English Version

కరెంట్ అఫైర్స్ (నవంబర్ 10 - 16, 2017)

అంతర్జాతీయం
బ్రెగ్జిట్‌కు ముహూర్తం 2019, మార్చి 29
ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29 ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే నవంబర్ 10న ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్‌‌సలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బ్రెగ్జిట్‌కు ముహూర్తం ఖరారు
ఏమిటి : 2019, మార్చి 29
ఎవరు : బ్రిటన్ ప్రధాని థెరెసా మే
ఎందుకు : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు

అంతరిక్ష పిల్లికి కాంస్య విగ్రహం
Current Affairs అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఏకైక పిల్లిగా గుర్తింపు పొందిన ఫెలికిట్టె’కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ఫ్రాన్స్లో ఐదడుగుల ఫెలికిట్టె’ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి లండన్‌కు చెందిన మాథ్యూ గై అనే వ్యక్తి కిక్‌స్టార్టర్ వెబ్‌సైట్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు.
1963 అక్టోబర్ 18న ఫ్రాన్స్ ప్రయోగించిన వెరొనిక్ ఏజీ1 రాకెట్‌లో ఈ పిల్లి భూమి నుంచి 157 కి.మీ. మేర అంతరిక్షంలోకి ప్రయాణించి, 15 నిమిషాల అనంతరం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఒక పిల్లి అంతరిక్షంలోకి వెళ్లిన సంగతిని ప్రజలకు తెలిపేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని మాథ్యూ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన పిల్లి ఫెలికిట్టెకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : మాథ్యా గై
ఎక్కడ : ఫ్రాన్స్ లో

ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు.
ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 12న రాత్రి 9.48 గంటల (భారత కాలమానం నవంబర్ 12న రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
ఏమిటి : నవంబర్ 12
ఎక్కడ : ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో

దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ
దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు నవంబర్ 13న అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్‌‌స మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
దక్షిణ చైనా సముద్రంపై రాజీ
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : చైనా, వియత్నాం

మనీలాలో ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సు
ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 31వ ఆసియాన్-భారత్’ సదస్సులో నవంబర్ 14న మోదీ పేర్కొన్నారు.
ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం
భారత్, ఆసియాన్ మధ్య పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రసంగించిన ప్రధాని మోదీ.. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో-ఆసియాన్ ప్రత్యేక సదస్సుకి దేశాధినేతలను ఆహ్వానించారు.
ఆసియాన్ సభ్య దేశాలు..
ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్’(ఆర్‌సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి.
తూర్పు ఆసియా’ది కీలక పాత్ర
ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

నాలుగు దేశాల చతుర్భుజ కూటమి !
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కూడిన నాలుగుదేశాల కూటమి (క్వాడ్రిలేటరల్-క్వాడ్) అవసరమని జపాన్ ప్రధాని షింజో అబే 2007లోనే భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ సూచించారు. తర్వాత నెల రోజులకే ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ ‘చైనా వ్యతిరేక’ చతుర్భుజం ప్రతిపాదన మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అబే ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ఫిలిప్పీన్‌‌స వచ్చిన ఈ నాలుగు దేశాల అధికారులు మనీలాలో నవంబర్ 12న సమావేశమయ్యారు. నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో అక్కడ చర్చలు జరిగాయి.
షింజో లక్ష్యమేంటి?
అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్ దేశాలకు రవాణాపరంగా దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైనది. అయితే ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్ర ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేలా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశాలను బెదిరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అలాగే గతంలో జపాన్ చైనాతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో జపాన్ ఉంది. తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్‌ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా అబే భావిస్తున్నారు. అలాగే అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా కూడా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’ లో భాగంకావడానికి సిద్ధమైంది.
కూటమిలోకి భారత్?
హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో భారత్ కొంత వెనుకబడటం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. అయితే ఇటీవల రెండు నెలలకు పైగా డోక్లామ్ వివాదంతో భారత్ విసిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు ‘క్వాడ్’ కూటమిలో చేరడం ఇప్పుడు భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోంది. మనీలాలో జరిగిన అధికారుల స్థాయి చతుర్భుజ కూటమి సమావేశంలో నాలుగు దేశాల ప్రతినిధులూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరూ అంతర్జాతీయ చట్టాలను అనుసరించడం, సముద్రాల్లో నౌకలు, ఆకాశంలో విమానాల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడడం, ఓడలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు. చైనా తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వన్ బెల్డ్- వన్ రోడ్ ప్రాజెక్టును ఆర్భాటంగా చేపడుతుండగా, ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కూడా ఓ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఈ ప్రాంతంలో సూచిస్తున్నారు. ఈ కూటమి బలపడితే కొత్త ప్రాజెక్టు పని సులువవుతుందనీ పలువురు భావిస్తున్నారు. ఏదేమై నా ఆర్థికంగా బలమైన 4 పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే.

జాతీయం
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చెన్నై
Current Affairs ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో భారత్‌లోని చెన్నై నగరం చోటు దక్కించుకుంది. ఈ మేరకు చెన్నైతో కలిపి 44 దేశాల నుంచి 64 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు కల్పిస్తూ యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకొవా నవంబర్ 8న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జాబితాలో స్థానం పొందిన నగరాల సంఖ్య 180కి చేరింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(సిటీ ఆఫ్ మ్యూజిక్), రాజస్తాన్‌లోని జైపూర్(సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్) నగరాలు 2015 డిసెంబర్‌లోనే ఈ జాబితాలో స్థానం పొందాయి. యూనెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సంగీతం, పర్యావరణ అంశాల్లో గుర్తింపు పొందిన నగరాల అభివృద్ధి కోసం ఈ వేదికను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
యూసీసీఎన్‌లో స్థానం పొందిన చెన్నై
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : యునెస్కో
ఎందుకు : సంగీతం విభాగంలో

ఢిల్లీలో వాతావరణ అత్యవసర పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. పాఠశాలలకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువ. అందువల్ల అక్కడ అధిక క్యూబిక్ సెంటీ మీటర్ డీజిల్ వాహనాల వాడకంపై ఆంక్షలు అమలవుతున్నాయి. పదేళ్లు పైబడిన వాహనాలను నిషేధించారు. కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది దీపావళికి టపాసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో 74% పోలింగ్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తారు.

విపత్తు నిర్వహణకు ఫేస్‌బుక్ సాయం
విపత్తు నిర్వహణకు సాయం అందించేందుకు సిద్ధమని ఫేస్‌బుక్ ప్రకటించింది. భారత దేశంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎమ్‌ఏ)తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించిది. ఇందుకోసం డిజాస్టర్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే ఇది ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా, దక్షిణ, మధ్యఆసియా దేశాల ప్రాజెక్ట్ అధికారిగా వ్యవహరిస్తున్న రితేష్ మెహతా వెల్లడించారు.
సాధారణంగా విపత్తుల సమయంలో అందరూ ఆన్‌లైన్‌లో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉన్నా సర్వీసులన్నీ బిజీ అని రావచ్చు, అయితే ఇటువంటి సమయాల్లో కూడా సమాచారం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఫేస్‌బుక్ కొత్త సాధనాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మ్యాపులను జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విపత్తు నిర్వహణకు డయాస్టర్ మ్యాప్‌లు
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : ఫేస్‌బుక్

హోం శాఖ కింద రెండు కొత్త విభాగాలు
ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు CTCR (కౌంటర్ టైజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కేంద్ర హోంశాఖ కింద 18 విభాగాలు
ఏమిటి : నవంబర్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : కొత్తగా సీటీసీఆర్, సీఐఎస్ విభాగాల ఏర్పాటు

జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్
దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 10న జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :జడ్జీల వేతనాల పెంపు కోసం జస్టిస్ వెంకట రామారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్

ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం
ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : న్యూఢిల్లీ శివారులో

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు

కశ్మీర్‌లోని కౌరిలో భూకంపాలను తట్టుకునే వంతెన
అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపాలను సైతం తట్టుకునే వంతెన నిర్మాణం
ఎక్కడ : కశ్మీర్‌లోని చినాబ్ నదిపై
ఎందుకు : భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా

వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం
కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నవంబర్ 13న ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని నవంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎందుకు : అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు

పశ్చిమ బెంగాల్‌కు రసగుల్లా జీఐ గుర్తింపు
రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రసగుల్లా భౌగోళిక గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : పశ్చిమ బెంగాల్‌కు

న్యూఢిల్లీలో 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
ఎప్పుడు : నవంబర్ 14 - 28
ఎవరు : ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
ఎక్కడ : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ

దంతెవాడలో భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు
భారత తొలి ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సుని ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో నవంబర్ 14న నిర్వహించారు. భారత్‌లో జరుగుతున్న 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సులో భాగంగా.. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. గిరిజన యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు
ఎప్పుడు : నవంబర్
ఎవరు : నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : దంతెవాడ, ఛత్తీస్‌గఢ్

ద్వైపాక్షికం
భారత్ - బంగ్లా వీక్లీ ‘బంధన్’ రైలు ప్రారంభం
Current Affairs భారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు సర్వీసులని ప్రారంభించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. రూ. 650 కోట్లతో నిర్మించిన బైరట్, టైటాస్ రైల్వే వంతెనలను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభం
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : భారత ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని హసీనా
ఎక్కడ : భారత్ - బంగ్లా మధ్య

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన
ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌‌సలో పర్యటిస్తున్నారు. ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు.
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్పీన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
ఏమిటి : నవంబర్ 12 - 14
ఎందుకు : ఇండియా-ఆసియాన్, 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు

మనీలాలో ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు.
ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం
ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు.
ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలు
ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ఏమిటి : నవంబర్ 13
ఎక్కడ : మనీలా, ఫిలిప్పీన్స్
ఎందుకు : ఆసియాన్ సదస్సు సందర్భంగా

రాష్ట్రీయం
కాళేశ్వరంపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు
Current Affairs తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ గత నెల 5న ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ప్రధాన బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. పనులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణ పనులతోపాటు ఇతర అనుబంధ పనులను మాత్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటవీ అనుమతులు వచ్చేంత వరకు అటవీ భూములను తాకరాదని సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలరాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏవైనా పనులు చేపట్టి ఉంటే కేవలం తాగునీటి అవసరాలకే వాటిని పరిమితం చేయాలని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : హైదరాబాద్ హైకోర్టు

ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత
ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు.
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య-సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు..
 • 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
 • 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
 • తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్
 • ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు
 • తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు
 • 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
 • 2014లో తానా అవార్డు
 • ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్
 • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత
ఏమిటి : నవంబర్ 9
ఎక్కడ : జనగామ

ప్రయాణికుల సదుపాయాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నంబర్ 1
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రయాణికుల సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ మేరకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు నిచ్చింది. తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్ చాలా బాగుందని, విమానాశ్రయం తరహాలో సదుపాయాలు ఏర్పాటు చేశారని కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అందజేసే సదుపాయాలపై ఈ కమిటీ విసృ్తతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంది.

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి
రాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీ
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : మహేందర్‌రెడ్డి
ఎందుకు : అనురాగ్ శర్మ పదవీ విరమణతో

కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ హబ్స్
కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో నవంబర్ 12న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి
ఏమిటి : నవంబర్ 12
ఎక్కడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద

ఆర్థికం
రెస్టారెంట్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
Current Affairs వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
రెస్టారెంట్లకు భారీ లాభం
ప్రస్తుతం నాన్-ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెస్టారెంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గింపు
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : జీఎస్టీ మండలి
ఎక్కడ : గువాహటి సమావేశంలో

సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 3.8%
దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది.
విభాగాల వారీగా...
 • ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.
 • కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది.
 • విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సెప్టెంబర్ పారిశ్రామిక వృద్ధి 3.8 శాతం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర గణాంక విభాగం

పదేళ్లు పెరిగిన భారతీయుల ఆయుష్షు
1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏళ్లు పెరిగింది. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివృద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లు పెరిగిన భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : లాన్సెట్ జర్నల్

‘భారత్ నెట్’ రెండో దశ ప్రారంభం
దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్టు రెండో/తుది దశను నవంబర్ 13న ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.34,000 కోట్లు. ఇందులో భాగంగా అదనంగా 10 లక్షల కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలను అందించే టెలికం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బ్యాండ్ విడ్త్ సౌకర్యం కల్పిస్తామని, ఆయా సంస్థలు సెకన్‌కు రెండు మెగా బిట్ల వేగంతో డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ పేర్కొన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ
మొబైల్ గేమింగ్‌లో మూడోస్థానంలో భారత్
Current Affairs మొబైల్ గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. బ్రెజిల్, రష్యాలు భారత్‌కంటే ముందు వరుసలో నిలిచాయి. హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్ నవంబర్ 9న ఈ విషయాన్ని వెల్లడించింది. సరిగ్గా పదినెలల కిందటి గణాంకాల ప్రకారం గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. కేవలం 300 రోజుల వ్యవధిలోనే మూడోస్థానానికి ఎగబాకడం గమనార్హం. అయితే మొదటి రెండుస్థానాల్లో అప్పుడూ, ఇప్పుడూ బ్రెజిల్, రష్యాలే ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మొబైల్ గేమింగ్‌లో 3వ స్థానంలో భారత్
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్, హైదరాబాద్

ట్వీటర్‌లో డిస్‌ప్లే నేమ్ ‘పరిమితి’ పెంపు
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా నవంబర్ 11 నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్వీటర్ డిస్ ప్లే నేమ్ పరిమితి పెంపు
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : ట్వీటర్
ఎందుకు : 20 అక్షరాల నుంచి పరిమితి 50 అక్షరాలకు పెంపు

క్రీడలు
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్స్ సైనా, ప్రణయ్
Current Affairs పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మూడోసారి విజేతగా నిలిచింది. నవంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-17, 27-25తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది.
ప్రణయ్‌కు పురుషుల టైటిల్
జాతీయ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-14, 21-14తో సంయోగిత-ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత - సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్ విజేత - హెచ్ ఎస్ ప్రణయ్
ఎక్కడ : నాగపూర్

ఆసియా సీనియర్ బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు స్వర్ణం
ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ (34) చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5-0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి పసిడి పతకాన్ని గెలుచుకుంది. 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి.
2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే. మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మెరీకోమ్‌కు ఇది ఐదో స్వర్ణం. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌కు స్వర్ణం
ఎక్కడ : వియత్నాం

జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్ లలిత్ బాబు
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో నవంబర్ 10న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : విజేత లలిత్ బాబు

జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్వ్కాష్ టోర్నీలో సౌరవ్‌కు టైటిల్
భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించాడు. నవంబర్ 10న ముగిసిన జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ అంతర్జాతీయ స్క్వాష్ సర్క్యూట్ టోర్నీలో ప్రపంచ 21వ ర్యాంకర్ సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్ 11-6, 11-8, 11-8తో ఐదో సీడ్ నికొలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరవ్‌కు 7,671 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు) లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్క్వాష్ సర్క్యూట్ టోర్నమెంట్
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : విజేత సౌరవ్ ఘోషాల్

17వ ప్రపంచ బిలియర్డ్స్ చాంప్‌గా పంకజ్ అద్వానీ
భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు. నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు.
గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : విజేత పంకజ్ అద్వానీ

యూఏఈలో ధోని అకాడమీ ప్రారంభం
భారత క్రికెటర్ ధోని అకాడమీ.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభమైంది. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) అని పేరు పెట్టారు. నవంబర్ 11న ఈ అకాడమీని ధోని లాంఛనంగా ప్రారంభించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం
ఏమిటి : నవంబర్ 11
ఎక్కడ : యూఏఈ

బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సెబాస్టియన్ వెటెల్
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు.
తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్ ప్రీ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : విజేత సెబాస్టియన్ వెటెల్

పేస్ - రాజాకు నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టైటిల్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్‌కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : డబుల్స్ టైటిల్ విజేత లియాండర్ పేస్ - పురవ్ రాజా

ఫెడ్‌కప్ విజేత అమెరికా
ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘ఫెడ్ కప్’ను అమెరికా జట్టు సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్‌‌స, ప్రపంచ పదో ర్యాంకర్ కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, అలీసన్ రిస్కీ సభ్యులుగా ఉన్న అమెరికా ఫైనల్లో 3-2తో బెలారస్‌పై గెలిచింది. చివరిసారి 2000లో ఫెడ్ కప్‌ను దక్కించుకున్న అమెరికా తాజా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడ్ కప్ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : విజేత అమెరికా

వార్తల్లో వ్యక్తులు
బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామా
బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో నవంబర్ 8న ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రతి పటేల్ రాజీనామా
ఏమిటి : నవంబర్ 8
ఎందుకు : ఇజ్రాయెల్ పర్యటనలో అనుమతి లేకుండా ఆ దేశ నేతలతో సమావేశం కావటంతో

‘నాడా’ అప్పీల్ ప్యానెల్‌లో సెహ్వాగ్
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్- ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించారు. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
‘నాడా’ అప్పీల్ ప్యానెల్
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు

నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్
Current Affairs దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తొలి మహిళ.. ఘోష్. ఆమె ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండీగా పనిచేశారు. నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఘోష్ సభ్యురాలు కాగా.. నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉన్నారు.
దేశీ ఐటీ, బీపీవో రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : దేబ్‌జానీ ఘోష్

భార్యను కలిసేందుకు జాధవ్‌కు అనుమతి
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది.

యునెస్కోకి రెండోసారి మహిళాధిపతి
‘ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో)’ నూతన డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఫ్రాన్స్ సాంస్కృతిక, సమాచార శాఖ మాజీ మంత్రి ఆద్రే అజోలే నియమితులయ్యారు. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను యునెస్కో సర్వ సభ్య సదస్సు నవంబర్ 12న ఆమోదించింది. యునెస్కోకి 11వ డీజీగా నియమితులైన అజోలే ఈ పదవిని అలంకరించనున్న రెండో మహిళ కావడం గమనార్హం. ఈమె ఇరినా బొకోవా స్థానంలో నియమితులయ్యారు.
Published on 11/16/2017 4:10:00 PM

సంబంధిత అంశాలు