాతం, తయారీ రంగ వృద్ధి 9.1 శాతం నమోదుకాగా నిర్మాణ రంగ వృద్ధి 11.6 శాతంగా నమోదయ్యింది. 2016 - 17లో ఈ విలువ రూ.43.52 లక్షల కోట్లుగా ఉంది.
  • పెట్టుబడికి సూచికగా ఉన్న గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) 2017-18లో రూ.47.79 లక్షల కోట్లుగా అంచనా. 2016 - 17లో ఈ విలువ రూ.43.52 లక్షల కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.7 శాతంగా నమోదైన భారత్ వృద్ధిరేటు
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ)

అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐవోసీ
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో (పీఎస్‌యూ) అత్యంత లాభదాయక కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. టర్నోవర్ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన ఐవోసీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 21,346 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశంలోని అన్ని కంపెనీలను పరిగణలోనికి తీసుకుంటే అత్యంత లాభదాయక కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. 2017-18లో రూ.36,075 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ జాబితాలో రూ. 25,880 కోట్ల లాభంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత లాభదాయక పీఎస్‌యూ
ఎప్పుడు : మే 31
ఎవరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)

నల్లధనం సమాచారమిస్తే ఐదు కోట్ల నజరానా
నల్లధనం, బినామీ లావాదేవీల గురించి నిర్దిష్ట సమాచారమిచ్చే వారికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల దాకా పారితోషికం ఇవ్వనున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. ఈ మేరకు ‘బినామీ లావాదేవీల సమాచారమిచ్చే వారికి పారితోషిక పథకం 2018’ ని జూన్ 1న ఆవిష్కరించింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది.
బినామీ లావాదేవీలు, ఆస్తులతో పాటు వాటిపై వచ్చే ఆదాయాలు అందుకుంటున్న వారి వివరాలను నిర్దిష్ట పార్మాట్‌లో ఆదాయ పన్ను విభాగం ఇన్వెస్టిగేషన్ డెరైక్టరేట్స్‌లోని బినామీ నిరోధక యూనిట్లలో జాయింట్ లేదా అడిషనల్ కమిషనర్స్‌కి అందించాలి. ఈ వివరాలను ఇచ్చిన ఇన్ఫార్మర్ వివరాలను గోప్యంగా ఉంచుతామని సీబీడీటీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నల్లధనం సమాచారమిచ్చే వారికి ఐదు కోట్ల నజరానా
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు

సేవా భోజ్ యోజనను ప్రవేశపెట్టిన కేంద్రం
అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సేవా భోజ్ యోజన’ అనే పథకాన్ని జూన్ 2న ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు.
ఈ పథకాన్ని రానున్న రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అమలు చేయనుంది. కనీసం ఐదేళ్లుగా నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు వంటి సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం దర్పన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సేవా భోజ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలు
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : ఆర్థిక భారం తగ్గించేందుకు

సైన్స్ అండ్ టెక్నాలజీ
న్యూట్రాన్ నక్షత్రాన్ని కనుగొన్న నాసా
Current Affairs పాలపుంతకు 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో న్యూట్రాన్ అనే కొత్త నక్షత్రాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను పాలపుంతలో పదికిపైనే కనుగొన్నప్పటికీ పాలపుంతకు ఆవల కనుగొనడం ఇదే తొలిసారి. సాధారణంగా న్యూట్రాన్ స్టార్ల లాంటి నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాల అంతర్భాగంలో ఉంటాయి. అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు అంతరించిపోయి సూపర్‌నోవాగా అవతరిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూట్రాన్ నక్షత్రం ఆవిష్కరణ
ఎవరు : నాసా
ఎక్కడ : పాలపుంతకు ఆవల

పినాక’ ప్రయోగం విజయవంతం
పినాక్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ మే 30న తెలిపింది. రాకెట్‌ను ఆధునీకరించి, నావిగేషన్, గెడైన్స్ వ్యవస్థలను అనుసంధానించి ఒడిశాలోని చాందిపూర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీంతో పినాక రాకెట్ లాంచర్‌తో ప్రయోగించిన రాకెట్లు మరింత దూరంలోని లక్ష్యాలను చేధించడంతోపాటు మార్గమధ్యలో నిర్దేశిత లక్ష్యాన్ని మార్చే వీలు కూడా ఉంది. దీనిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), డీఆర్‌డీఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పినాక ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మే 30
ఎవరు : భారత ఆర్మీ
ఎక్కడ : చాందిపూర్, ఒడిశా

అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది. దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి (వీలర్ ఐలాండ్) నుంచి రక్షణ శాఖ జూన్ 3న పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5ని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఇప్పటివరకు అగ్ని-5ని ఆరుసార్లు ప్రయోగించగా అన్ని సార్లు విజయవంతమైంది.
అగ్ని-5 పరిధిని 5 వేల కిలోమీటర్లకు పెంచడంతోపాటు దిక్సూచి వ్యవస్థ, ఇంజిన్, వార్‌హెడ్‌లకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతను కూడా జోడించారు. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలో వెళ్లేందుకు రింగ్ లేజర్ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, మిసైల్‌లో ప్రత్యేక కంప్యూటర్‌ను వినియోగించారు. ఇప్పటికే 700 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-1, 2 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-2, 2,500 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-3 క్షిపణులు రక్షణ శాఖ వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం చైనా వద్దనున్న ‘సీఎస్‌ఎస్-10 మోడ్ 2’ క్షిపణి పరిధి 11,200 కిలో మీటర్లు కాగా ఆ దేశం అభివృద్ధి చేస్తున్న డీఎఫ్-41 క్షిపణి ప్రపంచంలోని అన్ని దేశాలపై దాడి చేయగలదు. ఇది 10 అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడంతో పాటు 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు.
అగ్ని-5 ప్రత్యేకతలు
  • ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి అగ్ని-5.
  • 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువు కలిగి 1500 కేజీల అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
  • ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే 5000-5500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ల సరసన భారత్ చేరుతుంది.
  • అగ్ని-5 తూర్పున చైనా, ఆసియా, యూరప్‌ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు.
  • 800 కిలో మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ భూమిపై లక్ష్యాలను ఢీ కొట్టగలదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయవంతమైన అగ్ని-5 క్షిపణి ప్రయోగం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రక్షణ శాఖ
ఎక్కడ : ఏపీజే అబ్దుల్ కలాం దీవి (వీలార్ ఐలాండ్), ఒడిశా

క్రీడలు
అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికిన వికాస్
Current Affairs డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు మే 30 ప్రకటించాడు. కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రోయర్ విభాగంలో తొలిసారిగా స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడిగా వికాస్ గుర్తింపు పొందాడు. వికాస్ వరుసగా నాలుగు ఒలింపిక్స్‌ల్లో (2004, 2008, 2012, 2016) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ డిస్కస్ త్రోయర్ రిటైర్మెంట్
ఎప్పుడు : మే 30
ఎవరు : వికాస్ గౌడ

డోపీగా తేలిన సంజిత చాను
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) నిర్వహించిన డోప్ టెస్టులో భారత వెయిట్ లిఫ్టర్ కుముక్‌చమ్ సంజిత చాను డోపీగా తేలింది. ఈ మేరకు సంజిత నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్) వాడిందని ఐడబ్ల్యూఎఫ్ మే 31న ఆమెపై నిషేధం విధించింది. గోల్డ్‌కోస్ట్, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సంజిత స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డోపీగా తేలిన వెయిట్ లిఫ్టర్
ఎప్పుడు : మే 31
ఎవరు : సంజిత చాను

వార్తల్లో వ్యక్తులు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్
Current Affairs రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగవ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. 2017 మార్చి నుంచి ఐడీబీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా జైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2017 జూలైలో ఎస్.ఎస్.ముంద్రా పదవీకాలం ముగియడంతో జైన్‌ను ఆయన స్థానంలో నియమించారు. ఆర్‌బీఐలో ప్రస్తుతం విరాల్ వి ఆచార్య, ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగో లు డిప్యూటీ గవర్నర్‌లుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : మహేశ్ కుమార్ జైన్

యంగెస్ట్ ఆథర్‌గా అసోం బాలుడు
అసోంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల అయాన్ గగోయ్ గోహెయిన్ అనే బాలుడు యంగెస్ట్ ఆథర్‌గా గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ అయాన్ చోటు సంపాదించుకున్నాడు. ‘హనీకాంబ్’ పేరుతో అయాన్ రాసిన పుస్తకం ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది. ఈ పుస్తకంలో 30 కథలతోపాటు కొన్ని బొమ్మలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యంగెస్ట్ ఆథర్‌గా నాలుగేళ్ల బాలుడు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : అయాన్ గగోయ్ గోహెయిన్
ఎక్కడ : లఖింపూర్, అసోం
ఎందుకు : హనీకాంబ్ అనే పుస్తకాన్ని రచించినందుకు

కోహ్లీ మైనపు బొమ్మ ఆవిష్కరణ
దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన మైనపు బొమ్మను జూన్ 6న ఆవిష్కరించాడు. ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులైన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, లయోనల్ మెస్సీ, ఉసేన్ బోల్ట్‌ల మైనపు బొమ్మలు టుస్సాడ్స్ మ్యూజియలో ఉన్నాయి. కోహ్లీ 2008లో మలేషియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ను భారత్‌కు అందించడంలో కీలక పాత్ర వహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ క్రికెటర్ మైనపు బొమ్మ ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం

టెస్సీ థామస్‌కు కీలక పదవి
క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. డాక్టర్ సీపీ రామనారాయణన్ స్థానంలో జూన్ 1న ఆమె ఈ బాధ్యతల్ని చేపట్టారు. రెండేళ్ల వ్యవధిలో వైమానిక విభాగం డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతల్ని చేపట్టిన మూడో వ్యక్తి టెస్సీ థామస్.

అవార్డులు
కేరళ కార్టూనిస్టుకి అంతర్జాతీయ అవార్డు
Current Affairs కేరళ కార్టూనిస్టు థామస్ ఆంటోనీ కి కేరికేచర్ కేటగిరీలో వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు లభించింది. ఈ మేరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆంటోనీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. థామస్ మలయాళ పత్రిక మెట్రోవార్తలో ఎగ్జిక్యూటివ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వార, దినపత్రికల్లో 2016లో ప్రచురితమైన కార్టూన్లలో ఉత్తమమైన వాటికి, ఫేక్ న్యూస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కేటగిరీలో ఈ అవార్డులను ప్రకటించారు. యూరప్, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఎనిమిది దేశాలకు చెందినవారికి ఈ పురస్కారాలు దక్కగా ఆసియా నుంచి థామస్ ఆంటోనీ ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేరళ కార్టూనిస్టుకి అంతర్జాతీయ అవార్డు
ఎప్పుడు : మే 30
ఎవరు : థామస్ ఆంటోనీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

వృక్ష శాస్త్రవేత్త కమల్‌జిత్ బవాకు లిన్నేయన్ మెడల్
భారత వృక్ష శాస్త్రవేత్త కమల్‌జిత్ బవాకు ప్రఖ్యాత లిన్నేయన్ మెడల్ లభించింది. సొసైటీ ఆఫ్ లండన్ ప్రదానం చేసే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు బవా. ఈయన ప్రస్తుతం బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్‌మెంట్’కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉష్ణ ప్రదేశాల్లో మొక్కల పరిణామ క్రమం, అటవీ క్షీణత, కలప రకానికి చెందిన అటవీ ఉత్పత్తులు, మధ్య అమెరికా, పశ్చిమ కనుములు, తూర్పు హిమాలయాల్లోని అడవుల్లో జీవ వైవిధ్యంపై చేసిన కృషికి గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.
Published on 6/8/2018 3:31:00 PM

సంబంధిత అంశాలు